శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారం శ్రీరాముడు. ఆయన గాథ రామాయణం, ఆదికావ్యం. రామాయణం భారతావనికే పరిమితం కాలేదు. కొన్ని మార్పులతో విశ్వవ్యాప్తమైంది. మూడు వందల రామాయణాలు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్నాయని అందరూ చెబుతున్న మాట. కానీ ఆ వాదాన్ని తోసిపుచ్చుతూ దాదాపు 2000 రామాయణాలు ఉన్నాయని గ్లోబల్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ‌రామాయణ సంస్థ అంచనా వేస్తున్నది. అయోధ్య రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో అంతర్భాగమది. 2021లో యోగి ఆదిత్యనాథ్‌ ఆరంభించారు. ప్రపంచంలో రామకథ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సేకరించే పని ఈ సంస్థ చేస్తున్నది. భారతీయమైన విలువలకు మూలం ఈ కావ్యమే.

ప్రతి మహాకావ్యం పుట్టుక వెనుక గొప్ప గాథ వినిపిస్తుంది. రామాయణ ఆవిర్భావం వెనుక కూడా చక్కని గాథలు వినిపిస్తాయి. మొదట ఈ కథను పార్వతీదేవికి శివుడు వినిపించాడనీ, అమ్మవారితో పాటు ఎందరో ఆ కథ విన్నారనీ ప్రతీతి. మూడున్నర లక్షల శ్లోకాల ఈ కావ్యాన్నే మహా రామాయణం అంటారు. పరాత్పరుడు భగవాన్‌ ‌రాముడి గురించి ఇందులో పార్వతికి శివుడు తెలియచేస్తాడు. ఇదంతా సంభాషణల రూపంలో ఉంటుంది. వాల్మీకి మహర్షి కంటే ముందే రామకథను ‘హనుమన్నాటకం’ పేరుతో మారుతి ఒక మహా శిల మీద రాశాడని, కానీ వాల్మీకి ఎదుటే దానిని సాగరంలోకి నెట్టివేశాడని మరొక గాథ. ఎన్ని రామాయణాలు వచ్చినా అవన్నీ వేదయుగం తరువాత రచించినవే. వాటిలో వాల్మీకానిదే అగ్రస్థానం. అదే ప్రామాణికం. ఎందుకంటే రామాయణ గాథలోని కొన్ని ఘట్టాలకు వాల్మీకి మహర్షి ప్రత్యక్ష సాక్షి అని నమ్ముతారు. 24,000 శ్లోకాల ఈ మహాకావ్యం తన సొంతమని వాల్మీకి కూడా చెప్పుకోలేద••. లోకోత్తర పురుషుడైన రామచంద్రుడి గాథకు అక్షరరూపం ఇవ్వవలసిందిగా నారద ముని తనకు సూచించారనే అంటాడాయన. వాల్మీకం తరువాత అంత ఖ్యాతి తెచ్చుకున్నది తులసీ రామాయణం. శ్రీరామ జననాన్ని అనేక విధాలుగా చిత్రించారని, లక్షలలో రామాయణాలు ఉన్నాయని తులసీదాస్‌ అభిప్రాయపడ్డారు (1:33:6). కాళిదాసు రఘువంశం కూడా రామాయణ గాథే.

 నిజానికి మహర్షి ఆరు కాండలతోనే రామాయణం రచించారు. ఉత్తరకాండ తరువాత చేరినదని ప్రతీతి. బుద్ధుని కాలంలో చేరిన ఆ కాండతో అసలు కథకు సంబంధం లేదన్నదే ఎక్కువమంది అభిప్రాయం. బౌద్ధ మతస్థులు రాసుకున్న రామాయణం పేరు ‘దశరథ జాతక’. ఇందులో తన మూడో భార్య నుంచి రక్షించడానికి దశరథుడే సీతారామ లక్ష్మణులను అడవులకు పంపుతాడు. సీతాపహరణ ఘట్టం అందులో లేకపోవడం మరొక విశేషం. 11వ శతాబ్దానికి చెందిన ఒక శిలాశాసనం మయన్మార్‌లో దొరికింది. మోన్‌ ‌భాషలో ఉన్న ఆ శాసనం ప్రకారం బగాన్‌ ‌వంశీకుడు రాజా కైయాన్‌జిత్త తనను తాను రాముని అవతారంగా ప్రకటించుకున్నాడు. గడచిన 2500 ఏళ్లలో రామాయణం దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాలలో విశేష ప్రాచుర్యం పొందింది. అన్నామి, బాలి, చైనీస్‌, ‌ప్రాకృతం, సంథాలీస్‌ ‌భాషలలోను కనిపిస్తుంది. పొరుగు దేశం చైనాలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో, కొన్ని మార్పులతో ఈ కావ్యం జన బాహుళ్యంలో ఉన్నది. అక్కడి దాయ్‌ ‌సమాజం చదువుకునే రామాయణం పేరు ‘లంగ్‌ ‌కా సిప్‌ ‌హో’. అలాగే ‘తా లామ్మా’ పేరుతో మరొక రామాయణం అక్కడే ప్రాచుర్యంలో ఉన్నది. 1980లో ప్రొఫెసర్‌ ‌జీ జియాలిన్‌ ‌వాల్మీకానికి చేసిన యథాతథ అనువాదం కూడా ప్రసిద్ధిలో ఉంది. నేపాల్‌ ‌మహాకవి సిద్ధిదాస్‌ ‌మహజు అమాత్య ‘సిద్ధి రామాయణం’ రాశాడు. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ కాలంలో వెలువడింది. అక్కడే ఖాస్‌ ‌భాషలో భానుభక్త రామాయణం అవతరించింది.

ప్రపంచంలో 300 రామాయణాలు ఉన్నాయన్న వాదనను చాలామంది అంగీకరించడం లేదు. ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త ఏకే రామానుజన్‌ ‌కొన్నేళ్ల క్రితం రాసిన వ్యాసం ‘త్రి హండ్రెడ్‌ ‌రామాయణాస్‌: ‌ఫైవ్‌ ఎగ్జాంపుల్స్ అం‌డ్‌ ‌త్రీ థాట్స్ ఆఫ్‌ ‌ట్రాన్సిలేషన్‌’ ‌రామాయణాల సంఖ్య మీదనే వివాదం సృష్టించింది. ఒక్క సంస్కృత భాషలోనే 25 వరకు రామాయణాలు కనిపిస్తాయని ఆయనే చెప్పారు. ఆధ్యాత్మ రామాయణం, వాసిష్ఠ రామాయణం (ఇదే యోగ వాసిష్టం), లఘు యోగ వాసిష్ఠ రామాయణం, ఆనంద రామాయణం, ఆగస్త్య రామాయణం, అద్భుత రామాయణం సంస్కృతంలో వచ్చినవే. రామానుజన్‌ ‌బెల్జియన్‌ ‌మిషనరీ కామిల్లే బల్కే వాదన మీద ఆధారపడినట్టు కనిపిస్తుంది. ఆ మిషనరీ ప్రపంచ వ్యాప్తంగా 300 రామాయణాలు ఉన్నాయని తేల్చాడు.

 ప్రపంచం చదువుకుంటున్న రామాయణాల పేర్లు:

1.వాల్మీకి రామాయణం 2.ఆధ్యాత్మ రామాయణం (బ్రహ్మాండ పురాణ భాగం) 3. ఆనంద రామాయణం, 4 అద్భుత రామాయణం, 5. రంగనాథ రామాయణం, 6. మొల్ల రామాయణం (ఈ తెలుగులో వెలువడినాయి. తెలుగులోనే 40 వరకు రామాయణాలు ఉన్నాయి) 7. రూయిపాద్క తేనపది రామాయణం (ఒరియా), 8. రామ్‌కెర్‌ (‌కంబోడియా), 9. రామ్‌కెర్తి-రాయంకర్‌ (‌కంబోడియా) 10. రామచరిత మానస్‌ (అవధ్‌), 11.ఇరామ్‌వత్‌రామ్‌ (‌కంబ, తమిళం), 12.జానకీ హరణ (సంస్కృతం, కుమారదాస), 13. మాలేరాజ్‌ ‌కథ్వ (సింహళ), 14. కావ్యాదర్శ (కిన్రాస్‌ ‌పున్స్ ‌పా, టిబెట్‌), 15. ‌కాకవిన్‌ ‌రామాయణ (ఇండోనేసియా), 16. హికాయత్‌ ‌సేరీరామ్‌ (‌మలేసియా), 17, రామావత్తు (మయన్మార్‌), 18. ‌హోబుత్సుషు, తెరానో యాసునోరి, శాంబో ఎకోతాబా (జపనీస్‌), 19. ‌రామ్‌జాతక (లావోస్‌), 20. ‌భానుభక్త ఆచార్య రామాయణం (నేపాల్‌), 21. ‌రామ్‌కియేన్‌ (‌థాయిలాండ్‌), 22. ‌ఖోటానీ రామాయణ్‌ (‌తుర్కిస్తాన్‌), 23. ‌జీవక్‌ ‌జాతక (మంగోలియా), 24. మాషి రామాయణ (పర్షియా), 25. దాస్తాన్‌ ఎ ‌రామ్‌ ఒ ‌సితా (షేక్‌ ‌సది), 26. దశరథ్‌ ‌కథ, 27. రామకా వాకా (బాలి), 28. కాకావిన్‌ ‌లేదా యోగేశ్వర్‌ ‌రామాయణ (జావా, ఇందులో కవిత్వం శ్లోకాలు రాసే ఛందస్సులో ఉంది), 29.రామాయణ స్వర్ణద్వీప (సుమిత్ర). ఇంకా రఘువీర గద్యం (స్వామి దేశికన్‌). ‌కొన్ని చోట్ల లభ్యమవుతున్న సమాచారం ప్రకారం ఈ రామాయణాలు కూడా ఉన్నాయి. మన దేశంలోనే రాజాజీ, ఆర్‌కె నారాయణ్‌ ‌వంటివారు ఆంగ్లంలో రామాయణం రచించారు.

‘మంత్ర రామాయణం’ (రుగ్వేదం), ‘సత్యోపాఖ్యానం’, ‘బృహత్‌ ‌కోశలకాండ / బ్రహ్మ రామాయణం’, ‘లోమస రామాయణం’, ‘మంజుల రామాయణం’, ‘అగస్త్య రామాయణం’, ‘రామాయణ మహామాల’,‘రామాయణ మణిరత్న’, ‘సౌహార్ద్ర రామాయణం’, ‘శౌర్య రామాయణం’, ‘చంద్ర రామాయణం’, ‘స్వాయంభువ రామాయణం’, ‘దేవ రామాయణం’, ‘శ్రావణ రామాయణం’, ‘దురంత రామాయణం’, ‘సుబ్రహమ రామాయణం’, ‘మయింద రామాయణం’ వంటివి కూడా ఉన్నాయి. వీటి వివరాలు ఇంకాస్త వెలుగులోకి రావడం అవసరం. కశ్మీర్‌లో 19వ శతాబ్దంలో ‘రామావతార చరిత’ పేరుతో రామాయణం వెలువడింది. ‘కంబ రామాయణం’ తమిళనాట విశేష ప్రాచుర్యంలో ఉన్నది. ఉభయ కవిమిత్రుడు తిక్కన సోమయాజి ‘నిర్వచనోత్తర రామాయణం’ కూడా ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. గోవా కవి కృష్ణదాస్‌ ‌శర్మ 15వ శతాబ్దంలో రాసిన రామాయణ కావ్యం వ్రాతప్రతులు పోర్చుగల్‌లో ఉన్నాయి.

భారతీయ భాషలలో రామాయణాల పేర్లేమిటి? మొల్ల రామాయణం, (ఆత్కూరి మొల్ల) రంగనాథ రామాయణం (గోన బుద్ధారెడ్డి), శ్రీమద్రామాయణ కల్పవృక్షం (విశ్వనాథ) ప్రధానంగా చెబుతారు. సప్తఖండ రామాయణ (అస్సామీ, మాధవ కందాలి), కృత్తివాసి రామాయణం (బెంగాలీ, కృత్తిదాస్‌ ఓఝా), మైథిలీ భాష రామాయణం, రామేశ్వర చరిత్‌ ‌మైథిలీ (బిహార్‌, ‌చంద్ర ఝా, లాల్‌దాస్‌), ‌తులసీ క్రత రామాయణం(గుజరాతీ, ప్రేమానంద స్వామి), కుముదేందు రామాయణం (కర్ణాటక, జైనులది), రామచంద్ర చరిత పురాణ (కర్ణాటక, నాగచంద్ర), రామచరితం (కేరళ, చీరమాన్‌), ‌మాప్పిల్ల రామాయణం (కేరళలో ముస్లింలు ఆలపించే గీతాల రూపంలోని రామాయణం), భావర్త రామాయణం (మహారాష్ట్ర, సంత్‌ ఏక్‌నాథ్‌). ‌సిక్కుల గురు గ్రంథ సాహెబాలో కూడా రామాయణ ప్రస్తావన ఉంది. పోథి రామాయణం 1776లో ఉర్దూలో వెలువడిన రామాయణం.

ఫిలిప్పీన్స్‌లో ‘మహారాడియా లావన’ పేరుతో రామాయణ గాథ ప్రఖ్యాతి గాంచింది. ఆ దేశంలో పేర్గాంచిన నృత్యం సింగ్‌కిల్‌కు ప్రేరణ రామాయణమనే చెబుతారు. రామాయణం జాడలు రష్యాలో కూడా ఉన్నాయి. అక్కడ స్థిరపడిన కల్మయిక్స్ అనే ఒక వర్గం మూలాలు మంగోలియాకు చెందినవి. ఆ ప్రాంతానికి చెందిన మార్‌స్టోన్‌ ‌ఖాస్‌ ‌గ్యాల్‌ అనే ఆయన రామాయణానికి ‘శుభసీతారత్న నిధి’ పేరుతో వ్యాఖ్యానం రాశాడు. అసలు కైక రష్యాకు చెందినదని కూడా వీరు వాదిస్తారు. ఇటలీలో రామాయణ దర్శనానికి వేరొక ప్రత్యేకత ఉంది. అక్కడ రోమ్‌ ‌నాగరికతకు ముందు ఎట్రూస్కాన్స్ అనే వారు ఉండేవారు. వారు వదిలిన కుడ్యచిత్రాలలో రామాయణ పాత్రలు కనిపిస్తాయి. అక్కడే పురావస్తు శాఖ తవ్వకాలు జరిపినప్పుడు కొన్నిచోట్ల తోకలు ఉన్న సమూహం, ఒక స్త్రీ, ఒక పురుషుడు వెంట వస్తుండగా నడిచి వెళుతున్న ఒక పురుషుడి చిత్రం కనిపించాయి. పురుషుల భుజాల మీద విల్లంబులు ఉన్నాయి.

జైనం, బౌద్ధం కూడా రామాయణ గాథను ఆదరించాయి. జైనులలో రెండు శాఖలకు రెండు రామాయణాలు ఉన్నాయి. అవి శ్వేతాంబరుల రామాయణం, దిగంబర వర్గ రామాయణం. శ్వేతాంబరుల రామాయణం ప్రాకృతంలో ఉంది. బౌద్ధ వాఙ్మయంలో రామాయణం ‘దశరథ జాతక’ పేరుతో కనిపిస్తుంది. శ్రీరామచంద్రుడి వలెనే బుద్ధుడు కూడా ఇక్ష్వాకు వంశీకుడేనని ఇవి వాదిస్తాయి.

రామాయణం అంటే భారతీయులందరికీ కూడా బొడ్డుతాడు వంటిదని, కన్నతల్లి గర్భం నుంచి బయటపడిన తరువాత తల్లి భారతి ఒడిలో ఎలా బతకాలో అదే నేర్పుతుందని అంటారు గ్లోబల్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ‌రామాయణ కన్వీనర్‌ ‌బావెంకటేశ్వరరావు సంకురాత్రి (టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా, నవంబర్‌ 21,2023). ‌భారత్‌లో పుట్టినప్పటికీ వారు ఏ వర్గం నేపథ్యం వారైనప్పటికీ వారందరిని కలిపి ఉంచే అంతసూత్రం కూడా రామాయణమేనని ఆయన అన్నారు. రామాయణం కల్పిత కథ అనుకుంటే పొరపాటనీ, అది చరిత్ర అనీ, కావ్యాన్ని సమగ్రం చేయడానికి రచయితలు, కవులు స్మజనాత్మక స్వేచ్ఛను ఉపయోగించుకున్నారనీ ఆయన చెప్పారు. రామాయణం అంటే పురాణం అనుకోవడం సరైన అవగాహన కాదని, అది ఇతిహాసం (చరిత్ర) అన్నారు. గోస్వామి తులసీదాస్‌ ‌రామాయణానికీ, అయోధ్యలో వివాదాస్పద కట్టడానికీ ఉన్న బంధం గురించి కూడా సంకురాత్రి చెప్పారు. 1526-28లో రామమందిరం పడగొట్టారు. ఆ శిథిలాల మీద బాబ్రీ మసీదు కట్టారు. అప్పుడు తులసీదాస్‌ (1511-1623) ‌వయసు దాదాపు పదహారేళ్లు కావచ్చు. ఈ పరిణామాన్ని ఆ కాలంలోనే చారిత్రక, జాతీయతా దృక్పథంతో ఆయన పరిశీలించారు. అందుకే రామకథ అందరికీ తెలియాలనీ, సంస్కృతంలో ఉన్నది కాబట్టి ప్రాంతీయ భాషలోకి తీసుకురావాలని యోచించారనీ సంకురాత్రి విశ్లేషించారు. తులసీదాస్‌ ‌హిందీ మాండలీకాలలో ఒకటైన అవధీలో రామాయణం రాశారు. అదే ‘రామచరిత మానస్‌’. ‌తులసీదాస్‌ ఆలోచన వాస్తవికమైనదని, ప్రాంతీయ భాషలలో వచ్చిన రామాయణాలు రాముడి స్ఫూర్తిని సజీవంగా నిలిపి ఉంచాయని ఆయన చెప్పారు. ఎన్నో కళారూపాలు. మరెన్నో విశ్లేషణలు. టీకా తాత్పర్యాలు. రామాయణం మీద వచ్చిన విచార ధారకు అంతం లేదు.

వాల్మీకి రామాయణం/ఇతర రామాయణ గాథల మీద కొన్ని అంతర్జాతీయ సదస్సులు కూడా నిర్వహించారు. నరేంద్ర మోదీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నప్పుడు (1998) మారిషస్‌లో జరిగిన రామాయణ గోష్ఠికి హాజరయ్యారు. భారత జాతిని ఐక్యం చేయడంలో రామాయణం పాత్ర అనే అంశం మీద ప్రసంగించారు. సెప్టెంబర్‌ 21-23,2001‌లో ఉత్తర అమెరికాలోని నార్తరన్‌ ఇల్లినాయిస్‌ ‌విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సు అందులో ఒకటి. జనవరి 23-25, 2015లో బెంగళూరులో కూడా ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. శ్రీరామ చరిత భవన్‌ ‌మార్చి 21-23, 2024 తేదీలలో జైపూర్‌లో నిర్వహించింది. ఈ జూలైలో మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరగబోతున్నది.

ఆ నో భద్రాః క్రతవో యన్తు విశ్వతో దబ్ధాసో అపరీతాస ఉద్భిదః।

దేవా నో యథా సదమిద్వృధే అసన్నప్రాయువో రక్షితారో దివేదివే।।

 (అన్ని దిక్కుల నుంచి ఉన్నత భావాలు నాలో ప్రవేశించుగాక: రుగ్వేదం)


మొదట ఈ కథను పార్వతిదేవికి శివుడు వినిపించాడనీ, అమ్మవారితో పాటు ఎందరో విన్నారనీ ప్రతీతి. మూడున్నర లక్షల శ్లోకాల ఈ కావ్యాన్నే మహా రామాయణం అంటారు. పరాత్పరుడు భగవాన్‌ ‌రాముడి గురించి ఇందులో పార్వతికి శివుడు తెలియచేస్తాడు. వాల్మీకి మహర్షి కంటే ముందే రామకథను ‘హనుమన్నాటకం’ పేరుతో మారుతి ఒక మహా శిల మీద రాశాడని, కానీ వాల్మీకి ఎదుటే దానిని సాగరంలోకి నెట్టివేశాడని మరొక గాథ.


తులసీదాస్‌ ‌రామాయణానికీ, అయోధ్యలో వివాదాస్పద కట్టడానికీ ఉన్న బంధం గురించి కూడా సంకురాత్రి చెప్పారు. 1526-28లో రామమందిరం పడగొట్టారు. ఆ శిథిలాల మీద బాబ్రీ మసీదు కట్టారు. అప్పుడు తులసీదాస్‌ (1511-1623) ‌వయసు దాదాపు పదహారేళ్లు కావచ్చు. ఈ పరిణామాన్ని ఆ కాలంలోనే చారిత్రక, జాతీయతా దృక్పథంతో ఆయన పరిశీలించారు. అందుకే రామకథ అందరికీ తెలియాలనీ, సంస్కృతంలో ఉన్నది కాబట్టి ప్రాంతీయ భాషలోకి తీసుకురావాలని యోచించారనీ సంకురాత్రి  విశ్లేషించారు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE