– గన్నవరపు నరసింహమూర్తి
‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన
రెండు రోజుల పాటు అకాడమీని పూర్తిగా పరిశీలించాను. అందులో సుమారు 200 మంది దాకా శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ కన్నా తను బాగా తర్ఫీదు ఇవ్వగలిగితే చాలా మంది అందులో చేరే అవకాశం ఉంది. సివిల్ సర్వీసెస్‌కు తోడు ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా అందులో బోధిస్తే మరింత మంది చేరే అవకాశం ఉంది.
ముందు సివిల్ సర్వీసెస్ సిలబస్, నిబంధనలు, మెటీరియల్స్, 10 సంవత్సరాల ప్రశ్నపత్రాలు, వాటికి సంబంధించిన పుస్తకాలు, అలాగే ఇంజనీరింగ్ సర్వీసెస్‌కు సంబంధించిన ప్రశ్నపత్రాలు, మెటీరియల్స్ కొని ఇంటికి వచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత వారం పాటు వాటిని క్షుణ్ణంగా పరిశీ లించాను. ఆ తర్వాత నాకు వాటి మీద మంచి అవగాహన కలిగింది. మంచి లెక్చరర్లను నియమించు కుంటే ఫలితాలు బాగా రావచ్చనే భావం నాకు కలిగింది. అద్దె భవనానికి, మెటీరియల్స్, కంప్యూటర్స్, ఫర్నీచర్, ప్రింటర్స్, స్టాఫ్ జీతాలు ఇలా ఒక ఎస్టిమేషన్ తయారు చేసాను. ఆ తరువాత మా అమ్మకి చెప్పి హైదరాబాద్ వచ్చి అక్కడ ఐయ్యేయస్ అకాడమీలో చేరాను. అక్కడ పదిహేను రోజులున్నా సమీరను కలవలేదు. చేరింది శిక్షణ కోసం కాదు.. ఆ సంస్థ నిర్వహణని, మెటీరియల్స్, పరీక్షలు అన్నీ గమనించాలనీ. వారెవ్వరికీ నేను కోచింగ్ సంస్థ పెడుతున్నట్లు చెప్పలేదు. కాబట్టి వారికి నా పరిశీలన అనుమానం కలగలేదు. అలా నెల్లాళ్ల పాటు ఆ సంస్థని నిశితంగా పరిశీలించే సువర్ణ అవకాశం నాకు కలిగింది. దాంతో పాటు వాళ్లిచ్చిన నోట్సులు, మెటీరియల్స్, ప్రశ్నపత్రాలు, పరీక్షల నిర్వహణ, ఆన్‌లైన్ పరీక్షలు… ఇలా చాలా వాటిని నిశితంగా గమనించి ఇంటికి వచ్చాను.
ఆ తరువాత విశాఖపట్నం వెళ్లి నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు లెక్చరర్లను కలిసి వారికి నేను పెట్టబోయే కోచింగ్ సంస్థ గురించి చెప్పాను. ముందుగా మంచి కూడలి దగ్గర కాంప్లెక్స్‌లో ఒక ఫ్లోర్ అద్దెకు తీసుకొని, దాన్ని కోచింగ్ ఇనిస్టిట్యూట్‌గా మార్పులు చేసాను. కంప్యూటర్ల గది, రెండు క్లాస్ రూమ్‌లు, ఆఫీసు గది, వాటికి ఫర్నిచర్ అంతా సమకూర్చాను. అన్నీ ఆధునిక హంగులతో తీర్చిదిద్దాను. ఆ తర్వాత పేపర్లలో యాడ్స్ ఇచ్చాను. లెక్చరర్లను, ట్యూటర్లను తీసుకోవడం మొదలుపెట్టాను. నా స్నేహితుడు రాజు ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. వాడిని నేను పెట్టిన కోచింగ్ కేంద్రానికి ఇంఛార్జిగా నియమించి ఇంటికొచ్చేసాను.
మొత్తం దీనికి 50 లక్షలు ఖర్చైంది. ఇదివరకు నేను మా ఐదకరాల మెట్ట పొలాన్ని కోటి రూపాయలకు అమ్మి, బేంకులో వేసిన సొమ్ములోంచి ఈ డబ్బుని తీసి, కోచింగ్ కేంద్రం కోసం ఖర్చు పెట్టాను. నాన్నగారు చనిపోయిన తర్వాత 20 ఎకరాల పల్లం పొలాన్ని బోర్లు తీసి నీటి వనరుల్ని పెంచేను. పదెకరాల మెట్టలో 5 ఎకరాల పొలాన్ని అమ్మేసి, మిగతా ఐదెకరాల్లో మామిడి తోట వేసాను. ఇప్పుడు నాకు గమ్యం తెలిసింది. వ్యవసాయం చేస్తూ, కోచింగ్ కేంద్రాన్ని నడుపుతూ, జీవితాన్ని గడిపెయ్యాలి. ఇదీ నా గమ్యం. ఇది ఎంతవరకు సఫలమవుతుందో, నేను గమ్యం చేరుకోగలనో లేదో కాలమే చెప్పాలి.
ళి ళి ళి
రెండు నెలల తరువాత కోచింగ్ కేంద్రంలో అభ్యర్థుల చేరికలు మొదలయ్యాయి. నేను కూడా వెళ్ళి అక్కడే ఒక ఇల్లు తీసుకొని అక్కడే ఉండడం మొదలుపెట్టాను. మొత్తం నూటయాభై మంది చేరారు. అందరికీ మెటీరియల్స్ ఇచ్చి క్లాసులు మొదలు పెట్టాము. ప్రతీ రెండు రోజులకు ఒక టెస్ట్. లెక్చరర్లు అనుభవం ఉన్న వాళ్లు కావటంవల్ల రెండు నెలలకి మంచి పేరు వచ్చింది. రాను రాను చేరికలు పెరగడం మొదలైంది. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్, టూ ఉద్యోగాలు ప్రకటించడంతో చేరికలు మరింత పెరిగాయి. రాన్రాను కోచింగ్ కేంద్రం గాడిలో పడుతోంది. రాజు దాన్ని బాగా నిర్వహిస్తూ పూర్తిగా బాధ్యతలు తీసుకున్నాడు. దాంతో నాకు భారం తగ్గి వ్యవసాయం మీద ధ్యాస పెట్టాను.
ఒకరోజు నేను విశాఖపట్నం వెళుతున్న సమయంలో సమీర ఫోన్ చేసి నన్ను వెంటనే హైదరాబాద్ రమ్మనమని చెప్పింది. నేను ఆశ్చర్య పోతూ ఫ్లైట్‌లో హైదరాబాద్ వెళ్లాను. నేను వెళ్లేసరికి నా గురించి ఎదురు చూస్తున్న ఆమె ముఖంలో ఆందోళన కనిపిస్తోంది. మా అత్త సుశీల నన్ను పలకరించి, ఇద్దరికీ కాఫీలు తెచ్చింది. కాఫీ తాగుతుంటే సమీర చెప్పడం మొదలు పెట్టింది.
‘‘ఆ నీచుడు రవితేజను నన్ను కలవవద్దనీ చెప్పాను కదా! అయినా వాడు వినకుండా మళ్లీ రోజూ ఆఫీసుకు రావడం మొదలుపెట్టాడు. అమెరికాలో వాడికి వార్నింగ్ ఇచ్చిన తరువాత వాడు నన్ను కలవడంగానీ, మాట్లాడటంగానీ చెయ్యలేదు.
ఆ తరువాత మా నాన్నగారు చనిపోవడం, నేనిక్కడకు వచ్చేయడం జరిగింది. నేను ఇండియా వచ్చిన సంగతి తెలుసుకొని వాడు హైదరాబాద్ వచ్చేడు. ఇక్కడ కూడా మళ్లీ రోజూ ఆఫీసుకు రావడం మొదలుపెట్టాడు. అప్పుడు నేను పోలీసులకి ఫిర్యాదు ఇవ్వడంతో వాడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసికెళ్లిపోయారు.
ఆ తరువాత వాడు నామీద కక్ష కట్టి, రెండు రోజుల క్రితం నేను ఆఫీసు నుంచి వచ్చిన తరువాత, రాత్రి ఎనిమిది గంటలప్పుడు మా ఇంటికి తాగి వచ్చి పెద్ద గొడవ చేసాడు. నేను, మా అమ్మ గట్టిగా కేకలు వేయ్యడంతో, మా వాచ్ మన్ రావడంతో వాడు పారిపోయాడు. కానీ నిన్న మధ్యాహ్నం పోలీస్ ఇన్ స్పెక్టర్ మా ఆఫీసుకి వచ్చి మా ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత రవితేజ రోడ్డు మీద స్పృహ తప్పి పడి ఉన్నాడని, తలమీద, ముఖం మీద బాగా దెబ్బలు తగలడంతో బాగా రక్తం పోయిందనీ, ప్రస్తుతం హాస్పటల్లో ఉన్నాడనీ, అంత క్రితం అతను మా ఇంటికి వచ్చినట్లు తెలిసిందనీ, ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? దెబ్బలు ఎలా తగిలాయనీ నన్ను ప్రశ్నించాడు.
అతని మాటలకు నేను ఆశ్చర్యపోయాను. ఆ తరువాత తేరుకొని అతను మా ఇంటికి వచ్చిన మాట నిజమేననీ, కాకపోతే అతను ఆ సమయంలో తాగి ఉన్నాడనీ, గొడవ చెయ్యడంతో మా వాచ్‌మన్ వచ్చి అతన్ని బయటకు పంపించి వేసాడనీ, ఆ దెబ్బలు ఎలా తగిలాయో నాకు తెలియదనీ చెప్పాను. నిన్న మళ్లీ ఎస్సై మా ఇంటికి వచ్చి అన్నీ పరిశీలించి, నన్ను అనుమానితురాలిగా పేర్కొని కేసుని రిజిస్టర్ చేసినట్లు చెప్పాడు’’ అని జరిగినదంతా చెప్పింది సమీర.
‘‘ రెండు రోజులు ఆఫీసుకి వెళ్లకుండా శలవు పెట్టు, ఈలోగా వాడి వ్యవహారం తేలుస్తాను’’ అని చెప్పి బయటకొచ్చాను.
అప్పుడు నాకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుధీర్ గుర్తుకు వచ్చాడు. అతనికి ఫోన్ చేస్తే మర్నాడు స్టేషన్‌కి రమ్మనాడు. ఆ రోజు నేను హోటల్లో ఉండి, మర్నాడు పోలీస్ స్టేషన్లో సుధీర్ని కలిసి, సమీర చెప్పిన వివరాలు అతనికి చెప్పాను. రవితేజ గురించి అతనికి ఇదివరకే తెలిసి ఉండటంతో సమీరను పిలిపించిన ఎస్సై దేవానంద్‌కి ఫోన్ చేసి కేసు వివరాలు కనుక్కున్నాడు. అదృష్టవశాత్తూ ఆ కేసు రిజిస్టరైన పోలీసుస్టేషన్ సుధీర్ కంట్రోల్లోనే ఉండటం వల్ల ఎస్సై దేవానంద్ అరగంటలో సుధీర్ దగ్గరికి వచ్చాడు.
సుధీర్ అతనికి రవితేజ గురించిన వివరాలు చెప్పి, అమెరికాలో సమీర ఉన్నప్పట్నుంచీ రవితేజ ఆమెను ఎలా అల్లరి చేస్తున్నాడో, వాడు ఎటువంటి వాడో చెప్పాడు.
‘‘దేవానంద్! రవితేజ మొన్న సమీర గారున్న ఇంటి కొచ్చి అల్లరి చేసినప్పుడు వాచ్‌మన్ రావడంతో భయపడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతనికి దెబ్బలు తగిలాయి. అంటే అతనికి ప్రమాదమైనా జరిగి ఉండాలి లేదా ఎవరైనా దాడిచేసి కొట్టి ఉండాలి. ఏం జరిగిందీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంటుంది. వెంటనే వాటి ఫుటేజ్ తెప్పించి చూడు. ఇంకో విషయం.. ఆ రవితేజకి పెళ్లయింది. అతని భార్య, పిల్లాడు ఇక్కడే ఉన్నారు. దాని వెనుక వాళ్ల హస్తం ఉండొచ్చు. కాబట్టి వాళ్ల గురించి ఆరా తియ్యి. ఏదైనా ఈ రోజు సాయంత్రానికి నాకన్ని విషయాలు తెలియాలి’’ అని చెప్పాడు సుధీర్.
‘‘ సీసీ ఫుటేజ్‌ని మనవాళ్లు కలెక్ట్ చేసారు. ఇంకో గంటలో వివరాలు తెలుస్తాయి. ఈ లోగా అతని భార్య, ఆమె కుటుంబ వివరాలు తెలుసుకుంటాను’’ అని చెప్పి వెళ్లిపోయాడు ఎస్సై దేవానంద్.
సుధీర్ దగ్గర శలవు తీసుకొని, నేనిదివరకు కోచింగ్ తీసుకున్న కేంద్రానికి వెళ్లి, అక్కడ సాయంత్రం దాకా ఉండి, కొన్ని పేపర్లు, మెటీరియల్స్ కలెక్టు చేసాను. ఆ తరువాత మళ్లీ సుధీర్ దగ్గరికి వెళ్లాను.
నేను వెళ్లేసరికి సుధీర్, దేవానంద్ ఇద్దరూ స్టేషన్లో ఉన్నారు. నన్ను చూడగానే సుధీర్ ‘‘రా వంశీ! మీ కేసు ఆల్మోస్ట్ ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసుని
మావాళ్లు ఛాలెంజ్‌గా తీసుకొని ఛేదించారు. దేవానంద్ ! జరిగింది చెప్పు?’’ అంటూ ఎస్సై వంక చూసాడు.
ఎస్సై దేవానంద్ చెప్పడం మొదలుపెట్టాడు.