‌భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– జి. ఉమామహేశ్వర్‌

‘‘‌నందూ..ఏమిటి ఆలస్యం?’’ డ్రైవింగ్‌ ‌సీట్లో కూర్చుని అసహనంగా అడిగాడు ఆనంద్‌

‘‘ఐపోయిందండీ, కార్‌ ‌దగ్గరకే వస్తానని చెప్పింది. ఆమె వస్తే మాట్లాడి బయలుదేరడమే’’ కార్‌ ‌పక్కనే నిల్చున్న నందిత విండో నుంచి లోపలికి చూస్తూ సమాధానమిచ్చింది.

ఆనంద్‌ ఒక ఎమెన్సీలో ప్రిన్సిపల్‌ ‌కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఉస్మానియాలో ఇంజనీరింగ్‌ ‌పూర్తిచేసి పాతికేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. చిన్నప్పుడు ఆనంద్‌ ‌తండ్రి ఆంధ్రాబ్యాంక్‌ ‌హెడ్డాఫీస్‌లో పనిచేయడం వల్ల చాలాకాలం కాచిగూడ, సుల్తాన్‌బజార్‌ ఏరియాలో ఉన్నారు. ఆనంద్‌ అమెరికా వెళ్లిపోయిన తరువాత వాళ్ల నాన్నగారు ప్రమోషన్‌ ‌మీద వేరే వేరే ఊళ్లలో పనిచేసి చివరి రోజుల్లో హైదరాబాద్‌ ‌వచ్చేసి ఇక్కడే పదవీ విరమణ చేసి కొండాపూర్‌లో ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు. ఆనంద్‌ ‌కూడా వివిధ కంపెనీలలో, వివిధ బాధ్యతలలో అనేక ప్రాంతాలలో పనిచేసి హైదరాబాద్‌ని తన చివరి మజిలీ చేసుకుని వచ్చేశాడు. ఇంటిని మళ్లీ కొత్తగా కట్టించి పైన ఆనంద్‌ ‌కుటుంబం, కింద తల్లితండ్రులు ఉంటున్నారు.

ఇక్కడకు వచ్చి ఆరు నెలలవుతోంది. ఆఫీస్‌లో సెటిలయి, ఇల్లు సర్దుకుని అంతా కుదురుకున్నాక ఇప్పుడు తన బాల్యం గడిపిన కాచిగూడ ఏరియాకు పోవాలని, అక్కడ తిరిగి తన జ్ఞాపకాలను తడుముకోవాలని ఉబలాట పడుతున్నాడు. అది ఈ రోజుకు కుదిరింది. తన క్లాస్‌మేట్‌ ‌సంతోష్‌ ‌యాదవ్‌ ఇప్పటికీ అక్కడే ఉంటున్నాడని తెలిసింది. అనేక లింకుల సహాయంతో అతని నంబర్‌ ‌సంపాదించి మాట్లాడి ఈరోజు కలవాలని నిర్ణయించుకున్నారు.

మరో నాలుగు నిమిషాల తరువాత దూరంగా రమణమ్మ కనిపించింది. నందిత కొంచెం ముందుకు వెళ్లి రమణమ్మతో ఏదో మాట్లాడుతోంది. వాళ్ల మాటలు విన బడటంలేదు కానీ వాళ్ల హావభావాలు కనబడుతున్నాయి. రమణమ్మ ఏదో దీనంగా చెబుతోంది. నందిత చాలా సానుభూతితో వింటోంది. నందిత వాళ్లు వచ్చి ఆరునెలలే అయినా రమణమ్మకి నందిత ప్రవర్తన నచ్చేది. తగినంత గౌరవం ఇవ్వడం, కాఫీ టిఫిన్లు పెట్టడం, పని మానేసిన రోజు కారణమడిగేది తప్ప కరిచేది కాదు. ఏదైనా చెప్పాల్సి వస్తే నేరుగా సున్నితంగా చెప్పేది. దాంతో రమణమ్మకి నందిత అంటే భక్తి, గౌరవం పెరిగిపోయాయి. చివరిగా రమణమ్మ తన చిన్న పర్సులో నుంచి మడిచి రబ్బర్‌ ‌బ్యాండేసిన కొన్ని నోట్లు నందితకు ఇచ్చింది. నందిత సరేనంటూ తలూపుతూ ఆ నోట్ల కట్టను తన బ్యాగులో వేసుకుంది. రమణమ్మ వీడ్కోలు అందుకుని ముందు సీట్లో వచ్చి కూర్చుంది నందిత.

దంపతులిద్దరూ హైటెక్‌ ‌సిటీ మీదుగా కాచిగూడా వైపు బయలుదేరారు.

‘‘ఈ రమణమ్మ గొడవేంటి నీకు’’ డ్రైవ్‌ ‌చేస్తూ అడిగాడు ఆనంద్‌.

‘‘అది గొడవ కాదు ఆనంద్‌, ‌బతుకుతెరువు. రమణమ్మ నాలుగిళ్లలో పనిచేసి నెలకి పదివేల దాకా సంపాదిస్తుంది. కానీ ఏం ప్రయోజనం? మొగుడు తాగుబోతు. తన సంపాదనంతా ఖర్చు చేస్తాడు. పైసా కూడా పొదుపు చేయడు. పైగా నెలాఖరుకల్లా ఈమె దగ్గర తన్నిలాక్కుంటాడట. అందుకని తన సంపాదన ఎనిమిది వేలే అని చెప్పి దాంతోనే ఇల్లు జరుపుతుంది’’ వివరణ ఇచ్చింది నందిత.

‘‘అంటే భర్తను మోసం చేస్తోందన్నమాట’’ సరదాగా అన్నాడు ఆనంద్‌. ‌నందిత కూడా సరదాగానే నవ్వుతూ..

‘‘దాన్ని మోసం అనరు బాబూ! తల్లి మనసు అంటారు. అది మీకు అనుభవంలోకి వచ్చే అవకాశమే లేదు. పిల్లల అవసరాలు తల్లికే తెలుస్తాయి. దాచిన ఆ రెండు వేలు పిల్లల ఫీజులకో, మందులకో, ఏమైనా కొనియ్యడానికో వాడుతుంది. నా దగ్గరుంటే మొగుడుకి అనుమానం రాదని, వచ్చినా అడగడని ఆమె నమ్మకం’’ అన్నది.

దార్లో స్వీట్స్, ‌పండ్లు కొనుక్కుని కోఠీ దగ్గర చప్పల్‌ ‌బజార్‌ ‌చేరేపాటికి సాయంత్రం నాలుగయింది.

సంతోష్‌యాదవ్‌ ‌చాలా ప్రేమతో ఆప్యాయంగా సాదరంగా ఆహ్వానించాడు. ఇప్పటికీ వాళ్లది ఉమ్మడి కుంటుంబమే. అన్న దమ్ములందరూ పాల వ్యాపారమే చేస్తారు. పనుల విభజన, సంపాదన అన్నీ పెద్దన్నే చూసుకుంటాడని చెప్పాడు. భార్యా భర్తలిద్దరినీ తీసు•కెళ్లి హాల్లో కుర్చీలేసి కూర్చోబెట్టాడు. ‘‘బాగ తయారయినవ్‌ ఆనంద్‌. ‌నిన్నసలు గుర్తు పట్టరెవరు’’ అన్నాడు సంతోష్‌

‘‘అవును, బాగా లావయ్యాను కదా’’ అంటూ చుట్టూ పరికించి చూశాడు.

సంతోష్‌ ‌వాళ్ల నాన్న వాళ్లది. చప్పల్‌బజార్‌లో పెద్ద పాలవ్యాపారం. వాళ్లు విడిపోయి మూడు కేంద్రాలు ఏర్పరచుకున్నారు. వీళ్ల వాటాకి వచ్చిన గేదెలు, ఆవులతో వీళ్లు విడిగా వ్యాపారం ప్రారంభించారు. దాంతో పాటు పాల ప్యాకెట్లు కూడా అమ్ముతారు.

‘‘నాయన పోయి పదేండ్లు దాటింది. అన్నలు బయటకెళ్లిండ్రు.వస్తరు’’ అంటూ

‘‘ఇగో ఈమె నా భార్య సుశీల. వీళ్లు మా వదిన•లు’’ అంటూ అందరినీ పరిచయం చేశాడు.

పరిచయాలయ్యాక చిక్కటి పాల కాఫీ తాగుతూ మిత్రులిద్దరూ చిన్ననాటి కబుర్లలో మునిగిపోయారు.

ఫ్రెండ్స్ ‌గురించి వాకబు చేశాడు ఆనంద్‌. ‌సంతోష్‌ ‌పెద్దగా నవ్వుతూ,

‘‘మేమేమన్న మీలెక్క సక్కగ సదుకున్నోల్లమా వేరే వేరే ఊర్లలో ఉండనికీ! అందరం ఈడనే యాడో తిప్పలు పడుతున్నాం. శంకర్‌ ‌గాడు వాళ్లయ్య సెలూన్‌ ‌కంటిన్యూ చేస్తున్నడు. పుల్లాగాడు సెపరేటు కిరాణం షాపు పెట్టిండు. ఇద్దరు మార్వోడోళ్ల పిల్లలొస్తుండేది చూడు. ఔర్‌ ‌శ్యామ్‌ అనేటోళ్లం, వాళ్లు ఇప్పటికీ ఇడిపోకుంట పార్టనర్‌ ‌షిప్‌లో బ్యాంక్‌ ‌స్ట్రీట్‌కెల్లి శాంసంగ్‌ ‌షోరూం తెరిసిన్రు. రంగాగాడు బడిచౌడిలో కూరగాయల షాప్‌ ‌పెట్టిండు. ఇగ గణేష్‌ అని ఒక దడ్డుపిల్లగాడు నింబోలి అడ్డకెల్లి వచ్చెతోడు. వాడక్కడే మంచిగ మెకానిక్‌ ‌షాప్‌ ‌నడిపిస్తున్నడు..’’ సంతోష్‌ ‌తనకు గుర్తున్నవాళ్ల వివరాలన్నీ చెప్పాడు.

నందిత కొంచెం ఇబ్బందిగా కూర్చుంది. ఎవరూ ఆమెతో మాట్లాడటం లేదు. వాళ్ల వాళ్ల పనులలో హడావిడిగా తిరుగుతున్నారు. అక్కడ పచ్చిపేడ వాసన ఘాటుగా కొడుతోంది. ఆమెకు అలవాటు లేకపోవడం వల్ల ముక్కు మూసుకుంటే ఏమైనా అనుకుంటా రేమోనని అలాగే భరిస్తూ పరిసరాలు గమనిం చడంలో నిమగ్నమైంది. అది పాత మోడల్లో కట్టిన ఇల్లు. హాలు ఎత్తులో ఉంది. బయటి వాకిలికి, హాలుకి మధ్యన కొన్ని గేదెలను, రెండు ఆవులను కట్టేశారు. ఆ జాగా వాటి కోసమే అన్నట్టు, కొన్ని గుంజలు కూడా పాతారు. పనివాళ్లలో ఒకతను పాలు పితుకు తున్నాడు. సంతోష్‌ ‌యాదవ్‌ ‌భార్య, వదిన పర్యవేక్షిస్తు న్నారు.

అంతావరకూ బోర్‌గా ఫీలవుతున్న నందితకు పాలు పితికే సన్నివేశం ఆసక్తిగా తోచింది. పట్టణ మధ్యతరగతి ఉద్యోగస్తుల ఇంట్లో పుట్టి పెరిగిన ఆమెకు ఈ తంతు చిత్రంగా ఉంది. పాలు పితక డంలో అతను ప్రదర్శిస్తున్న ఒడుపును అబ్బురంగా చూస్తోంది. ఒక చెంబు పాలు నిండడానికి ఇంతసేపు పడుతుందా అని ఆశ్చర్యపోతోంది.

‘‘స్కూల్‌ ‌వైపు వెళ్లొద్దామా?’’ ఉన్నట్టుండి ఏదో గుర్తొచ్చిన వాడిలా అడిగాడు ఆనంద్‌.

‘‘ఇం‌కెక్కడి స్కూల్‌ ‌భయ్‌. ‌లీజు పూర్తయిందని పడగొట్టేసిన్రు. ఆడ ఒక అపార్ట్మెంట్‌ ‌వచ్చింది’’

‘‘అయ్యో, అలాగా’’ బాధగా అన్నాడు. స్కూల్‌ ‌బిల్డింగ్‌ ‌స్థానే అపార్ట్మెంట్‌ ‌రావడం అతనికి నచ్చలేదు.

‘‘మన సార్లు గానీ, టీచర్లు గానీ కనిపిస్తుంటారా?’’ అనుబంధ ప్రశ్న వేశాడు.

‘‘ఇంకెక్కడి సార్లు ఆనంద్‌. అప్పటికే ముసిలోల్లు. ఎవ్వడున్నడో ఎవలు లేరో తెల్వది. అయితే మన డ్రిల్‌ ‌సార్‌ ‌మాత్రం అప్పుడప్పుడూ ఈడ హరామజీద్‌ ‌కెల్లి వస్తుంటడు’’

మళ్లీ అతనే…‘‘నీకు యాదికుందా? మనం సెవెన్త్ ‌క్లాస్‌లో ఉన్నప్పుడు మహేశ్వరి పరమేశ్వరిలో గిరఫ్తార్‌ ‌సినిమాకు పోయినుంటిమి. అమితాబ్‌, ‌రజనీకాంత్‌, ‌కమలాసన్‌ ‌యాక్ట్ ‌చేసిరందులో’’

ఆనంద్‌కూడా ఆ సినిమా సందర్భం గుర్తు తెచ్చుకుంటూ…

‘‘అవును..ఆ తరువాత మనం కూడా రాయిని పైకెగరేసి ఇంకో రాయితో కొట్టే ఆట కనిపెట్టాం’’ అన్నాడు.

సంతోష్‌ ‌కొంచెం విచారంగా మొహం పెట్టి

‘‘ఇంకెక్కడి మయేశ్వరి పరమేశ్వరి లే ఆనంద్‌. అదిప్పుడు పెద్ద మాలయింది. అంద్ల ఇప్పుడు చిన్న చిన్న థియేటర్లు ఉన్నయ్‌ ‌గానీ, మహేశ్వరి పరమేశ్వరి లెవెలే వేరు’’

ఇద్దరూ తీరికగా ఇంకా పాత రోజులను కలబోసు కుంటున్నారు.

ఉన్నట్టుండి నందిత దృష్టి పక్కనే కట్టేసి ఉన్నదూడ వేపు మళ్లింది. దాని కట్టు విప్పదీయడానికి సంతోష్‌ ‌వాల్ల వదిన దూడను సమీపిస్తుంటే అది అటూ ఇటూ తిరుగుతూ, చిందులేస్తూ తలగుండ్రంగా తిప్పుతూ దాని సంబరాన్ని ప్రకటిస్తోంది. నందిత దాన్నే గమనిస్తోంది. ఇంతలో పితికిన పాలగిన్నె పక్కకు తీసిపెట్టి దూడకు కట్లు విప్పదీసి దాని తల్లి దగ్గరకు వదిలారు. దూడ ఆనందంతో గంతులేస్తూ తల్లి దగ్గరకు పోయి పాలు కుడవడం మొదలుపెట్టింది. అప్పుడు దాని కళ్లలోని పారవశ్యాన్ని చూసి తన్మయత్వంతో పులకించిపోయింది నందిత మనసు.

ఆ దృశ్యాన్ని చూసి చప్పున మొబైలు తీసి క్లిక్‌మనిపించింది. అందరూ నవ్వారు.

‘‘గిసంటియి మీకు కొత్త గుంటయ్‌ ‌గద’’ అన్నది సంతోష్‌ ‌భార్య నందితను చూస్తూ.

అవునన్నట్టు తలవూపి ధ్యానమగ్నతతో మళ్లీ అటే దృష్టి సారించింది నందిత.

ఆనంద్‌, ‌సంతోష్‌ అలా బయటకు వెళ్లారు. బహుశా సిగరెట్‌ ‌కోసం అనుకుంది నందిత.

పది నిమిషాలు గడిచాయో, లేదో…పనతను, సంతోష్‌ ‌భార్య ఇద్దరూ పాలు తాగుతున్న దూడను బలవంతంగా తల్లి నుంచి వేరు చేసి విడిగా కట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి గేదె ఆ పని తనకు అంగీకారం కాదన్నట్టు, వదిలితే వాళ్లిద్దరినీ కుమ్మేస్తానన్నట్టు కొమ్ములు విసురుతూ చూస్తుంటే, ఆ లేగదూడ ‘ఇంకా ఆకలి తీరకముందే నన్ను దూరం చేస్తారా’ అని ప్రాధేయపడుతున్నట్టు మొండికేస్తూ గింజుకుంటోంది. ఒక రెండు మూడు నిమిషాల పెనుగులాట తరువాత దూడను పక్కకు కట్టేశారు. ఆ అలజడి తగ్గిన తరువాత పాలకు మళ్లీ గేదె దగ్గరకు పోతున్న వాళ్లకి ఎవరో ఏడుస్తున్నట్టు ఎక్కిళ్ల శబ్దం వినబడింది. ఎక్కడా అని చుట్టూ చూసి ఆ శబ్దం నందిత దగ్గర నుండే వస్తుందని గమనించి అందరూ నందిత వైపు చూశారు.

నందిత ఏడుస్తోంది. అప్పటికీ ఆమె ఎంత నియంత్రించుకున్నా ఇక తప్పదన్నట్టు ఎక్కిళ్లు బయటకు వచ్చాయని అర్థమవుతుంది. అందరూ తననే గమనిస్తున్నందుకు కించపడుతూ కళ్లు తుడుచుకుంటూ నవ్వడానికి ప్రయత్నిస్తోంది. అయినా గొంతులో నుండి దుఃఖం తన్నుకుంటూ వస్తూ గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి. సంతోష్‌ ‌భార్య, వదిన నందిత వైపు చూసి ‘ఏమయిందమ్మా’ అని వాకబు చేస్తుంటే నందిత కొంచెం సిగ్గు పడుతూ ‘‘ఏం లేదు, ఏం లేదు’’ అంటూ కళ్లు తుడుచుకుంటూ మళ్లీ మామూలవడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడే లోపలికి వచ్చిన సంతోష్‌, ఆనంద్‌ ఈ ‌దృశ్యం చూసి కలవరపడ్డారు. సంతోష్‌ ‌వదిన చొరవ తీసుకుని ‘‘ఏమ్మా, ఏమయింది’’ అని అనునయంగా భుజం మీద చేయి వేసి అడిగింది.

‘‘వాట్‌ ‌నందూ, ఆర్యూ ఆల్‌ ‌రైట్‌’’ ‌దగ్గరగా వచ్చి అడిగాడు ఆనంద్‌.

‌నందిత ఇక చెప్పకపోతే బాగుండదని నోరు విప్పింది. మెల్లగా మాటలు కూడబలుక్కుంటూ

‘‘ఆ దూడకు..’’ మళ్లీ ..గొంతు పూడుకుపోతుంటే కొంచెమాగి

‘‘ఆ దూడకు ఇంకా ఆకలిగా ఉన్నట్టుంది. దాని కడుపు నిండక ముందే పక్కకు లాక్కెళుతుంటే పాపం అది బేలగా చూస్తోంది..’’ అంటూ ఆ సంఘటన కళ్లముందర కదలాడుతుంటే గద్గద స్వరంతో చెప్పింది.

ఒక్క క్షణం ఎవరికీ నోట మాట రాలేదు.

ఆనంద్‌కు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఒక వైపు భార్య సున్నిత హృదయం అర్థమైనా ఇక్కడ సంతోష్‌ ‌వాళ్ల పనిని ఎత్తి చూపుతున్నట్టు వాళ్లు ఎక్కడ ఫీలవుతారో అని సతమతమౌతున్నాడు.

సంతోష్‌ ‌వాళ్ల వదిప చొరవగా నవ్వుతూ

‘‘నీది చల్లని మనసు బిడ్డా’’ అని నందిత మెడ చుట్టూ చేతులు కప్పి

‘‘ఏం గాదమ్మా, అది గూడ తల్లే గదా! బిడ్డ కోసం ఎప్పుడూ కొన్ని పాలు బిడ్డసంచిలో దాసి బెడతది. మనం ఎంత గుంజినా ఒక్క సుక్క గూడ విడువది. బిడ్డ నోరు తగలంగనే పాలిడుస్తుంది. దూడ కోసం ఒక లీటర్‌ ‌పాలన్నా ఆ బిడ్డ సంచిల దాసి పెడతది’’ అన్నది వాతావర ణాన్ని తేలిక చేస్తూ.

అక్కడ ఏ అపార్థాలూ జరగనందుకు ఆనంద్‌ ‌మనసులోనే సంతోషించాడు. నందిత మనసు తేలిక పడింది. ఆమె మాతృహృదయం నెమ్మళించింది. మొహం కడుక్కుని ఫ్రెష్‌ అవ్వమని సంతోష్‌ ‌భార్య చెబితే బాత్రూమ్‌కెళ్లి మొహం కడుక్కుని వచ్చింది నందిత. బ్యాగులోనుండి న్యాప్కిన్‌ ‌తీస్తుంటే ఉదయం రమణమ్మ ఇచ్చిన డబ్బుల కట్ట కింద పడింది.

అది గమనించిన సంతోష్‌ ‘‌బ్యాగులకెల్లి ఏదో కింద పడింది చూడమ్మా’ అని చెప్పాడు.

నందితకంటే ముందే ఆనంద్‌ ‌కిందకు వంగి దాన్ని తీసి నందిత చేతికిస్తూ ఆమెకు మాత్రమే వినిపించేలా

‘‘బిడ్డ సంచి’’ అంటూ చిన్నగా నవ్వాడు.

నందితకు భావం అర్థమై మెచ్చుకోలుగా ఆనంద్‌ ‌వైపు చూసి అతని నవ్వుతో జత కలిపింది.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE