కార్టూన్ కళకళలాడాలి

చుట్టూ ఉన్న సమాజంలో వీరంగం వేస్తున్న గోరోజనాన్ని వెక్కిరించేదే వ్యంగ్యచిత్రం. అదే కార్టూన్. ఈ ధరాతలాన్ని మోస్తున్నామన్నట్టు విన్యాసాలు చేసే నేతల వికారాలని తగ్గించేది కూడా కార్టూన్ కళే. రాజకీయాల పెడధోరణుల మీద మొట్టికాయలు వేసే అనధికార న్యాయస్థానం మూడు కాలాల కార్టూన్. అలాంటి కళ ఇటీవలి దశాబ్దాలలో రాను రాను బలహీనపడుతున్నదంటే మనం ఒప్పుకోవాలి. వీలైతే విలపించాలి. కార్టూన్ కళ బలహీనపడుతున్నదంటే సమాజంలో వచ్చిన మార్పు కారణమా? కార్టూన్‌ను భరించే సహృదయతకి జాతి నీళ్లు వదిలేసిందా? తనను వెక్కిరించి, నేలపై నడిచేటట్టు చేసే కళలోని స్వారస్యాన్ని అనుభవించే స్థితిని కోల్పోయిందా? లేకపోతే సామాజిక అవ్యవస్థను కార్టూనించే సృజన చిత్రకారులలో ఇంకిపోతున్నదా? ఇలాంటి ప్రశ్న వేసుకోక తప్పని పరిస్థితిలోనే మనం ఇప్పుడు ఉన్నామని ఎవరైనా అంటే, ఆ వ్యాఖ్యను కూడా సవినయంగా స్వీకరిద్దాం.

కార్టూనిస్టులు చవిచూసిన రెండు పరిస్థితుల గురించి ఇక్కడ గుర్తు చేసుకుందాం. ఎందుకంటే, కాస్త ఎక్కువో లేదా కాస్త తక్కువో! ఇలాంటి పరిస్థితులు తరుచు పొంచి ఉంటాయి. రైలింజన్‌లో లోకో పైలట్ పారతో రాక్షసి బొగ్గు ముక్కలు మంటలో విసురుతూ ఉంటాడు. మంట మీద నాజీజం అన్న అక్షరాలు ఉంటాయి. బొగ్గుల గుట్ట మనిషి చిన్నచిన్న శవాల రూపంలో చిత్రించి ఉంటుంది. వాళ్లంతా యూదులు.ఆ లోకో పైలట్ హిట్లర్. ఈ కార్టూన్‌ను చూసిన హిట్లర్ ఒక్కటే కోరాడు. ఆ కార్టూనిస్టు తల. నన్ను కార్టూనించడంలేదెందుకు అంటూ శంకర్ పిళ్లైని భారత ప్రథమ ప్రధాని పండిట్ నెహ్రూ అడిగేవారట. శంకర్ బ్రష్ నుంచి తమ రూపాలు రావాలనే ఆనాడు భారతదేశంలో ఎక్కువ మంది నాయకులు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అలాగే మనకాలంలో చూసిన మహా దారుణం ఒక కార్టూన్‌ను ప్రచురించినందుకు హోబ్డో అనే ఫ్రెంచ్ పత్రిక మీద జరిగిన దాడి. ఈ ఉదంతాలు మనకు చాలా విషయాలు చెబుతాయి.
భావ ప్రకటనా స్వేచ్ఛ అన్న ఓ మాట గతంలో ఏనాడూ వినపడనంత బిగ్గరగా ఇప్పుడు వినిపిస్తున్నది. కానీ ఆ పేరుతో దేశంలో జరుగుతున్న చీదర వర్ణనాతీతం. చాలాసార్లు శాంతిభద్రతల సమస్య. స్టాండప్ కమేడియన్‌లు ఈ చీదరకు ఆద్యులు. వీళ్ల విసురులన్నీ భారతీయ విలువల మీద. వీళ్ల చెణుకులన్నీ ఈ దేశంలో మెజారిటీ మతం మీద. వీళ్ల వికృత వ్యాఖ్యలన్నీ ఈ దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో వస్తున్న చెత్త మరొకటి. వ్యంగ్యం, కాసేపు సరదాగా నవ్వుకోవడానికి, క్రియేటివ్ లిబర్టీ అన్న ముసుగులలో వాళ్ల వాళ్ల బుర్రలోలని బురదంతా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచం మీదకు వెల్లువెత్తుతున్నది. వీటి వెనుక ఒక కుట్ర ఉంది. స్టాండప్ కమేడియన్ల వికారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (చాలాభాగం) వినోదం బ్యాడ్ టేస్ట్‌కి ఉదాహరణలు. ఇవన్నీ ఒకరకం ద్వేషాన్ని రగులుస్తున్నాయి. కిరాయిమూకల చర్యలని అనుకోక తప్పనట్టే ఉంటున్నాయి. కానీ కార్టూన్ స్థాయి వేరు. చరిత్ర వేరు. దాని ఉద్దేశమే వేరు. అది ఒక అవాంఛనీయ పరిస్థితిని, పరిణామాన్ని వెక్కిరిస్తుంది. అందుకు కారణమైన సమూహాన్ని లేదా వ్యక్తి వివస్త్రుని చేస్తుంది. మనని వినోదింప చేస్తూనే, ఆలోచింపచేస్తుంది. పౌరులకు సమాజం ఎడల ఉండే ఒక బాధ్యతను చెంపకాయ కొట్టినట్టు కొట్టి గుర్తు చేస్తుంది.

భావ ప్రకటనా స్వేచ్ఛకు నిజంగా అర్హమైనది కార్టూన్ కళే. అయితే ఇప్పుడు కార్టూనిస్టుల ప్రతిభ వెనుకపడడమే పెద్ద విషాదం. పదునైన కార్టూన్లు రావలసిన కాలంలో బ్రష్‌లు బద్ధకించడం ఈ కాలపు వైచిత్రి. స్టాండప్ కమేడియన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో వెటకారం రాజ్యమేలడానికి కారణం కార్టూనిస్టులు వెనుకపడడమేమో వారితో పాటు మొత్తం సమాజం కూడా ఆలోచించాలి. రాజకీయ రంగం మీద వేసే కార్టూన్లు, కేవలం మనుషుల వికృతుల మీద చిత్రించే కార్టూన్లు, సామాజిక ధోరణుల మీద సంధించే కార్టూన్లు ఏమైనా గానీ, కార్టూన్ కళ నీరసించిపోవడం అవాంఛనీయమే. చాలా పత్రికలు కార్టూన్లు వేయడం లేదు. అందుకు వారు చెబుతున్న మాట ఒక్కటే! ప్రమాణాలు. అందరినీ వెక్కిరించే కార్టూనిస్టులు ఈ మాటను సహృదయంతో స్వీకరించడం గొప్ప అవసరం.
జాగృతి, జొన్నలగడ్డ లక్ష్మీనారాయణ కార్టూన్ పోటీ (2025) విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. ముందు ముందు కూడా మా పత్రికకు ఇంకా ఇంకా మెరుగైన రీతిలో కార్టూన్లు వస్తాయని ఆశిస్తున్నాం.
జొన్నలగడ్డ లక్ష్మీనారాయణ ఆర్థిక సహకారంతో జాగృతి నిర్వహించిన – 2025 కార్టూన్ పోటీ ఫలితాలు
- మొదటి బహుమతి రూ.5000 – గోపాలకృష్ణ, హైదరాబాద్
- రెండవ బహుమతి రూ.3000 – జెన్నా, విశాఖపట్నం
- మూడవ బహుమతి రూ.2000 – శేఖర్ వంగల, రాజమండ్రి
ప్రోత్సాహక బహుమతి రూ.500 పొందినవి
- ఎన్.వి. రమణమూర్తి(నాగిశెట్టి), విజయవాడ
- బీవీఎస్ ప్రసాద్, హైదరాబాద్
- పి.వి. రామశర్మ, విశాఖపట్నం
- సి. శ్రీధర్ కుమార్, గుంటూరు
- డి.ఎస్. చక్రవర్తి, గుడివాడ
- సింహాద్రి నాగశిరీష –
- ఓంకార్, విశాఖపట్నం
- ఆనంద్, సూర్యాపేట
సాధారణ ప్రచురణకు ఎంపికైనవి
- కృష్ణ కిషోర్, హైదరాబాద్
- మాచవోలు రమ –
- బొమ్మన్, విజయవాడ
- ఎన్‌వి రమణమూర్తి, విజయవాడ
- గుత్తుల శ్రీనివాసరావు, వేమగిరితోట