మనదేశంలో డిజిటల్ లావా దేవీలు భారీ ఎత్తున జరుగుతున్నప్పటికీ నగదు లావాదేవీలు ఏ మాత్రం తగ్గలేదనటానికి నిదర్శనంగా భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం రైళ్లలో ఏటీఎం సేవలను అందుబాటులో తీసుకువస్తోంది. ఇందులో భాగంగా మధ్య రైల్వే మొట్ట మొదటిసారి అన్నట్టుగా ముంబాయి, మన్మాడ్ మధ్య రాకపోకలు సాగించే పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేసినట్టు మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి స్వప్నిల్ నీలా ఏప్రిల్ 16న మీడియాతో అన్నారు. మహారాష్ట్ర బ్యాంక్ భాగస్వామ్యంతో రైలులోని ఏసీ చైర్‌కార్‌లో ఒక ఏటీఎంను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇన్నోవేటివ్ అండ్ నాన్-ఫేర్ రెవెన్యూ ఐడియాస్ పథకం కింద రైలు బోగీలో గతంలో ప్యాంట్రీగా ఉపయోగించిన చోటులో ఏటీఎంను నెలకొల్పినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ విజయవంతమైందని తెలిపారు. రైలు కదులుతున్నప్పుడు భద్రతకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉండ టానికని ఏటీఎంకు షట్టర్ డోర్‌ను సైతం అమర్చినట్టు చెప్పారు. ఏటీఎంను ఏసీ కోచ్‌లో ఏర్పాటు చేసినప్పటికీ రైలులోని 22 బోగీల్లోని ప్రయాణికులు వినియోగించు కునేలా ఏర్పాటుచేశారు. సుమారు 4.30 గంటల ప్రయాణ సమయం తీసుకునే పంచవటి ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజూ ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, మన్మాడ్ జంక్షన్ మధ్య రాకపోకలు సాగిస్తుంది.