మే 2 (పంచమి) శంకర, రామానుజ జయంతి
భారతీయ సమైక్యతా, సమతామూర్తులు శంకరాచార్యులు, భగవద్రామానుజాచార్యులు. హిందూమతోద్ధరణకు, సనాతనధర్మ పరిరక్షణకు, ప్రత్యేకించి ప్రజలలో భక్తిప్రపత్తులు ఇనుమడింపచేసేందుకు, సర్వమానవ కల్యాణానికి కంకణబద్ధులయ్యారు. ఆదిశంకరులు ఈశ్వర స్వరూపులు కాగా రామానుజులు క్ష్మణ అంశగలవారని విశ్వాసం. వారు కేవలం ఆధ్యాత్మిక గురువులు, మతాచార్యులే కారు. సనాతన ధర్మానికి విఘాతం కలుగుతూ, అంధ విశ్వాసాలు ముసురుకుంటున్న వేళ జగతిని జాగృత పరిచేందుకు అవతరించిన చైతన్యదీప్తులు. అద్వైత, విశిష్టాద్వైత ప్రవక్తులు ఇద్దరూ ఒకే తిథి (వైశాఖ శుద్ద పంచమి)నాడు ఉదయించడం విశేషం. వర్తమానంలో చెప్పుకుంటున్న ఎన్నో సంస్కరణలకు, సమభావన, సహజీవనం, సమతావాదనకు ఆ మహనీయులు నాడే బీజం వేశారు. అన్యమతాల శత్రురాజులు దాడులకు ధ్వంసమైన ఆలయాలను పునరుద్ధరణకు విశేష కృషి చేశారు. వారి బోధనలను తరచి చూస్తే వాటి వెనుక కాలాలకు అతీతంగా, ముఖ్యంగా నేటి యువతకు ఉపకరించే ఎన్నో మర్మాలు, అంశాలు దాగి ఉన్నాయి.
అద్వైతమూర్తి ఆదిశంకర
దేశంలో అవతరించిన మహాపురుషుల్లో అగ్రగణ్యులు ఆదిశంకరాచార్యులు. కేరళలోని కాలడిలో శివగురువు, ఆర్యాంబ దంపతుల వరపుత్రుడు శంకరులు. వైశాఖ శుక్ల పంచమి కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో జన్మించారు. భారతీయ జీవన విధానంలో శ్రీకృష్ణ పరమాత్మ తరువాత జగద్గురువులు ఆదిశంకరులే మౌలికమైన ఏకత్వానికి వ్యావహారిక రూపం ఇచ్చారు. వ్యాసభగవానుడి ఆజ్ఞానుసారం ప్రస్థానత్రయానికి భాష్యాలను, ప్రకరణ గ్రంథాలను రాశారు. కేవలం ముప్పయ్ రెండేళ్ల జీవిత ప్రస్థానంలో సాధించిన అపూర్వ విజయాలను బట్టి కారణజన్ముడిగా ఆధ్యాత్మికవేత్తలు విశ్వసిస్తారు. జన్మతః ప్రాప్తించిన ఎనిమిదేళ్ల ఆయుర్దాయం నిజసన్యాసం స్వీకరణతో రెట్టింపు అయింది. తన సూచన మేరకు రచనా వ్యాసంగం కొనసాగించేందుకు వ్యాసుడు ఆ ఆయుర్దా యాన్ని ద్విగుణీ కృతం చేశారు. శాఖోపశాఖలుగా విడిపోయి అస్తవ్యస్తమైన హిందూ ధర్మాన్ని ఏకతాటి మీదికి తెచ్చారు శంకరులు.
వైష్ణవ, స్మార్త, సౌర, శాక్తేయ, గాణాపత్య, శైవమతాలను అవగాహన చేసుకొని ఆయా మతాచారాలు, విధానాలను సంస్కరించి ‘షణ్మత’ స్థాపనతో వైదిక ధర్మాన్ని పునరుద్ధరింప చేశారు.వైదిక ధర్మపరిరక్షణలో భాగంగా నాటి పండితులతో వాదప్రతివాదనలు చేశారు. పరాజిత పండితులను గౌరవించారు. వాదనలో ఓడిన మండనమిశ్రుని శృంగేరి పీఠానికి తొలి అధిపతిగా నియమించడం అందుకు ఒక ఉదాహరణ. తమ వాద ప్రతి వాదన లలో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఉదయభారతి (మండనమిశ్రుని అర్ధాంగి)ని సాక్షాత్తు శారదాదేవిగా గ్రహించి తమ శృంగేరి పీఠంలో శారదామాతగా కొలువుదీరాలని అర్థించారు. మోక్ష మార్గాలలో జ్ఞానం అత్యంత ఉత్తమం, పవిత్రమైనదని, జ్ఞానం ద్వారా పొందిన మోక్షం అక్షయమని ప్రబోధించారు. తాంత్రిక పూజల స్థానంలో సాత్విక పూజా విధానం ప్రవేశపెట్టారు. మతం పేరిట జరుగుతున్న జంతుబలులు, మూఢ విశ్వాసాలు, కర్మకాండలను వ్యతిరేకించారు. అథమ స్థాయిలోని వారిని ఉన్నత మైన ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేందుకు విగ్రహారాధన అవసరమని భావించి, బోధించారు.
‘సకలజీవరాశుల్లో మనిషి బుద్ధిజీవి. దుర్లభమైన మానవ జన్మను ప్రసాదించిన భగవంతుడి గురించి ఆలోచన లేకుండా సాగించే జీవితం నిరర్థకం. దేవుడి పట్ల భక్తి విశ్వాసాలు, జీవరాశి క్షేమం పట్ల అనురక్తుడై ఉండాలి. మనిషి నడతలో, చూపులో లోపం ఉంటుందేమో కానీ, సృష్టికి అంతా సమానమే’ అని అతి సులభ రీతిలో బోధించారు. ‘విద్య పర, అపార అని రెండు విధాలు. మొదటిది ఉదర పోషణ, వ్యక్తిగత సుఖాలకు సంబంధించినది కాగా, రెండవది లోకకల్యాణం, పరోపకార కోసం నేర్చేది. భగవంతుని దూరం చేసే కాంతాకనకాల పట్ల వ్యామోహం తగ్గించుకోవాలి. సత్సంగం, సజ్జన సాంగత్యంతో అజ్ఞానానికి మూలమైన మోహం నశిస్తుంది. అంత్య కాలం సమీపించినప్పుడు పాండిత్యం, సంపదలు కాపాడలేవు. కనుక… మూఢమతీ! గోవిందుడిని స్మరించు’ అని హితవు పలికారు.
శంకరభగవత్పాదులు, తాము సూత్రీకరించిన అద్వైత సిద్ధాంతవ్యాప్తి, వైదిక మతం వర్థిల్లడానికి దేశం నలుమూలలా చతురామ్నాయాలు (పీఠాలు) నెలకొల్పారు. ఉత్తరాదిన బదరీనాథ్‌లో జ్యోతిర్మఠం, తూర్పున పూరిలో గోవర్దనమఠం, పశ్చిమాన ద్వారకా మఠం, దక్షిణాదిన తుంగానదీ తీరంలో శృంగేరి మఠాన్ని స్థాపించారు.
‘న• మాతుః పరం దైవతమ్’.. (తల్లిని మించిన దైవం లేరు) అనే శాస్త్ర వాక్యానుసారం లోకాన్ని ఎదిరించి మాతృరుణం తీర్చుకున్న ధన్యుడు శంకరాచార్యులు. భక్తి మార్గాన్ని మరింత వ్యవస్థీకృతం చేయాలన్న సంకల్పంతో మాతృమూర్తిని ఒప్పించి యతిదీక్ష స్వీకరించారు. దేశాటనకు బయలు దేరుతూ… ‘నీ అంతిమదశలో తప్పక వస్తాను’ అని మాటను నెరవేర్చుకున్నారు. దేహత్యాగం చేసిన తల్లికి అంతిమ సంస్కారాలకు ప్రయత్నించినప్పుడు… సన్యాసికి కర్మాధికారం లేదంటూ బంధువులు, ఇతరులు ఆ తంతుకు అవాంతరం కల్పించారు. అయినా వెనుదీయని శంకరుడు స్వగృహంలోనే చితి పేర్చి యోగాగ్నితో మాతృమూర్తికి అంతిమ సంస్కారం నిర్వహించారు. మాతృభక్తికి ఆదర్శంగా నిలిచారు. వర్తమాన సమాజంలో కొందరు కన్నవారి కడపటి రోజుల్లో వ్యవహరిస్తున్న అనుచిత వైఖరికి ఆయన మాతృభక్తి కనువిప్పు కావాలి.
ఆయన మానవీయతకు ఒక ఉదాహరణ… ఆయన భిక్షకు వెళ్లినప్పుడు దీనస్థితిలోని గృహిణి ఒకరు, సిగ్గు, సంకోచాలతో ఉసిరికాయను భిక్షాపాత్రలో వేసింది. అది గమనించిన శంకరులు, కనకధారా స్తోత్రంతో శ్రీమహాలక్ష్మిని అర్చించి ఆ కుటంబు దారిద్య్రాన్ని రూపుమాపిన కరుణామూర్తి. అమ్మవారు కేవలం ఐశ్వర్య ప్రదాత కాదని, జ్ఞానం, సౌందర్యం, శక్తి సర్వాభీష్టాలు ప్రసాదించి వరప్రదాయని అని కీర్తించారు. నేటి భక్తకోటి స్తుతిస్తున్న స్తోత్రాలలో అనేకం ఆయన గళం నుంచి వెలువడినవే.
పరమగురువు (గురువు గోవిందభగవత్పాదుల గురువు) గౌడపాదునలు సందర్శించాలనే చిరకాల వాంఛను నెరవేర్చుకున్నారు. సంకల్ప శక్తి ఫలితంగా గౌడపాదులు సాక్షాత్కరించారు. ఆనంద పారవశ్యంతో పాదాభివందనం చేసిన శంకరుని ఉద్దేశించి, ‘నీ కృషి ఫలించింది. ఆయుర్దాయమూ ముగియవచ్చింది. శివదర్శనంతో అవతార పరి సమాప్తి చేసుకొని, శివసాయజ్యం పొందు’ అని ఆదే శించారు(ట). ఆ ఆజ్ఞ మేరకు కేదారేశ్వరుడి దర్శనం అనంతరం ఉత్తర దిక్కుగా పయనించి అనంత విశ్వంలో లీనమయ్యారు.
‘శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్’
సమతామూర్తి రామానుజ
తమిళనాడులోని‘ భూతపురి’ అనే శ్రీపెరంబూ దురులో ఆసూరి కేశవాచార్యులు, కాంతిమతి దంపతులకు తిరువల్లిక్కేణి (చెన్నై) పార్థసారథిస్వామి వరప్రసాదిగా జన్మించిన రామానుజులు విశిష్ట ఆచార్యులుగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. సమ సమాజ స్థాపన కోసం పరితపిస్తూ ఆయన అహరహం పాటుపడ్డారు. కొందరికే పరిమితమైన మంత్రరాజం అందరి సొంతం కావాలనుకున్న ‘మానవతా హక్కుల మూర్తి’. అనుకున్నది సాధించడమే తప్ప వెనకడుగు తెలియని ధీశాలి.
ఆయన ఆవిర్భావం నాటికి గల మతమౌఢ్యం, కొన్ని జాతుల పట్ల చిన్నచూపు,అనైక్యత, జంతు బలులు, మూఢాచారాలు, మూఢనమ్మకాలు వంటివి ఆయనను కలచి వేశాయి.ఇవి హైందవ నాగరికతకు గొడ్డలిపెట్టుగా భావించి, జాతిమత వివక్షరహితంగా నాటి హైందవ జాతినంతటిని ఏకతాటిపై నడిపేందుకు ఉద్యమించారు. జనహితం, ధర్మరక్షణ కోసం ఎంతటి కష్టనష్టాలనైనా ఎదుర్కోవాలని, వెరవ వలసిన అవసరం లేదనే ఆత్మవిశ్వాసం. పరమాత్మ చింతనకు, భక్తిభావానికి జాతి,మత,కులాలు లాంటివి అడ్డుకావని, భగవంతుని ఉనికిని తెలిపే వారు ఎవరైనా ఉన్నతులేనని ఎలుగెత్తారు.అందుకే ‘గతులన్ని ఖిలమైన కలియుగమందును/గతి ఈతడే చూపె ఘన గురుదైవము’ అని కీర్తించారు వాగ్గేయచక్రవర్తి తాళ్లపాక అన్నమాచార్య.
సర్వం విష్ణుమయం జగత్. భగవంతుడి దృష్టిలో అంతా సమానమే. మనిషికి గుణమే కొలమానం తప్ప ఇతర అంశాలు కావు’ అంటూ సమతా వాదాన్ని చాటారు.
విష్ణువును చిత్తంలో నిలిపి, సర్వమత సమానతను పాటించేవాడే వైష్ణవుడు తప్ప వైష్ణవ సామాజికవర్గంలో పుట్టిన వారంతా వైష్ణవులను రామానుజులు భావించలేదు.ఎనిమిది మంది బ్రాహ్మణేతరులు, ఒక మహిళ సహ పన్నెండుమంది ఆళ్వారుల రచనలు వెలుగులోకి తెచ్చిన ఘనత ఆయనదే. కులమతాలకు అతీతంగా అందరికీ ఆలయ ప్రవేశం కల్పించి, భోజనం (తదీయారాధన/సమారాధన) పెట్టే సంప్రదాయాన్ని నెలకొల్పారు. ‘రామానుజ కూటమి’ పేరుతో మధ్యాహ్న భోజనం, అన్నదానాలను నిర్వహించారు.
‘తిరుమంత్రం(నారాయణ మంత్రం) అసాధారణ మైనది. అన్యులకు వెల్లడిస్తే రౌరవాది నరకాలకు పోతావు’ అని గురువు చేసిన హెచ్చరికలను లక్ష్య పెట్టలేదు.
‘వ్యక్తిగత స్వార్థం కన్నా సమాజ శ్రేయస్సు మిన్న. సమాజహితం కోరే క్రమంలో నాకు కీడు కలిగినా, నేను నరకానికి పోయినా పర్వాలేదు.జనులు తరిస్తారు .మనిషి గుణమే కొలమానం. భగవంతుడి దృష్టిలో అంతా సమానం’ అంటూ కులమతలింగ అడ్డు గోడ లను బద్దలు కొట్టి సర్వులు పరమాత్మను చేరుకోవాలని తపించిన సమతామూర్తి. అలా శ్రీసౌమ్యనారాయణ పెరుమాళ్ కోవెల పైభాగంనుంచి నారాయణ మంత్రాల రహస్యాలను తెలియచెప్పిన ఆచార్యులు.
తాను అందరివాడినని భగవానుడే భగవద్గీతలో బోధించినప్పుడు మానవుల మధ్య తేడాలు మన్నింప రానివనే భావనతో ఆధ్యాత్మిక సంస్కరణలు చేపట్టారు. సమాజంలోని అన్ని వర్గాల వారిని ఆలయ సేవల్లో భాగస్వాములను చేశారు. భగవంతుడికి పల్లకీ• మోయడం, వింజామరలు వీయడ, దివిటీలు పట్టడం లాంటి సేవలు కల్పించారు. ఆయన చొరవ కొందరు ఛాందసవాదుల్లో అక్కసు రేపి అంతమొందించే ప్రయత్నాలకు దారితీసినా వెరవలేదు. ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మవలసిన పనిలేదని, తర్కానికి నిలబడితేనే ఆహ్వానించాలని బోధించారు.
అన్ని అంశాలను సానుకూల దృక్పథంతో వీక్షించిన రామానుజులు భగవత్ భాగవతా చార్యులను, భాగవతోత్తములను కించపరచడాన్ని, తక్కువ చేయడాన్ని సహించలేరు. వేద వాక్యాలను విపరీతార్థంలో వ్యాఖ్యానించిన గురువు యాదవ ప్రకాశకులతోనే విభేదించారు. శిష్యుని ప్రతిభా సంపత్తి గురువుకు కంటగింపుగా మారింది. ఆ ఈర్ష్యా భావం రామానుజులకు హాని కలిగించే స్థాయికి చేరింది. ఆ చేదు అనుభవం పునరావృతం కాకూడదన్న భావనతోనే కాబోలు, ఎందరో శిష్యులను తీర్చిదిద్ది ‘ఆదర్శ ఆచార్యులు’గా మన్ననలు అందుకున్నారు.
‘అంత్యజుల నుంచి బ్రాహ్మణుల వరకు అందరికి భక్తి మార్గం సమానమేనని ప్రబోధించిన ఆధ్యాత్మిక సారథి భగవద్రామానుజులు’ అని స్వామి వివేకానంద, ‘ధార్మికంగా, సామాజికంగా విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టిన మహాస్రష్ట. ఎంచరానంత బలమైన ఆత్మబలం, భావితరాలపై ప్రేమ ఆయన సొంతం’ అని సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు, ‘ఒక వర్గానికి పరిమితమైన మోక్షద్వారాలను సర్వులకూ తెరిచిన సమతామూర్తి రామానుజులు’ అని తమిళ ప్రసిద్ధ కవి భారతీదాసన్ శ్లాఘించారు.
‘కేవలం జ్ఞానార్జనతోనే సరిపోదు. ధర్మానుష్ఠానం తోనే జ్ఞానం సార్థకమవుతుంది. సామాజిక బాధ్యతలు గుర్తెరిగి న్యాయదృష్టితో కర్మాచరణ చేయడంతోనే జీవితం సార్థకమవుతుంది’ అని ఉద్బోధించిన రామానుజులు, తాము ప్రారంభించిన ‘జ్ఞాన ఉద్యమం’ కొనసాగింపు బాధ్యతను 74 మంది శిష్యులకు అప్పగించారు. శిష్యప్రశిష్య పరంపరంతో భగవద్రా మానుజుల ఆశయం కొనసాగుతూనే ఉంది, ఉంటుంది.
‘రామానుజార్య దివ్యాజ్ఞా వర్థతాం అభివర్థతాం’
రామానుజస్య చరణౌ శరణౌ ప్రపద్యే
– స్వామి