హోలీ పండుగ కామదహనానికే మాత్రమే పరిమితం కాకుండా హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో లెక్కా పత్రం లేని దాదాపు రూ.15 కోట్లు విలువైన కరెన్సీ నోట్ల కట్టలను కూడా దహించివేసింది. మార్చి 14 శుక్రవారం అర్థరాత్రి దేశరాజధానిలో ఢిల్లీ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసం స్టోర్ రూమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో కట్టలకొద్దీ కరెన్సీ నోట్లు కాలిబూడిదై పోతూ మంటలార్పడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి కనిపించాయి. న్యాయవ్యవస్థకు మచ్చ తెచ్చిన ఈ ఘటనపై సుప్రీంకోర్టు స్పందించింది. అంతర్గత విచారణకు త్రిసభ్య కమిటీని నియమించింది. విచారణ పూర్తయ్యేంతవరకు జస్టిస్ యశ్వంత్ వర్మకు న్యాయపరమైన ఎలాంటి విధులు, బాధ్యతలు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను ఆదేశించింది. అయితే స్టోర్ రూమ్‌లో నోట్ల కట్టలకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని, ఇది తనపై జరిగిన కుట్రగా జస్టిస్ యశ్వంత్ వర్మ ముక్తా యించారు.
ఇదీ జరిగిందీ
మార్చి 14, రాత్రి 11:30: న్యూఢిల్లీలోని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం.
మార్చి 15, సాయంత్రం 4:50: అగ్ని ప్రమాదం జరిగిన సమయానికి లక్నోలో ఉన్న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ జరిగిన సంఘటన గురించి వివరించారు.
మార్చి 16: జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ న్యూఢిల్లీకి తిరిగి వచ్చీరావడంతోనే నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాను కలుసు కున్నారు. ఆ తర్వాత ఆయన చీఫ్ జస్టిస్ ఆదేశాలకు లోబడి జస్టిస్ యశ్వంత్ వర్మకు ఫోన్ చేశారు.
మార్చి 17, ఉదయం 8:30: జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు అతిథి గృహంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ ఇంటి స్టోర్ రూమ్‌కు ఎలాంటి తాళం వేసి ఉండదని, అది అందరికీ అందుబాటులో ఉంటుందని, అందులో వాడని ఫర్నీచర్ లాంటి సామాన్లు ఉన్నాయని జస్టిస్ ఉపాధ్యాయకు జస్టిస్ వర్మ తెలియపరిచారు. ఇది తనపై జరిగిన కుట్రగా జస్టిస్ వర్మ ఆరోపించారు.
మార్చి 21: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ యశ్వంత్ వర్మకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. జస్టిస్ వర్మ ఫోన్‌లో డేటాను వెలికితీయడం కోసమని గత ఆరు నెలల నుంచి ఫోన్‌లో నిల్వ ఉన్న ఎలాంటి మెస్సేజ్‌లు లేదా కాల్ రికార్డులను డిలీట్ చేయవద్దని ఆదేశించారు.
మార్చి 22: సుప్రీంకోర్టు విడుదల చేసిన జస్టిస్ యశ్వంత్ వర్మ అధికార ప్రకటనకు లోబడి ఆయన తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. స్టోర్ రూమ్‌లో ఎలాంటి నోట్ల కట్టలు బైటపడలేదని చెప్పుకొచ్చారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న స్టోర్ రూమ్‌కు, తాను ఉంటున్న ఇంటికి ఎలాంటి సంబంధంలేదని, ఆ స్టోర్‌రూమ్‌కు గార్డులు, తోట పనివారు, సిబ్బంది, కేంద్ర ప్రజాపనుల శాఖ- సీపీడబ్ల్యూడీ సిబ్బంది తరచుగా వచ్చి పోతుంటారని తెలిపారు.
ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయ సమర్పించిన నివేదిక ప్రాతిపదికగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా పంజాబ్ హరియాణా హైకోర్టు చీఫ్ జస్టిస్ షీల్ నాగు, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జీఎస్ సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్‌తో త్రిసభ్య విచారణ కమిటీని నియమించారు. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ నివేదికపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పందన, జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రకటన, అగ్నిప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సుప్రీంకోర్టు ఆన్‌లైన్‌లో ఉంచింది.
వీడియోలో మంటల్లో భారీ నగదు
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసపు స్టోర్ రూమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో నోట్ల కట్టలు కాలి బూడిదైపోతున్న దృశ్యాలతో కూడిన వీడియో సంచలనం సృష్టించింది. ఆ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాలి బూడిదైపోతున్న భారీ నగదు ఎక్కడ నుంచీ వచ్చిందీ అనేదానిపై, అగ్నిప్రమాదానికి దారి తీసిన పరిణామాలపై పెద్ద ఎత్తున చర్చను లేవనెత్తింది. ఆ వీడియో హైకోర్టు సిట్టింగ్ జడ్జి నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు ఉన్న సంగతిని ధ్రువీకరించింది. అయితే అది ప్రమాదం జరిగినప్పుడు మంటలు ఆర్పడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఒకదానితో ఒకటితో పొంతన లేకుండా చెబుతున్న మాటకు పూర్తి విరుద్ధంగా ఉంది.
మా కోర్టు చెత్తబుట్ట కాదు
ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని తొలుత సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసన తెలిపింది. ఇదే విషయమై అసోసియేషన్ ఒక లేఖలో ‘‘కొలీజియం తీసుకున్న ఈ నిర్ణయంతో అలహాబాద్ హైకోర్టు ఒక చెత్త బుట్టనా అనే తీవ్రమైన ప్రశ్నను లేవనెత్తుతోంది’’ అని పేర్కొంది.
జడ్జి నివాసానికి త్రిసభ్య కమిటీ
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు మార్చి 25న మంగళవారం జస్టిస్ వర్మ అధికారిక నివాసానికి వెళ్లారు. అక్కడ అరగంటసేపు ఉన్నారు. కాలిన నగదు దొరికినట్టుగా చెబుతున్న ప్రాంతాన్ని సందర్శించారు.
లెక్కకు అందని నోట్ల కట్టలు మచ్చను తెచ్చిన న్యాయవ్యవస్థపై వ్యవహారంపై సుప్రీంకోర్టు వెంటనే స్పందించడం, అంతర్గత విచారణకు కమిటీని ఏర్పాటు చేయడంతో కేసు దర్యాప్తులో ఓ ఆశా వహమైన ముందడుగు పడినట్టయింది. అయితే దర్యాప్తు అందించే ఫలితం, జస్టిస్ వర్మపై తీసుకునే చర్యలపైనే న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం తిరిగి పాదుకొనడం ఆధారపడి ఉంటుంది.