‘భారతీయ తత్త్వశతకం’ కవయిత్రి.
నవ కవితా కదంబం, అంతకు మూడేళ్ల ముందు ‘భావతరంగాలు’ పేరిట తొలిగా కవితల సంపుటికి రచయిత్రి.
‘మరో మాయాబజార్’ అంటూ వెలువడిన కథల పుస్తక కర్త.
తండ్రి సాహితీవేత్త, తల్లి అధ్యాపకురాలు కాబట్టి సహజ సిద్ధంగానే ఇంతటి భావ ప్రకటన శక్తి మంగిపూడి రాధికకు అలవడిందని మనం అనుకుంటాం. విజయనగరం అని తన స్వస్థలం పేరు కలకాలం నిలిచేలా ‘స్వర్ణ వారసత్వ’ సంస్థ వ్యవస్థాపన చేశారు కనుక నిర్వాహక ప్రముఖురాలిగా సంభావిస్తాం. వీటన్నింటికీ తోడు, ప్రతిష్ఠాత్మక సమ్మేళనాల వ్యాఖ్యాతగా తనదైన విలక్షణతను ఎప్పటికప్పుడు ప్రస్ఫుటం చేస్తుండటం స్వరతపస్సు అనాల్సిందే!
వ్యాఖ్యాన రంగాన ఇంత మేటి విశిష్టతకు ఎంతో నేపథ్యముంది. ‘‘తెలుగుభాషను పరిపుష్టం చేయటం, నిర్వహణ వ్యవస్థ నిబద్ధతకు దీటుగా సాంస్కృతిక సదస్సులు నిర్వహించటం నా / మా జీవిత లక్ష్యాలు’’ అని ఒక సందర్భంలో ఆమె అనడం ఇక్కడ ప్రస్తావనార్హం.
భాగ్యనగరం వేదికగా వరసగా రెండు రోజులు ఏర్పాటైన రెండు విభిన్న భారీ సభలకు కీలక సంధాన / నిర్వహణ పాత్రధారి రాధికే! అంతర్జాతీయ స్థాయిన ఆహ్వానితులతో తెలుగుకు పురస్కృత పట్టం కట్టిన మేటి ఘట్టం.
తెలుగునాట విజయనగరం మాదిరిగానే – దేశీయంగా మహారాష్ట్ర, అంతకుముందు సింగపూర్‌తో తనకు భాషా సాహితీ సాంస్కృతిక కళానుబంధం.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం దాదాపు ఐదేళ్ల క్రితం నిర్వహించిన సమావేశ శీర్షిక ‘నారీ – సాహిత్య భేరీ’ నాదనినాదాల సమ్మిళితమైన ఈ సప్త అక్షరాలే సదా సాకారం కావాలన్నదే అభిమతం.
వ్యాఖ్యాతకు సమయస్ఫూర్తి ఎంత ధాటిగా ఉంటే, ప్రేక్షకులూ వీక్షకులకి రసాస్వాదన శక్తి అంతగట్టి. అప్పుడే వేదికమీదా ముందూ కూడా తెలుగు వెలిగి తీరుతుందన్నది ఆమె స్వానుభవం. వివరాలు…
తెలుగు, ఆంగ్లభాషల్లో పలు పుస్తకాలందించిన కొటికలపూడి కూర్మనాథం బొబ్బిలి ప్రాంత ఆస్థాన సాహితీమూర్తుల వంశీకులు. విజయనగరం మహారాజా కళాశాలలో మూడు దశాబ్దాల బోధన అనుభవం. దేవులపల్లి కృష్ణశాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతారావు వంటి సాహిత్య, సంగీత సుప్రసిద్ధులతో ఆత్మీయబంధం. తాను ‘కవికోవిద’ అనిపించుకున్నారు.
అప్పట్లోనే తనకు 38 ఏళ్ల ప్రాయాన విశేష గేయ రచనల పుస్తకాన్ని ప్రచురించారు. పేరు ‘నవనందిని.’ ఆయన ఆంగ్ల కవితలన్నింటినీ తిరుమల -తిరుపతి దేవస్థానం ఏడేళ్ల కిందట పుస్తకంగా వెలువరించింది. సంగీత రంగంలోనూ దక్షత కనబరచిన ఆ ప్రతిభను ప్రశంసిస్తూ ప్రపంచ స్థాయి సంస్థ పురస్కృతి ప్రకటించింది. సప్తగిరులు, కిన్నెర వీణ, అంతర్వాహిని, భావరాగాలు, మానవ మాధవం… మరికొన్ని కావ్యాలు.
తత్వచింతన నిండిన గీతికలను కూర్మనాథం ప్రచురించి ప్రాచుర్యానికి తెచ్చారు. ఈ ప్రత్యేకతలను వారసత్వంగా పుణికిపుచ్చుకున్న రాధిక తత్వశాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ అయ్యారు. పరిశోధన కృషినీ నిర్వర్తించారు.
ఇప్పటికి రమారమి దశాబ్దం నాటి ముచ్చట. సింగపూర్‌లో ప్రపంచ సాహితీ సదస్సును ఉద్దేశించి మాట్లాడటంతో, ఆమె కళాయానం ఆరంభమైంది. అనేకానేక సమ్మేళనాల పరంపరకు నిండుదనం తెచ్చారు. ఎన్నెన్నో కార్యక్రమాల నిర్వహణపరంగా, ప్రణాళికల రూపకల్పన సంబంధంగా ప్రముఖ పాత్ర వహించారు. ప్రధాన నిర్వాహక బృంద ప్రతినిధి అయ్యారు. సాహితీ సదస్సుల విశేష సంచికలకు సంపాదక బాధ్యురాలయ్యారు.
ఆకాశవాణి ప్రసంగ, ప్రసార అంశాలెన్నింటికో ఆమె సమన్వయకర్తగా నిలిచారు. సింగపూర్ నుంచి ప్రాతినిధ్య విధులు చేపట్టారు. అలా సింగపూర్‌లో, అల సింగపురంలో అనేలా తెలుగువారంతా కలసి తీసిన లఘుచిత్రానికి పరిపూర్ణ రచనా సహకారం అందించారు. కథల సంపుటికి ప్రచురణ బాధ్యత చేపట్టిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థది ముప్ఫయి వసంతాలకు పైగా సుదీర్ఘ చరిత్ర.
తెలుగు సాహిత్య వేదికగా, సేవ – ధార్మిక వ్యవస్థగా ఉన్న ఇది ప్రచురణ, నిర్వహణ రంగాల్లో ముందు వరస. సృజనాత్మక రచనలు, సంగీతం, మరెన్నో లలిత కళల విస్తృతికి మూలమవుతూ వస్తోంది. అమెరికాలోని తొలి వెలుగు పత్రికల్లో ఎంతగానో పేరొందిన ‘మధురవాణి’ ప్రారంభకులూ నిర్వాహకులూ అయిన వంగూరి చిట్టెన్‌రాజు ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. స్వస్థలం కాకినాడ ప్రాంతం. విఖ్యాత సంస్థ వంశీ ఇంటర్నేషనల్ సంస్థాపకులు రామరాజు అర్ధశతాబ్దికి పైగా సారస్వత, సాంస్కృతిక, సేవారంగాల్లో యశస్వి. పన్నెండు దేశాల్లోని పలు రంగాల ప్రతిభామూర్తులను ఈ తెలుగు సంవత్సర సందర్భాన సత్కరించినవారు. ప్రవాస భారతీయులు అనేకమందికి పురస్కార ప్రదానం చేసినవారు. ‘శిరోమణి’ గ్రహీత.
భాగ్యనగరాన ఇటీవలి ఘన కార్యక్రమాలకు సంయుక్త నిర్వాహకత్వం వహించింది శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ. పుస్తక పరిచయాలతోపాటు శాస్త్రీయ సంగీత రంగం గురించిన ప్రసంగాల నిర్వాహక వ్యవస్థ. అరుదైన కళారూపాల సమాదరణకు పేరొందిన ఈ సంస్థకు అత్యంత ముఖ్యులు మంగిపూడి రాధిక. సింగపూరుకు తలమానికమైన రీతిన నిర్వహణం. ఆమె శతక పుస్తకాన్ని ఆస్ట్రేలియన్ సంస్థ ప్రచురణకు తెచ్చింది. ముంబయి జనరంజని, మహారాష్ట్ర రచయితల సంఘం, నార్వేలోని ‘వీధి అరుగు’, ఇంకా ఎన్నెన్నో సంస్థలతో ఆమెది అక్షర బంధం.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డస్‌లో స్థానం సాధించటం, కథల పోటీల్లో ప్రథమ బహుమతులు పొందడం, మరీ ముఖ్యంగా వ్యాఖ్యాతిగా సింగపూర్‌లో అప్పట్లోనే ప్రత్యేక పురస్కృతులు అందుకోవడం, తెలంగాణ ప్రభుత్వం నుంచి ‘మేటి మహిళ’ పురస్కారం, అంతర్జాతీయ సాహితీ బహూకృతులు – తన మధుర అనుభవాలు. దక్షిణాఫ్రికాలోని తెలుగు సంఘం నుంచి ప్రపంచ స్థాయి ప్రవాస తెలుగు పురస్కృతినీ సొంతం చేసుకున్నారామె. అన్నింటా అంతటా ఎన్నింటిని కైవసం చేసుకున్నప్పటికీ- వ్యాఖ్యాన పక్రియపైనే తనకు మక్కువ ఎక్కువ అంటున్నారు.
తన కథల పుస్తకం న్యూజిలాండ్‌లో ఆవిష్కృతమైంది. తమిళనాడు, మరికొన్ని రాష్ట్రాల సంస్థలకు సంబంధించీ క్రియాశీలత వెల్లివిరుస్తోంది. ప్రపంచ సాహిత్యవేదిక ‘తానా’ సరిగ్గా నాలుగు వసంతాల నాడు జరిపిన ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం జ్ఞాపకాలూ మహదానుభూతి కలిగిస్తున్నాయి. అది 21 దేశాల్లోని 21 సంస్థలతో 21 గంటలపాటు సాగిన అక్షర యజ్ఞం. అలాగే రాధిక తన మొదటి పుస్తక ప్రతిని సమర్పించింది విజయనగరంలోని జ్ఞానసరస్వతి ఆలయాన అమ్మవారి చరణాలకు. అంకితం చేసింది తాను చదువుకున్న అక్కడి విద్యాలయాలకు, చిన్ననాటి గురుదేవులకు.
అదే సందర్భంలో ఆమె భావతరంగాలు ఇవీ:
మన దేశం ఆధ్యాత్మికతకు నెలవు.
ధార్మిక విలువల కూడలి, కేంద్ర స్థానం మన భారతదేశమే.
ప్రాచీన సాహిత్యం అనేది అపురూప సంపద.
తత్వ ఆలోచనలు, జిజ్ఞాస, ప్రశ్నించే తత్వం మనందరిదీ.
పుస్తక రచనా వ్యాసంగం పురాకృత పుణ్యఫలం.
తత్వశాస్త్రం ఎంతో గంభీరం. సముద్రంలా నిగూఢం.
భక్తి శతకాలతో తత్వ ఉపదేశం సుసాధ్యం.
రాధిక మరో ప్రత్యేక కృషి… సాహితీ మిత్రులను ఒకే వేదికపైకి చేర్చి, భావసంపద విస్తరణకు మరిన్ని అవకాశాలు కలిగించడం. వారందరికీ ప్రాంతీయ సమాచారాన్ని అందుబాటులోకి తేవడంలో ఎప్పుడూ ముందే ఉంటున్నారు. ధార్మిక సంస్థ, విభాగాల ఏర్పాటుతో సేవా నిరతికి క్రియారూపం ఇస్తున్నారు, విస్తృతీకరిస్తున్నారు.
సమాజంలోని వాస్తవాలను వెల్లడిచేసేవారు మాత్రమే కవులూ కవయిత్రులూ అవుతారు. నాయకత్వ బాధ్యతను చేపట్టగలిగినవారే సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తారు. ఆ వ్యక్తీకరణను, నిర్వహణ రూపాలను వేదికమీద ప్రత్యక్షం చేయగలిగింది వ్యాఖ్యాత. అందుకే ఆ సంవిధానాన్ని ఆచరణకు తెస్తున్నారు ‘మధుర వచో రూఢి రాధిక మంగపూడి.’
భాష పరిరక్షణకు కావాల్సింది క్రియాత్మకత. యోచనలు, మాటలు, చేతలలోనే అనుకున్నవి నెరవేరతాయి. ఈ కృషిలో మొదటగా అవసరమైంది స్ఫూర్తిదాయకత. ఇది విశదీకరణ, వ్యాఖ్యానాలతో మరింత వేగవంతమవుతుంది. ముందడుగు వేయించగలుగుతుంది.
ఈ రీత్యా చూసినపుడు; వేదికమీది వ్యాఖ్యానానికి, సమయస్ఫూర్తి ప్రకటనకు సమధిక ప్రాధాన్యం ఉండనే ఉంటుంది. ఉత్తేజభరిత వాగ్ధాటి నవోత్తేజానికి మూలకారకం. సాహిత్య, సమాజ రంగాలు రెండింటికీ ఇదే పూర్తిగా వర్తిస్తుంది మరి.
ప్రాముఖ్యాన్ని గ్రహించి, నిర్వహణ అవసరాలను గమనించి, సమన్వయ సహకార విధులను అనుసరించి మెలగడమన్నది చక్కని ఫలితాలకు కీలకం. దీన్ని గుర్తించి, గౌరవించి, పాటించి, ఒక మంచి అనుభూతిని అనుభవానికి తెస్తున్నందునే వ్యాఖ్యాన పక్రియకు ఆదరణ పెరుగుతోంది.
స్వప్నాన్ని సాకారానికి తెస్తున్నందుకు; తెలుగు పద సంపదను వేలాది తెలుగువారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అందిస్తున్నందుకు వ్యాఖ్యానకర్తలను మనం అభినందించి తీరాలి. మాటలంటే మాటలు కావు. వాటివల్ల కలిగే చైతన్య ప్రభావాలు సామాన్యంగా ఉండవు. అసామాన్య ప్రజ్ఞను, మీదు మిక్కిలి భాష విస్తరణను సులభసాధ్యం చేస్తున్నందున రాధిక అభినందనీయురాలు.
తెలుగువారి నాలుకలమీద నిలిచేదే భాషానురక్తి. ఆ శక్తి సంపన్నతకు సమ్మేళనాల్లో నోటిమాటలను జోడించడమన్నది ఎంతైనా వందనీయం. ఆ కారణంగానే, ఆమెను ఆదర్శంగా భావించాలందరూ.
ఒక సభలో తానే అన్నట్లు – మన భాషకు పరిరక్షకులం మనమే. అంతా మన మాట తీరులోనే ఉంటుంది. ఇప్పుడైనా, ఎప్పుడైనా!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్