మనము సంవత్సరాది పండుగను ఉగాది యని కూడ బిల్చుచుందుము. ఈ ఉగాది శబ్దము సంస్కృతయుగాది శబ్దమునకు వికృతరూపంగా గానవచ్చుచున్నది. భవిష్యపురాణోత్తర భాగమున కృతయుగము వైశాఖ తృతీయ నాడును, త్రేతాయుగము కార్తిక నవమినాడును, ద్వాపర యుగము శ్రావణ త్రయోదశినాడును, కలియుగము మాఘపౌర్ణమినాడును మొదలిడెనని చెప్పబడి యున్నదట! దీనినిబట్టి కలియుగ వాసులమగు మనకు మాఘ పౌర్ణమి యుగాది కావలయును. కాని ఆచారము దానికి విరుద్ధముగానున్నది. మనము ప్రతి సంవత్సరమును చైత్రశుద్ధ ప్రతిపత్తునాడీ పండుగను జరుపుకొనుచున్నాము. దీనికి గొన్ని పూర్వగ్రంథములలో ఆధారము కనబడుచున్నది.
హేమాద్రి పండితుడు ‘‘చైత్రేమాసి భద్భ్రహ్మ ససర్జ ప్రదమే హని’’ అని వ్రాసియుండెను. అనగా బ్రహ్మదేవుడు ప్రథమ దినమున జగత్తు సృష్టించెనని యర్థము. ఇంక చైత్రమాసమున ప్రథమ దినమేది యను విషయమున గూడ సందేహము కలుగవచ్చును ఇతరుల కెట్లున్నను, దాక్షిణాత్యులకు పాడ్యమియే ప్రారంభమని ధర్మసింధుకారుడు చెప్పుతున్నాడు – ‘‘అథ శుక్ల ప్రతిపదాది హరిత ఏవమాసః ప్రాయేణ దాక్షిణాత్యై కాక్షియతే’’ అని యాతని వాక్యము. ఇందలి ‘ప్రాయేణ’ అను శబ్దముచే దీనికి విరుద్ధమనే ఆచారము కూడ నుండె యను సందేహము కలుగుచున్నది. కాని ఆంధ్ర కర్ణాటకాదులు చైత్రశుద్ధ ప్రతిపత్తునాడే ఈ పండుగను గావించుచున్నారు.
భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణి లంకానగరమున ‘భాను డానా డుదయించుటే జైత్రమాసారంభ దినమే…’ఉగాదికముల ఆరంభమనియు నుడివియుండెను. యజుర్వేదం గూడ వసంతముతో సంవత్సరారంభమనియు, మధు మాధవము అనునది క్రమముగా రుతు మాసముల కాలములనియు చెప్పినదట. రుతుమాసములనే మనము వసంత చైత్రములని వ్యవహరించుచున్నాము. దాక్షిణాత్యులకే కాక ఈ చైత్ర శుద్ధ ప్రతిపత్తు పార్సీలకు గూడ సంవత్సరముగా ఉండేవని ఔరంగజేబు తన కుమారునకు వ్రాసిన లేఖను బట్టి తెలియుచున్నది. ఆతడా ఉత్తరములో సంవత్సరాదిని గూర్చి ఈ దినమగ్నిని బూజించు పారశీకుని పండుగ. ఇది విక్రమాదిత్యుడను రాజు రాజ్యాభిషిక్తుడైన దినము. హిందూ దేశమున ఇది సంవత్సరాది పండుగగా లిఖింపబడుచున్న’దని రాశాడు. చాల పురాతన కాలమున ఆర్యులును, పారశీకులును గలసి ఉన్నప్పడు ఈ పండుగ చేసుకొనేవారని,ఒకప్పుడు హిందూ దేశమందంతట నీ పండుగ చైత్ర మాస ప్రథమ దినమునాడే పాటించేవారని దీనినిబట్టి తెలుస్తున్నది.
పార్శీ వారి ఇప్పటికిని సంవత్సరాది పండుగను నిర్వహిస్తారు. దానిని వారు ‘నౌరోజ్’ (కొత్త దినం) అని పిలుస్తారట. ఇది సాధారణంగా మార్చి నెలలో మనకు ఉగాది అప్పుడే వస్తుందట. హిందూ దేశంలో మాత్రం మాసభేదమునుబట్టి ఈ పండుగను రెండు భిన్న కాలములలోనూ పాటిస్తున్నారు. చాంద్రమానమును అనుసరించే దాక్షిణాత్యులు కొందరు దానిని చైత్రమాస ప్రథమ దినమున జరుపుకొనుచుండగా, ఔత్తరాహులు సౌరమానమును అనుసరించి మేష సంక్రాంతి నాడు (అనగా సూర్యుడు మేషరాశిని జొచ్చునప్పుడు) చేసికొనుచున్నారు.
సంవత్సరాదినాడు ఆచరించవలసిన కార్యకలాపాల గురించి, ధర్మసింధుకారుడు ఇలా చెబుతున్నాడు. ‘నూతన సంవత్సర కీర్తనాద్వారంభం, ప్రతి గృహ ధ్వజారోహణం, నింబ పత్రాశనం, సంవత్సరాది శ్రవణం, నవరాత్రారంభః’’. ఇందులో ధ్వజారోహణం తప్ప మిగిలినవన్నీ మనం ఆచ•రిస్తున్నవే. స•ంవత్సరాదినాడు ఇప్పటికిని గ్రామములలోనో దేవాలయంలోనో బ్రాహ్మణులు కొత్త పంచాంగం తెచ్చి నూతన సంవత్సర రాజాదుల గురించి,తత్ఫలితాల గురించి చదువుతుంటారు. గ్రామస్తులు వచ్చి దానిని వింటారు.దీనినే మనం పంచాంగ శ్రవణం అంటాం. ధర్మసింధుకారుడు చెప్పిన వత్సరాది శ్రవణమిదే కాబోలు. ఈ సమయముననే ప్రజలు తమ జన్మ నక్షత్రమునో, నామ నక్షత్రమునో చెప్పి కందాయ ఫలములను (సున్నలను)ఎరిగి తాత్కాలికంగా సంతోషమునో విషాదమునో పొందుచుందురు.
సర్వోచితములైన నవవస్త్ర ధారణలతో పాటు ఈ సంవత్సరాదినాఁడు ప్రజలు కొత్త చింతపండు, కొత్త బెల్లం, వేపపూవు, చెరకు ముక్కలు మున్నగు వానితో చేసిన ద్రవరూపమైన పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆంధ్ర, కర్ణాటులేకాక మహారాష్ట్రులు కూడా నీ ఉగాది పచ్చడి చేసికొని సేవిస్తారట. పరిశీలించి చూడగా ఈ పచ్చడి షడ్రసముల కదంబముగా గోచరించును. ఇది నూతన సంవత్సరంలో కలిగే ఫలాదులకు ఉపక్రమణము. ధర్మసింధుకారుడు నింబపత్రా శనమని వేప ఆకులు తినడాన్ని సూచించాడు.ఆ ఆకుల బదులుగా మనము పూవులను వాడుతాము. ఎవ్వరైనను గొందరు వేప చిగుళ్లను కూడా ఆ పచ్చడిలో వేసికొందురేమో! నిజమైన చేదు రుచి చూడవలెనన్న వేప పూవుకంటె వేప ఆకులనే భక్షించాలి.
చైత్రశుద్ధ ప్రతిపత్తినాడు శ్రీరామ నవరాత్రా రంభము జరుగును. కొందరు ఈ దినమున మత్స్యజయంతి జరుపుదురట! మన ప్రబంధములలో సౌధముల వర్ణన సందర్భంలో ధ్వజములను గుంభములను గూడ వర్ణించారు. ఆ కాలంలో గృహాలంకరణ సామగ్రిలో ధ్వజకుంభాదులు కూడ ఉన్నాయి కాబోలు. ఈ రెండిటిని గూడా మనమిప్పుడు విసర్జించినాము. దేవాలయాలలో మాత్రం కనిపిస్తున్నాయి. జాతీయ భావాలు పెంపొందిన తర్వాత స్వతంత్ర దినములలో కొందరు తమ ఇండ్లపై జాతీయ పతాకారోహణము చేస్తున్నారు.
భారతదేశమునకు స్వాతంత్య్రము లభించి ఆరేండ్లయినది. దేశ సౌభాగ్యమునకై నాయకులు అనేక ప్రణాళికలను తయారు చేయుచున్నారు. కాని అభ్యుదయము మాత్రం పెండ్లి నడకలనే సాగించు చున్నది. విజయ సంవత్సరం యావద్భారత దేశమునకును, ముఖ్యంగా ఆంధ్రులకు కొంత ఉత్సామాన్ని జేకూర్చినది.
సత్యము వెల్లడించుటకు జంకక ధర్మ్యము కై మహాజన/స్తుత్యములైన కార్యముల తోరపుసిద్ధికి బట్టుకొమ్మయై
యత్యకలంక భారత పురాధిగ తోన్నతి వెల్లడించుచున్/నిత్యశుభంబు కూర్చి ఠవణిల్లుత జాగృతి సార్థకాఖ్యయై
– జాగృతి, 04.04.1954
దివాకర్ల వేంకటావధాని