దక్షిణాఫ్రికాలో ఎస్‌ఏ హిందూస్ అనే ధార్మిక సంస్థ శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని ఇటీవల 60 వేల హనుమాన్ చాలీసా పుస్తకాలను దేశంలో ఎనిమిది దేవాలయాల వద్ద పంచిపెట్టింది. గౌటెంగ్ ప్రావిన్సుకు చెందిన పలు క్లబ్బులకు చెందిన బైకర్ల నేతృత్వంలో ఎస్‌ఏ హిందూ సభ్యులు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్‌ఏ హిందూస్ సంస్థ షెరెనో ప్రింటర్స్, ఎలక్ట్రో ఆన్‌లైన్ మీడియా భాగస్వామ్యంతో ఆగస్టు 24, 2024న 10 లక్షల హనుమాన్ చాలీసా పుస్తకాలను పంచిపెట్టే కార్యక్రమానికి నాంది పలికింది. 2029 నాటికి 10 లక్షల హనుమాన్ చాలీసా పుస్తకాలను పంచిపెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదే విషయమై ఎస్‌ఏ హిందూస్ వ్యవస్థాప కురాలు పండిత లూసీ సిగాబన్ మాట్లాడుతూ ‘‘మా కార్యక్రమానికి భగవంతుని ఆశీస్సులు తోడైనట్టుగా మేము వెళ్లిన దేవాలయాల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు కనిపించారు. హనుమాన్ చాలీసా పుస్తకాల పంపిణీతో పాటుగా అవసరార్థుల కోసమని మేం చేపట్టిన పచారీ సామాన్ల సేకరణకు ఆయా దేవాలయాల నిర్వాహకుల నుంచి, భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. దాదాపుగా 2,000 కేజీల పచారీ సామాన్లను సేకరించాం. ఇందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సేకరించగా వచ్చిన పచారీ సామాన్లను మరికొద్ది రోజుల్లో గౌటెంగ్, కేజెడ్‌ఎన్ ప్రావిన్సుల్లో అవసరార్థులకు పంచిపెడతాం’’ అని తెలిపారు.
షెరెనో ప్రింటర్స్ యజమాని నిరాన్ సింగ్ హనుమాన్ చాలీసా పుస్తకాల పంపిణీ గురించి మాట్లాడుతూ ‘‘ఎస్‌ఏ హిందూస్ ఎంతో అంకిత భావంతో ప్రజలకు ఆధ్యాత్మిక విద్యను అందించడానికి చేపట్టిన ప్రాజెక్టులో భాగమైనందుకు మేం ఎంతగానో సంతోషిస్తున్నాం’’ అని తెలిపారు. దక్షిణాఫ్రికా బైకర్ల క్లబ్‌లో ఒకటైన థ్రోటల్ కలెక్టివ్ సహ వ్యవస్థాపకుడు మృణాల్ భగవాన్ సైతం ఎస్‌ఏ హిందూస్ చేపట్టిన కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేశారు.