మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ప్రకృతి, పంచభూతాల సమాహారమే పర్యావరణం. స్వచ్ఛమైన వాయువు, వృక్షాలు, నిర్మలమైన నీటివనరులు, సహజ ఖనిజాలు, మృత్తికలు, లవణాలతో నిండిన సారవంతమైన భూమి కలిపి మానవ మనుగడకు అత్యంత ఉపయోగకరమైన పర్యావరణం అంటాం. మానవాళి సుఖజీవనానికి ఇది చాలా ముఖ్యం. అయితే కొన్ని శతాబ్దాలుగా మానవుడు తన స్వార్థానికి ప్రకృతి వనరులను బలి చేస్తూ, పర్యావరణాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాడు. ఫలితమే కాలుష్యం, దానితో మానవాళికి వస్తున్న ముప్పు. సుఖానికి అలవాటుపడ్డ మానవుడు ఈ నిజాన్ని గుర్తించి కూడా శాస్త్ర, సాంకేతికతల మోజులో పడి తప్పు దిద్దుకోవడానికి సరియైన ప్రయత్నం చేయట్లేదని అనిపిస్తోంది. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నానాటికీ అడుగంటుతున్న భూగర్భజలాలు, అకాల వర్షాలు, వరదలు, తరిగిపోతున్న వృక్షసంపద, అల్లాడుతున్న వన్యమృగాలు, సునామీలు, కాలుష్యంతో జీవజాలం రోగాలబారిన పడుతున్న వైనం, భూకంపాలు మొదలైన విపరీత పరిణామాలన్నీ ఈ పర్యావరణం క్షీణిస్తున్నదనడానికి నిదర్శనాలు.
ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ, వివిధ దేశాల పర్యావరణ మంత్రిత్వశాఖలు, స్వతంత్ర సామాజిక సంస్థలు, కేంద్ర, రాష్ట్రాల కాలుష్య నియంత్రణ సంస్థలు లాంటి అనేకం చేస్తున్న ప్రయత్నాలన్నీ పెరుగు తున్న ప్రపంచ జనాభా ఆధునిక జీవన పోకడలు, టెక్నాలజీ వాడకం ముందు పనికి రాకుండా పోతున్నాయి. పర్యావరణ పరిరక్షణోద్యమ మంటే టూకీగా-విచ్చలవిడి పారిశ్రామికీకరణ వల్ల పెరుగు తున్న వాయు, నీటి కాలుష్యం, నగరాల పెరుగుదల, పునరుద్ధరణీయం కాని ఇంధన వనరులను అధికంగా వాడడం, పచ్చదనం క్షీణతకు నిరసన, వీటిని నియంత్రించడానికి /అరికట్టడానికి చేసే ప్రజా ఉద్యమం. పర్యావరణం క్షీణిస్తున్నదన్న సత్యాన్ని 17వ శతాబ్దంలోనే గుర్తించారు. వారిలో స్త్రీలు ముందు న్నా•. కొన్ని దశాబ్దాల క్రితమే క్షీణిస్తున్న పర్యావరణం గురించి దేశ విదేశాల్లో మహిళలు ఆందోళన చేపట్టారు. వీరిని మహిళా పర్యావరణ కార్యకర్తలు, మహిళా పర్యావరణోద్యమకారులు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి8 2025ని పురస్కరించుకుని దేశ విదేశాల్లో ఉద్యమాలు నడిపిన, ఇంకా చేపడుతున్న మహిళామణులను గురించి గౌరవసూచకంగా చర్చించుకుందాం.
భారత్‌లో మహిళా పర్యావరణోద్యమకారులు – వారి నిబద్ధత
అమృతాదేవి: ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణోద్యమం మొదట మనదేశంలోనే మొదలైంది. రాజస్థాన్‌లోని కేజ్రాలి అనే గ్రామంలోని బిష్ణోయీ హిందువులు భారతదేశంలో మొదటి పర్యావరణ పరిరక్షణోద్యమం చేపట్టారని చరిత్ర చెప్తోంది. వీరు జోధ్‌పూర్ మహారాజా భవంతి కోసం (1720) వృక్షాలను నరికిస్తుంటే సైనికులకు అడ్డుపడి ప్రాణాలు విడిచారు. వీరిలో ప్రముఖురాలు అమృతాబాయి దేవి, ఇంకా ఆమె సహ ఉద్యమకారులు. అందుకే ఈమెను భారతదేశంలో పర్యావరణ పరిరక్షణోద్యమ మాత అని అభివర్ణిస్తారు. దీని ఫలితంగా 19వ శతాబ్దంలో పర్యావరణ హక్కుల నినాదం పుట్టిందని చెప్పవచ్చు. ఇదే 1970 ప్రాంతంలో ‘చిప్కో’ ఉద్యమంగా రూపొందింది.
బచనిదేవి : బచనిదేవి అంటే ప్రకృతి / వృక్ష ప్రేమికులైన వారు ముఖ్యంగా స్త్రీలు నేటి ఉత్తరాఖండ్‌లో కాంట్రాక్టర్‌లు చెట్లు నరుకుతూంటే చెట్లను కౌగలించుకుని అడ్డుపడడమే ‘చిప్కో’ ఉద్యమం. చండీప్రసాద్ భట్, సుందర్‌లాల్ బహుగుణ అనే పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు ఈ ఉద్యమాన్ని నడిపించారు. వీరి ఉద్దేశం హిమాలయ పర్వత ప్రాంత అడవులలోని వృక్ష సంపదను కాపాడడం. హిందీలో ‘చిప్కో’ అంటే అంటిపెట్టుకుని ఉండడం. ఈ ఉద్యమం ఫలితంగా ప్రభుత్వ దృక్పథంలో మార్పు వచ్చి అడవుల సంరక్షణకు అనుకూలంగా భారతీయ అటవీ చట్టంలో మార్పులు చేశారు.
తిమ్మక్క : కర్ణాటకకు చెందిన ఈమె భర్తతో కలిసి కొద్దిపాటి వ్యవసాయం చేసేది. పర్యావరణాన్ని పరిరక్షించాలని తానొక్కతే 385 చెట్లను జాతీయ రహదారి కిరువైపులా నాలుగు కి.మీ.ల మేర నాటింది. రాష్ట్రమంతటా 8000 చెట్లు నాటిందని సమాచారం. నాటిన చెట్లను పరిరక్షించడానికి సైతం ఆమె ఎంతో శ్రమ పడేవారు. ఈమెను భారతదేశపు ‘వృక్షమాత’గా అభివర్ణిస్తారు. ఈమె కృషికి గుర్తుగా భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. ఈమెకు ‘నేషనల్ సిటిజెన్ అవార్డు ఆఫ్ ఇండియా’ కూడా లభించింది. ఈమె అంతగా చదువుకోలేదు. అయినా పర్యావరణ పరిరక్షణపై శ్రద్ధ కనబరచింది.
సునీతా నారాయణ్: ఈమె రచయిత్రి, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి. ఈమె తన అపారమైన జ్ఞానాన్ని పర్యావరణంలో సకారాత్మకమైన మార్పు తీసుకురావడానికి వినియోగిస్తుంది. 2005లో పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఈమెకు వర్షపు నీరు వొడిసిపట్టడం, నిల్వ చేసుకోవడం ఎలా అనే అంశం మీద చేసిన కృషికీ, సామాజిక నీటివనరుల సంరక్షణ అనే అంశంపై జరిపిన కృషికీ ‘ప్రపంచ నీటి బహుమతి’ లభించింది. 2009లో రాజాలక్మి అవార్డు, 2020లో ఎడింబరో మోడల్ అవార్డు కూడా వచ్చాయి. సునీతా నారాయణ్‌ను ‘పర్యావరణ శాస్త్రమాత’ (mother of environmental science) గా కూడా పేర్కొంటారు. సునీత ప్రస్తుతం ఢిల్లీలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే స్వయంప్రతిపత్తి గల సంస్థ ముఖ్య అధికారి.
రషీదా బి, చంపాదేవి శుక్లా: ఈ మహిళామణు లిద్దరూ భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనంతరం పర్యావరణ పరిరక్షణోద్యమం చేపట్టిన వారిలో ముఖ్యులు. భోపాల్‌లోని యూనియన్ కార్బయిడ్ ఫ్యాక్టరీలో 1984లో జరిగిన మిథయిల్ ఐసో సైనేట్ గ్యాస్ విడుదలైన దుర్ఘటనలో దాదాపు 20,000 వేల మంది ప్రాణాలు కోల్పోవడం, ఇంకా దాదాపు 1,50,000 మంది వరకు గాయపడడం తెలిసిందే. వారికి పరిహారం ఇప్పించడం కోసం అంతర్జాతీయ స్థాయిలో పోరాటానికి నాంది పలికినవారు ఈ ఇద్దరు మహిళామణులేనంటారు. ఈ ఉద్యమంలో వీరి సహచర నారీమణులు తమ నగలు, ఇతర విలువైన వస్తువులు అమ్మి తమ సంఘీభావం చాటుకున్నారు. ఢిల్లీలో వీరు అప్పటి ప్రధానమంత్రికి వినతిపత్రం సమర్పించారు. వీరిద్దరూ 2002లో యూనియన్ కార్బయిడ్ ప్రధాన అధికారి వారెన్ అండర్సన్, ఇతర అధికారులను భారత్‌కు రప్పించి విచారించాలని, బాధితులు, వారి సంతానం ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలనీ, మూతపడిన యూనియన్ కార్బయిడ్ సంస్థ లోపల, బయట పూర్తిగా శుభ్రం చేయాలనీ డిమాండ్ చేస్తూ ఢిల్లీలో 19 రోజులు నిరాహార దీక్ష చేశారు. దీనికి అనుబంధంగా భోపాల్‌లో యూనియన్ కార్బయిడ్ ఫ్యాక్టరీ ముందు దాదాపు 1,500 మందితో, 10 ఇతర దేశాలనుంచి వచ్చిన ఉద్యమకారులతో నెలరోజులు ఆందోళన జరిగింది. వీరి కృషికి చంపాదేవి శుక్లాకు ‘గోల్డడ్‌మాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ విన్నర్ ఫ్రమ్ ఇండియా 2004’ అవార్డు లభించింది.
మనేకాగాంధీ: మనేకా గాంధీ భారత్‌లో ఓ పేరొందిన పర్యావరణ కార్యకర్త. ఆమె వృక్ష సంపదను పెంపొందించడానికి, వృక్షాలను నాటమని సందేశమిస్తూ ఉంటారు. అందుకే మనేకా గాంధీ ట్రీ పేరిట ఓ ఉద్యమానికి నాంది పలికారు. పర్యావరణ పక్షవాదానికి, హరిత విప్లవ నాయకత్వానికి ఓ శక్తిమంతమైన చిహ్నంగా నిలిచారు. మనేకా గాంధీ కేంద్రంలో పర్యావరణ మంత్రిగా కూడా పనిచేశారు.
సుగత కుమారి: ఈమె కేరళలో జన్మించిన పర్యావరణ పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తి గల మహిళ. అక్కడి ప్రకృతి సంరక్షణ సమితికి వ్యవస్థాపక కార్యదర్శిగా చాలకాలం పనిచేశారు.
డా.లుబ్నా సార్వాత్ : హైదరాబాద్‌కు చెందిన ఈమె ఆర్థికవేత్త, పర్యావరణవేత్త. హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు కబ్జాలకు గురికాకుండా ప్రజల తరఫున వాదిస్తుంటారు. భాగ్యనగరంలో అనాదిగా ఉన్న చెరువులు, అవి క్రమంగా కరువైపోతున్న వైనం, వాటిని పరిరక్షించుకోవడానికి ప్రజలకు సూచనలు సలహాలు ఇస్తుంటారు. భాగ్యనగర నీటి పరిరక్షణకై ఈమె చేస్తున్న కృషి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతోంది.
విదేశాల్లో కూడా మహిళలు పర్యావరణ పరిరక్ష ణోద్యమాలు చేపట్టారు. వారి వివరాలు:
కేట్ సెషన్స్: కేట్ సెషన్స్ పార్క్ అమెరికాలోని శాండియాగోకు చెందినవారు. ఆమె ఆ పట్టణంలో ఉన్నప్పుడు (1885 ప్రాంతం) చెట్లు అసలు ఉండేవి కావట. ఈమె 30 ఎకరాలలో ఉద్యానవన నర్సరీని ప్రారంభించి అద్దెకు ఇచ్చారు. ఆమె అందుకు ప్రతిఫలంగా ప్రతి ఏటా 100 చెట్లు ఆ స్థలంలో నాటాలనీ, దాంతో పాటు శాండియాగో పట్టణంలో 300 చెట్లు నాటాలని అద్దెకిచ్చిన వారిని కోరారు. అలా ఆ పట్టణంలో వృక్ష సంపద అభివృద్ధి చెంది పట్టణమంతా హరిత వనాలేర్పడ్డాయి. ఆమెకు చెందిన ఆ స్థలాన్ని ఇప్పుడు బాల్బోవా పార్క్ అంటున్నారు. ఆమెను ది మదర్ ఆఫ్ బాల్బోవా పార్క్ అనేవారు.
మార్జోరీ స్టోన్మాన్ డగ్ల్లస్: ఈమె అమెరికాలో మియామి (ఫ్లోరిడా) అనే ప్రాంతానికి మారినప్పుడు, అక్కడ ఎవెర్‌గ్లాడ్స్ అనే తడి ప్రాంతాలు ఒక రకమైన పొడవాటి గడ్డితో ఉండేవి. అక్కడివారు వాటిని ఎందుకూ పనికిరానివిగా భావించేవారు. కానీ మార్జోరీ వాటి ప్రయోజనాన్ని గ్రహించారు. వాటిని పరిరక్షించడం కోసమని ఎంతో శ్రమపడి అందర్నీ ఒప్పించారు. ఫలితంగా ఆ గడ్డి వల్ల ఫ్లోరిడాలో స్వచ్ఛమైన నీరు లభించేది. ఆమె 1947లో రాసిన ‘ది ఎవెర్‌గ్లాడ్స్-రివర్ అఫ్ గ్రాస్’ పుస్తకంలో ప్రపంచంలో మరెక్కడా ఎవెర్‌గ్లాడ్స్ లేవని పేర్కొన్నారు. ఆమె ఉద్యమించకపోతే ఎవెర్‌గ్లాడ్స్ గడ్డి అంతరించిపోయి ఉండేది. బహుశా ఫ్లోరిడాకు శుభ్రమైన నీరు సహజంగా దొరికేది కాదు.
మార్గరెట్ థామస్ మ్యూరీ : ఈమె తన భర్తతో కలిసి సుమారు 40 ఏళ్లు అలస్కాలో, వాయో మింగ్‌లో అడవిప్రాంతాలను అధ్యయనం చేసిన ప్రకృతి ప్రేమికురాలు. 1956లో ఈమె తన భర్త సహకారంతో అలస్కాలో అంతరించి పోతున్న ప్రాకృతిక వనాలను పరిరక్షించే ఉద్యమం మొదలు పెట్టారు. అమెరికా సుప్రీం కోర్ట్ జడ్జి సహాయంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్ హోవర్‌ను ఒప్పించి 8 మిలియన్ ఎకరాల భూమిని అడవులు పెంచడానికి కేటాయించేటట్లు చేసారు. అవి ఈనాడు 100 మిలియన్ ఎకరాలుగా వృద్ధి చెందాయి. ఈ కృషికి సియర్రా క్లబ్, అరణ్యాల సొసైటీ ఈమెను ‘గ్రాండ్ మదర్ అఫ్ కన్సర్వేషన్ మూమెంట్’ అని ప్రశంసించారు.
రాచెల్ కార్సన్ : రాచెల్ కార్సన్ సముద్ర జీవశాస్త్ర నిపుణురాలు. ఈమె పంటలపై రసాయన కీటకనాశినులను విచక్షణారహితంగా వాడడాన్ని వ్యతిరేకించారు. దీన్ని నిరోధించడానికి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈమె 1962లో ‘సైలెంట్ స్ప్రింగ్’ అనే పుస్తకం రాశారు. దీనికి రసాయన పరిశ్రమ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కార్సన్ మరణానంతరం సైతం ఆమె రాసిన పుస్తక ప్రభావంతో సమాజంలో అన్ని వర్గాల వారూ పర్యావరణ కాలుష్యాన్ని వ్యతిరేకించసాగారు. ఫలితంగా సంయుక్త రాష్ట్రాల పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ – యూఎస్‌యీపీఏ ఏర్పడింది. డీడీటీ అనే రసాయనం వాడకం నిలిచిపోయింది.
వాంగారి మాతాయి: ఈమె కెన్యా మహిళ. అమెరికాలో చదువుకుని 1960 ప్రాంతంలో కెన్యాకు తిరిగి వచ్చారు. స్వదేశంలో జరుగుతున్న పర్యావణ విధ్వంసాన్ని ఆపడానికీ, మహిళల హక్కుల కోసం హరితహార ఉద్యమాన్ని మొదలు పెట్టారు. ఆమె చెట్లు లేని ప్రదేశాల్లో మొక్కలు నాటే అంశంపై 30,000 మంది మహిళలకు శిక్షణనిచ్చారు. వారితో 5 కోట్ల 10 లక్షల మొక్కలను నాటించారు. ఆ విధంగా ఆమె వారికి జీవనోపాధి చూపారు. ఆమె పర్యావరణ పరిరక్షణకు, మహిళా సాధికారతకు చేసిన కృషికి గుర్తింపుగా 2004 నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. నోబెల్ పురస్కారాన్ని అందుకున్న మొదటి ఆఫ్రికన్ మహిళగా వాంగారి మాతాయి నిలిచారు.
ఇవి మహిళల సాధించిన విజయాల్లో కొన్ని మాత్రమే. ఇలా ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టి, ఎన్నో వ్యతిరేకతలను అధిగ మిస్తూ కృషి చేసిన, ఇప్పటికీ చేస్తున్న మహిళామణు లందర్నీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిద్దాం.
మహావాది రామకృష్ణ