సంపాదకీయం
శాలివాహన 1946 శ్రీ క్రోధి ఫాల్గుణ బహుళ దశమి – 24 మార్చి 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
కాలచక్రం అతివేగంగా పరిభ్రమిస్తోంది. మరో ఏడాది ‘క్రోధి’ అనంత కాలవాహినిలో బిందువై పోయింది. ఇది దాదాపు అన్ని సంవత్సరాలు మాదిరిగానే మోదఖేదాల సమ్మిశ్రితం. స్థాయిలోనే వ్యత్యాసం. ఆరు పదుల తెలుగు సంవత్సరాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక అర్థం ఉంది. సంవత్సరాలకు నామకరణం చేయడం వెనుక మన పెద్దల అద్భుత వివేచన వ్యక్తమవుతుంది. వాటికి అలా పేర్లు పెడుతూనే, వాటిలో ఒక నిగూఢ సందేశాన్ని ఇమడ్చడం వారి దార్శనికతకు నిదర్శనం. వారి ఆలోచనలను ‘చాదస్తం’గా భావించేవారు కూడా, ఆయా సంవత్సరాలలో చోటుచేసుకున్న పరిణామాలను స్థూలంగా పరిశీలిస్తే విస్తుపోక తప్పదు. ఉదాహరణకు, స్థాలీపులాక న్యాయంగా.. గడచిన అర్ధదశాబ్ది పరిణామాలనే విశ్లేషించుకుంటే… వికారి నామ సంవత్సర (2019-20) చరమాం కంలో కరోనా మహమ్మారి లోకాన్ని బెంబేలెత్తించింది. సమస్త భూమండలాన్ని ఒక కుదుపు కుదిపింది. జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. లెక్కకు మిక్కిలి దాటిపోయారు. శార్వరి (2020-21), ప్లవ(2021-22) వత్సరాలు ఆ అలజడితోనే కరిగిపోయాయి. శార్వరి అంటే అంధకారం. పేరుకు తగినట్లే అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. బతుకులను అంధకారబంధురం చేసింది. ‘ప్లవ’ను ప్రతిభ, జ్ఞానానికి సంకేతంగా భావిస్తారు. ‘ప్లవ’ అంటే..దాటడం అని భావం. ప్రతికూల పరిస్థితులను అధిగమించి శుభాలు తెస్తుందని అర్థం. అలాగే ప్లవ జన జీవితాలను చిగురింపచేసి, శుభకృత్ (2022-23)కు స్వాగతం పలుకుతూ వీడ్కోలు తీసుకొంది. శోభకృత్ (2023-24)లో ‘సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి’ అన్న పంచాంగ కర్తల వాక్కు చాలా వరకు నిజమైంది. అయోధ్య దివ్య భవ్య మందిర ఆవిష్కరణే అందుకు ప్రథమ తార్కాణం. ఆధునిక భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన, ఎన్నెన్నో అవాంతరాలు, ఆటంకాలు, న్యాయపరంగా సమస్యలను అధిగమించి, దాదాపు అయిదు శతాబ్దాల పైచిలుకు కల సాకారమైంది. సాకేత సార్వభౌముడు అయోధ్యలో బాల రాముడిగా కొలువు దీరాడు.
క్రోధి (2024-25) నామ సంవత్సరంలో కోప స్వభావం పెరుగుతుందని అంటారు. అది ధర్మాగ్రహం కావచ్చు…అటు ప్రకృతి పరంగానూ కావచ్చు. ఇది రెండు విధాలుగా రుజువైందని ఆయా సంఘటనలు సూచిస్తున్నాయి. తీపి గురుతులతో పాటు చేదు అనుభవాలను వదలి వెళ్లింది. ఆధ్యాత్మికపరంగా చూస్తే, జనవరి 5, 2025 చరిత్రాత్మక దినం. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద జరిగిన ‘హైందవ శంఖారావం’లో లక్షలాది హిందూ బంధువుల, సుమారు 150 మంది సాధుసంతుల గళాలు ‘మన దీక్ష-దేవాలయ రక్ష’ అని గర్జించాయి. ‘మా ఆలయాలు మాకు అప్పగించండి’ అంటూ జరిగిన తొలి శంఖారావం తొమ్మిది అంశాల ప్రకటన (విజయవాడ డిక్లరేషన్)ను ఏకగ్రీవంగా,నిర్ద్వంద్వంగా ఆమోదించింది. ఈ ఏడాదిలో రాజకీయంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరించారు. మరోవంక, ప్రకృతి ప్రకోపించింది. తుఫాను,వరదలు జన జీవితాలను అతులాకుతలం చేశాయి. తెలుగు రాష్ట్రాల పరంగా చూస్తే.. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (ఎస్‌ఎల్‌బీసీ) సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఇక వర్తమాన ‘విశ్వావసు’ (2025-26)లో సంపద సమృద్ధిగా లభిస్తుందని శాస్త్రకారుల వచనం. ‘ఇంటాబయటా కొన్ని శక్తులు అశాంతి సృష్టించే అవకాశాలు ఉన్నా, పాలకులు సమర్థంగా బదులిస్తారు. దేశ ఆర్థికరంగం బలం పుంజుకుని ప్రగతి పథాన సాగుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణలతో ఇతర దేశాలకు మార్గదర్శకంగా ఉంటుంది. నూతన ఆయుధ సంపత్తిని సమకూర్చుకొని, సరిహద్దుల్లో ఉద్రిక్తలకు దీటైన సమాధానం ఇస్తుంది’ అనే నూతన వత్సర పంచాంగ ఫలాలు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సంకల్పానికి అద్దం పడుతున్నాయి. భారత్ ప్రపంచ ఐదు ఆర్థికశక్తులలో ఒకటిగా ఎదుగుతుందని, అన్ని రంగాలలో దిగుమతుల నుంచి ఎగుమతుల దిశగా సాగుతుందన్న మోదీ ధీమాకు,కార్యదీక్ష పటిమకు ఈ ఫలాలు సంకేతాలుగా నిలుస్తాయని విశ్వసిద్దాం.
ఉగాది పర్వం పూజ్య డాక్టర్‌జీ (136) జయంతి కావడంతో పాటు వారి అమృత హస్తాలతో ఆవిర్భవించి, సహస్రపత్ర దళరీతిన విస్తరించిన రాష్ట్రీయ స్వయంసేవక సంఫ్‌ుకు శతవార్షిక సంరంభం వత్సరం కూడా. హిందూ సమాజ ప్రభ అప్రహతిహతంగా తేజరిల్లేలా పునరంకితం అవుతున్న శుభతరుణం ఇది. వందల ఏళ్ల క్రితం శంకరభగవత్పాదులు నియమించిన ‘ధర్మ సంరక్షకుని’ వంశంలోనే డాక్టర్‌జీ జన్మించడం కాకతాళీయం కాదు.. ఆయన కారణజన్ములని హిందూ బంధువుల అచంచల విశ్వాసం. భారత్‌ను బానిసదేశంగా మార్చిన ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి, వర్తమాన భారత్ సర్వాంగీణ వికాసానికి డాక్టర్‌జీ పాదుకొల్పారు. ‘ఒక వ్యక్తి మరణించిన తరువాత ఆయన సిద్ధాంతాలు సజీవంగా ఉండడం కష్టం. అలాంటి మహాపురుషులు అరుదుగా కనిపిస్తారు. ఆ కోవకు చెందిన వారు డాక్టర్ హెడ్గేవార్ జీ’ అని భారతీయ మజ్దూర్ సంఫ్‌ు వ్యవస్థాపకులు దత్తోపంత్ ఠేంగ్డేజీ రాజ్యసభ సభ్యుడుగా (1966-72), ఒక వామపక్ష నేత వ్యాఖ్యకు స్పందనగా చేసిన ప్రకటన అక్షరసత్యం అనడంలో సందేహంలేదు. ‘సత్పురుషులు లోకంలో వసంత రుతువులా శోభిస్తారు’ అన్న శంకరభగవత్పా దుల అభిభాషణ నిత్యసత్యం కావాలని అభిలషిద్దాం.
విశ్వావసూ..! విజయోస్తు.