తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో డిసెంబరు 22, 1887న పేదరికం తాండ విస్తున్న ఆ ఇంట్లో పదిమంది హడావిడిగా ఉన్నారు. లోపలినుంచి మూలుగు వినబడు తోంది. కాసేపటికి పసిపిల్లవాడు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న శబ్దం వినపడింది. అంతవరకు ముందు గదిలో కూర్చుని వచ్చిన అతిథులతో మాట్లాడుతూన్న శ్రీనివాస అయ్యంగార్ ఏడ్పు వినగానే ఒక్కసారిగా లేచి లోపలికి పరుగెత్తాడు. ‘‘మొగపిల్లవాడు పుట్టాడు. సుఖ ప్రసవమే…’’ అని ఇంకేదో అంటూ తనకు బహుమానం కావాలన్నట్లుగా చెప్పుకుపోతున్న మంత్రసాని నుంచి తియ్యని మాటలు విన్నందుకు అందరికీ స్వీట్లు పంచిపెట్టాలని ఆయన అనుకున్నాడు. కాని జేబులో చిల్లిగవ్వ కూడ లేదు. వంటింట్లో డబ్బాలో కొద్దిగా పంచదార ఉంటే అందరికి పంచాడు. అతని అదృష్టాన్ని మెచ్చు కుంటూ వచ్చిన వారంతా వెళ్లిపోయారు. జన్మించిన తిథివారనక్షత్రాలు గమనించి శుభప్రదమే అనుకున్నారు అంతా. అనంతర కాలంలో మహాగణిత శాస్త్రజ్ఞుడుగా ప్రపంచఖ్యాతి గాంచిన శ్రీనివాస రామానుజమే ఆనాడు జన్మించిన పసివాడు.
శ్రీనివాస అయ్యంగార్ కుంభకోణం పట్టణంలో బట్టలకొట్టులో చిన్న గుమాస్తా. వారసత్వంగా ఆయన్ని బాధపెడుతున్న దారిద్య్రమే ఆయన కుమారుడికి కూడా సంక్రమించింది. రామానుజం బాల్యమంతా ఆర్థికపరమైన ఇబ్బందులతోనూ, ఈతి బాధలతోనూ గడిచింది. అయినప్పటికీ ఏదో విధంగా తన ఏడవ యేట కుంభకోణంలోని టవున్ హైస్కూల్‌లో చేరాడు. ఆయనకు చిన్నప్పటి నుంచీ కూడా గణితశాస్త్రం మీద విశేషమైన ఆసక్తి ఉండేది. హైస్కూలులో చదువుకునే రోజుల్లోనే కళాశాల లైబ్రరీనుంచి కార్ వ్రాసిన ‘సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మాథమెటిక్స్’ పుస్తకం తెచ్చి, దాన్ని చదవటంలో ఆయన పూర్తిగా నిమగ్నుడై ఉండేవాడు. 16 సంవత్సరాలు వచ్చేసరికి మెట్రిక్ పరీక్ష ప్యాసయ్యాడు. ఆ పరీక్షలో గణితంలో మార్కులు బాగా వచ్చిన ఫలితంగా లభించిన ‘‘సుబ్రహ్మణ్యం స్కాలర్‌షిప్’’ సహాయంతో కుంభకోణంలోనే ప్రభుత్వ కళాశాలలో ఎఫ్.ఎ.లో చేరాడు. తరగతిలో వింటున్న సబ్జెక్టు ఏదైనప్పటికీ ఆయన మనస్సు మాత్రం గణితశాస్త్రం మీద కేంద్రీకృతమై ఉండేది. దానిమూలంగా ఇతర సబ్జెక్టులను పట్టించుకోకుండా గణితంలోనే అనేక కొత్తమార్గాలు పరిశోధిస్తూ ఉండేవాడు. దీంతో ఎఫ్.ఎ. మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యాడు. స్కాలర్‌షిప్ పోగొట్టుకున్నాడు. రామానుజం తర్వాత ఏదో తంటాలుపడి మద్రాసు (ప్రస్తుతం చెన్నయ్) పచ్చయప్పాస్ కాలేజీలో చేరారు. అయితే అనారోగ్యం కారణంగా చదువు మధ్యలోనే విరమించుకోవలసి వచ్చింది. ఆయన చదువును ఆపేసినప్పటికీ గణితంలో కృషి మాత్రం ఆపలేదు.
రామానుజంకు 1909లో వివాహం జరిగింది. ఏపాటు తప్పినా సాపాటు తప్పదుగదా! అంతేకాకుండా ‘తాదూర కంత లేదు మెడకో డోలు’ అన్న చందంగా భార్య ఇంటికివచ్చేసరికి అన్నానికి సంపాదించుకోవలసిన అవసరం వచ్చింది ఆయనకు. వారసత్వంగా వచ్చిన దరిద్రానికి తోడు తండ్రి తరహాలోనే రామానుజానికి కూడా గుమాస్తా ఉద్యోగం వచ్చింది. తెలిసినవారి సిఫారసుతో తంటాలు పడి మద్రాసు పోర్టు ట్రస్ట్‌లో ఉద్యోగానికి కుదిరాడు. నెలకు 25 రూపాయల జీతం. బాల్యంలోనే అబ్బిన గణితశస్త్ర జిజ్ఞాస ఈ పోర్టు ఉద్యోగంలో కూడా ఆయన్ను వదలిపోలేదు.
దున్నలబండిలా మెల్లగా సాగిపోతున్న రామానుజం జీవితంలో, ఆయన శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహాలు ఆయనకు గొప్ప ముప్పును తెచ్చిపెట్టాయి. వారి సలహా ప్రకారం గణితశాస్త్రంలో తాను చేసిన పరిశోధనలను పరిశోధనలను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కాలేజీలో ఆచార్యుడుగాఉన్న జి.హెచ్.హార్దికి పంపించాడు. హార్దీకి రాసిన లేఖలో రామానుజం రాశాడు.
‘‘విశ్వవిద్యాలయాలలో సంప్రదాయబద్ధంగా అనుసరిస్తున్న నిర్ణీతమైన పద్ధతిలో నేను ఉండలేను. నాకంటూ ఒక సొంత పంథాను నేను అనుసరిస్తు న్నాను. నేను విభిన్న శ్రేణులలో (ణఱఙవతీస్త్రవఅ• వతీఱవ) ప్రత్యేక పరిశోధన జరిపాను. అందులో నేను సాధించిన ఫలితాలను చూసిన స్థానికంగా ఉండే గణితశాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. అత్యున్నత శ్రేణిలో ఉన్న నా భావాలను వారు అర్థం చేసుకోలేక పోతున్నారు.’’ ఈ ఉత్తరంలోనే చివరగా తన ఫలితాలన్నింటినీ రాసి ‘‘ఈ విషయాలు నేను మీకు చెప్పగానే పిచ్చాసుపత్రే నాకు శరణ్యమని మీరు బహుశః సూచిస్తారు.’’ అన్న వాక్యం కూడా రామానుజం రాశారు. ఆ పరిశోధనలలో రామానుజం ప్రదర్శించిన ప్రతిభా వ్యుత్పత్తులకు ఆశ్చర్యపడిన హార్డీ, వెంటనే రామానుజాన్ని కేంబ్రిడ్జికి ఆహ్వానించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం ఇచ్చిన కొద్ది సహాయం ఆధారంగా, అనేక ఆచారవ్యవహారాల కట్టుబాట్లను దాటి, చిట్టచివరకు రామానుజం కేంబ్రిడ్జికి ఏప్రిల్, 1914లో చేరుకోగలిగాడు. ట్రినిటీ కళాశాల కూడా ఆయనకు ఉపకార వేతనం యిచ్చింది.
జన్మాంతర సంస్కారంవలన ఆయనలో ప్రాదుర్భవించిన ప్రతిభ విశిష్ట స్వరూపంలో కనిపించసాగింది. ఈనాటి గణిత శాస్త్ర పంథాలో, ఈనాటి క్రమంలో ఆయన పరిశోధనలు ఉండేవి కాదు. నిజానికి ఆయన ప్రతిభ ఈనాటిదైతే కదా ఈ పద్ధతిలో ఉండేందుకు! ఏనాటి ప్రతిభో అది. ప్రొఫెసర్ హార్డీ, లిటిల్‌వుడ్ ప్రభృతులు రామానుజన్‌కు ఆధునిక శాస్త్రీయ పద్ధతిలో గణితశాస్త్రం బోధిస్తూ, ఆయన పరిశోధనలను ఒక రూపంలో అనుసరిస్తూ, ఆయన సాహచర్యంలో అనేక విషయాలు తాము గూడ నేర్చుకోగలిగారనటంలో ఆశ్చర్యమేమీ లేదు.
రామానుజం ప్రతిభకు ఆశ్చర్యపడిన ప్రొఫెసర్ హార్డీ ఇట్లా అన్నారు: ‘‘అధునాతన గణితశాస్త్రాన్ని ఈయనకు నేర్పాలంటే ఏం చెయ్యాలి? ఆయన విజ్ఞానపుటవధులు ఎంత మహత్తరంగా ఉన్నాయో అంత స్వల్పంగా కూడా ఉన్నాయి. పాతవిగాని, కొత్తవిగాని, సత్యంగాని, అసత్యంగాని ఆయన పరిశోధనలన్నీ వివిధ విషయాల సమ్మిశ్రణంతో కూడిన ఉపపత్తులు కలిగి, సృజనాత్మకమైన, వినూత్న ప్రతిభతో ఉండి, దానికి ఆయనే అన్వయాన్ని సరిగా ఇవ్వలేనంత గాఢంగా ఉండేవి.’’
ఇంగ్లండులో ఉన్న రోజుల్లో రామానుజం ఒక్క గణితశాస్త్రంలోనే కాక, సాహిత్యం, వేదాంతాలలో కూడా, ప్రత్యేకంగా, విచిత్రంగా, అకస్మాత్తుగా కనిపించిన ప్రతి చిన్న విషయంపైన అభిలాష చూపిస్తూ ఉండేవారు. ఆయన ఏర్పరుచుకున్న ఆ అతి చిన్న గ్రంథాలయంలో కూర్చుని తన పుస్తకాలుంచుకునే ‘‘సర్కిల్ స్వీరర్సు’’ పరికించి అది ఒక ప్రత్యేకతతో ఉన్నట్లు భావించి దానిపై పరిశోధన చేసి, అతి చిన్న విషయంలోంచి కూడా ఒక మహత్తర గణితశాస్త్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ,1913 ది ఇండియన్ మేథమెటికల్ సొసైటీ జర్నల్‌లో ‘‘స్క్వేరింగ్ ది సర్కిల్’’ అనే వ్యాసం కూడా రాశారు.
అహోరాత్రాలు పరిశోధనలో ఉండి, ఇతర విషయాలన్నింటినీ విస్మరించిన కారణంతో ఆయనకి కొద్దికాలంలోనే (1917 వచ్చేసరికి) ఆరోగ్యం చెడి, క్షయవ్యాధి లక్షణాలు జనించాయి. కొంతకాలం, వేల్సు, ‘మాట్‌లాక్’లలోని క్షయవ్యాధి శానిటోరియంలో చికిత్స పొందిన తర్వాత ఆరోగ్యం బాగుపడుతున్న లక్షణాలు కనిపించాయి. భవిష్యత్తుకు అది ఆయనకు ఆశాజ్యోతిలా కనిపించింది. దానికి తోడు 1918లో ఎఫ్.ఆర్.ఎస్ (ఫెలో ఆఫ్ రాయిల్ సొసైటీ ఆఫ్ లండన్) హోదా లభించింది. ఆ ఘనతను పొందిన పప్రథమ భారతీయుడు ఆయనే. ఆయన పరిశోధక వ్యాసాలు అనేక పత్రికల్లో, అనేక దేశాల్లో, అనేక భాషల్లో ప్రచురితమయ్యాయి. ఇదంతా ఆయన జీవనజ్యోతికి దేదీప్యమానమైన ప్రతిభను ఇస్తుందని ఆశించినవారికి, ఆయనకు ఆ చివరి రోజులలో కలిగిన విజయాలు, ఆరిపోయే దీపం ఒక్కసారి ఘనంగా వెలిగి నశించినట్లు అనిపించింది.
దాదాపు పూర్తిగా కోలుకున్నాడనుకున్న తర్వాత 1919లో రామానుజన్ భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఎక్కడ చూసినా ఆయన ప్రతిభ వ్యాపించింది. కాని విధి దానిని చూడలేకపోయిందో ఏమో! హఠాత్తుగా ఏప్రిల్ 22, 1920వ తేదీన ఆ మేధావిని ఎత్తుకు పోయింది. ఈ విధంగా తన జీవితమే పరిశోధనగా, పరిశోధనే జీవితంగా గడిచిన ఆ జీవితం 32 ఏండ్ల స్వల్ప వ్యవధిలోనే ముగిసి పోయింది.
మరణించిన తర్వాత కూడా రామానుజన్ పరిశోధక వ్యాసాలు, ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మన్ భాషలలోని అనేక గణితశాస్త్ర పత్రికల్లో ప్రచురిత మయ్యాయి. ఆయన పరిశోధనలు తర్వాతి కాలంలో యల్.జె.మోర్టెల్, హెచ్.బి.సి.డార్లింగ్, సి.ఏ.మెక్ మోహన్ ఇత్యాది గొప్ప గణితజ్ఞుల వ్యాసాలకు ఆధారాలయ్యాయి.
1921లో ప్రచురించిన ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ’లో రామానుజం మృతిపట్ల సంతాపం తెలుపుతూ ప్రొఫెసర్ హార్డీ అనేక పేజీలు రాశారు. ప్రొఫెసర్ హార్డీ శ్రీ రామానుజం ప్రతిభను అంచనావేస్తూ ‘‘ఆయన ప్రతిభ, విభజనల సిద్ధాంతం (Theory of Partions) ఊనేంద్రియ కార్య సిద్ధాంతాల్లోనూ(Theories elliptic functions) వితత భిన్న సిద్ధాంతం (Theory of continued fractions) లోనూ మహోత్కృష్ట తను ప్రదర్శిస్తోందని’’ రాశారు.
ఆయన అతి కూలాసాగా అంకెలతో ఆటలాడు కుంటూ ఉండేవాడు. ఆయనకు అనూహ్యము, అనన్యమునైన ధారణాశక్తి ఉండేదని హార్డీ చెప్పారు. ‘‘సంఖ్యల వివిధ ప్రత్యేకతలన్నీ ఆయనకు కరతలామలకాలు. ప్రతి ఒక్క ‘సంఖ్య’ కూడా ఆయనకు అత్యంత ఆప్తమిత్రునిలా ఉండేవి’’ అని మిష్టర్ లిటిల్‌వుడ్ ప్రశంసించాడు. ఆయనకు అంకెలతో తమాషా చేయటంలోనూ, గణితంలో అనన్య ప్రతిభ ప్రదర్శించటంలోనూ ఎంతో సద్యోస్ఫూర్తి ఉండేది.
ఒకసారి రామానుజానికి శరీరంలో అస్వస్థతగా ఉండగా చూడటానికి వచ్చిన ప్రొఫెసర్ హార్డీ తను ఎక్కి వచ్చిన కారు నెంబరు 1729 అని యథా లాపంగా చెప్పాడట. అది వింటూనే రామానుజం ‘‘ఇది చాలా తమాషా సంఖ్య; దీనిని రెండు విధాలుగా, రెండు ఘనముల మొత్తంగా రాయవచ్చు, అందునా అత్యంత చిన్నదేమంటే అవి ఏ మాత్రం తడుముకోకుండా 1729= 13+123=93+103 అంటూ సమాధానం చెప్పాడుట. ఇది అతని మేధాసంపత్తిని, సద్యోస్ఫూర్తిని సూచించే మచ్చుతునక.
‘‘రామానుజానికి సరితూగే పెద్ద శాస్త్రజ్ఞులు ఉన్నారు గాని ఆయన కృషిచేసిన శాస్త్ర విభాగాలలో ఆయనతో తూగే వారు గడచిన 36 ఏళ్లలో ఎవరూ లేరు. అతని కతడే సాటి’’ అని అతనిని అభినందిస్తూ ప్రొఫెసర్ హార్డీ (1920కి ముందు) చెప్పాడు.
ఈనాడు రామానుజం జీవించి ఉన్నట్లయితే, ప్రఖ్యాత భారతీయ శాస్త్రజ్ఞుడు సి.వి.రామన్ మహోదయునకు సరితూగే స్థాయిలో విశ్వవిఖ్యాతి నార్జించి ఉండేవాడని భావించేవారనేకమంది ఉన్నారు.
శ్రీనివాస రామానుజన్
డిసెంబర్ 22, 1887-ఏప్రిల్ 26, 1920