‘‌జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

– గన్నవరపు నరసింహమూర్తి

‘‘‌సీసీ పుటేజీ పరిశీలిస్తే ఆ రోజు రాత్రి రవితేజ సమీర ఇంటి నుంచి బయటకొచ్చిన తరువాత మోటారు సైకిలు మీద బయలుదేరాడు. బయలు దేరినప్పటి నుంచీ అతన్ని ఒక ఎర్రటి కారు అనుసరించడం అందులో రికార్డైంది. అతను మూడు కిలోమీటర్లు వెళ్లిన తరువాత ఆ కారు ఆ మోటారు సైకిల్ని ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఆ తరువాత అక్కడ దగ్గరలోని అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ కారు నంబరుని బట్టి అది మోహన్‌ అనే వ్యక్తిదని తేలింది. అతను రవితేజ బావమరిది. రవితేజ భార్య సులోచన 498ఎ కింద భర్తపై గృహహింస కేసు పెట్టింది. ఇరవై రోజుల క్రితం రవితేజ అమెరికా నుంచి రాగానే పోలీసులు అరెస్ట్ ‌చేసారు. నాలుగు రోజుల తరువాత బెయిల్‌ ‌మీద బయటకు వచ్చిన రవితేజ భార్యకి వెళ్లి ఆమెతో గొడవ పడ్డాడు. అప్పుడు సులోచనకి దెబ్బలు తగిలాయి. ఈలోగా అమెరికాలోని అతని స్నేహితుడి ద్వారా రవితేజ సమీరనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెను మోసం చేసాడనీ, ఆమె ఇతని మీద పోలీసు కంప్లైంట్‌ ఇచ్చిందన్న వివరాలు సులోచనకి తెలిశాయి. దాంతో ఆమె తన తమ్ముడు మోహన్‌కు అతనిపై ఓ కన్నేసి ఉండమంది. తన అక్కని కొట్టిన రవితేజ మీద మోహన్‌ ‌కోపం పెంచుకొనీ అతన్ని వెంటాడటం మొదలు పెట్టాడు. ఆ విధంగా మొన్న రవితేజ సమీర ఇంటికి వచ్చి వెళుతుండగా, కారుతో ఢీ కొట్టాడు. మా వాళ్లు మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. హాస్పిటల్‌ ‌నుంచి డిశ్చార్జి కాగానే రవితేజని కూడా సులోచనని కొట్టినందుకు అరెస్ట్ ‌చేస్తాం. ఈ కేసులో సమీర కేమీ సంబంధం లేదు కాబట్టి ఎఫ్‌ఐఆర్‌ ‌నుంచి ఆమె పేరుని తీసి వేశాం•’’ అని చెప్పాడు.

అతని చెప్పిన వివరాలు విన్న తరువాత నాకు చాలా ఆనందం కలిగింది. సుదీర్‌, ‌దేవానంద్‌లకు కృతజ్ఞతలు చెప్పి సమీర ఇంటికి వచ్చాను.

నన్ను చూసి సమీర చాలా గాబరా పడింది. జరిగిన విషయాలు చెప్పిన తరువాత చాలా సంతోషించి కృతజ్ఞతలు చెప్పింది. మా అత్త కూడా నన్ను చాలా మెచ్చుకొంది. ఆ రాత్రి అక్కడే భోజనం చెయ్యమంది. భోజనాలప్పుడు సమీరకు నేను విశాఖపట్నంలో పెట్టిన సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌కోచింగ్‌ ‌కేంద్రం గురించి చెప్పాను. ఆమె నా మాటలకు నవ్వుతూ తను కూడా దానిలో కోచింగ్‌ ‌తీసుకుంటాననీ చెప్పింది.

 ‘‘సమీరా! ఈ సాఫ్ట్‌వేర్‌ ‌రంగం నీకు అంతగా నప్పదనీ నా అభిప్రాయం. సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌రాస్తే మంచిది. అందులో ఎంపికైతే సమాజానికి సేవ చేసే అవకాశం ఉంటుంది… ఈ దిశగా ఆలోచించు’’ చెప్పాను.

నా మాటలకు ఆమె ఆలోచిస్తూ మౌనం దాల్చింది. ఆ మర్నాడు మా ఊరు వెళ్లిపోయాను.

                                                                                     *   *    *

వారం రోజుల తరువాత ఒకరోజు సమీర వాళ్లతో పాటు మా ఊరు వచ్చేసింది. ఆ సాయంత్రం ఆమె మా ఇంటికి వచ్చింది. అమ్మ మా ఇద్దరికీ కాఫీ ఇవ్వడంతో ఇద్దరం కాఫీ కప్పులతో డాబా ఎక్కాము.

సాయం సంధ్య… చల్లటి మలయమారుతం. ఎర్రటి పడమర…గోధూళి వేళ కావడంతో పొద్దువాలిపోతోంది. కొబ్బరి చెట్ల మీద పిచ్చుకల కిచకిచలు. మొత్తానికి వాతా వరణం ఆహ్లాదంగా ఉంది.

‘‘ఏంటిలా వచ్చావు? శలవు పెట్టేవా’’? అడిగాను.

‘‘లేదు వంశీ! ఉద్యోగానికి రాజీనామా చేసేసాను’’ అంది సమీర.

‘‘ఇంత ఆకస్మాత్తుగా ఏంటి ఈ నిర్ణయం? మరిప్పుడేం చేస్తావు’’.

‘‘నాకా ఉద్యోగం నచ్చలేదు. అక్కడంతా రాజకీయాలు. పైగా ఒత్తిడి… చేరుకోలేని టార్గెట్స్… ‌ముఖ్యంగా ఉద్యోగంలో సంతృప్తి లేదు. అందుకే రాజీనామా చేసేసి వచ్చేసాను. ఇప్పుడు నువ్వు చెప్పినట్లు సివిల్‌ ‌సర్వీసెస్‌, ‌గ్రూప్‌ ‌వన్‌ ‌రాస్తాను. దానివల్ల ఎన్నో పుస్తకాలను చదివే అవకాశం తద్వారా బోలెడు జ్ఞానం కలుగుతుంది. ఈ చదువుకొనేప్పుడులా కాకుండా ఈసారి అనుభవిస్తూ చదువుతాను.’’ అంది సమీర…

‘‘ఇక్కడే చదువుతావా. ఎక్కడైనా కోచింగ్‌ ‌తీసుకుంటావా?’’

‘‘విశాఖపట్నంలో కోచింగ్‌ ‌కేంద్రం ప్రారంభించావు కదా? అందులో చేరతాను’’.

‘‘ఒక పని చేయ్యకూడదూ? రాజు ఆ కోచింగ్‌ ‌కేంద్రాన్ని నడుపుతున్నాడు. ఇప్పుడు చాలా మంది యువకులు చేరడంతో దానిని నిర్వహించడం వాడికి కష్టం అవుతోంది. నువ్వు దానిలో పార్టర్నగా చేరి దానిని నిర్వహిస్తూ ప్రిపేర్‌ అవ్వు. దాంతో నీకు ఉద్యోగం, చదువు రెండు అవకాశాలు కలుగుతాయి. ఆలోచించు. నీకిష్టమైతే నిన్ను ఆ సంస్థకి డైరెక్టర్‌గా నియమిస్తాను. నీకు జీతం కూడా లభిస్తుంది. రాజుకి పని ఒత్తిడి తగ్గుతుంది. అలా కొన్నాళ్లు డైరెకట్టర్‌గా చేస్తే నువ్వు ఎంటరప్రెన్యువర్‌ అవుతావు.’’ అన్నాను…

‘‘ఉద్యోగంలో పడితే చదువు కుదరదనే దానిని వదులుకున్నాను. మళ్లీ ఇప్పుడు ఆ కోచింగ్‌ ‌కేంద్రంలో చేరితే ద్విపాత్రాభినయం చెయ్యవలసి ఉంటుంది. ఆ పని నావల్ల అవుతుందంటావా?’’

‘‘తప్పకుండా? ఇన్నాళ్లూ నువ్వు చేసింది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం. దానికి చదువుకు సంబంధం లేదు. కానీ కోచింగ్‌ ‌కేంద్రంలో విద్యార్థులకు విభిన్న విషయాలను చెప్పవలసి ఉంటుంది. జాగ్రఫీ, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, భూగోళశాస్త్రం, పౌర శాస్త్రం, తెలుగు, ఆంత్రోపాలజి, సోషియాలజీ, సైన్స్, ఇం‌జనీరింగ్‌, ‌సాహిత్యం, అంతర్జాతీయ విషయాలు.. ఇలా ఎన్నో … వాటిని చెప్పాలంటే నువ్వు ముందు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తేనే నీకు ఆ సబ్జెక్టుల మీద అవగాహన పెరుగుతుంది. ఒకసారి అవగాహన పెరిగి బోధన చేసావో నీకు అవి కరతలామలకం అవుతాయి. అవన్నీ నీ సివిల్స్ ‌పరీక్షలకు ఆయుధాలవుతాయి. ఆ ఆయుధాలే నీకు విజయాన్ని అందిస్తాయి’’ అన్నాను.

కానీ అధ్యయనం, బోధన చేయగలనంటావా?

‘‘తప్పకుండా చెయ్యగలవు.. నీ సంగతి నాకు తెలుసు. నువ్వు అనుకుంటే చెయ్యగలవు. ఒకసారి అధ్యయనం మొదలుపెడితే నీ మెదడు పదునెక్కి అక్షరు తూణీరంలో బాణాల్లా ఒకదాని తరువాత ఒకటి అలవోకగా వచ్చేస్తాయి. మెదడు షార్ప్ అవుతుంది. శివుడి మూడో కన్నులో భగ్గుమనే నిప్పు, ఓదార్చే చల్లదనం రెండూ ఉంటాయి. మన మెదడే మనకు మూడో కన్ను. అందులో తెలిసే చిన్నవిషయాలతో పాటు తెలియని విజ్ఞాన గని కూడా ఉంటుంది. మెదడులో నిక్షిప్తమై అంధకారంలో ఉన్న జ్ఞానజ్యోతిని వెలికి తియ్యటానికి అధ్యయనమనే చిరుదీపాన్ని వెలిగిస్తే ఆ చీకటి చెదిరి తేజోమయమై జ్ఞానసాగరం బయట పడుతుంది. అప్పుడు మెదడు వికసిస్తుంది. నిద్రాణంగా ఉన్న న్యూరాన్లు ఉత్తేజితమవుతాయి’ అనీ చెప్పాను…

నా మాటలు ఆమెను బాగా ప్రభావితం చేసాయి.

‘‘వంశీ! నువ్వు చాలా డబ్బు ఖర్చు పెట్టి దాన్ని ప్రారంభించావు. నేను దాన్ని సరిగ్గా నిర్వహించలేక దానికి నష్టాలు వస్తే నేను తట్టుకోలేను. ఆ అపరాధ భావం నన్ను జీవితాంతం వెంటాడుతుంది’’ అంది.

‘‘ముందు నాది, నీది అనే భావన రానీయకు. అయినా నీతో ఒక విషయం చెబుదామని నాకు చాలా రోజులుగా అనుకుంటున్నా. సమయం రాక నాలోనే దాచుకున్నాను. మీ నాన్నకిష్టం లేదనీ నాకిష్టమైనా నీ ప్రేమని వదులుకున్నాను. చిన్నప్పటి నుంచీ కలిసి పెరగటం వల్ల నువ్వంటే నాకు ఇష్టం పెరిగింది. అది ఇంటర్‌ ‌కొచ్చేసరికి ప్రేమగా పరిణమించింది. దాన్ని మూడుముళ్లతో వివాహ బంధంగా మార్చుకోవాలనీ ఎంతో ఉబలాటపడ్డాను. కానీ మీనాన్న వల్ల అడుగు ముందుకు వెయ్యలేక తప్పుకున్నాను. కానీ జీవితం ఒక ప్రహేళిక లాంటిది. దాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. మన జీవితాలూ అంతే… అవి ఎన్నో మలుపులు తిరిగి మళ్లీ మనముందుకొచ్చాయి. రెండు నదులు సంగమించే ముందు కొండలు, లోయల్లో ఎన్నో వంపులు తిరిగి దూరమై కొన్ని మైళ్లప్రవాహం తరువాత మళ్లీ దగ్గరై సంగమిస్తాయి. మన జీవితాలూ అంతే. ఎన్నో కష్టసుఖాలనెదుర్కొన్నాయి. నీకు ఇష్టమైతే చెప్పు. కలిసి జీవన ప్రస్థానాన్ని కొనసాగిద్దాం’’ అన్నాను.

నా మాటలకు చాలాసేపటి వరకు సమీర శూన్యంలోకి చూస్తూ మౌనం దాల్చింది. ఆమె చాలా సేపటి వరకు మాట్లాడక పోయేసరికి ఆమె కిష్టం లేదేమోననీ ఆమె వైపు చూసాను. ఆమె అప్పుడే ముఖం నా వైపు తిప్పింది.

ఆమె కళ్లు ఎర్రగా మారిపోయాయి.కళ్లలో చెమ్మగిల్లిన నీరు బయట పడాలనీ విశ్వ ప్రయత్నం చేస్తునాది.

‘‘సమీరా! ఏం జరిగింది? ’’ అనీ ఆత్రుతగా అడిగాను…

‘‘నేనంటే అమ్యాయిని ధైర్యం చెయ్యలేక చెప్పలేకపోయాను.నువ్వు చెప్పకపోయేసరికి నీకిష్టం లేదనుకునీ ఆ బాధని నాలోనే దాచుకున్నాను. మరి నా మీద అంత ప్రేమ ఉండి కేవలం మా నాన్నకు భయపడి చెప్పకపోవడం తప్పుకాదా?’’ అంది మెల్లగా…

‘‘పెళ్లి అంటే రెండు మనసుల కలయికే కాదు రెండు కుటుంబాల సంగమం. మన ప్రేమ గురించి వాటిని విడదీయటం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాను. నేను తప్పు చేశానని ఇప్పుడని పిస్తోంది. గతం గతః. ఇంక ఆలస్యం చెయ్యొద్దు.. రేపే మీ అమ్మకి చెబుతాను. ఆమె అంగీకారంతో మన పెళ్లి జరుగుతుంది’’ చెప్పాను.

నా మాటలు నిజమనీ చెబుతూ దూరంగా గుడిలోని గంటలు మారుమోగసాగాయి.

(ముగింపు వచ్చేవారం)

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE