ఏప్రిల్ 30 చందనోత్సవం
సింహాచలము మహా పుణ్య క్షేత్రము.. శ్రీ వరాహ నరసింహుని దివ్యధామమూ….’ అని భక్తులతో నీరాజనాలు అందుకుంటున్న సింహగిరి దక్షిణ భారతదేశంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. హరిచందనగిరి, సుందరగిరి, సువర్ణగిరి, ప్రహ్లాదాద్రి, వరాహాచలం, నందనాద్రిగా ఖ్యాతిపొందింది. భూదేవిని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వరాహామూర్తిగా హిరణ్యక్షుని వధించిన తరువాత, ప్రహ్లాద పాలకుడిగా ఆతని తండ్రి హిరణ్యకశిపుని సంహరించాడు. నాటి ఉగ్రరూపం ఉపసంహరణకు బ్రహ్మాది దేవతలతో పాటు ప్రహ్లాదుడు ప్రార్థించినా, ఆ ఉగ్రత్వం తగ్గలేదు. దాంతో, బ్రహ్మ సూచన మేరకు, ప్రహ్లాదుడు చందన (గంధం) లేపనంతో సేవ చేశాడు. వరాహా నృసింహుడు శాంతించాడు. ప్రహ్లాదుడ్ని విన్నపం మేరకు చందన చర్చితంగా భాసిల్లుతూ, సింహగిరిపై కొలువుదీరాడు. ఏడాది పొడవునా చందనలేపనంతో దర్శనమిచ్చే వరాహా నృసింహుడు అక్షయ తృతీయ నాడు (వైశాఖ శుక్ల తదియ)చందనోత్సవం పేరిట జరిగే కార్యక్రమంలో నిజరూప దర్శనం ఇస్తారు. పురూరవ చక్రవర్తికి స్వామిని ఈ తిథి నాడే మొదటిసారి దర్శించినందున అప్పటి నుంచే ఆ రోజున నిజరూప దర్శన భాగ్యం సంప్రదాయంగా వస్తోంది. అది భక్త జనావళికి పండుగ రోజు.
తెలుగు రాష్ట్రాలలోని నారసింహక్షేత్రాల ఉత్సవాలు వేటికవే ప్రత్యేకమైనవి కాక సింహాచలం చందనయాత్ర జగత్ప్రసిద్ధం.ఏడాది పొడవునా చందనం లేపనం మాటున ఉండే స్వామి వైశాఖ శుద్ధ తదియ నాడు భక్తజన కోటికి నిజరూప దర్శనం అనుగ్రహిస్తారు. ఇదే చందనయాత్రగా ప్రసిద్ధి. చందనావృతంగా, లింగాకృతిలో భాసిల్లే స్వామి నిజ మంగళ దివ్య స్వరూపాన్ని ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే దర్శించుకోగలుగుతాం. ఇది వైకుంఠంలో లక్ష్మీ నారాయణులను దర్శించినంతటి పుణ్య ఫలితమని క్షేత్ర మహాత్మ్యం పేర్కొంటోంది.
స్థల పురాణం ప్రకారం, దనుజ సంహరణ అనంతరం ప్రహ్లాదుని అభ్యర్థన మేరకు సింహగిరిపై వరాహనరసింహుడిగా అవతరించిన స్వామికి ఆ మహా భక్తుడు అర్చనాదులు నిర్వహించాడని, బ్రహ్మ-మహేశ్వరులు,ఇంద్రాది దిక్పాలురతో తరలి వచ్చి బ్రహ్మోత్సవాలు జరిపించాడని ప్రతీతి. అనంతర కాలంలో స్వామికి ఆరాధనలు లేక ఆలయం శిథిలమై పుట్టలు లేచి స్వామి దివ్య మంగళ విగ్రహం కనుమరుగైంది. కాలాంతరంలో, పురూరవ చక్రవర్తి ఊర్వశితో గగనయానం చేస్తుండగా, స్వామి ఉన్న ప్రదేశంలో విమానం నిలిచిపోయింది. అక్కడ స్వామివారి ఉనికిని దివ్య దృష్టితో గమనించిన ఊర్వశి విషయాన్ని పురూరవుడికి తెలిపింది. అదే రాత్రి చక్రవర్తికి స్వప్న సాక్షాత్కారమైన శ్రీహరి ‘తనను పుట్ట నుంచి బయటకు తీసి గంధం (చందనం) సమర్పించ’మని, వెలికి తీసిన నాడే (వైశాఖ శుద్ధ తదియ) భక్తులకు తన నిజరూప దర్శనం కలుగచేయాలని ఆదేశించారట. చక్రవర్తి వేయి కలశాల గంగ ధార, పంచామృతాభిషేకంతో పుట్టను కరగించి స్వామిని వెలికి తీయించాడట.
చందనయాత్ర…
వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)నాడు స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని పురూరవుడు కనుగొని, చందనసేవ చేయడం వల్ల చందనయాత్రగా స్థిరపడిపోయింది. ఆ సంప్రదాయం ప్రకారమే, ముందురోజే విదియనాటి రాత్రి మూలమూర్తిపై గల చందనాన్ని ఒలిచి, తదియ నాటి బ్రాహ్మీ ముహూర్తంలో స్వామికి గంగధార పవిత్ర జలాలతో సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. అనంతరం స్వామి నిజరూప దర్శనాన్ని అనుమతిస్తారు.ఆ నాటి సాయం సంధ్యా సమయంలో స్వామికి మనమూలికలు, సుగంధ ద్రవ్యాలతో కూడిన 120 కిలోల చందనం సమర్పిస్తారు. మరో మూడు విడతల్లో (వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి) అంతేసి పరిమాణంలోనే చందనం అద్దుతారు. చందనోత్సవం నాడు సింహగిరి శోభాయమానంగా విరాజిల్లుతుంది. ఈ క్షేత్రంలో వివిధ ఉత్సవాలు జరుగుతున్నా, చందనయాత్రను విశేషంగా పరిగణిస్తారు. ఆరోజు స్వామి నిజరూప దర్శనానికి ఉవ్విళ్లూరుతారు. ఇక్కడ ఐదుగురు దేవతామూర్తులు గోవిందరాజస్వామి (ఉత్సవమూర్తి), మదనగోపాలస్వామి (శయనమూర్తి), వేణుగోపాలస్వామి (స్వప్నమూర్తి), యోగ నృసింహ (బలిమూర్తి), సుదర్శనుడు (చక్రపెరుమాళ్)లకు జరిగే నిత్యార్చనను ‘పంచభేరి’ అంటారు.
ఏటా పుష్యమాస అమావాస్యనాడు శ్రీకృష్ణ అలంకరణలో స్వామి వారికి కొండదిగువన వరాహా పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. చందనోత్సవం తరువాత అంత ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవం కన్నుల పండువుగా ఉంటుంది
శ్రీమద్రామానుజులు, శ్రీకృష్ణదేవరాయలు, రెడ్డిరాజులు తదితర ఎందరో ప్రముఖులు ఈ క్షేత్రాన్ని దర్శించారు. రాయలు తమ మాతృమూర్తి నాగదేవమ్మ,సర్వారాయలు పేరిట స్వామి వారికి కంఠమాల, వజ్రమాణిక్యాలు, కడియాలు, శంఖుచక్రాలు, పతకం మొదలైన ఆభరణాలు సమర్పించినట్లు ఆలయ ప్రాంగణంలో శాసనం చెబుతోంది. కంచి నుంచి కటకం వరకు పాలించిన అనేక మంది రాజులు, రాణులు స్వామి వారికి భూరి విరాళాలు సమర్పించుకున్నట్లు ఆలయ స్తంభాలపై, ప్రాకార గోడలపై రాతలు తెలియచెబుతాయి. చాళుక్య, చోళ రాజులు, వీరకూట పల్లవుల, వేంగీ చాళుక్యులు, కోరుకొండ నాయకులు, కొప్పుల నాయకులు, నందాపుర రాజులు, గాంగులు, వడ్డాదిమాత్యులు, జంతరనాటి సురబి వంశజులు, ఒడిసా గజపతులు తదితరులు సింహాద్రినాథుడిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.
సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే!
సింహచల నివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్!!
డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి