భారతదేశంలో నాణేల అధ్యయనం, పరిశోధన రెండు వందల సంవత్సరాలుగా సాగుతోంది. పురాతన భారతదేశ చరిత్రలోని కొన్ని అగాథాలను భర్తీ చేయడానికి నాణేలు చేసిన సేవ అమోఘమైనది. పురాతన భారతదేశ చరిత్ర నిర్మాణంలోనే నాణేలది పెద్ద స్థానం. అందుకే నాణేల అధ్యయనం మీద వచ్చిన సమాచారాన్ని (ఏ రూపంలో ఉన్నా) ఒకచోట చేర్చడం సాధారణంగా జరిగేదే. ఎందుకంటే ప్రతి పాత నాణెం చరిత్రలో కొత్త కోణం వెల్లడించగలదు. గతంలో కూడా చాలా సంస్థలు ఆ పని చేశాయి. నాణేల వివరాలతో ప్రచురించిన పుస్తకాలు, వెలువరించిన పత్రాలు, ప్రత్యేక సంచికల జాబితాలను ఒక క్రమంలో అందించి పరిశోధకులకు ఇతోధికంగా సాయం అందించే విధానం పాతదే.
Bibliography of Medieval and
modern indian
coins 1981-2020
రచన: దేమె రాజారెడ్డి
బీపీఆర్ పబ్లిషింగ్ కార్పోరేషన్, ఢిల్లీ
పే.267, వెల: రూ. 1500/-
చెదురుమదురుగా ఉండే నాణేల సమాచారాన్ని ఒక చోటికి చేర్చే పద్ధతి 1904లో నుంచి ఉన్నది. ఇలా వెలువడిన పుస్తకాల జాబితాను సిద్ధం చేసే పని 1980 సంవత్సరం వరకు జరిగింది. ఆ తరువాత వెలువడిన పుస్తకాల జాబితాయే ‘బిబ్లియోగ్రఫీ ఆఫ్ మిడివల్ అండ్ మోడరన్ ఇండియన్ కాయిన్స్-1981-2020’. ప్రముఖ నాణేల శాస్త్రవేత్త, న్యూరోసర్జన్ డాక్టర్ దేమె రాజారెడ్డి ఈ పుస్తకం వెలువరించారు. 1981 నుంచి 2020 మధ్య నాణేల మీద వెలువడిన పుస్తకాల, పత్రాల, ప్రత్యేక సంచికల సమాచారం అంతా ఇందులో పొందు పరిచారు. ఇందులో మధ్య, ఆధునిక భారతదేశంలో వెలువడిన నాణేల వివరాలు తెలిపే పుస్తకాల సమాచారం ఉంది. చిన్నా పెద్దా మొత్తం 16 అధ్యాయాలు ఉన్నాయి. శాసనాలు, సాహిత్యంలో నాణేలు పేర్లు (అధ్యాయం 3), అస్సాం, చత్తీస్‌గఢ్, ఒడిసా, మరాఠా, సిఖ్‌ల నాణేల వివరాలు (అధ్యాయం 5), ముస్లింలు విడుదల చేసిన నాణేలు (అధ్యాయం 6), విజయనగర, హోయసాల, కదంబులు, నాయక రాజులు, గజపతులు వంటివారు విడదుల చేసిన నాణేలు (అధ్యాయం 7) విదేశీయుల నాణేలు (అధ్యాయం 8), స్వదేశీ సంస్థానాల నాణేలు (అధ్యాయం9), భారత రిపబ్లిక్ నాణేల (అధ్యాయం 14) వివరాలు ఇచ్చే పుస్తకాలు కూడా ఉన్నాయి.
నాణేల అధ్యయనంలో చిత్రవిచిత్రమైన విషయాలు వెలుగు చూస్తూ ఉంటాయి. కొందరు పాలకులు ముద్రించిన నాణేలు గుట్టలు గుట్టలుగా బయటపడతాయి. ఒక వంశవారివిగా చెప్పే నాణేలు ఒకటి రెండు బయటపడిన వైనాలు కూడా ఉన్నాయి. హిందువుల మెప్పు కోసం హిందూ దేవతల ప్రతిమలతో నాణేలు ముద్రించిన ముస్లిం పాలకులు ఉన్నారు. శైవాన్ని పోషించిన పాలకులు విష్ణువు అవతారంతో ఉన్న నాణేలు, వైష్ణవ అభిమానులు శివారాధనతో ఉండే ప్రతిమలతో నాణేలు ముద్రించారు. ఏ విధంగా చూసినా నాణేల అధ్యయనం ఒక ప్రత్యేక అంశం. ఆ ముచ్చట్లు ఏఏ కాలాలలో ఉన్నాయో ఈ పుస్తకం కొద్దిగా అయినా వివరిస్తుంది. నాణేల అధ్యయనానికి ఇదొక కిటికీ.
నాణేల సేకరణ అభిరుచి కలిగిన వారికే కాదు, చరిత్రకారులకు కూడా ఈ పుస్తకం విశేషమైన సమాచారం ఇస్తుంది.