తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 8న 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో చోటు చేసుకున్న జంట పేలుళ్ల కేసుకు సంబంధించి ఇండియన్ ముజాహిదీన్ -ఐఎంకు చెందిన ఐదుగురు నిందితులు మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ మోను, ఐజాజ్ షేక్, జియావుర్ రెహ్మాన్, మహ్మద్ అహ్మద్ సిద్దిబాప అలియాస్ యాసిన్ భత్కల్‌కు ఉరిశిక్ష విధిస్తూ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఈ సందర్భంగా ఇది అత్యంత అరుదైన కేసు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు హత్య, నేరపూరితమైన కుట్ర, ఉగ్రవాద కార్యకలాపాలు, దేశానికి వ్యతిరేకంగా యుద్ధం అభియోగాలతో సంబంధిత ఐపీసీ సెక్షన్లు, ఆయుధాల నిరోధక చట్టం, ఉపా కింద ఐదుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. దాడుల వెనుక ముందస్తు ప్రణాళిక, వాటిని దుర్మార్గంగా అమలు చేసిన తీరు, దారుణమైన మారణ హోమాన్ని ప్రేరేపించేలా నిందితుల పాశవిక లక్ష్యాన్ని హైకోర్టు ప్రధానంగా ప్రస్తావించింది. ఫిబ్రవరి 21, 2013 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో జనసమ్మర్థంగా ఉండే దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో రెండు పేలుళ్లు సంభవించిన దుర్ఘటనలో 18 మంది మరణించారు. మరో 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. అత్యంత అధునాతనమైన పదార్థాలతో మొదటి పేలుడు బస్ స్టాప్‌లో చోటు చేసుకోగా, రెండవ పేలుడు ఏ1 మిర్చి సెంటర్ వద్ద జరిగింది. యావత్ నగరాన్ని, దేశాన్ని వణికించింది.