చూడబోతే మొగల్ పాలకుల ప్రేతాత్మలు వర్తమాన భారతంలో స్వైర విహారం చేస్తున్నట్టే ఉంది. మహారాష్ట్రలో ఔరంగజేబ్ ప్రేతాత్మను స్వాగతించేవాళ్లు తయారయ్యారు. వీళ్లకి పోటీగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ మొగల్ వంశ స్థాపకుడు బాబర్ ప్రేతాత్మకు ఎర్రతివాచీ పరిచే పనిలో ఉన్నది. ఈ దురాక్రమణదారుల ఆరాధన దేశంలో శాంతిభద్రతల సమస్యకు దారి తీసింది. నాగపూర్ అల్లర్ల వెనుక పరోక్షంగా ఔరంగజేబ్‌పై ప్రశంసలు, అతడి సమాధి తొలగింపు అంశాలు ఉన్నాయి. మార్చి 27న ఆగ్రా ఉద్రిక్తంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తుల గుంపు ఎంపీ రామ్‌జీ సుమన్ ఇంటి మీద దాడి చేసింది. వారు కర్నిసేన సభ్యులని చెబుతున్నారు. కర్నిసేన రాజపుత్ర కుల సంఘం. ఈ సంస్థకు చెందిన వారిగా భావిస్తున్న వారే మార్చి 26న ఎంపీ ఇంటిని ధ్వంసం చేశారు.
మొగలాయిల ఆరాధన కేంద్ర బిందువుగా సాగిన రెండో దాడి ఘటన గురించి చూద్దాం. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ (రాజ్యసభ) రామ్‌జీ లాల్ సుమన్ రాణా సంగ్రామ్ సింహుడిని ‘ట్రెయిటర్’ (దేశద్రోహి) అంటూ పార్లమెంట్‌లో పేలాడు. అంటే సమాజ్‌వాదీ పార్టీయే ఇక్కడ కూడా గొడవ రేపింది. ఆ చెత్తకుండీ కులపార్టీ దృష్టిలో రాణా సంగా అంతటి త్యాగి, వీరుడు ఎందుకు దేశద్రోహి అయ్యాడు? బాబర్‌ని భారతదేశానికి రావలసిందిగా ఆహ్వానించినది ఆయనేనని ఈ సుమన్ వాగాడు. భారతదేశం మీద దండెత్త వలసిందని రాణా కోరాడని కొత్త కథ ఒకటి తెచ్చాడు. ఇదంతా చూస్తుంటే విదేశీ పాలకులను ఎదిరించిన వారందరినీ దేశ వ్యతిరేకులుగా చిత్రించే నీచాతి నీచమైన కుట్రకు కొన్ని విపక్షాలు పాల్పడు తున్నాయనే అర్థమవుతుంది. అన్నట్టు మహారాష్ట్రలో అసెంబ్లీలో ఔరంగజేబ్‌ను మహనీయుడని కీర్తించిన దౌర్భాగ్యుడు (ఆజ్మీ), బాబర్‌ను ఆహ్వానించడం రాణా సంగా దేశద్రోహి అయ్యాడని వక్కాణించిన వాడూ(సుమన్) ఇద్దరూ ఒకే పార్టీ వాళ్లు. అదే ఈ దేశంలోనే నికృష్ట రాజకీయాలకి చిరునామాగా ఉండే సమాజ్‌వాదీ పార్టీ.
‘దేశంలో ముస్లింలు బాబర్ డీఎన్‌ఏ కలిగి ఉన్నారని బీజేపీ నేతలు ఆడిపోసు కుంటారు. నిజానికి భారతీయ ముస్లింలు బాబర్‌ని ఆదర్శ పురుషునిగా కొలవరు. అసలు ఆ బాబర్‌ను భారత్‌కు ఆహ్వానించినవారు ఎవరు? ఇబ్రహీం లోడీని ఓడించేందుకు రాణా సంగాయే బాబర్‌ను ఆహ్వానించాడు. కాబట్టి ముస్లింలు బాబర్ డీఎన్‌ఏ కలిగి ఉంటే, మీరు రాణా సంగా డీఎన్‌ఏ కలిగి ఉన్నారన్నదే తర్కబద్ధమవుతుంది. కాబట్టి రాణా దేశద్రోహి. మేం బాబర్‌ను విమర్శిస్తాం. రాణా సంగాని విమర్శించడం లేదు’ అంటూ మార్చి 21న రాజ్యసభలో మాట్లాడుతూ సుమన్ అన్నాడు. సమాజ్‌వాదీ ఎంపీ వ్యాఖ్యలు మొత్తం హిందువులను అవమానించేవేనని బీజేపీ విమర్శించింది.
1526లో తొలి పానిపట్టు యుద్ధం జరిగింది. ఇదే భారతదేశంలోకి బాబర్ రావడానికి దోహదం చేసింది. బాబర్‌కు ముందు లోడీ వంశీకులు పాలించేవారు. ఆఖరివాడు ఇబ్రహీం లోడీ. కుతుబుద్దీన్ ఐబక్ మొదటివాడు. ఇతడు బానిస వంశస్థుడు. కాబట్టి మొగల్ పాలకుల కంటే ముందు ఢిల్లీ సహా కొన్ని ప్రాంతాలను బానిసరాజులు (వీళ్లనే మామ్‌లుక్‌లు అంటున్నారు), ఖిల్జీలు, తుగ్లక్‌లు, సయ్యద్, లోడీ వంశీకులు పాలించారు. వీళ్లందరిదీ ఒకేరకమైన చరిత్ర. ఇబ్రహీం లోడీ వచ్చేసరికి కాస్త బలహీన పడింది. ఇబ్రహీం చేసిన రాజకీయ తప్పిదం అతడి రాజ్యంలో చాలా బలంగా ఉన్న స్థానిక పాలకులను, అధికారులను తొలగించాడు. అలాగే అఫ్ఘాన్‌లో కూడా జరిగింది. ఇదేకాకుండా వీళ్లు అనుభవిస్తున్న జాగీర్లను సైతం తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. దీనితో అధికారం కోల్పోయిన గవర్నర్లు, పెద్ద పెద్ద అధికారులు తిరుగుబాటు ప్రకటించారు. ఇలాంటి వారిలో దౌలత్‌ఖాన్ లోడీ ఒకడు. ఇతడు పంజాబ్ ప్రాంత పాలకుడు. మరొకడు జౌన్‌పూర్ పాలకుడు ఆలంఖాన్ లోడీ. ఈ ఇద్దరు సుల్తాన్ ఇబ్రహీం లోడీ బంధువర్గంలో వారే.
రసపుత్ర వీరుడు రాణా సంగ్రామసింహునికీ ముస్లిం పాలకులకీ వైరం ఉంది. మాల్వా పాలకుడు రెండవ మహమ్మద్ ఖిల్జీని గగ్రాన్ యుద్ధంలో రాణా ఓడించాడు. ఖిల్జీని తరిమేసి మేదినీ రాయ్ అనే పాలకుడిని రాణా నియమించాడు. మాల్వా రాజధాని చందేరి. రాణా సంగా రాజ్య విస్తరణ నిజానికి లోడీ వంశీకులనీ కలవర పెట్టిందని హిస్టరీ ఆఫ్ మిడీవల్ ఇండియా చరిత్ర రాసిన సతీశ్‌చంద్ర రాశారు. రాణాకు, లోడీకి 1518లో దక్షిణ రాజస్థాన్‌లోని హరౌతీ సరిహద్దులోని ఘటోలీ వద్ద పెద్ద యుద్ధమే జరిగింది. రాణా ధాటికి తట్టుకోలేక లోడీ సైన్యం వెనుతిరిగింది. తరువాత జరిగిన ధోల్‌పూర్ యుద్ధంలోను లోడీ ఓడిపోయాడు. పైగా భారీ నష్టం జరిగింది. ఈ యుద్ధంలో రాణా చేతిని కోల్పోయినా, కాలిలో బాణం దిగినా రణభూమిని వీడలేదు.
ఫర్గానా అనే ప్రాంతానికి చెందిన జహరుద్దీన్ మహమ్మద్ బాబర్ తైమూర్ సంబంధీకుడు. ఇతడు పినతండ్రి రెండో ఉలూఘ్ బేగ్ నుంచి ఘజ్నీ, కాబూల్‌లను ఆక్రమించాడు. అదే సమయంలో తన భూభాగాలు ఫర్గానా, సమర్ఖండ్‌లను బాబర్ కోల్పోయాడు. ఆ తరువాతనే అతడి దృష్టి భారత్ మీద పడింది. 1519 ప్రాంతానికి బాబర్ చీనాబ్ నది వరకు వచ్చాడు. అదే సమయంలో ఢిల్లీలో ఇబ్రహీం లోడీ చిక్కులను ఎదుర్కొంటున్నాడు. ఇబ్రహీం మీద కక్ష కట్టిన స్థానిక పంజాబ్ పాలకుడు దౌలత్‌ఖాన్ లోడీ, ఆలంఖాన్ లోడీ ఇద్దరూ బాబర్‌ను ఆహ్వానించారు. ‘బాబర్ నామా’లో రాణా సంగా పేరు ఉన్నప్పటికీ ఆయన బాబర్‌ను ఆహ్వానించాడని ఏ చరిత్రకారుడు చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే చిక్కులో ఉన్న లోడీ మీదకు బాబర్ దండెత్తిన పరిస్థితులను నుంచి తాను లబ్ధి పొందాలని రాణా ఆశించి ఉండవచ్చు. అంతేకాని, బాబర్‌ను దేశానికి ఆహ్వానించలేదనే చరిత్రకారుల వాదన. అసలు బాబర్‌కు రాణా ఆహ్వానం అన్న మాటనే ప్రఖ్యాత చరిత్రకారుడు జదునాథ్ సర్కార్ కొట్టి పారేశాడు. భారత్ మీద దండెత్తడంలో బాబర్‌కు సొంత లక్ష్యాలు ఉన్నాయి. పైగా గౌరీశంకర్ హీరాచంద్ ఓఝా అయితే తనకు సాయపడవలసిందిగా బాబర్ రాణా సంగాను కోరాడని రాశారు. 1524లో బాబర్ లాహోర్ వైపు దండుతో కదిలాడంటే, అందుకు కారణం దౌలత్‌ఖాన్‌ను ఇబ్రహీం లోడీ పదవి నుంచి తొలగించాడన్న వర్తమానంతోనే అని కూడా ఆధారాలు చెబుతున్నాయి. నిజానికి 1526లో మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. సంవత్సరానికే అంటే 1527లో కాణ్వా యుద్ధం జరిగింది. ఇది బాబర్, రాణాల మధ్య యుద్ధం. వాస్తవాలు ఇలా ఉండగా ఎలాంటి విలువలు లేని రాజకీయ పార్టీలో పదవులు నొక్కి రాజ్యసభను కూడా అభాసుపాలు చేస్తున్నారు కొందరు నాయకులు. ముస్లింలను బుజ్జగించడానికి దురాక్రమణదారులను కూడా ఆరాధించే దుష్ట సంస్కృతిని ప్రారంభించారు.