‘హిందూ సుందరి’
ఎవరు? పత్రిక పేరు.
ఎప్పటిమాట? ఎప్పుడో నూటపాతికేళ్ల నాటిది.
ఆ ప్రస్తావన ఇప్పుడెందుకు?
ఏప్రిల్ నెలలోనే ఆ వనితల పత్రికా సంస్థ సంస్థాపన.
భండారు అచ్చమాంబ, మొసలికంటి రమాబాయమ్మ, వెంపల శాంతాబాయమ్మ, మాడభూషి చూడమ్మ, కళ్లేపల్లె వెంకటరమణమ్మ, బాలాంత్రపు శేషమ్మ… వీరందరి పేర్లూ ఆ పత్రికతోనే ముడివడి ఉన్నాయి, ఇంకా ఎప్పటికీ ఉంటాయి.
ఎందుకంటే – నిర్మాణం, నిర్వహణ, రచన, పర్యవేక్షణ బాధ్యతలన్నీ వారివే కాబట్టి.
అంతకుముందు.. వనితల కోసం వనితలే నడిపిన పత్రికలు లేవా?
ఉన్నాయి. వాటిల్లో ప్రత్యేకించి తెలుసుకోవాల్సింది ‘హిందూ సుందరి’ గురించే.
ఏమిటీ అంత ప్రత్యేకత?
రచనా, నిర్వహణా ఆ పత్రికలో వెల్లివిరియడం. మహిళామణుల కలంబలం అన్నింటా, అంతటా విస్తరించడం. ఇప్పుడు కాదు – శతాబ్ది, ఇంకా చెప్పాలంటే శతాధిక వసంతాల కిందటే అంతటి మహోదయం.
నాటి స్థితిగతులు, అప్పటి పూర్వాపరాలు, అతివల నిపుణతలను విశ్లేషిస్తే…. విశేషాలూ, విశిష్టతలూ అనేకం.
అది 1897. ఆ ఊరు ఏలూరు.
అక్కడ ఒకనాడు ఏర్పాటైంది సమాజ సంస్కరణల నిర్వహణ సభ. ఆ కార్యక్రమానికి ఆ రోజుల్లోనే వందమంది దాకా రచయిత్రులు / కవయిత్రులు హాజరయ్యారు. సమకాలీన అంశాలతో రచనల వేగాన్ని పెంచాలని, అదే సమయంలో క్రియాశీలక వైఖరిని అనుసరించాలనీ నిర్ణయించుకున్నారు.
గృహలక్ష్మి, ఆంధ్రమహిళ, అంతకుముందే సతీహితబోధిని, స్త్రీ హిత బోధిని, తెలుగు జవానా, శ్రీబాలిక వంటి పత్రికలైతే ఉన్నాయి. అవి వెలువడింది రాజమండ్రి, విజయవాడ, కాకినాడ, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి. హిందూ సుందరి వ్యవస్థాపన 1902 ప్రాంతాల్లో.
సంపాదకురాలిగా ఉండాలని అచ్చమాంబకు పిలుపు వెళ్లింది. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ క్రోడీకరణ కర్తకు సోదరి ఆమె. తెలుగు, హిందీలతోపాటు గుజరాతీ, ఆంగ్లభాషల్లోనూ ప్రవీణ. స్వయంకృషితో సంస్కృత కావ్యాలు, శ్రుతులూ, స్మృతులూ, పలు శాస్త్రాలనూ అవగాహన చేసుకున్న నిపుణ. అందుకే ఆమెకు సంపాదక హోదా గురించి అప్పట్లోనే సంప్రదింపులయ్యాయి.
అనివార్య కారణాలతో ఆమె సమ్మతి తెలపలేదు కానీ, ఆ పత్రికకు రచనలెన్నో చేశారు. సమాజ సమస్యలూ, వాటి పరిష్కార మార్గాల గురించిన చర్చలు జరిపారు. మరి కొన్నాళ్ల తర్వాత- సంపాదక విధులను రమాబాయమ్మ, శాంతాబాయమ్మ చేపట్టారు. నిర్వహణ సౌలభ్యం కోసం పత్రిక కార్యాలయం కంతేరుకు మారింది.
మరోవైపున ‘సావిత్రి’ అనే పత్రిక కాకినాడ నుంచి మొదలైంది. సంపాదకురాలు పులుగుర్త లక్ష్మీ నరసమాంబ. హిందీ, బెంగాలీ భాషల్లో సైతం నేర్పరి. మరికొంత కాలానికి అనసూయ పేరిట పత్రిక ప్రారం భమైంది. వింజమూరి వెంకటరత్నమ్మ ఎడిటర్‌గా ఉండేవారు చాలాకాలం. బాలికలకు ఉపకరించే శీర్షిక లెన్నింటినో తన పత్రికలో ప్రవేశపెట్టారు. ప్రపంచ ప్రఖ్యాత ముదితల చరిత్రలను విపులీకరించి ప్రచురించేవారు.
దురాచారాల మీద అలుపెరగని ఉద్యమాన్ని కొనసాగించారామె. బరంపురం నుంచి వెలువడిన ‘ఆంధ్రలక్ష్మి’కి వెంకటరమణమ్మ సంపాదకురాలు. వనితా వికాసానికి ఎంత చేయాలో అంతా చేశారు.
ఆంధ్ర మహిళ సంపాదకురాలు అనగానే, గుమ్మిడిదల దుర్గాబాయమ్మ గుర్తుకొస్తారు. స్త్రీ జనాభ్యుదయానికి జాతీయ స్థాయిన ప్రత్యేక విధానం ఉండాలని లిఖిత పూర్వకంగా ప్రతిపాదించారు. రాచమళ్ల సత్యవతీదేవి నిర్వాహకత్వంలో, సంపాదక సహకారంతో వెలువడిన మరొక పత్రిక ‘తెలుగుతల్లి’. అలాగే సూర్యదేవర రాజ్యలక్ష్మి కూడా పత్రిక సంపాదక విధులను నిర్వర్తించారు.
ఇంకా వివిధ పత్రికలు (స్త్రీలవి); ఉండేవి. వీటన్నింటికంటే ముందు నడిచింది ‘హిందూ సుందరి’.
ప్రతీ సంచికలోనూ కనిపించిన తొలిపేజీ పద్యం ఇదీ :
శ్రీ సంభావిత వాక్య సంపదలచే జెన్నొంది సాధ్వీమనో
ల్లాసంబేర్పడ సేయుచున్ విమలశీలంబొప్పగా వైదుషీ
వ్యాసంగంబుల వెరవృత్తులెడపున్ భాషాఢ్యయై కాన సం
తోషంబొందికొనుండ సుందరులు హిందూ సుందరీ రత్నమున్.
వాక్య సంపద, వైదుషీ వ్యాసంగం, భాషాఢ్య, తదితర పదప్రయోగాలు నారీజన పురోగమనాన్ని సూచించేవే.
‘శారదా కుసుమ సంవాదం’. ఇదొక నాటక రచన. హిందూ సుందరిలోనే ముద్రితం అయింది. రచయిత్రి చూడమ్మ. మానసిక, శారీరక ఎదుగుదలను విపులీకరించే శాస్త్ర జ్ఞాన చైతన్యం స్త్రీలకు అత్యవసరమన్నారు.
ఆడవారికి సమగ్రమైన ఆరోగ్య పరిజ్ఞానం ఉండాలన్నది మరొక రచన సారాంశం. దీని ప్రచురణతోనూ హిందూ సుందరి ఎంతో పేరందుకుంది. విద్యావంతురాలైన అతివ తన బిడ్డలను పరిశుభ్ర వాతావరణంలో పెంచుతుంది. వారి శారీరక ఆరోగ్యానికి పూర్తి ప్రాధాన్యమిస్తుంది. ఈ అంశాలను ఆనాడు నాటక రచన ద్వారా ప్రస్ఫుటంచేసిన రచయిత్రి ఓరుగంటి ఆదెమ్మ.
కందుకూరి రాజ్యలక్ష్మమ్మ. సంఘసేవలో అగ్రగామి. కంతేరు (గోదావరి ప్రాంతం) వాస్తవ్యురాలు. తను నివసించే ఆనందాశ్రమ ఆరామంలోనే ప్రార్థన మందిరాన్ని స్థాపించిన సంస్కర్త. అటువంటి మహనీయ స్మృతి సూచకంగా పద్య కవితను ప్రచురించింది హిందూ సుందరి పత్రిక. కవయిత్రి జూలూరు తులశమ్మ.
వెలలేని సద్ధర్మ వితతిని బోధించి
యజ్ఞాన మడచిన యమ్మయెవరు?
ఆర లేని యనుకంపనారసి దుఃఖంబు
లపనయించినయట్టి యతివ యెవరు?
అట్టి మా రాజ్యలక్ష్మమ్మనలఘునాతిని
కాలగతినిట్లు నెడబాస కనల వలసె
నకట కాలంబు దాటగా నలవియగునె?
ఫాలనేత్రునకయినను బ్రహ్మకైన!
ఇటువంటి రచనల ప్రచురణతో అనేక పక్రియలను సమాదరించింది పత్రిక. స్త్రీలే పత్రికా ప్రచురణ చేయడమన్నదీ హిందూ సుందరి పత్రికతోనే వ్యవస్థీకృతం అయింది. మన స్వాతంత్య్ర సాధనకు ముందువరకూ ఆ పత్రికకు కొంతకాలంపాటు శేషమ్మ సంపాదకురాలిగా ఉన్నారు. స్త్రీలు తప్పక చదవాల్సిన, చదివి సమగ్రంగా తెలుసుకోవాల్సిన పత్రిక ఇదని ప్రచారం చేస్తుండేవారు. ‘ఇది ప్రత్యేకము. హిందూ స్త్రీల కొరకు మాసమునకొకసారి ప్రచురింపబడును’ అని ప్రథమభాగంలోనే ప్రచురించేవారు నిర్వాహక సంపాదకులు.
‘స్వవిషయము’ అంటూ ఒక సందర్భంలో ఆ పత్రిక రాసిందిలా:
‘‘ప్రియసోదరీ రత్నములారా! హిందూసుందరి పత్రికకు నానాటికి మంచి దశ కలుగుచున్నది. ఇందుకు అత్యంత కుతూహలము చెందుచున్నాము. నేటికీ ‘సుందరి’ కి దాదాపుగ ముప్పదిమంది ఉప విలేకరులుగా ఉన్నారు.
గోదావరి జిల్లా వల్లూరు సంస్థానాధీశ్వరులగు జమీందారువారి అగ్ర పుత్రికయగు రాజ్యలక్ష్మీ దేవమ్మ తమకు కలిగిన సహజ ఉత్సాహంబున ఒక సమస్యను పూర్తిచేసి పంపిరి. ఆమె విద్యావతి అని వినుటయేగానీ స్వలిఖిత వ్యాసములంగను భాగ్యమిచ్చినది గాదు. ఆమె అనుగ్రహంబున మా ‘సుందరి’ లక్ష్మీపార్వతుల వెంట జమీందారీ గృహముల స్వేచ్ఛగా సంచరించి, వారందించు వ్యాసముల నూతనాలంకారియై చదువరుల మనంబులాకర్షింపగలదని ప్రకటించుచున్నాము.’’
గ్రాంథిక భాషలో కొనసాగిన ఆ ప్రకటనా రచన స్త్రీల రచనా శక్తి సంపన్నతను చాటి చెప్తోంది.
ఇక, సంపాదకులు రమాబాయమ్మ, శాంతాబాయమ్మ ఆ పత్రికా ముఖంగా చేసిన విజ్ఞాపనలో ఉపయోగించిన పద మాధురులు:
విద్యావివేక సంపన్నులగు సోదరీ మణులారా!
పత్రికాధిపత్యం వహించిన మా పట్ల
విద్యావతులు అమిత వాత్సల్యముతో సర్వవిధములా తోడ్పాటు అగుదురని కోరుచున్నాము.
ఆనాడు మొదలైన ఆ పత్రిక 1960 తర్వాత కూడా కొనసాగుతూ వచ్చింది. వివిధ కాలాల్లో పలువురు మహిళల సంపాదక సేవలను పొందగలిగింది. ఎన్ని ఆర్థిక అవరోధాలు ఎదురైనా, అనేక విధాల సమస్యలు కలిసికట్టుగా చుట్టుముట్టినా; నిర్వాహక సంపాదకుల ఉమ్మడి కృషి ఫలితంగా ‘హిందూ సుందరి’ జైత్రయాత్ర కొనసాగించింది.
అర్ధశతాబ్దానికి పైగా ఆ పత్రిక దిగ్విజయంగా నడవటమన్నది చరిత్రాత్మకం. ఎంతోమందిని ఉత్తమ సాహితీవేత్తలుగా తీర్చిదిద్దింది. రచనల పరంపరతో సమాజాన్ని ఎంతగానో ముందుకు తీసుకువెళ్లగలిగింది. ఉదాత్త రచనలకు వేదికగా స్థానాన్ని స్థిరపరచుకుంది.
పత్రిక ప్రచురణ మొదలైన దరిమిలా అనేకానేక సంవత్సరాలు రచయిత్రులెందరో లిఖిత దర్శనమిచ్చేవారు. సున్నిత, కీలక సమస్యలను వెల్లడించడంలో; వాటికి పరిష్కార మార్గాలను విశదీకరించడంలో ఆ పత్రికా సంస్థ ఎప్పుడూ ముందే ఉండేది.
స్త్రీ విద్య కలిగించే బహుళ ప్రయోజనాలను సుభద్రమ్మ ఎంతో ప్రభావాత్మకంగా వివరించారు ఒక వ్యాసంలో. బాలికల విద్యకు సంబంధించి తల్లిదండ్రులు వివక్ష చూపడాన్ని కాశీనాథుని రామాబాయమ్మ తీవ్రంగా నిరసించారు. ఆ రచనను సమధిక ప్రాధాన్యంతో ప్రచురించి అగ్రతను నిలబెట్టుకుంది హిందూ సుందరి పత్రిక. వర్తమానం పేరుతో ప్రాంతీయం నుంచి అంతర్జాతీయం వరకు వార్తలెన్నింటినో ప్రచురించి కాంతి మాలికలా వెలుగులొలికింది ఆ పత్రిక. వార్తావళి అంటూ నారీజనలోకానికి ఎంతెంతో సమాచారం అందించి ‘పత్రిక’ అనే మాటకు అర్థ తాత్పర్యాలను వెలువరించింది. అందుకే అనంత ప్రఖ్యాతి!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్