తెలుగునాట ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇతర విభాగాల్లోని కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి చేసే ఆందోళనకు వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలు నాయకత్వం వహిస్తాయి. తాము కార్మిక పక్షపాతులమని వామపక్షాల నాయకులు చెప్పుకుంటారు. కానీ అందులో ఏ మాత్రం వాస్తవం లేదని కేరళలో ఆశావర్కర్లు 23 రోజులుగా (ఈనెల 4వ తేదీకి) చేస్తున్న ధర్ణాను బట్టి అర్థమవుతుంది. వేతనం పెంచాలని,పదవీ విరమణ ప్రయోజనం కల్పించాలని, వివిధ యాప్‌లతో పని చేయాలి కాబట్టి మొబైల్ ఫోన్లను ఇవ్వాలన్న తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలో ఆశ వర్కర్ల డిమాండ్లనే కేరళలోనూ అడుగుతున్నారు. కేరళ ప్రభుత్వం తన వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వం మీదకు నెట్టేయాలని చూస్తోంది.
ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తుంటే, కేరళలో రూ.7 వేలే చెల్లిస్తున్నారు(కేందప్రభుత్వం నుంచి రూ.2వేలు ప్రోత్సాహకం చెల్లిస్తున్నారు). వాటిలోనూ రెండు, మూడు నెలల వేతన బకాయిలున్నాయి.. టీకాలువంటి ఇతర సేవలకు అదనంగా చెల్లిస్తారు. ఆశ వర్కర్లకు అప్పగించిన అదనపు పనులు చేస్తే అదనంగా ప్రోత్సాహకం అందుతుంది. ఒకవేళ అదనపు పనులు చేయలేకపోతే జీతంలో కోత విధిస్తారు. దీంతో నెలకు రూ.5 వేలే అందుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కేరళలో ఆశ వర్కర్ల సేవలు 2008లో ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 26,478 మంది ఆశా వర్కర్లు ఉన్నారు
వ్యాధులపై సర్వేల కోసం ఆశ వర్కర్లు తమ ఫోన్లలో సంబంధిత యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రతి ఇంటి నుంచి 60పైగా అంశాలను సేకరించాలి. ఆ వివరాల నమోదు అనంతరం లబ్ధిదారు మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీని ఆశవర్కర్ తప్పనిసరిగా ఆ యాప్‌లో నమోదు చేయాలి. ఓటీపీ మోసాలు పెరిగిపోవడంతో, అది చెప్పేందుకు ప్రజలు నిరాకరిస్తున్నారు. దీంతో ఓటీపీ నంబరు నమోదును తొలగించాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. యాప్‌లు నమోదు చేయడానికి ప్రభుత్వమే ఫోన్ ఇవ్వాలన్న తెలుగు రాష్ట్రాల కార్మిక సంఘాల నేతల డిమాండ్‌నే అక్కడ కూడా ఆశవర్కర్లు గుర్తుచేస్తున్నారు.. స్టేట్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభించిన శ్కెలి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ప్రభుత్వమే స్మార్ట్ ఫోన్లు, పోస్ట్ పెయిడ్ కనెక్షన్‌తో ఇవ్వాలని కేరళ ఆశ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఆశ,అంగన్‌వాడీ కార్యకర్తలు దశలవారీగా ఆందోళన చేస్తున్నా పినరయి విజయన్ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 3న పెద్ద సంఖ్యలో శాసన సభకు చేరుకున్నారు. సచివాలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో గల అసెంబ్లీ ప్రవేశద్వారం వరకూ ప్రదర్శన నిర్వహించారు. ప్రవేశ ద్వారానికి దూరంగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఆశ వర్కర్లు అక్కడ బైఠాయించారు.
గత నవంబర్ నుండి మూడు నెలలకు సంబం ధించి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలను, బకాయిలను చెల్లించలేదు. వారు ఆందోళన చేస్తూ రోడ్డెక్కిన తర్వాత, వారం రోజుల క్రితమే గౌరవ వేతనాలు, ప్రోత్సాహకాలు సహా బకాయిలన్నీ క్లియర్ అయ్యాయి. నెలవారీ గౌరవ వేతనాన్ని రూ.21వేలకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5లక్షలు అందించాలని కేరళ ఆశా హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. కాగా, ఆందోళన చేస్తున్న వారిపై పోలీసు ఒత్తిళ్లు ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ధర్నాలో పాల్గొన్న వారి వివరాలను సీఐటీయూ నాయకులు సేకరిస్తున్నారని జాతీయ మీడియా పేర్కొంది.
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పిఎస్‌సి)చైర్మన్, సభ్యుల వేతనాలను ప్రభుత్వం ఇటీవల భారీగా పెంచింది. చైర్మన్ జీతం రూ.2.26 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు, సభ్యుల వేతనాలు రూ.2.23 లక్షల నుంచి రూ.3.25 లక్షలకు పెంచేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇదే విషయాన్ని ఆశ వర్కర్లు ప్రస్తావిస్తున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులకు లక్షల్లో జీతాలు పెంచి తమ వేతన బకాయిలు చెల్లించకపోవడాన్ని తప్పుబడుతున్నారు.
ప్రతిపక్షాల మద్దతు
ఆశ వర్కర్ల డిమాండ్లు సహేతుకమైనవేనని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం ఆశ వర్కర్లపై అణచివేత చర్యలకు పాల్పడుతోందని కేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం లిజు ఆరోపించారు. మూడు నెలలుగా గౌరవ వేతనాలు చెల్లించడం లేదని ఆశా వర్కర్లు సచివాలయం ఎదుట ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోకుండా పీఎస్సీ చైర్మన్ జీతం ఎందుకు పెంచారని ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ ప్రశ్నించారు. కేరళ ఆర్టీసీ ఉద్యోగులకు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలకు జీతాలు, పింఛన్లు సకాలంలో చెల్లించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర సచివాలయం వద్ద ధర్నా చేస్తున్న ఆశ వర్కర్లకు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రమేష్ చెన్నితాల సంఘీభావం ప్రకటించారు. ఆశ వర్కర్ల డిమాండ్లు సరైనవేనని సీనియర్ సిపిఐ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి సి.దివాకరన్ అన్నారు.
సీఎం తలచుకుంటే ఆశ వర్కర్ల డిమాండ్లను ఐదు నిమిషాల్లో నెరవేర్చవచ్చునని సీపీఐ నాయకుడు దివాకరన పేర్కొన్నారు. ఆశ వర్కర్ల ఆందోళన గురించి అసెంబ్లీలో కొంగడ్ ఎమ్మెల్యే కె. శాంతకుమారి ప్రశ్నించగా, 90 శాతం మంది ఆశా కార్యకర్తలు నెలకు రూ. 10 వేల నుండి రూ. 13 వేల వరకు సంపాదిస్తున్నారని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బకాయిలు చెల్లిం చడం లేదని ఆరోపించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే 90% పైగా బకాయిలు చెల్లించామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు చెప్పిందని బిజెపి నాయకుడు వి.మురళీధరన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. వారి డిమాండ్లను ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకు వెళతామని కేంద్ర మంత్రి సురేష్ గోపి తెలిపారు.
హేమచందర్ కొలిపాక
సీనియర్ జర్నలిస్ట్,