ప్రణవ్ ఫోన్‌కు పుట్టింటికి వెళ్లిన భార్య శైలు ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. దానిని చూసి షాకై వెంటనే తేరుకొని తనకి కాల్ చేశాడు. ‘హెలో…హెలో’ అంటూ ఉన్నాడు. అవతలి నుంచి ఎటువంటి స్పందన లేదు. ‘శైలు శైలు ఉన్నావా? ఒక్కసారి మాట్లాడు’ అని పదే పదే అడిగాడు. కాసేపటికి ‘ఆ ..ఉన్నాను…చెప్పు’ అని సమాధానం. ‘నీకేమైనా పిచ్చి పట్టిందా? విడాకులు ఏంటి? ఆర్ యు రియల్లీ మ్యాడ్?’ అని తిట్టేస్తున్నాడు. శైలు నుంచి ఏం సమాధానం రాలేదు.
కొంచెం నెమ్మదిగా ‘చూడు శైలు, నేను నీతో ఒక్కసారి మాట్లాడాలి. ఒక్కసారి కలుద్దాం’ అని బ్రతిమాలాడు. ‘ఇంక మాట్లాడేది ఏముంది? బాగా ఆలోచించే ఆ మెసేజ్ పెట్టాను. లెట్స్ బ్రేకప్. సారీ ఇది ప్రేమ కాదు కదా! మనది పెళ్లి కదా. లెట్స్ డివోర్స్’ అని తన నిర్ణయం చెప్పేసింది.
‘పిచ్చి.. పిచ్చి.. నిజంగానే పిచ్చి. ఆర్ యు క్రేజీ? ఒక్కసారి కలిసి మాట్లాడుదాం. నేను మనం ఎప్పుడూ కలిసే చోటుకు వచ్చేస్తున్నాను. అక్కడకి వచ్చాక, మనం మాట్లాడాక, నీ నిర్ణయం మారకపోతే, ఆ తర్వాత విడాకుల పేపర్ కాదు. నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తా’ అని మాట ఇచ్చేసాడు.
చెప్పిన చోటుకి చెప్పిన సమయం కన్నా ముందే ప్రణవ్ బైక్ మీద వచ్చేసాడు. శైలు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ స్థలంలో అడుగుపెట్టగానే శైలుతో తనకి గల తీయని అనుభూతులు అన్నీ ఒక్కొక్కటీ గుర్తుకు వస్తున్నాయి. వారిద్దరు సంతోషంగా కలిసి ఉన్నప్పుడు ఇక్కడే కూర్చొని బోలెడన్ని కబుర్లు చెప్పుకోవడం.. ఆ సరదాలు అన్నీ గుర్తుకు వస్తున్నాయి.
కాసేపటికి శైలు వచ్చింది. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. ‘చా.. చా.. మరచిపోయాను. ఇదిగో నీ చాక్లెట్’ అని ఎప్పటిలాగే తనకి చాక్లెట్ ఇచ్చాడు. ఈసారి ఇష్టం లేకుండా తీసుకుంది. పక్కపక్కనే కూర్చున్నారు. కానీ ఇద్దరి మధ్య చాలా దూరం ఉంది. ‘నీకు గుర్తుందా? అయిదేళ్ల క్రితం మన ప్రేమ మొదలైనప్పుడు ఈ చెట్టు ఎంత చిన్నగా ఉండేది. ఇప్పుడు చూడు ఎంత పెద్దగా అయ్యిందో? అప్పుడు పెద్దగా ఉన్న మన మధ్య ప్రేమ మరి ఇప్పుడు ఎందుకు చిన్నగా అయ్యింది? చెప్పు శైలు’ అంటూ సమాధానం కోసం తన వైపే చూస్తున్నాడు. శైలు ఏం సమాధానం చెప్పడం లేదు.
‘సరే నువ్వు కోరినట్టే ఇద్దరం విడిపోదాం. నువ్వు అడిగినప్పుడు, నీ సంతోషం కోసం ప్రేమని ఇచ్చిన వాడిని, ఇప్పుడు నువ్వు పదేపదే అడుగు తుంటే, అదే సంతోషం కోసం విడాకులు ఇవ్వలేనా? తప్పకుండా ఇస్తాను. నీ కోసం ఇచ్చేస్తాను. కానీ ఏమైంది? ఎందుకు విడాకులు? దయచేసి మాట్లాడు’ అని రెండు చేతులు జోడించి అడిగాడు.
శైలు కళ్లలో నీరు. తన హ్యాండ్ కర్చీఫ్ తీసి ఇచ్చాడు. ఆ కర్చీఫ్ తీసుకుంటూ ‘ఇదే మిస్ అయ్యింది’ అని అంది. ‘ఇదే అంటే?’ అర్థం కానట్టు ముఖం పెట్టాడు. ‘మనం ప్రేమలో ఉన్నప్పుడు, నేను ఏదైనా కష్టంలో ఉండి ఏడుస్తుంటే, వెంటనే నా కన్నీళ్లు తుడిచేది నీ చేయి… నీ హ్యాండ్ కర్చీఫ్ కాదు. ఇప్పుడు నువ్వు నేను ప్రేమించిన ప్రణవ్‌వి కావు. ఇప్పుడు మొగుడయిన ప్రణవ్‌వి. నేను ఇప్పుడు శైలుని కాదు. ప్రణవ్‌కి భార్యని మాత్రమే’ అని చెప్తున్న శైలు కళ్లు చెమ్మగిల్లాయి.
‘ఏమంటున్నావో? నాకు అసలు అర్థం కావడం లేదు శైలు!’ అని తన వైపే చూసాడు. ‘నాకు కూడా అదే అర్థం కావడం లేదు. నేను గంటలు గంటలు షాపింగ్ చేస్తుంటే, నా వెనుకే ఆ సంచీలు పట్టుకొని తిరిగిన ప్రణవ్ ఎక్కడ? ఏమయ్యాడు? ఐస్‌క్రీమ్ తినాలి అని అర్ధరాత్రి ఫోన్ చేస్తే రోడ్ల మీద ఐస్ క్రీమ్ బండ్ల కోసం తిరిగిన ప్రణవ్ ఎక్కడ? ఏమయ్యాడు? నా ప్రేమ కోసం అల్లారు ముద్దుగా పెంచిన పేరెంట్స్‌ని ఎదిరించిన ప్రణవ్ ఎక్కడ? ఏమయ్యాడు? నేను ఏడుస్తుంటే, నన్ను వెంటనే నవ్వించాలి అని పరితపించిన ఆ ప్రణవ్ ఎక్కడ? ఏమయ్యాడు? నేను ప్రేమించిన ప్రణవ్? నన్ను ప్రేమిం చిన ప్రణవ్ ఎక్కడ? ఏమయ్యాడు? ఎక్కడ? ఆ ప్రణవ్ మిస్సింగ్’ అని చెప్తున్న శైలు కన్నీరు చూసి ప్రణవ్‌కూ కన్నీరు ఆగలేదు.
‘అవును నేను ఇప్పుడు భార్యని. గర్ల్‌ఫ్రెండ్‌ని కాదు. నువ్వు భర్తవి. బాయ్‌ఫ్రెండ్‌వి కాదు. ఒక్కటి చెప్పు.. పెళ్లి అయితే ఇవన్నీ ఎందుకు మారిపోవాలి? గంటల కొద్దీ నా వెనుక షాపింగ్ కోసం తిరగమని అడగడం లేదు. కాస్త సమయం. ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ భార్య కోసం కాస్త సమయం కావాలంటున్నాను. నాకు తెలుసు. నువ్వు సంపాదించేది, కష్టపడేది, కూడపెట్టేది నా కోసం, మనకి పుట్ట బోయే పిల్లల కోసం. వెరీగుడ్. మెచ్చుకుంటాను. కానీ ముందు మేము కోరుకొనేది. జస్ట్ మీ ప్రేమ. వారంలో ఒక సినిమా. కలిసి కాసేపు షాపింగ్, హోటల్. కనీసం వారాంతం కూడా భార్య గుర్తుకు రావడం లేదా?’’
ఇంతకు ముందు కన్నీళ్లు తుడవడానికి లేచిన చెయ్యి, ఇప్పుడు ఏదైనా అడిగితే, కోపంతో కొట్టడానికి లేస్తుంటే, ప్రేమ ఉందనా? లేదనా? ప్రేమ లేనప్పుడు, ఇక ఇద్దరం కలిసి ఉండడం ఎందుకు? చెప్పు ప్రణవ్’ తను అడిగిన ప్రశ్నలకి ప్రణవ్ దగ్గర సమాధానం లేదు.
ప్రణవ్ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఒకసారి లేచి నిలబడి, అక్కడే అటుఇటు తిరిగి, మళ్లీ వచ్చి పక్కనే కూర్చొని ‘నువ్వు సరిగా చెప్పావు శైలు. ఈ ఒక్కసారి నన్ను క్షమించు. మేము అబ్బాయిలం అంతే, మా గురించి ఎప్పుడూ ఆలోచించం, ప్రేమలో ఉన్నప్పుడూ, ఎప్పుడూ మీ గురించే ఆలోచన. గర్ల్ ఫ్రెండ్‌తో సినిమాకి వెళ్లాలి. తనతో కలిసి షాపింగ్ చెయ్యాలి. బాగా ఎంజాయ్ చెయ్యాలి. మాకు అదే ఆలోచన. ఒకసారి పెళ్లి అయ్యాక, బాధ్యత నెత్తిమీదకి వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి నాన్న కష్టం దగ్గర నుంచి చూసి పెరిగాం కదా, పిల్లలు పుట్టేసరికి ఒక మంచి కమ్యూనిటీలో ఇల్లు కొనాలి. వాళ్లని మంచి స్కూల్‌లో చేర్పించాలి. అలా చేయాలి అంటే మంచి బ్యాంక్ బాలన్స్ ఉండాలి. ఈ ఆరాటంలో, పోరాటంలో పడి నిన్ను మరచిపోయాను. ప్రేమించిన అమ్మాయి కదా..నన్ను వదిలి ఎక్కడకి పోతుందిలే అని చిన్న ధీమా! నేను చేసింది తప్పే ! నూటికి నూరు శాతం తప్పే! అప్పటిదాక దేవతలా చూసుకున్న అమ్మాయిని, ఇంట్లో పెట్టి, కిచెన్‌లో బంధించి, ‘మొగుడు ఆఫీసు నుంచి ఎప్పుడు వస్తాడా!’ అని తను ఎదురు చూస్తుంటే, ఆఫీసు చికాకులో ఇంటికి వచ్చి, ఆ చికాకు పెళ్లాం మీద చూపించడం తప్పే! నూటికి నూరు శాతం తప్పే!’ అని అంటూ లేచి నిలబడి, తన మోకాళ్ల మీద ఎదురుగా కూర్చొని, శైలు చేతులు తన చేతుల్లో తీసుకొని ప్రేమగా తన వైపు చూసాడు.
‘స్కూల్‌లో టీచర్ స్టూడెంట్‌ని ఒక్కసారి సమాధానం తప్పు చెప్పాడు అని స్కూల్‌కే రావొద్దు అంటే? వాడు ఆ చేసిన తప్పును మళ్లీ సరిదిద్దు కోగలడా? చెప్పిన మాట వినడం లేదు అని, అమ్మానాన్న తమ పిల్లల్ని ఇంటి నుంచి తరిమేస్తారా? రేప్పొద్దున మనకి ఒక బిడ్డ పుట్టిన తర్వాత, ఆ బిడ్డ తప్పు చేస్తే, ప్రేమగా మందలిస్తాం. దారిలో పెట్టుకుంటాం. అవసరమైతే ఒక దెబ్బ కూడా వేస్తాం. అంత మాత్రాన, మన బిడ్డ మీద మనకి ప్రేమ లేనట్టేనా? వీళ్లందరినీ క్షమించగలిగినప్పుడు, తెలియక తప్పు చేసిన భర్తని భరించలేరా? ఏ బంధంలో అయినా బాధలు వస్తే మాట్లాడుకోవాలి. అప్పుడు బరువు తగ్గుతుంది. ఇలా పుట్టింటికి వెళ్లి కూర్చొని ఆ బరువును ఇంకా పెంచేయ్యకూడదు. ప్రేమతో మొదలయ్యిన మన బంధం, పెళ్లితో ముడిపడి, విడాకులు అనే కాగితం ముక్కతో విడిపోకూడదు. ప్రేమ, పెళ్లి అంటే ఏంటో తెలుసా? ఒప్పులు మాత్రమే కాదు. ఒప్పుల్ని మెచ్చుకుంటూ, తప్పుల్ని సరిదిద్దుకుంటూ కలిసిమెలిసి ఉండడం. కలిసి మెలిసి బ్రతకడం. ప్రేమగా అనిపిస్తే, నా చొక్కా పట్టుకొని దగ్గర లాక్కొని ముద్దు పెట్టుకో. అదే కోపం వస్తే…అదే చొక్కా పట్టుకొని నన్ను నిలదీయ్. నేను చేస్తున్న తప్పేంటో అర్థ్ధం చేయించు. మా మగాళ్లకి ప్రేమించడం మాత్రమే తెలుసు. నీ కాళ్లు పట్టుకుంటే తిరిగి మన ఇంటికి వస్తాను అంటే చెప్పు. నా ఇంటి మహాలక్ష్మి నా ఇంటికి రావడానికి, దానికైనా నేను సిద్దం’ అని చెప్తూ ప్రేమగా తన పాదాలు ముట్టు కున్నాడు. శైలు కన్నీళ్లు పాదాల మీద ఉన్న తన చేతుల్ని వెచ్చగా తాకాయి. అప్పుడు శైలు, ప్రణవ్‌ని దగ్గరకి లాక్కొని గట్టిగా హత్తుకుంది. దాంతో వారిద్దరి మధ్య ఎడబాటు వీడిపోయింది.
ప్రణవ్ నుదుటి మీద ముద్దు పెట్టి ‘ఐ యామ్ సారీ రా. భార్యకి ఐశ్వర్యం, ఆస్తులు, డబ్బు, అంతస్తులకన్నా కావాల్సింది మొగుడి ప్రేమ. నీ పని చేసుకో, జాబ్ చేసుకో, నీ గోల్స్ అచీవ్ చెయ్. నేను కూడా నీ ప్రయాణంలో నీ వెంటే ఉంటాను. కానీ నాకు ఇవ్వాల్సిన కాస్త సమయం. కొంచెం ప్రేమ. కలిసి భోజనం చెయ్యడం. పక్కపక్కనే కూర్చొని కాఫీ తాగడం. కాసిన్ని కబుర్లు అంతే’ అని ముద్దుగా చెప్పింది.
‘పిచ్చిదానా! ఇంత ప్రేమ పెట్టుకొని, దీని కోసం విడాకులు ఇచ్చేస్తా అంటావా?’ అని దగ్గరకి తీసుకున్నాడు. ‘అబ్బా! ఆశ! విడాకులు ఊరికే ఇచ్చేస్తారు. నేను నీ గురించి ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటే, ‘నీ మొగుడికి నీ మీద ప్రేమ ఎంత ఉందో తెలియాలి అంటే, ఒకసారి అలా మెసేజ్ పెట్టి చూడు’ అని మా పెద్దమ్మ సలహా చెప్పింది’ అని చెప్పి చిన్నగా నవ్వింది.
‘పెద్దమ్మ చెప్పిందా? పెద్దమ్మ.. పెద్దమ్మ.. అందుకే అలా మెసేజ్ చేసావా?’ చిరు కోపంతో మళ్లీ మళ్లీ అడుగుతూ నవ్వేసాడు. అది చూసి శైలు కూడా నవ్వింది. ఇద్దరూ కలిసి ప్రయాణంకొత్తగా మొదలు పెట్టారు.
– వెంకట శివకుమార్ కాకు
భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది