-వెంకట మణి

భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

ఆ ‌విషయం విన్న దగ్గర నుంచి శ్యామల మనసు అదోలా అయి పోయింది. మధ్యాహ్నం నిద్రపట్టక అసహనంగా మంచంపై అటు ఇటూ దొర్లుతున్నంతలోనే, పావు తక్కువ నాలుగు అయిపోయింది. ఆమె భర్త సుబ్బారావు లేచి వరండాలోకొచ్చి వాలు కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడే టీకి టైమయ్యిపోయిందా అని లేచి, గ్రీన్‌ ‌టీ పెట్టి అతనికి ఇచ్చింది శ్యామల. అతను కప్పు అందుకోవడమే తరువాయి, తాగటం మొదలుపెట్టాడు.

ఎన్నడూ ఉండే రుచి తాగుతున్న టీలో లేకపోయేసరికి, పెదాలు విరుస్తూ ‘‘ఏంటి శ్యామల! ఈరోజు టీ ఇలా కాచావ్‌?’’ అనడిగాడు.

‘‘ఏవండీ బాగు లేదా?’’ అని తన టీ రుచి చూసింది. రోజూలా లేదు. తనకూ నచ్చలేదు. సుబ్బారావుకైనా, తనకైనా టీ అంటే ఎంతో ప్రీతి! ఎంత ఇష్టమంటే, సాయంత్రం టీ టైం ఎప్పుడవు తుందాని వాళ్లు ప్రతిరోజూ ఎదురు చూస్తుంటారు. అలాగే తెల్లవారైతే చాలు… బ్లాక్‌ ‌టీ తాగాలని తహతహలాడతారు.

టీ నాలుక్కి చిక్కగా తగలకపోయేసరికి ‘‘మంచి రంగు కూడా లేదు; సరిగ్గా మరగనిచ్చావా?’’ అంటూ విసుక్కున్నాడు సుబ్బారావు. శ్యామల మాట్లాడలేదు. ఆమె మౌనంగా ఉండిపోవడం చూసి ‘‘ఇంకా సునీల్‌ ‌విషయమే ఆలోచిస్తూ కూర్చున్నట్టున్నావ్‌.. ‌నీకు చెప్పానా.. ఆ విషయం గురించి అంతగా ఆలోచించ వద్దని..’’ కాస్త విసుక్కున్నాడు.

‘‘ఏమోనండీ మీరు చెప్తున్నారుగానీ.. నా మనసుని ఎంతకీ సముదాయించు కోలేకపోతున్నాను.. నాకదంత కరెక్ట్ ‌కాదని అనిపిస్తోంది..’’ ముఖం చిట్లించింది శ్యామల. సుబ్బారావు తనతో అన్న మాటలే ఆమె చెవుల్లో పదే పదే ప్రతి ధ్వనిస్తున్నాయి.

‘‘…ఏవే.. మనవాడు ఎవరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడట.. తన కొలీగట.. మంచి అమ్మాయట.. తను కూడా మనవాడు పనిచేసే కంపెనీలోనే పనిచేస్తోందట.. ఇద్దరికీ కిందటేడాది నుంచి పరిచయమట.. ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలని డేటింగ్‌లో ఉంటున్నారట.. అదే సహజీవనం చేస్తున్నారట.. ఆ అమ్మాయిని మనకు పరిచయం చేస్తాడట.. మనల్ని వారం పదిరోజుల్లో వీలుచూసుకుని రమ్మంటున్నాడు..’’ ఆమెకు కర్ణకఠోరంగా అనిపిస్తున్నాయి ఆ మాటలు! ఏం పనులివి? అబ్బాయి ఇలాంటి పని చేశాడేమిటి? ఇంటావంటా లేని పని! నలుగురికీ తెలిస్తే ఏమనుకుంటారు? అసలే బీపీ మనిషి కావడంతో అది కాస్తా ఎక్కువైపోయింది. నిన్న కొడుకు సునీల్‌ ‌నుంచి ఫోన్‌ ‌వచ్చినప్పటి నుంచి ఆమె ఎడతెరపి లేని ఆలోచనలతో సతమతమై పోతోంది.

‘‘అది కాదు శ్యామలా! ఈ రోజుల్లో అదంతా కామన్‌ అయి పోతోంది.. కాలం వేగంగా మారి పోతోంది. ఆ మార్పులను మనం ఒప్పుకోవాలి శ్యామలా… తప్పదు..’’

‘‘ఏంటండీ కాలంలో మార్పు!.. ఇదం చెడిపోయిన మనుషులు తెస్తున్న మార్పుల్ని మనం అంగీకరించాలా?’’

‘‘ఇందులో ఇదం చెడిపోవడమేముంది?.. నేటితరం స్వేచ్ఛను కోరుకుం టోంది. వారి హక్కును మనం కాదనలేం.. కాదన్నా వారు వినిపించు కోరు..’’ ఏమిటండీ హక్కు.. మరీ దిగజారిపోతున్నారు.. స్వేచ్ఛకి ఓ హద్దూపద్దూ ఉండొద్దూ? అద్దెకు స్నేహితుడిని తెచ్చుకునే వరకూ వెళ్లింది అమ్మాయిల స్వేచ్ఛ! గంటకింత అని వారు పంచే స్నేహానికి అద్దె చెల్లిస్తారట! అది నాకు స్నేహం అనిపించడం లేదు…వ్యభిచారం అనిపిస్తోంది. ఈ రోజుల్లో పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలను ఎంతోమంది అమ్మాయిలు ఒక గుదిబండగా భావిస్తున్నారండీ! పెళ్లి చేసుకుంటే బిడ్డకి జన్మనివ్వాల్సి వస్తుందనీ, ఆ బిడ్డకి పాలివ్వాల్సివస్తుందనీ, ఆ బాధను భరించడం తమ వల్లకాదనీ పెళ్లి వద్దనుకుంటున్నారట. సుఖజీవనం కోసం దర్జాగా సహజీవనం పేరు చెప్పి కాపురాలు వెలగబెడుతున్నారు.. సహజీవనం పేరుతో ఎన్నెన్ని మోసాలు జరగడంలేదూ.. భార్యాభర్తల మధ్యనుండే స్వచ్ఛమైన అనురాగం, ఆప్యాయతలు సహజీవనం చేసేవాళ్ల మధ్య ఎక్కడ ఏడుస్తున్నాయండీ.. కేవలం అవసరాలు తీర్చుకోవడం కోసమే వాళ్ల అనుబంధాలు. చిన్నపాటి కలహాలకే నూరేళ్ల కాపురాలను కాల్చేసుకుని పరాయి పంచలకు పోతున్నారు.. లేకపోతే ఒకళ్ల మీద ఒకళ్లు పగలు తీర్చుకుంటున్నారు.. మీరేమైనా అనండి, నీచమైన వాంఛలు తీర్చుకోవడానికే ఈ తంతంతా..’’ చీదరించుకుంది శ్యామల.

‘‘ప్రతి దాంట్లో మనం చెడునే కాదు, మంచిని కూడా చూడాలి శ్యామలా.. పెళ్లికి ముందు ఒకరి నొకరు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో సహజీవన మన్నది పనికి వస్తుందంటున్నారు. సహజీవనం చేసేవాళ్లందరూ చెడ్డవాళ్లు కారు. చెడ్డవాళ్లేనని అనుకుంటే, మనవాడూ చెడ్డవాడే అవుతాడు; వాడిని కనిపెంచిన దానివి.. నువ్వే చెప్పు… మనవాడు చెడ్డవాడా? చెడ్డవాడు కాదు కదా! మనవాడు మంచి కారణంతోనే ఏ పనైనా చేస్తాడు.. వాడు మనల్ని మోసపుచ్చలేదు. మన దగ్గర ఏ విషయమూ దాయలేదు… తను ఒకమ్మాయితో సహజీవనం చేస్తున్నానని నిజాయతీగా చెప్పాడు; ఆ అమ్మాయిని మనకు పరిచయం చెయ్యడానికి స్వయంగా వాడే పిలిచాడు కూడా..’’

సుబ్బారావు మాటలు ఆపనే లేదు. అతడికి అడ్డుపడి ‘‘నేను రానండీ! మీరు వెళ్తే వెళ్లండి.. నాకు కంపరంగా ఉంది..’’ అని ఖరాకండీగా చెప్పేసింది.

‘‘అలా అంటే ఎలా శ్యామలా! రోజుల్ని బట్టి పోక తప్పదు..’’

‘‘మీరు ఎన్నయినా చెప్పండి.. నేను రాను.. మీరూ మీ అబ్బాయి మీ ఇష్టమొచ్చినట్టు ఊరేగండి..’’ అని అక్కడ్నుంచి లేచి విసురుగా వెళ్లిపోయింది.

రెండు రోజులు భారంగా గడిచాయి. ‘‘కొడుకు పిలిచాడు కదా.. వెళ్లకపోతే బాగోదు.. నువ్వు కూడా రా.. అక్కడ నువ్వేం మాట్లాడొద్దు.. నేను మాట్లాడ తాను.. వాతావరణం చూద్దాం.. మనకి నచ్చకపోతే నచ్చలేదని చెప్పేద్దాం.. వెంటనే తిరిగొచ్చేద్దాం.. సరేనా..’’ అని శ్యామలకు నచ్చజెప్పాడు సుబ్బారావు.

ఆమె మౌనంగా ఉండిపోయింది. సుబ్బారావు అర్థం చేసుకుని ‘‘మనం శనివారం బయలుదేరుదాం.. వాళ్లు ఆదివారం ఇంట్లోనే ఉంటారట..’’ చెప్పాడు. వెంటనే ఫ్లయిట్‌కి రెండు టిక్కెట్లు రిజర్వేషన్‌ ‌చేయించాడు.

                                                                                             *     *     *

ఆదివారం తెల్లారే సరికి బెంగుళూరులోని కొడుకు ఇంటికి చేరారు. రేష్మి ఎదురెళ్లి వాళ్లని ఇంట్లోకి రమ్మనమని తెల్లని అందమైన, నవ్వు ముఖంతో సాదరంగా ఆహ్వానించింది. ‘‘ఈమే కాబోలు నా కోడలు కాని కోడలు..’’ అని అనుకుంటూ అయిష్టంగానే ఇంట్లో అడుగుపెట్టింది శ్యామల.

రేష్మిని పరిచయం చేశాడు కొడుకు సునీల్‌. ‌శ్యామల ముఖం జేవురించుకునిపోయింది. మామూలుగా ఉండమని తనకి మాత్రమే అర్థమయ్యే భాషలో నొక్కి చెప్పాడు సుబ్బారావు. వారి స్నానపానాలకు చకచకా ఏర్పాట్లు చేసింది రేష్మి. వేడి వేడి ఫలహారం చేసి పెట్టింది. శ్యామలకు తినబుద్ధి కాలేదు. సుబ్బారావు మళ్లీ తన భాషలో నొక్కి చెప్పాడు. కొడుకు కోసం తినక తప్పలేదు. ఈలోపు వంట ఇంటిలోంచి ఒకటే ఘుమఘుమ వాసన వారి ముక్కుపుటాలను అదిరించింది. అది వారికెంతో ఇష్టమైన వాసన! పక్క ఫ్లోర్‌లో ఎవరో టీ కాచుకుంటున్నారు కాబోలు అనుకుంది శ్యామల. ఇంతలో రెండు కప్పుల్లో మంచి రంగు తేలిన బ్లాక్‌ ‌టీతో వచ్చింది రేష్మి.

‘‘ఆంటీ తీసుకోండి’’ అని ఓ కప్పును శ్యామలకు అందించింది. ‘‘అంకుల్‌! ‌మీకు షుగర్‌ ‌లెస్‌..’’ అని మరో కప్పును సుబ్బారావు చేతికిచ్చింది.

టీ రుచనిపించింది శ్యామలకు. సుబ్బారావు ‘‘టీ బాగుందికదా..’’ అనంటే ఆమె తటాలున మొఖం తిప్పేసుకుంది.

ఇక మధ్యాహ్న భోజనంలో, నాలుగు రకాల కూరలతో మైమరపించింది రేష్మి. సుబ్బారావు కడుపునిండా తిని బ్రేవ్‌మని త్రేన్చాడు. శ్యామలకు మాత్రం కడుపు మండింది!

‘‘మేం సాయంత్రం, నా స్నేహితుడు గోపాల రావుని కలుసుకుని అటునుంచి అటే విశాఖ ఫ్లెయిట్‌ ఎక్కేస్తాం..’’ అని చెప్పాడు సుబ్బారావు కొడుకుతో. సునీల్‌, ‌రేష్మి రెండురోజులుండి వెళ్లండి అనంటే పనుంది కుదరదన్నాడు.

మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉండడంతో సుబ్బారావు వెళ్లి కొడుకు బెడ్‌పైన పడుకున్నాడు. శ్యామల హాల్‌లోని సోఫాలోనే నడుంవాల్చింది. ఆమె కళ్లు మూతలు పడలేదు. రేష్మి ఆలోచనలు దోమల్లా ముఖం చుట్టూనే తిరుగుతున్నాయి. ఏమిటీ కొత్త కొత్త బంధాలు?! ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి పెళ్లికి ముందు ఒక ఆడ, మగ ఒక గదిలో కలిసుండాలా? ఏంటో ఈ వైపరీత్యాలు?! తన కొడుకు తప్పు చేస్తున్నాడా? రేష్మిని చూస్తే మంచి అమ్మాయిలాగానే ఉంది. సంప్రదాయంగానే కనిపిస్తోంది. ఆలోచనలు మధించగా.. మధించగా శ్యామల మనసు కాస్త మెత్తబడింది.

సుబ్బారావు ఠంచనుగా పావుతక్కువ నాలుగుకి లేచి కొడుకు గదిలోంచి బయటకు వచ్చాడు. ‘‘అమ్మో! ఈ మనిషి లేచాడు.. గ్రీన్‌ ‌టీ అడుగుతాడు.. ఇక్కడ గ్రీన్‌ ‌టీ ఉందో లేదో..’’ అని శ్యామల లేచి వంటగది లోకి వెళ్లబోయింది. ఇంతలో గ్రీన్‌ ‌టీతో రేష్మి ఎదురొచ్చింది. ఆమె అలా తమ అలవాట్లను తెలుసుకుని ఠంచనుగా గ్రీన్‌ ‌టీ అందించేందుకు ఆ వేళకు వచ్చేసరికి శ్యామల, సుబ్బారావు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యి ఆమె వైపు విస్మయంగా చూశారు. ‘‘అదేమిటి నావైపు అలా చూస్తున్నారు.. తాగండి అంకుల్‌.. ‌తాగండి ఆంటీ..’’ అంటూ ప్రేమగా టీ కప్పులు అందించింది రేష్మి. అమ్మాయి తమ మనసు తెలుసుకుని మసలుతోందని శ్యామల మనసు మరికాస్త మెత్తబడింది.

‘‘మమ్మీ! నేనూ రేష్మి ఏడాదిగా కలిసుంటు న్నాం..’’ వివరాలు చెప్పాడు సునీల్‌.

‌తన భార్య ఎలా స్పందిస్తుందా అని సుబ్బారావు ఆమె వైపు సాలోచనగా చూస్తూ ‘‘టీ బాగుంది కదా..’’ అని అన్నాడు. శ్యామల చిన్నపాటి చిరునవ్వుతో రేష్మి వైపు చూసి, తన కొడుకు సెలక్షన్‌ ‌బాగానే ఉంది అని మనసులో అనుకుంటూ పైకి టీని ఉద్దేశించి అన్నట్లుగా ‘‘పరవాలేదు..’’ అంది. తమ బంధాన్ని అమ్మ అంగీకరించినట్లేనని అర్థమైంది సునీల్‌కి.

                                                                                             *     *     *

బెంగుళూరు నుంచి తిరిగొచ్చిన దగ్గర్నుండి రేష్మితో కొడుక్కి పెళ్లి చేసెయ్యాలని ఇంట్లో శతపోరు పెడుతోంది శ్యామల.

‘‘పెళ్లీ పెటాకులు లేకుండా ఎన్నాళ్లని పెళ్లికాని వాళ్లిద్దరూ ఒక ఇంట్లో ఉంటారు చెప్పండి.. వాళ్ల విషయం మన బంధువులకి తెలియక ముందే వాళ్లకి పెళ్లి చేసేస్తే బాగుంటుంది.. ఎంత చెప్పినా వినిపించు కోరేం..! మీరు చెప్తున్నట్లుగా ఒకపక్క ప్రపంచం ఎంత మారుతున్నా, మారని ప్రపంచం కూడా మరోపక్క ఉంది కదండీ.. పల్లెల్లో వున్న మనవాళ్లకి ఈ విషయాలేం అర్థంకావు.. నా మాట వినండి..’’ అంది.

‘‘నువ్వు చెప్పిందీ నిజమేననుకో..’’ అని వీలు చూసుకుని సునీల్‌తో మాట్లాడతానన్నాడు సుబ్బారావు.

సంవత్సరం గిర్రున తిరిగిపోయింది.

సందర్భం వచ్చినప్పుడల్లా కొడుకుతో మాట్లాడ మని గుర్తుచేస్తూనే ఉంది శ్యామల. అతడు ‘‘అలాగే.. అలాగే..’’ అని ఊకొడుతున్నాడుగానీ కొడుకుతో మాట్లాడలేదు. శ్యామల చూసి చూసి ‘‘అబ్బాయి దగ్గరకు వెళదాం..పెళ్లి మాటలు ఫోన్లో ఎందుకు.. నేరుగా వాడితోనే మాట్లాడదాం..’’ అని సుబ్బారావుని బయలు దేరదీసింది.

 ఒకరోజు చెప్పాపెట్టకుండా సునీల్‌ ‌దగ్గరకు వెళ్లారు శ్యామ, సుబ్బారావు. కొడుకు ఫ్లాట్‌ ‌కాలింగ్‌ ‌బెల్‌ ‌నొక్కాడు సుబ్బారావు.

ఎండ కన్నెరుగక తెల్లబడిన కోమలమైన చేతుతో తలుపు తెరిచి వారిని లోపలికి అచ్చం రేష్మిలా ఆహ్వానించింది ఓ అమ్మాయి.

‘‘మమ్మీ! తను లిల్లీ.. తనూ నేనూ నాలుగు నెలలుగా కలిసుంటున్నాం.. రేష్మి కంటే ఎన్నో రెట్లు బెటర్‌ ‌మమ్మీ తిను..’’

మరి రేష్మి సంగతేవిటన్నట్టు విస్తుపోయి చూసింది శ్యామల.

కొడుకు ఆమె భుజంపై ఆప్యాయంగా చెయ్యివేసి ‘‘ఎవరైనా బెటర్‌మెంటే కదా చూసుకుంటారు. తనూ అదే చేసింది. ఇప్పుడు, మార్కెట్‌లో మనమైనా బెటర్‌ ‌క్వాలిటీ సరుకు ఏదైతే ఉందో దానినే కదా కొంటాం.. జీవితంలో కూడా అంతేనమ్మా..’’ అని జంకుగొంకూ లేకుండా చెప్పాడు.

శ్యామలకు అర్థమైంది. జీవితం కూడా వ్యాపారమైపోయిందన్నమాట! అయితే బంధాలు కూడా వస్తు సేవల్లాంటివే. బాగుందనుకుంది.

ఈలోపు బ్లాక్‌ ‌టీ పెట్టి తెచ్చి ‘‘ఆంటీ మీకిష్టమైన టీ… అంకుల్‌! ‌మీకు షుగర్‌ ‌లెస్‌..’’ అని అందించింది లిల్లీ. శ్యామల టీ కప్పు అందుకోలేదు. ‘‘తను టీ బాగా పెడుతుంది మమ్మీ.. అచ్చం నువ్వు పెట్టినట్లే పెడుతుంది.. నా మాట మీద నమ్మకం లేకపోతే ఒకసారి తాగి చూడు..’’ అన్నాడు సునీల్‌. ఆమె కప్పు అందుకుంది. తాగకపోతే బాగోదన్నట్లు సుబ్బారావు తన భాషలో చెబితే అప్పుడు తాగింది. కొడుకు చెప్పినట్లుగానే ఉంది టీ!

‘‘ఎలా ఉంది మమ్మీ.. నేను చెప్పినట్టే ఉంది కదూ!..’’ ఆతృతగా అడిగాడు సునీల్‌.

‘‘అస్సలు.. ఇదేం బాగులేదురా అబ్బాయ్‌!..’’ అని చివాలున లేచి బయటకు నడిచింది శ్యామల.

ఆమె వెనుకే సుబ్బారావు…

వచ్చేవారం కథ..

దృక్పథం

– వి. శాంతిప్రబోధ

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE