ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ జోడెద్దుల్లా సాగాల్సిన ప్రభుత్వం, కోర్టుల మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు నెలకొనేలా వాతావరణం ఏర్పడడం దురదృష్టకరం. ఈ రెండు వ్యవస్థలు దేనికవే అత్యున్నతమైనవి. ఒకరికొకరు సహకరించుకుంటూ పాలన సాగించాల్సిన ఈ వ్యవస్థల మధ్య పొరపొచ్చలు వచ్చేలా ఇటీవల కొన్ని ఘటనలు జరిగాయి. దేశంలోనే అత్యున్నత స్థానాలైన రాష్ట్రపతి, సుప్రీం కోర్టు ఇందులో పాత్రలైనాయి. కేంద్రంతో నిత్యం ఘర్షణ పడే తమిళనాడులోని డీఎంకే సర్కార్, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య విభేదాలు సుప్రీం కోర్టుకు చేరడంతో అదికాస్తా ఇటు అటు పోయి రాష్ట్రపతి, ధర్మాసనం మధ్య అభిప్రాయభేదాలు కలిగించే వాతావరణం ఏర్పడింది.
తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి మధ్య పలు అంశాలపై, బిల్లులపై దీర్ఘకాలికంగా కొనసాగుతున్న వివాదాల కేసులో జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 13, 2025న తీర్పు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు పంపే బిల్లులపై మూడు నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లతో పాటు రాష్ట్రపతికి కూడా గడువు విధించడం దేశంలో సంచలనం రేపింది. దీనిపై అనుకూల, ప్రతికూల స్పందనలు వెలువడు తున్నాయి. తాత్కాలిక రాజకీయాల దృష్ట్యా ఆయా రాజకీయ పార్టీలకు ఈ అంశంపై ఏదో ఒక అభిప్రాయం ఉన్నా అత్యున్నతమైన రాష్ట్రపతి, సుప్రీం కోర్టు మధ్య భేదాభిప్రాయాలు, ఘర్షణ ఏర్పడకుండా ఉంటేనే మంచిది. సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన అనంతరం కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ రాష్ట్రపతికి గడువు విధించడం న్యాయస్థానం మితిమీరిన జోక్యంగా వ్యాఖ్యానించగా, ఏప్రిల్ 17, 2025న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఒక సమావేశంలో ప్రసంగిస్తూ రాష్ట్రపతిని సుప్రీం కోర్టు ఆదేశించలేదని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న దశలో ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసు కోవడంపై ఈ రెండు వ్యవస్థల మధ్య ఉన్న పరిమితు లపై పెద్ద ఎత్తున చర్చోపర్చలు ప్రారంభమయ్యాయి.
ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ ఈ తీర్పుపై మాట్లాడుతూ సుప్రీం కోర్టుకు పూర్తి అధికారాలిచ్చిన రాజ్యాంగంలోని 142వ అధికర ణాన్ని కోర్టు క్షిపణిలా ఉపయోగించుకుంటూ రాష్ట్రపతికి గడువు విధించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామంటూ ప్రమాణం చేసే జడ్జీలు ఏ ప్రాతిపదికన దేశంలో అత్యంత ఉన్నతపదవైన రాష్ట్రపతికి ఆదేశాలిస్తారని ప్రశ్నించారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. న్యాయవ్యవస్థనే చట్టం రూపొందించడంలో కల్పించుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాలపై చట్టసభల్లో ప్రశ్నించే అవకాశాలుంటాయి. అదే న్యాయ వ్యవస్థయే నిర్ణయం తీసుకుంటే ఎవరిని అడగాలని ఉప రాష్ట్రపతి ప్రశ్నించారు.
ధన్‌ఖడ్ మరో అడుగు ముందుకేసి ఇటీవల జరిగిన ఒక ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఆయన న్యాయ వ్యవస్థపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో కాలిన నోట్ల కట్టల అంశాన్ని ఆయన ఈ సందర్భంగా లేవనెత్తుతూ న్యాయ వ్యవస్థ జవాబుదారీతనం ప్రశ్నించారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా ముగ్గురు న్యాయమూర్తులతో జరిపే అంతర్గత విచారణకు చట్టబద్దత ఉంటుందా అని ప్రశ్నించారు. ఇటువంటి ఘటనల్లో దర్యాప్తు చేయవలసింది కార్యనిర్వాహక వ్యవస్థే గానీ న్యాయవ్యవస్థ కాదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో కొలీజియం సమావేశమై యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. జగదీప్ దన్‌ఖఢ్ వ్యాఖ్యలను రాజకీయ కోణంలో చూడలేము. సుప్రీం కోర్టులో ప్రధానంగా రాజ్యాంగం చట్టంపై ప్రాక్టిస్ చేసిన న్యాయవాదిగా ఆయనకు గుర్తింపు ఉంది. మరోవైపు ఆయన గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఈయనకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పలు సందర్భాల్లో విభేదాలు వచ్చాయి. దన్‌ఖఢ్ న్యాయవాదిగానే కాకుండా గవర్నర్‌గా కూడా ప్రత్యక్షంగా అనుభవాలు ఎదుర్కొన్న ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎంతో విలువైనవి. వాటిని రాజకీయ దృష్టితో పూర్తిగా కొట్టేయలేము.
రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీం కోర్టు గడువు విధించే అంశంపై దన్‌ఖఢ్ కంటే ముందు కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ స్పందిస్తూ ఇందులో కోర్టు అభిప్రాయాన్ని తప్పుపట్టారు. ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించాలా..? వద్దా..? అనేది పూర్తిగా పార్లమెంట్ పరిధిలోని అంశమని అభిప్రాయపడ్డారు. గౌరవ కోర్టులే అన్నింటినీ నిర్ణయిస్తే చట్టసభల అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. ఈ అంశాన్ని ఇద్దరు జడ్జీల బెంచీ కాకుండా విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిందని ఆయన అభిప్రాయపడడంలో తప్పు లేదు. బిల్లుల ఆమోదానికి రాజ్యాంగం గవర్నర్లకు ఎలాంటి గడువు విధించలేదన్నారు. చట్టాన్ని పార్లమెంట్ మెజార్టీతో ఆమోదిస్తే, ఇద్దరు జడ్జీలు కోర్టులో నిర్ణయాలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. సుప్రీం కోర్టుతో పాటు దేశంలోని పలు హైకోర్టులలో వివిధ కేసులు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇందుకు పలు కారణాలున్నట్టే గవర్నర్లకు కూడా బిల్లులపై వివిధ కారణాలుంటాయని రాజేంద్ర ఆర్లేకర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కేరళ గవర్నర్‌గా ఉన్న ఆర్లేకర్‌కు అక్కడి వామపక్ష ప్రభుత్వంతో వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఆ అనుభవంతోనే ఆయన సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించారు.
సుప్రీం కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలున్నాయి. బీజేపీయేతర రాజకీయ పార్టీలు ఈ తీర్పును స్వాగతించాయి. కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ఉప రాష్ట్రపతి దన్‌ఖఢ్ స్పందనను తప్పుపట్టారు. రాజకీయ పార్టీల మధ్య ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలుండడానికి ప్రధాన కారణం ఈ బిల్లులపై రాజకీయ ప్రయోజ నాలు ఉండడమే. ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు అక్కడి గవర్నర్లకు మధ్య కొన్ని వివాదాస్పద బిల్లులపై పోరు నడుస్తోంది. నామినేటెడ్ పోస్టులు, యూనివర్సిటీలకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి. ఉదాహరణకు తమిళనాడులో మద్రాస్ విశ్వవిద్యాలయం సవరణ బిల్లును డీఎంకే ప్రభుత్వం ఏప్రిల్, 2022లో ఆమోదించింది. ఈ బిల్లు వీసీ నియామకంతో పాటు గవర్నర్‌ను చాన్సలర్ పదవి నుండి తొలగించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కట్టపెట్టేందుకు ఉద్దేశించింది. ఈ బిల్లులో గవర్నర్‌ను పక్కన పెట్టడంతో ఆయన దీన్ని పెండింగ్‌లో పెట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం గవర్నర్ పెండింగ్ పెట్టిన ఈ బిల్లుకు కాలం ముగిసిందని పేర్కొంటూ సుప్రీం కోర్టు తక్షణమే దానిని చట్టంగా మారుస్తూ తీర్పు ఇచ్చింది. తీర్పులో భాగంగానే సుప్రీం కోర్టు వివాదాస్పదమైన ఈ బిల్లులో గవర్నర్‌ను చాన్స్‌లర్‌గా తొలగించడంపై కూడా విచారణ జరిపితే పరిస్థితి మరోలా ఉండేది.
చాన్స్‌లర్‌గా గవర్నర్‌ను తొలగించిన ఈ బిల్లుతో పాటు తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవి సుదీర్ఘకాలంగా 10 బిల్లులను పెండింగ్‌లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లేకుండానే ఈ బిల్లులన్నింటినీ ఆమోదించినట్లు పరిగణించాలని అధికరణ 142 విచక్షణాధికారాలతో తీర్పు ఇచ్చింది. ఈ బిల్లులపై ఇకపై రాష్ట్రపతి ఎలాంటి చర్యలు తీసుకున్నా అవి చెల్లుబాటు కావంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం సంచలనం రేపింది. తీర్పు కాపీని సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే సమయం కోసం కాచుకొని కూర్చున్న స్టాలిన్ ప్రభుత్వం ఈ బిల్లులపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, అవి చట్టరూపం దాల్చినట్టు ప్రకటించిందంటే ఇందులో రాజకీయ ఉద్దేశాలు స్పష్టం అవుతున్నాయి. న్యాయస్థానాలు రాజకీయాలకు అతీతంగా తీర్పులు ఇస్తాయి. అయితే వీటిని రాజకీయ పార్టీలు స్వలాభం కోసం వాడుకుంటాయని మరోసారి బహిర్గతమైంది.
గతంలో పశ్చిమ బెంగాల్‌లో కూడా యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్‌గా గవర్నర్ బదులు ముఖ్యమంత్రిని నియమించేలా రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకుంటూ బిల్లును పాస్ చేయడంతో అక్కడ ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య ఘర్షణ ప్రారంభమైంది. గవర్నర్ ఈ బిల్లును పెండింగ్‌లో పెట్టడంపై అప్పుడు కూడా న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమబెంగాల్ తరహాలో తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కూడా యూనివర్సి టీల చైర్‌పర్సన్‌కు సంబంధించి ఇలాంటి నిర్ణయమే తీసుకుందంటే ఇందులో రాజకీయాలు సుస్పష్టం. యూనివర్సిటీలకు వైస్‌చాన్స్‌లర్‌గా గవర్నర్ ఉండడ మనే సంప్రదాయం మొదటి నుండి కొనసాగుతుంది. దీనికి భిన్నంగా స్వలాభ రాజకీయ దృష్టితో సంప్ర దాయాలకు వ్యతిరేకంగా గతంలో పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అప్పుడే న్యాయస్థానం పుల్‌స్టాప్ పెట్టుంటే అనంతరం తమిళనాడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునేది కాదు. గవర్నర్ ప్రభుత్వం మధ్య విభేదాలు కూడా కొంత తగ్గేవి. ఇంతకుముందు పంజాబ్‌లో కూడా ఆప్ ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఘర్షణ జరిగింది. పంజాబ్ సీఎం భగ్‌వంత్ మాన్ ప్రభుత్వం తెచ్చిన ఒక బిల్లును రాష్ట్ర గవర్నర్ బి.ఎల్.పురోహిత్ పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యానిస్తూ ఆర్టికల్ 200 అధికరణతో గవర్నర్ బిల్లులను పరిశీలన పేరుతో పెండింగ్‌లో పెట్టినా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నించాలని వ్యాఖ్యానించింది. లేకపోతే సవరణలు కోరితే బిల్లును పునఃసమీక్ష కోసం ప్రభుత్వానికి తిరిగి పంపాలని చెప్పింది.
బిల్లులపై రాజ్యంగం గవర్నర్లకు ప్రత్యేక అధికారాలు కల్పించింది. రాజ్యాంగంలోని 153వ అధికరణ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. ఆర్టికల్ 154వ అధికరణ ప్రకారం రాష్ట్ర పరిపాలనకు సంబంధించి కార్యనిర్వహణధికారాలు ఆర్టికల్ 162 ప్రకారం గవర్నర్ పేరు మీద చట్టాలను ప్రభుత్వం విడుదల చేస్తుంది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదించిన తర్వాతనే చట్టాలుగా మారుతాయి. ఒకవేళ గవర్నర్ బిల్లును ఆమోదించకపోతే అది చట్ట రూపం దాల్చదు. గవర్నర్ బిల్లును సభకు తిప్పి పంపితే, చట్టసభ సవరణలతో ఆ బిల్లును మళ్లీ గవర్నర్‌కి పంపితే దాన్ని తప్పనిసరిగా ఆమోదించాలి. లేకపోతే ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ రిజర్వు చేయవచ్చు. రాష్ట్రపతి వద్దకు బిల్లును పంపిన తర్వాత దానిపై గవర్నర్‌కు ఎలాంటి పాత్ర ఉండదు. అయితే రాష్ట్రపతి ఆ బిల్లును పునఃపరిశీలనకు పంపవచ్చు. అయితే గవర్నర్ ముందస్తు అనుమతితోనే రాష్ట్ర శాసనసభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెడుతారు కాబట్టి సాధారణంగా ద్రవ్య బిల్లులో వివాదాలుండవు.
రాష్ట్ర బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి వీటో అధికారాలున్నాయి. గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు బిల్లును పంపితే రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. లేదా పున:పరిశీలన కోసం తిరిగి శాసనసభకు పంపమని గవర్నర్‌ను కోరవచ్చు. అయితే రాష్ట్ర శాసనసభ ఎలాంటి సవరణలు లేకుండా తిరిగి ఆ బిల్లును రాష్ట్రపతికి పంపితే దాన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా అలాంటి బిల్లును రాష్ట్రపతి ఎంతకాలం తమ వద్ద పెట్టుకోవచ్చనే విషయం రాజ్యాంగంలో పేర్కొనలేదు. అంటే ఈ బిల్లులకు రాష్ట్రపతి పాకెట్ వీటోను వినియోగించుకునే అవకాశం ఉంది.
అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడంతో రాజకీయ పార్టీలు దీన్ని దుర్వినియోగ పరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఉత్తర్వులను ఒక అవకాశంగా తీసుకొని వివాదాస్పద అంశాలను కూడా రాజకీయ పార్టీలు బిల్లులుగా మార్చే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ తీర్పు దుర్వినియోగం కాకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీం కోర్టు ఈ తీర్పులో గవర్నర్లతో పాటు రాష్ట్రపతికి కూడా గడువు విధించడంతో భిన్నమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్రపతిని కాకుండా గవర్నర్‌కే పరిమితం చేసుంటే బాగుండేది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పుతో ఎవరిది పైచేయి అనేది నిర్వివాదాంశం. దేశంలో రెండు వ్యవస్థలు సుప్రీమే అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. దేశానికి రెండు కళ్లు లాంటి ప్రభుత్వం, న్యాయస్థానం మధ్య పొరపొచ్చలు రాకుండా సమప్రాధాన్యతతో కలిసికట్టుగా సాగాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు.
– శ్రీపాద