రెండు దశాబ్దాలుగా భారతదేశంలో మహిళల మాటకు విలువ కనిపిస్తున్నదని బీజేపీ నాయకురాలు, సామాజిక కార్యకర్త నిదా ఖాన్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ ఇరవై ఏళ్లలో దేశంలో మహిళల పరిస్థితి కొంతవరకు మెరుగు పడిందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిదాఖాన్ తలాక్ వ్యతిరేకోద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఇవాళ దేశంలో మహిళా శక్తి ఎంతో బలోపేతమైందని, వారు తమ గురించి తాము చెప్పుకోగలుగు తున్నారని, ఇలా చెప్పుకోవడం గతంలో సాధ్యమయ్యేది కాదని అన్నారు. ముస్లిం సమాజంలో ఉన్న తలాక్ ఆచారాన్ని నివారించడానికి చట్టం తేవడం మహిళా సాధికారత దిశగా పడిన అడుగు అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఆ పరిణామమే మహిళలు తమ హక్కులగురించి తామే మాట్లాడుకునే వాతావరణం కల్పించిందని అన్నారు.
అధికార యంత్రాంగం కూడా వీరి గురించి నివేదికలు ఇచ్చేది కాదని, ఇప్పుడు వాతావరణం మొత్తం మారిందని మహిళల మాట వినపడుతున్నదని నిదా చెప్పారు. మహిళల కోసం చాలా చేస్తున్నారని కూడా తెలియచేశారు. ప్రభుత్వం మారిన తరువాతే ఇది సాధ్యమైందని, గతంలో చాలామంది మహిళలు పెదవి విప్పలేదంటే అందుకు కారణం, అధికార యంత్రాంగం, పోలీసు శాఖ నుంచి వారికి ఎలాంటి మద్దతు లభించేది కాదని అన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన సందేశం స్ఫూర్తిదాయకంగా ఉంది. ‘నా కూతుళ్లకు, నా సోదరీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు. దేశానికీ, సమాజానికీ మహిళలు చేసిన సేవను గుర్తించి సత్కరించడానికి, మహిళా శక్తి గొప్పతనాన్ని మన్నించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మంచి సందర్భమని ముర్ము అన్నారు.
దేశానికీ, కుటుంబానికీ, సమాజానికి పునాది వంటివారు మహిళలేనని ద్రౌపది ముర్ము చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా మహిళలూ ఆయా రంగాలలో తమ ఉనికిని చాటుకుంటున్నారని శ్లాఘించారు. అలాగే, అన్ని అవకాశాలు సమానంగా అందిపుచ్చుకుంటూ, భయం లేకుండా మహిళ జీవించే ఒక సమాజాన్ని నిర్మించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.