‘ఇప్పటికీ చినుకు పడలేదు/ మా ఇంటికి ఎదురుగా ఉన్న చెట్టేమో కొట్టేశారు/ కారణం అదేనా?’ ఇది 59వ జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన వినోద్‌కుమార్ శుక్లా కవితలలో ఒకటి. ఆయన కవితా శైలి, తాత్త్వికతను అర్ధం చేసుకోవాలంటే దీనికి కొనసాగింపుగా ఉండే పంక్తులు కూడా గమనించాలి. ‘ఓ ఆదివాసుల్లారా! వృక్షాలు మిమ్మల్ని వీడలేదు/ మీకు మీరై అడవినీ వీడి వెళ్లలేదు కూడా/ ఈ ఏడాది నగర వీధులలో నడచిపోతున్న గుంపులని చూశాను/ వాళ్లతో వాడిపోయిన పసివాళ్లని చూశాను/ వనాలు లేని వనవాసులు/ అదే కారణమా?’ చెట్టు మీద వర్షం మీద ప్రేమ ఉన్న కవి శుక్లా అనిపిస్తుంది. వర్తమానంలోని ఒక పెను విషాద పరిణామాన్ని తన కవితలో దర్శింపచేశారాయన.
‘ఈ జీవితంలో నేను చాలా చూశాను. ఇంకా ఎంతో విన్నాను. మరెంతో అనుభూతి చెందాను. కానీ చాలా తక్కువే రాయగలిగాను’.. శుక్లా గతంలో ఒక ముఖాముఖీలో అన్నమాట ఇది. భారతదేశంలోనే ఆ అత్యున్నత సాహిత్య పురస్కారానికి శుక్లాను ఎంపిక చేసినట్టు భారతీయ జ్ఞానపీఠ్ కమిటీ మార్చి 22న ప్రకటించింది. శుక్లా రచనా శైలిలో కనిపించే నిరాడంబరత, ఉద్విగ్నతలు గొప్పగా ఉంటాయని జ్ఞానపీఠ్ కమిటీ వ్యాఖ్యానించింది. కథకునిగా, నవలాకర్తగా, కవిగా ఆయనకు హిందీ సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ పురస్కారం అందుకోబోతున్న 12వ హిందీ రచయిత శుక్లా. చత్తీస్‌గఢ్ నుంచి జ్ఞానపీఠ్ అందుకుంటున్న మొదటి రచయిత కూడా. తాను చూసిన జీవితంలో, విన్నదానిలో రాయవలసినది ఎంతో ఉందని, తాను కన్నుమూసేలోగా అదంతా రాయడానికే ప్రయత్నిస్తానని 88 ఏళ్ల శుక్లా చెబుతున్నారు. జీవితం తాను ఊహించనంత వేగంగా మారిపోతోందని, అంత వేగంతో తాను రాయగలనా అని మాత్రం అనిపిస్తూ ఉంటుందని, అదే తనను ఒక సందిగ్ధంలోకి నెడుతున్నదని ఆయనే చెప్పుకున్నారు. ఆయన 1937లో పుట్టారు. తల్లి బెంగాలీ సాహిత్య అభిమాని. మంచి పాఠకురాలు. శుక్లా 20 ఏట ప్రముఖ హిందీ కవి గజానన్ మాధవ్ ముక్తిబోధ్ ఆయన గ్రామానికి (రాజనందన్‌గావ్) వచ్చారు. అప్పటికే తాను రాసిన కొన్ని కవితలను ఆ ప్రముఖునిగా చూపారు శుక్లా. అప్పటి నుంచి వాటిని పత్రికలకు పంపించడం ఆరంభించారు.
శుక్లా సర్రయిలిస్ట్ శైలికి ప్రసిద్ధి చెందారు. కొన్ని రచనలలో మ్యాజిక్ రియలిజం స్పర్శ కూడా ఉంటుంది.
ఐదు దశాబ్దాల శుక్లా సాహితీ ప్రస్థానంలో ఎన్నో రచనలు ఉన్నాయి. ‘లఘ్‌భగ్ జై హింద్’ ఆయన తొలి కవితా సంకలనం. అది 1971లో వెలువడింది. ‘నౌకర్ కీ కమీజ్’, ఖిలేగా తొ దేఖేగా’, ‘దీవార్ మే ఏక్ ఖిడ్కి’ ఆయనకు మంచి పేరు తెచ్చిన నవలలు. దీవార్ మే ఏక్ ఖిడ్కి (గోడలో ఒక కిటికీ నివాసం ఉంది) కథా సంకలనానికి 1999లో కేంద్ర సాహిత్యం అకాడమి పురస్కారం లభించింది. ‘పీడ్ పర్ కమ్రా’, ‘మహా విద్యాలయ’ కథా సంకలనాలు ఆయనకు ప్రత్యేక స్థానం తెచ్చి పెట్టాయి. కవిగా, ‘వో ఆద్మీ చలే గయా నయా గరమ్ కోర్ట్ పెహెన్ కర్’, ఆకాశ్ ధర్తీ కో ఖటక్త హై’, కవితా సే లంబీ కవిత’ హిందీ కవిత్వంలో విశిష్ట స్థానం కలిగి ఉన్నాయి. ఆయన బాల సాహిత్యం కూడా అందించారు.