ఏ‌ప్రిల్‌ 16 ఆచార్య రామరాజు శత జయంతి

జానపద సాహిత్యంపై పరిశోధన అనగానే తొలుత స్ఫురించే పేరు ఆచార్య బిరుదురాజు రామరాజు. శిష్ట సాహిత్యానికి పునాదిగా చెప్పే జానపద సాహిత్యంపై ఎందరో ప్రముఖులు, మహనీయులు కృషి చేశారు, వ్యాసాలు వెలువరించారు. నేదునూరి గంగాధరం ఈ సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురాగా,ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు, చింతా దీక్షితులు, టేకుమళ్ళ కామేశ్వరరావు తదితరులు లెక్కకు మిక్కిలి వ్యాసాల ద్వారా దాని వ్యాప్తికి పాటుపడ్డారు. హరి ఆదిశేషువు ‘జానపద గేయ వాఙ్మయ పరిచయం’  పేరిట పల్లె ప్రజల సాహిత్యాన్ని తొలిసారి పుస్తక రూపంలోకి తెచ్చారు. అయితే విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధన రంగంలో జానపద సాహిత్య పరిమళాలను వెదజల్లిన తొలి వ్యక్తి మాత్రం బిరుదురాజు రామరాజు. ఆయన ‘తెలుగు జానపద గేయ సాహిత్యము’ సిద్ధాంత వ్యాసం ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో మొదటిదే కాకుండా జానపద సాహిత్యంపై దక్షిణ భారతదేశంలోని తొలి పరిశోధన వ్యాసంగా ప్రసిద్ధి పొందింది. భావి పరిశోధకులకు కరదీపికలా నిలిచింది. తెలుగు జానపద అధ్యయనాలకు విజ్ఞాన సర్వస్వంగా అందుబాటులో ఉంది.

ఆచార్య రామరాజు ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులుగా, తెలుగు శాఖాధ్యక్షులుగా సేవలందించారు. తెలుగు సాహిత్యంలో వివిధ పక్రియల్లో విశేష కృషి చేశారు. పెద్ద సంఖ్యలో గ్రంథాలు రాశారు. తెలుగు జానపద రామాయణం, వీరగాథలు, యక్షగాన వాఙ్మయం, ఆంధ్రయోగులు (నాలుగు సంపుటాలు), సంస్కృత సాహిత్యానికి తెలుగువారి సేవ, చరిత్రకెక్కని చరితార్థులు, మరుగునపడిన మాణిక్యాలు, తెలుగువీరుడు, తెలుగు సాహిత్యోద్ధారకులు, విన్నపాలు, పల్లెపట్టు (నాటకం) తెలంగాణ పిల్లల పాటలు… వంటివి వాటిలో ఉన్నాయి. ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్న ఆయన గురు గోవింద్‌సింగ్‌ ‌చరిత్ర, జాతక కథలను హిందీ నుంచి తెలుగులోకి అనువదించారు. ఉర్దూ-తెలుగు నిఘంటువును రూపొందించారు.

జననం.. చదువు

వరంగల్‌ ‌జిల్లా దేవునూర్‌ ‌గ్రామంలో ఏప్రిల్‌ 16, 1925‌న నారాయణరాజు, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించిన రామరాజు స్వగ్రామంలోని వీధిబడిలో చేరారు. ప్రాథమిక విద్యను మండికొండలో, ఇంటర్మీడియట్‌ ‌హన్మకొండలో, బి.ఎ. హైదరాబాద్‌ ‌నిజాం కళాశాలలో చదివారు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో స్నాతకోత్తర విద్య (ఎం.ఎ.) పూర్తి చేసి, ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం పర్యవేక్షణలో (1952-55) ‘తెలుగు జానపద గేయ సాహిత్యం’ శీర్షికతో పరిశోధన చేసి పీహెచ్‌.‌డి. పట్టా పొందారు. కళాశాలలో పార్ట్ ‌టైం ఉపన్యాసకుడిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకుడిగా (1951) చేరి అంచెలంచెలుగా డీన్‌, ‌విశ్వవిద్యాలయ తెలుగుశాఖ అధ్యక్షుడిగా ఎదిగారు. వరంగల్‌ ‌కాకతీయ స్నాతకోత్తర కేంద్రంలోని తెలుగుశాఖ వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలు అందించారు.

పరిశోధనాసక్తి

చిన్నప్పుడు నాయనమ్మగారు చెప్పిన జానపద కథలు, పుట్టిన ఊరిలో పొలం పనుల సమయంలో శ్రమజీవులు పాడుకునే పాటలు రామరాజుకు జానపద సాహిత్యంపై ఆసక్తి కలిగించాయి. పాఠశాల, కళాశాల విద్యార్థిగానే జానపద గీతాలు సేకరణ మొదలుపెట్టినట్టు ఆయన చెప్పేవారు. విశ్వవిద్యాలయంలో పరిశోధనకు అనుమతి లభించగా, మొదట యక్షగానం అంశాన్ని ఎన్నుకోవలసి వచ్చింది. అదే అంశంపై ఆంధ్ర విశ్వకళాపరిషత్తు (విశాఖపట్నం)లో యస్వీ జోగారావు పరిశోధన చేస్తున్నారని తెలిసి ఆరునెలల అనంతరం ‘జానపద సాహిత్యం’ అంశాన్ని ఎంచుకున్నారు.

జనపదాల సందర్శన

సమాచార, రవాణా వ్యవస్థ అంతగా లేని కాలంలో పరిశోధన సమాచారం, అందునా… జానపద సాహిత్య సమాచార సేకరణ అంత సులభం కాదు. ఆ పరిస్థితులలో సుమారు రెండున్నరేళ్లపాటు తెలంగాణలోని అనేక పల్లెలు తిరిగారు. అప్పుడూ అనేక ఒడుదొడుకులు. చేపట్టిన కార్యం అనుకున్నంత సులువుగా సాగలేదు. జానపదులు (ప•ల్లీయులు) పాడుతున్నప్పుడు సేకరించిన దానిలోనే జవం, జీవం ఉంటుంది. అయితే కొందరు భయం వల్ల, మరికొందరు సిగ్గుతో తన ఎదుట పాడేవారు కారట. ఫొటో(లు) తీసుకునేందుకూ ఒప్పుకునేవారు కారట. ఫొటోతీస్తే శరీరం శుష్కించిపోతుందని, కంఠ మాధుర్యం చెడిపోతుందని వారి నమ్మకం. అడిగి పాడించు కోవడం కష్టంగా ఉండడంతో, వారు పనుల్లో నిమగ్నమై పాడు కుంటున్న వేళ చాటుమాటు నుంచి రాసుకోవడం, ఫొటోలు తీయడం చేసేవారు. ఒక గ్రామంలోని వారు పాడిన పాటలను మరో గ్రామం లోని వారికి పాడి వినిపించి, ఆ స్ఫూర్తితో పాడించుకునే ప్రయత్నం చేసేవారు. అందుకు వారికి పాత దుస్తులు, పైకం ఇవ్వడం, కల్లు పోయించడం, పొగాకు లాంటి తాయిలాలు ఇచ్చేవారట. అయినా ‘ససేమిరా’ అనేవారిని గ్రామాధికారులు, పోలీసులతో గట్టిగా చెప్పించి, బెదిరించి పాడించుకున్న సందర్భాలు ఉన్నాయట (సమాచార సేకరణలో వారిని అలా ఇబ్బంది పెట్టినందుకు పశ్చాత్తాపం చెందారు) జానపద గాయక భిక్షుకులు మాత్రం అడిగినంత పాడేవారట. ‘వారికి కావలసింది పిడికెడు బిచ్చం, కల్లు నీళ్లు, రాగి డబ్బులు, పాత వస్త్రములు. వీటి వలన వారి జోలెలు నిండకున్నను తమ ఎదలలోని అమృతవాక్కులతో నా పాటల జోలెను మాత్రము నింపినారీ అల్ప సంతోషులు’ అని కృతజ్ఞత పూర్వకంగా వివరించారు. బిరుదురాజు పరిశోధనతో జానపద సాహిత్య విశిష్టతతో పాటు జానపదుల అమాయకత్వం, దయనీయత వెల్లడైనట్లయింది.

జానపద సాహిత్య పరిశోధనను సాంస్కృతిక సేవగా భావించిన రామరాజు ఈ అంశంపై జాతీయ, అంతర్జాతీయ సమావేశాలలో ప్రసంగిం చారు. అనేక పరిశోధన పత్రాలు సమర్పించారు. ఆయన సేకరించిన జానపద గీతాలు అనేకం అముద్రితంగానే మిగిలిపోవడంతో జానపద పరిషత్‌ ‌సంస్థకు, తమ అపూర్వ గ్రంథ సంచయమంతా కడపలోని బ్రౌన్‌ ‌స్మారక గ్రంథాలయానికి అంద చేశారు.

 అసమర్పిత సిద్ధాంత వ్యాసం

అప్పటిలో పండిత లోకంలో జానపద సాహిత్యం పట్ల అంతగా సదభిప్రాయం ఉండేది కాదు. దాంతో రామరాజులో, తాను ఎంచుకున్న అంశంపై పరిశోధన చేస్తూనే, ఇతరత్రా ప్రతిభను నిరూపించుకోవాలన్న పట్టుదల పెరిగింది. అలా… సంస్కృత, ఆంధ్ర తాళపత్ర గ్రంథాలను పరిష్కరించారు. సంస్కృతం లోనూ స్నాతకోత్తర విద్య పూర్తి చేశారు. ప్రాచీన సంస్కృతాంధ్ర గ్రంథాల్ని పరిశీలించి, పరిష్కరించి వెలుగులోకి తేవడానికి విశేష కృషి చేశారు.‘సంస్కృత సాహిత్యానికి ఆంధ్రుల సహకారం’ అనే అంశంపై సంస్కృతంలో పీహెచ్‌డీ చేశారు. 19వ శతాబ్ది చివరి వరకు 224 మంది తెలుగువారు సంస్కృతానికి చేసిన సేవల గురించి గ్రంథస్థం చేశారు. కానీ విశ్వవిద్యాల యానికి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించలేదు. ఆ పరిశోధననే (Andhras contribution to Sanskrit Literature) గ్రంథంగా వెలువరించారు. విశ్వవిద్యాలయంలో ఆచార్య పదోన్నతికి కొందరు అడ్డంకి కావడంతో విసుగు చెంది ఆ సిద్ధాంత వ్యాసాన్ని మూలన పడవేశారని అమలాపురం కళాశాల తెలుగు విశ్రాంత ఉపన్యాసకుడు, సాహితీ వేత్త దివంగత డాక్టర్‌ ‌ద్వా.నా.శాస్త్రి (నేనెరిగిన సాహితీవేత్తలు) పేర్కొన్నారు.

బిరుదురాజు ఎన్నో పుస్తకాల పరిష్కర్త, సంపాదకులు. అసంఖ్యాకంగా వ్యాసాలు రాశారు. కృష్ణదేవరాయల సంస్కృత కావ్యం ‘జాంబవతీ పరిణయం’ రూపకాన్ని పరిష్కరించి ప్రచురించారు. శరత్‌చంద్ర ఛటర్జీ, మున్షీ ప్రేమ్‌చంద్‌ ‌వంటి అగ్ర రచయితల రచనలను తొలిసారిగా తెలుగులోకి అనువదించి సాహిత్యాభిమానులకు పరిచ•యం చేశారు. ఆ రచనల్లోని ఏ విషయమైనా సూటిగా స్పష్టంగా ఉండేది. ఎలాంటి వ్యాఖ్యానాలకు అవకాశం ఉండదు. వంద పుటలో చెప్పవలసిన బసవేశ్వర చరిత్రను పదవ వంతులో సమగ్రంగా వివరించడం, వెయ్యేళ్ల ఓరుగల్లు ప్రాభవం, సాహిత్య ప్రాధాన్యాలపై ‘ఓరుగల్లు సాహితీ సౌరభాలు’ అంటూ కేవలం ఐదు పుటల్లో నిక్షేపించడం అందుకు మచ్చుతునకలు.

 ఆయన ఎంతటి సమర్థ పరిశోధకుడో అంత ఆధ్యాత్మికవాది. కర్మ సిద్ధాంతాన్ని కాదనే వారు కాదు. ‘జీవితంలో ఏం జరిగిన అన్నీ భగవత్‌ ‌నిర్ణయాలే. ‘ఉన్నంత కాలం సాహితీ సేవచేయాలి. సేవ చేసినంత కాలం జీవించగలగాలి’ అన్నది ఆయన అభిప్రాయం. యోగుల చరిత్ర అలా ఆవిష్కృతమైనదే. విశ్వవిద్యాలయ ఆచార్యులుగా పదవీ విరమణ చేసిన మూడేళ్లకు ప్రారంభించి (1988-2008) 301 మంది ‘ఆంధ్రయోగులు’ చరిత్రను ఆరు సంపుటాలుగా వెలువరించారు. మొదటి సంపుటి వెలువడిన పదేళ్లకు మిగిలినవి వెలుగు చూశాయి. రాయడం కంటే సమాచార సేకరణ కష్టతరమైంది. సాహితీవేత్తలకు లేఖలు రాయడం ద్వారా, శిష్యప్రశిష్యుల సహకారంతో వివరాలు సమీకరించి కలను సాకారం చేసుకున్నారు. ‘భారతధాత్రి వేదభూమి. యోగుల గురించి తెలియచేయడం అంటే భారతీయ సంస్కృతిని చాటి చెప్పడమే. ఈ దేశం ఇంకా ఇలా ఉందంటే ఆ మహాత్ముల వల్లనేనని నా ప్రగాఢ విశ్వాసం. వీళ్ల వల్లనే మన దేశం తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటుంది. ఆ భావనే ఈ మహాగ్రంథ రచనకు బీజం వేసింది. నా సాహిత్య ఆధ్యాత్మిక పారమార్థిక కృషిలో అత్యంత తృప్తినిచ్చిన గ్రంథం ఇదే’ అని చెప్పేవారు. చిరస్మరణీయమైనది, స్థిరస్మరణీయమైనదీ రామరాజు గారి ‘ఆంధ్రయోగుల’ దివ్యజీవన మాలికలో ఇప్పటికి పరశ్శతంగా ఈ భారతీయాధ్యాత్మిక వ్యక్తులను, దివ్యశక్తులను మూర్తీభవింపచేశారు’ అని ఆచార్య అక్కిరాజు రమాపతిరావు తమ గురువు కృషిని శ్లాఘించారు.

బిరుదురాజు తన జీవితాన్ని తీర్చిదిద్దిన వారి పట్ల సదా వినయంగా మెలిగేవారు. ముఖ్యంగా ‘గురువు ఖండవల్లి గారిని స్మరించుకుంటేనే నా జీవితానికి సార్థకత కలుగుతుంది. నాలో ప్రతిభ అంటూ ఉందంటే అందుకు గురువే కారకుడు. చదువు పట్ల ఆసక్తి కలిగించడం, ఆసక్తి కలవారిని ఆదరించడం గురువు నుంచి అబ్బే స•ద్గుణాలు. వాటిని నా గురువు ఖండవల్లి నేర్పారు’ అని వినయంగా చెప్పేవారు. అలాగే రచయిత, పాత్రికేయ ప్రముఖుడు సురవరం ప్రతాపరెడ్డితో గల ఆత్మీయబంధం, తండ్రీతనయుల వంటి అనురాగబంధం ఆయనను ఉన్నతంగా మలచింది. ‘సురవరంవారు నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పిన అపరోక్ష గురువు. ఆయన సలహా లేకపోతే సాహిత్యపరంగా ఈ స్థాయికి చేరేవాడిని కానేమో. మహా అయితే నా సహోద్యోగులలో కొందరిలా ప్రభుత్వోద్యోగిగా ఉన్నత హోదాలో పదవీ విరమణ చేసేవాడినేమో’ అని అనేక సందర్భాలలో మననం చేసుకున్నారు. స్వరాజ్య సమరంతో పాటు నైజాం సంస్థానం విముక్తి ఉద్యమంలో పాల్గొన్న ఆయనకు అనంతర కాలం రాజకీయంగా క్రియాశీలక పాత్రపోషించే అవకాశం వచ్చింది. చట్టసభకు పోటీ చేసేలా కొందరు పెద్దలు ప్రోత్సహిం చినా, ఆయన ‘సర్వ’ శ్రేయోభిలాషి సురవరం ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. అంతే కాదు, రామరాజు కళాశాల విద్యార్థిగా ఉండగానే తండ్రి నారాయణరాజు కాలం చేయడంతో, ఇంగ్లండ్‌ ‌వెళ్లి ఐసీఎస్‌ ‌సాధించాలనే అభిలాషకు ఆటంకం కలిగింది. అప్పుడే, స్వతంత్ర హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌పంచాయతీ అధికారిగా కొలువు దొరికింది. దానినీ సురవరం వారు పడనీయలేదు. రామరాజులోని ప్రతిభ, తెలివితేటలు, పరిశోధన జిజ్ఞాసను గుర్తించిన ఆయన, ఆ దిశగా కృషి చేయాలంటూ ప్రోత్సహిం చారు. ఆయనలోని తెలుగు భాషాభిమానాన్ని, భాషపై పట్టును గమనించి, తెలుగు భాషా సంస్కృతుల అధ్యయనం, పరిశోధనకు ప్రోత్సహించారు.

రామరాజు తమ గురువు(ల) దగ్గర పొందిన ప్రేమనే తన శిష్యులకు పంచారు. శిష్యుల వల్లనే గురువులకు పేరు ప్రఖ్యాతులు వస్తాయనే వారు. శిష్యుల ప్రతిభా పాటవాలు మన్ననలు అందుకున్న ప్పుడు అది గురువుకు దక్కిన అమిత గౌరవంగా పరిగణించేవారు. పరిశోధక విద్యార్థులు సిద్ధాంత వ్యాసాలు సమర్పించిన వెంటనే అనంతర పక్రియకు ఉపక్రమించి ఆశీర్వదించే వారని ఆచార్యులుగా పదవీ విరమణ చేసిన ఆయన శిష్యులు నేటికీ స్మరించు కోవడమే ఆయన శిష్యవాత్సల్యానికి నిదర్శనం. అన్ని అర్హతలు గల తనకు పదోన్నతిలో జాప్యం లాంటి అన్యాయం ఇతరులకు పునరావృతం కాకూడదన్నది ఆయన విశాల మనసుకు కారణం కావచ్చు.

రామరాజు శషభిషలకు అతీతులు. ‘స్వీయలోపం బెరుగుట పెద్ద విద్య’ అన్న మిత్రుడు దాశరథి కృష్ణమాచార్య రచనా పలుకులను తనకు అన్వయించు కున్నారనవచ్చు. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలలో మొదటి రెండు తనలో తక్కువని నిజాయతీగా అంగీకరించేవారు. సృజనాత్మక రంగంలో రాణింపు దక్కదని భావించి లోకానికి కొత్త విషయాలు చెప్ప వచ్చన్న ఆలోచనతో పరిశోధన రంగంవైపు మళ్లినట్టు స్వయంగా ప్రకటించారు. అలా తాను ఎంచుకున్న రంగంలో(జానపద పరిశోధన) విజయం సాధించ డమే కాదు.. భావి పరిశోధకులకు మార్గదర్శిగా నిలిచారు. ఆయన ముక్కుసూటి మనిషి. మనసులోని మాటను కుండబద్దలు కొట్టడంలో ఏ మాత్రం మొహ మాటపడే వారు కాదు. ‘నబ్రూయాత్‌ ‌సత్య మప్రియం’ (సత్యమైన అప్రియమైన మాటలు పలుకరాదు)అనే ఆర్యోక్తిని పట్టించుకునేవారు కాదని ఆయనను బాగా ఎరిగిన వారు చెబుతారు. ఉద్యోగ ప్రస్థానంలో పదోన్నతులలో ఎదురైన చేదు అనుభవాల నుంచి సర్కార్‌ ‌జిల్లాలకు చెందిన కొందరు మేధావులు నిజాం ఆశ్రయం పొందడం ద్వారా పరోక్షంగా తెలంగాణ ప్రాంత హిందువులను వంచించారడనడం దాకా మొహ మాట పడలేదు. ఇది ధర్మాగ్రహమే కాని మరోటి కాదని అనంతర కాలంలో ఆయన వ్యవహార శైలి చాటింది. వాస్తవానికి నిజాం పాలనలోని ప్రజల కడగండ్ల గురించి తెలంగాణేతర ప్రాంతాల వారికి అంతగా అవగాహన ఉండేది కాదు. కనుక ఈ విషయంలో వారిని తప్పుపట్ట నవసరం లేదు’ అనేవారు.

ఉద్యమ దీప్తి

ఆంధ్రమహాసభలను పురస్కరించుకొని మహాత్మా గాంధీ వచ్చినప్పుడు వలంటీరుగా పాల్గొన్నారు. నిజాం కళాశాలలో చదివేటప్పుడు దాశరథితో పరిచయమైంది. అయనతో కలసి నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. కాళోజీ, టి.హయగ్రీవా చారి, జమలాపురం కేశవరావు, ముదిగొండ సిద్ద రాజలింగం వంటి నాటి యువనాయకులతో రజాకార వ్యతిరేక, స్టేట్‌ ‌కాంగ్రెస్‌ ఉద్యమాలలో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం ఆర్టస్ ‌కాలేజీలో అనుమతి లేకుండా కవిసమ్మేళనం నిర్వహించినందుకు అరెస్టు అయ్యారు.

తెరసం కార్యదర్శిగా…

మాడపాడి హనుమంతరావు నెలకొల్పిన ‘ఆంధ్ర సంఘం’ అధ్యక్షుడిగా నియమితులైన బిరుదురాజు తెలంగాణ రచయితల సంఘం (తెరసం) వ్యవస్థాపక కార్యదర్శిగా (విశాలాంధ్ర ఆవిర్భావంతో తెరసం ‘ఆంధ్ర రచయితల సంఘం’గా మారింది) పనిచేశారు. సి.నారాయణరెడ్డితో కలసి ‘రామనారాయణ కవులు’ పేరుతో కవిత్వం చెప్పారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌,‌విశిష్ట పురస్కారం, కేంద్ర ప్రభుత్వంనుంచి నేషనల్‌ ‌ప్రొఫెషనల్‌ ‌షిప్‌, ‌రాజాలక్ష్మి ఫౌండేషన్‌ అవార్డు, సీపీ బ్రౌన్‌ అకాడెమీ వారి తెలుగు భారతి పురస్కారం.. వంటివి. అందుకున్నారు.

‘1945లో ‘ఆంధ్రుడా.. ఓ ఆంధ్రుడా’ అనే గేయంతో ప్రారంభమైన నా సాహిత్యవ్యాసంగం ఆంధ్రయోగుల చరిత్ర, ఆంధ్రుల సంస్కృత సాహిత్య పరివస్య (సేవ), నేను-నాసాయి రచనలతో ముగిస్తే బాగుంటుందనుకుంటున్నాను. ఇది నా చివరి కోరిక. ఇది తీరాక ఇక ఏ కోరిక కోరని పరిస్థితి కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’ (2004) అన్న ‘జానపద విజ్ఞాన శిఖరం’ తన ధ్యేయం పూర్తి చేసుకున్నాకే (ఫిబ్రవరి 8, 2010) ఎనిమిదిన్నర పదుల ఏళ్ల వయసులో ఒరిగిపోయింది.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE