ప్రపంచీకరణ పుణ్యమా అంటూ క్రికెటర్ల దశ తిరిగింది. ఐసీసీ టోర్నీలతో పాటు వివిధ దేశాల లీగ్‌ల్లో ఆడుతూ ఇబ్బడిముబ్బడిగా ఆర్జిస్తున్నారు. మహిళా క్రికెటర్లు పురుషులతో సమానంగా సంపాదిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు విజయాలు, రికార్డుల కోసం ఆడే సత్తెకాలపు రోజులు పోయాయి. ప్రపంచీకరణతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోవడం క్రికెట్ క్రీడకు బాగా కలసి వచ్చింది. బహుళజాతి సంస్థల ప్రచారానికి క్రికెట్ ఓ ప్రధాన వాహకంగా మారిపోడంతో వేల కోట్ల రూపాయల వ్యాపారంగా, క్రికెటర్ల పాలిట వరంగా రూపుదిద్దుకొంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో పాటు వివిధ దేశాల క్రికెట్ సంఘాలు నిర్వహించే టీ-20 లీగ్ లు, దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌ల్లో పాల్గొంటూ పురుష, మహిళా క్రికెటర్లు రెండు చేతులా ఆర్జించే స్థాయికి చేరుకొన్నారు.
మన దేశానికి చెందిన సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కొహ్లీ సహా వివిధ దేశాలకు చెందిన ప్రముఖ క్రికెటర్లు రూ. వందల కోట్లు సంపాదించడం ద్వారా సంపన్నులుగా ఎదిగారు. ఐసీసీ ప్రవేశపెట్టిన పలు విప్లవాత్మక సంస్కరణల కారణంగా మహిళాక్రికెటర్లు సైతం దండిగా సంపాదించడానికి మార్గం సుగమ మయ్యింది. భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి క్రికెట్ బోర్డులు పురుషులతో సమానంగా తమ దేశాల మహిళా క్రికెటర్లకూ మ్యాచ్ ఫీజులు చెల్లిస్తున్నాయి. వారికి ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్‌లు నిర్వహించడం ద్వారా ఏటా కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇస్తున్నాయి. పురుషులకు దీటుగా వివిధ దేశాల ప్రముఖ మహిళా క్రికెటర్లు భారీగా సంపాదిస్తూ తమ రిటైర్మెంట్ జీవితానికి విలాస వంతమైన గట్టిపునాది వేసుకోగలుగుతున్నారు.
వివిధ మార్గాలలో సంపాదన…
ఐసీసీ నిర్వహించే వన్డే, టీ-20 ప్రపంచకప్ టోర్నీలు, ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ల ద్వారా లభించే మ్యాచ్ ఫీజుతో పాటు… బీసీసీఐ ఏటా నిర్వహించే టీ-20 ప్రీమియర్ లీగ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిర్వహించే బిగ్ బాష్ లీగ్, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహించే (హండ్రెడ్స్) లీగ్‌ల ద్వారా రూ. కోట్ల కాంట్రాక్టుమనీ ఆర్జించగలుగుతున్నారు. బహుళజాతి సంస్థల ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా కూడా కోట్ల రూపాయల విలువైన ఎండార్స్‌మెంట్లు దక్కించుకొంటున్నారు.
భారత మహిళా క్రికెటర్లు ఆడే ఒక్కో టెస్టుమ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ.7 లక్షలు, టీ-20 మ్యాచ్‌కు రూ.4 లక్షలు మ్యాచ్ ఫీజుగా అందుకోగలుగుతున్నారు. దీనికి అదనంగా మహిళా టీ-20 ప్రీమియర్ లీగ్ ద్వారా కోట్ల రూపాయలు తమ ఖాతాల్లో జమచేసుకోగలుగుతున్నారు.
మూడోస్థానంలో మన మిథాలీరాజ్…
మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధికంగా ఆర్జించిన మొదటి పదిమందిలో మన మిథాలీరాజ్ రూ. 43 కోట్లతో మూడోస్థానంలో కొనసాగుతోంది. దేశానికి రెండు దశాబ్దాల పాటు క్రికెటర్‌గా సేవలు అందించ డానికి మిథాలీ తన వ్యక్తిగత జీవితాన్నే పణంగా పెట్టి అవివాహితగానే మిగిలిపోవాల్సి వచ్చింది. మ్యాచ్ ఫీజు, బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు, ఎండార్స్ మెంట్లు, స్పాన్సర్ల ద్వారా ఇప్పటికే అంత ఆర్జించిన మిథాలీ ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా కూడా పెద్ద మొత్తంలోనే సంపాదించగలుగుతోంది. భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా ఆర్జించిన క్రికెటర్‌గా రికార్డుల్లో చేరింది.భారత ఓపెనర్ కమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధన 35 కోట్ల రూపాయలతో నాలుగు, భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 26 కోట్లతో ఐదుస్థానాలలో కొనసాగుతున్నారు.
రూ.120 కోట్లతో ఎల్సీపెర్రీ అగ్రస్థానం..
ప్రపంచ మహిళా క్రికెటర్లలో ఆస్ట్రేలియా అందాల ఆల్ రౌండర్ ఎల్సీ పెర్రీ అత్యంత భాగ్య వంతమైన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా టెస్టు, వన్డే, టీ-20 జట్లలో కీలక సభ్యురాలిగా ఉన్న ఆమెకు చేతినిండా ఎండార్స్‌మెంట్లు ఉన్నాయి. బిగ్ బాష్ లీగ్ కాంట్రాక్టు ద్వారా దండిగానే సంపాదిం చగలుగుతోంది. పెర్రీ సంపాదన 14 మిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది.
ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ రూ.75 కోట్ల ఆర్జనతో రెండోస్థానంలో నిలిచింది.సారా టేలర్ రూ. ఆరు కోట్లు, ఇంగ్లండ్ మాజీ బౌలర్ ఇషా గుహ రూ.13 కోట్లతో ఎనిమిది, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సానా మీర్ రూ.11 కోట్లతో తొమ్మిది, దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ డానే వాన్ నీకెర్క్ రూ.9 కోట్ల రూపాయలతో 10 స్థానాలలో నిలిచారు.
ఐపీఎల్‌లో స్మృతి మంధనదే పైచేయి…
ఐపీఎల్ మహిళా లీగ్‌లో అత్యధిక మొత్తం కాంట్రాక్టు అందుకొన్న ఘనతను బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సారథి, భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధన దక్కించుకొంది. కేవలం మూడువారాల లీగ్ కోసం స్మృతి సీజన్‌కు రూ.3 కోట్ల 40 లక్షల రూపాయలు చొప్పున అందుకొంటోంది. గజరాత్ జెయింట్స్ ఆల్ రౌండర్ యాష్లీగా గార్డనర్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ నాట్ స్కీవెర్ చెరో 3 కోట్ల 20 లక్షల రూపాయలతో సంయుక్త ద్వితీయస్థానంలో నిలిచారు. భారత ఆల్ రౌండర్ దీప్తి శర్మ ఉత్తర ప్రదేశ్ వారియర్స్ జట్టుకు 2 కోట్ల 60 లక్షల రూపాయల కాంట్రాక్టుతో మూడో అత్యంత ఖరీదైన ఐపీఎల్ లీగ్ ప్లేయర్‌గా రికార్డుల్లో చేరింది. భారత యువక్రికెటర్లు జెమీమా రోడ్రిగేజ్ (2 కోట్ల 60 లక్షలు), సిమ్రాన్ షేక్, పూజా వస్త్రకర్ చెరో కోటీ 90 లక్షలు అందుకొంటున్నారు. మహిళా కుబేర క్రికెటర్ ఎల్సీ పెర్రీకి కోటీ 70 లక్షల రూపాయలు, భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు 1 కోటీ 80 లక్షల రూపాయల కాంట్రాక్టులు మాత్రమే దక్కడం విశేషం. మొత్తం మీద.. క్రికెటర్లుగా తాము సైతం కోట్లరూపాయలు సంపాదించగలమని వివిధ దేశాలకు చెందిన మహిళా క్రికెటర్లూ చాటుకోగలిగారు.
కృష్ణారావు చొప్పరపు
సీనియర్ జర్నలిస్ట్