– గన్నవరపు నరసింహమూర్తి

‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన


సంక్రాంతికి హరిదాసులు కరవయ్యారు? రాబోయ్‌ తరానికి ఈ మార్పులు బాగుంటాయి కానీ సంధియుగంలో ఉన్న మా లాంటి వాళ్లకి నచ్చటం లేదు…

దుక్కి దున్ని వరి నారు పోశారు. నారు పోసేవాడే నీరుపోస్తాడన్న ఆర్యోక్తి పోయింది. ఇప్పుడు నీరు బోర్ల నుంచీ వస్తున్నది.

రెండు నెలల నుంచి మా మావకి ఒంట్లో బాగుండటం లేదు. కూతురి పెళ్లి ఆగిపోయిందన్న బెంగతో మంచం పట్టేసాడనీ ఊళ్లో అందరూ అనుకుంటున్నారు. ఒకరోజు మా అమ్మ వాళ్లు వెళ్లి మావని చూసి వచ్చింది. బాగా నీరసించి పోయాడనీ, అంతుపట్టని రోగంతో బాధపడుతున్నాడని చెప్పింది. మా మావకి మొదటి నుంచీ ఆస్తమా ఉంది. దానికి తోడు వయస్సు. అతనికిప్పుడు 65 పెనే ఉంటాయి. అనుకున్నట్లుగానే నెల్లాళ్ల తరువాత మా మావ ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయాడు. అప్పుడు నేను, మా అమ్మ వాళ్లింటికి వెళ్లాం. సమీర తండ్రి చనిపోయిన రోజే వచ్చింది. పదమూడో రోజునాడు చుట్టాలందరూ వెళ్లిపోయారు. శ్రీధర్‌ శలవు లేదని వెళ్లిపోయాడు. మా అత్త, సమీర ఆ ఇంట్లో మిగిలారు.

ఒకరోజు సాయంత్రం నేను పొలానికి వెళుతుంటే సమీర వాకిట్లోంచి పిలిచింది. మామావ లేడు కాబట్టి నేను ఇంట్లోకి వెళ్లాను. అత్త ఆప్యాయంగా పిలిచి కాఫీ ఇచ్చింది. మాటల్లో సమీర ‘‘వంశీ! నేనింక అమెరికా వెళ్లను. నాన్నగారికి సీరియస్‌గా ఉందనీ అమ్మ చెప్పిన తరువాత ఉద్యోగానికి రిజైన్‌ చేసాను. కానీ మా మేనేజ్మెంట్‌ హైదరాబాద్‌లో తమ కాంపస్‌లో పని చెయ్యమనీ చెప్పడంతో ఒప్పుకున్నాను. అమ్మని కూడా నాతో పాటే తీసికెళ్లి పోదామను కుంటున్నాను. సంవత్సరం దాకా నాన్నగారికి పెట్టవలసిన మాసికాలు అన్నయ్య, అమెరికాలో పెడతాడట. అమ్మ ఇక్కడ ఒంటరిగా ఉండటం కష్టం’’ అనీ చెప్పింది.

‘‘రవితేజ మళ్లీ నిన్ను కలిసాడా?’’అనీ అడిగాను…

‘‘నువ్వు ఆ రోజు తన గురించిన విషయాలు చెప్పిన తరువాత నేనే ఫోన్‌ చేసి పెళ్లయిన విషయం ఎందుకు చెప్పలేదు’’ అనీ నిలదీశాను. తను మొదట అదంతా అబద్దమని బుకాయించినా అతని భార్య తన మీద పెట్టిన గృహహింస కేసు గురించి చెప్పగానే మాట మార్చి.. తనను ఆమే మోసం చేసిందనీ అబద్ధం చెప్పాడు. ఆ తరువాత నన్ను ఎప్పుడూ కలవవద్దనీ, ఫోన్లు చెయ్యవద్దని, తేడా వస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తాననీ చెప్పడంతో అప్పట్నుంచీ నన్ను కలవటం మానివేసాడు. దాంతో నా సమస్య తీరింది. కానీ నాన్న మాత్రం నాదే తప్పనీ చాలా గొడవ చేసారు. పల్లెటూళ్లలో కుటుంబాల మధ్య గొడవలుంటే అవి చాలా కలతలకు దారితీస్తాయి… అందుకు నా జీవితమే ఉదాహరణ. నేనేమో నిన్ను ఇష్టపడు తున్నానన్న అనుమానంతో చివరి వరకూ నన్ను నియంత్రించే ప్రయత్నం చేసి నన్ను బాధపెట్టి తనూ బాధపడ్డారు నాన్న. తండ్రీ పిల్లల మధ్య కమ్యూని కేషన్‌ గేప్‌ ఉంటే పిల్లలు నాలాగే బాధపడతారు. ఈ విషయంలో నువ్వు అదృష్టవంతుడివనీ చెప్పవచ్చు, మీ నాన్నగారు నీతో మొదట్నుంచీ స్నేహితుడిలా మెలిగేవాడు. సరే… గతం గతః.. అవన్నీ తలుచుకుంటే బాధ తప్ప మరేం ఉండదు. చీకటిని తిడుతూ కూర్చోకూడదనీ నువ్వే చెబుతుంటావు. అందుకే ఆ పని చెయ్యదల్చుకోలేదు’’ అనీ చెప్పింది సమీర.

 సమీరలో ఇప్పుడు బాగా పరిణతి కనిపిస్తోంది. జీవితం లో అనుకోని సంఘటనలు జీవితాలను ప్రభావితం చేస్తాయనడానికి సమీరే సాక్ష్యం.

  *     *      *

 పది రోజుల తరువాత సమీర వాళ్లమ్మని తీసుకొని హైదరాబాద్‌ వెళ్లిపోయింది. ఈ సంవత్సరం సివిల్‌ సర్వీస్‌ ప్రకటన వచ్చింది కానీ ఇప్పుడు నాకు రాయాలన్న కోరిక లేదు. రాయాలంటే మంచి కోచింగ్‌ తీసుకోవాలి, అటువంటి కోచింగ్‌ సంస్థలు మన రాష్ట్రంలో లేవు.. ఢిల్లీ వెళ్లాలి. విశాఖలో కోచింగ్‌ ఇన్స్టిట్యూట్‌ ఉంటే వెళ్లేవాడిని.. కానీ అక్కడ కూడా మంచిది లేదు. రెండు రోజుల తరువాత శ్రీరామ్‌ మావూరు వచ్చాడు. వాడిని చూసి నాకు చాలా సంతోషం వేసింది. ఇద్దరం ఏటికి వెళ్లి స్నానం చేసి వచ్చి భోజనం చేసి పెరట్లో చెట్టు కింద కూర్చున్నాం. మా పెరడు రకరకాల చెట్లు పాదులతో పచ్చగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో పక్షుల కూతలు సంగీతంలా, అప్పుడప్పుడు దూరంగా తోటల్లోంచి కోకిల కుహు కుహు నాదాలు మధురంగా వినిపిస్తుంటాయి.

శ్రీరామ్‌కు ఆ చెట్లు, ఆ నిశ్శబ్దం బాగా నచ్చింది. నాడు చాలాసేపు ఆ చెట్ల మధ్య కలియ తిరిగాడు.ఆ తరువాత కబుర్లలో పడ్డాము…

‘‘అమెరికా వెళ్లిన దగ్గర నుంచి నా జీవితంలో ప్రశాంతత కరువైందిరా… ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. స్మిత అనవసరంగా పరిచయమైంది. వయసు ఆకర్షణలో ఆమె మోజులో పడి జీవితాన్ని నరకం చేసుకున్నాను. ఆ తరువాత ఆమె వల్ల నాకు సుఖశాంతులు లేకుండా పోయాయి.

జీవితమంటే విరక్తి కలిగింది. మళ్లీ మంచి రోజులు వస్తాయా అన్న సందేహం కలిగింది. అయినా జీవితంలో సుఖదుఃఖాలు, కష్టసుఖాలు రంగుల రాట్నం లాంటివి… వస్తూ, పోతుంటాయి. నా విషయంలోనూ అదే జరిగింది. మొన్ననే మాకు విడాకులు మంజూరు అయ్యాయి. అమెరికా నుంచి త్వరలో వచ్చేస్తాను… అయినా నేను ఆ దేశాన్ని నిందించను. మన తప్పులకు మనమే కారణమౌతాము. మధ్యలో అమెరికా సమాజం ఏం చేసింది చెప్పు? అది మనలాంటి ఎంతో మందిని ఆదరించి ఆశ్రయం కల్పించి మంచి జీవితాన్నిచ్చింది. మనం దానిని స్వయం కృతాపరాధంతో పాడు చేసుకొని ఆ దేశాన్ని, ప్రజల్ని నిలదీయడంలో తప్పు. ఇప్పుడు మన దేశం మాత్రం అమెరికాకి ఏ మాత్రం తీసిపోవటం లేదు. అమెరికా వాళ్లు మనవాళ్లలా దొంగ కేసులు పెట్టరు. డబ్బు కోసం ఏది పడితే అది చెయ్యరు. నైతిక విలువలకు తిలోదకాలివ్వరు?’’ అంటూ ఆవేశంగా చెప్పాడు శ్రీరామ్‌.

‘‘రామ్‌! మంచీ, చెడు అన్నవి అన్ని దేశాల్లోను, అందరి ప్రజల్లోనూ ఉంటాయి. కాకపోతే మన దేశంలో పేదలు ఎక్కువ కాబట్టి డబ్బుకోసం చాలా మంది తప్పుడు పనులు చేస్తుంటారు. మనుషులు తాము సృష్టించిన డబ్బుకి తామే దాసులు అవుతున్నారు. అమెరికాలో మనవాళ్లు ఎంతో మంది పెళ్లి చేసుకొనీ అన్యోన్యంగా ఉంటున్నారు…పెళ్లి సక్సెస్‌ ఛాన్స్‌ 50 శాతమే! కొందరికి వెలుగు నింపి జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. నీలాంటి మరికొందరికి చేదు అనుభవాలను మిగిలిస్తుంది. అయినా విచారించకు. దీంతో జీవితం అయిపోలేదు. మళ్లీ నీ జీవితం చిగురిస్తుంది. ఓపిక పట్టు. నిరాశ పడక్కర్లేదు. ఇదొక పాఠం. ‘‘అపజయం అంటే మనం వెళుతున్న మార్గం తప్పని చెప్పే ఒక స్నేహితుడు. దాని వల్ల మనకు గెలుపుకి మార్గం తెలుస్తుంది’’ అనీ నేనెక్కడో చదివాను. .

‘‘నువ్వు చెప్పింది నిజంరా… ఏది జరిగినా మంచికే అనుకోవాలి. అపజయాన్ని గుణపాఠంగా తీసుకుంటే ఏ సమస్యా ఉండదనీ నా అనుభవం చెప్పింది. అది సరే! నువ్వేం చెయ్యబోతున్నావ్‌?’’ అడిగాడు శ్రీరామ్‌.

‘‘సివిల్‌ సర్వీసెస్‌ రాద్దామని రెండేళ్ల నుంచి అనుకుంటున్నా కుదరటం లేదు’’ అన్నాను.

‘‘సివిల్‌ సర్వీసెస్‌ రాయాలంటే ఏ డిల్లీకో, హైదరాబాద్‌కో వెళ్లాలి. పొలాలను, ఇంటినీ వదిలి వెళ్లగలమా? కుదిరే పనేనా? ఒకవేళ ఉద్యోగం వచ్చినా ఎక్కడెక్కడో తిరగాలి. అదంతా ఎందుకుగానీ నువ్వే సివిల్‌ సర్వీస్‌ రాసే వాళ్ల కోసం కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌ పెట్టొచ్చు కదా? నువ్వు సివిల్‌ సర్వీస్‌ రాసి ఎంపికైతే నువ్కొక్కడివే కలెక్టరువి అవుతావు. కానీ కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌ పెడితే వందల మంది ఐఏఎస్‌లను తయారు చేయవచ్చు. నే చెప్పినది ఆలోచించు’’ అన్నాడు శ్రీరామ్‌.

‘‘అవన్నీ ఇప్పుడు కుదిరే పని కాదురా… అది పెట్టాలంటే చాలా శ్రమ తీసుకోవాలి’’ అన్నాను…

ఆ తరువాత ఇద్దరం భోజనం చేసి పొలానికి వెళ్లాం. చుట్టూ పచ్చటి పొలాలు, మధ్యలో బోరింగ్‌ షెడ్డు… షెడ్డు చుట్టూ కొబ్బరి చెట్లు. అక్కడ నుంచి ఉరుకులు పరుగులు పెడుతూ పొలాల్లోకి పారే నీరు, మీద నీలాకాశం, ఎగిరే తెల్లటి కొంగలు దూరంగా చెరువు గట్టు… అక్కడి ప్రకృతి వాడికి బాగా నచ్చింది. ఆ మరునాడు వెళ్లిపోయాడు. కోచింగ్‌ కేంద్రం పెట్లాలన్న వాడి సలహా నన్ను వెంటాడసాగింది. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు గానీ రెండు రోజుల తరువాత నా ఆలోచనలు దాని చుట్టే పరిభ్రమించటం మొదలైంది.

పెద్ద నగరం విశాఖపట్నంలో సివిల్‌ సర్వీసెస్‌కు సరియైన శిక్షణ కేంద్రం లేదు. ఆ మాట కొస్తే హైదరాబాద్‌ లేదు. ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌,సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌ కోసం ఢిల్లీలోని అకాడమీల చుట్టూ తిరగవలసిందే. అంతదూరం వెళ్లలేక చాలా మంది జౌత్సాహికులు ఏదో తూతూ మంత్రంగా రాస్తూ అపజయాలను మూట గట్టుకుంటున్నారు.

అందుకే, విశాఖపట్నంలో ఒక అకాడమీ పెడితే ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల వాళ్లకే ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూడా వచ్చి చేరే అవకాశం ఉంటుంది. ఆ ఆలోచన రాగానే రెండు రోజుల తరువాత విశాఖపట్నం వెళ్లి అక్కడి సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌ అకాడమీని పరిశీలించాను. అక్కడ శిక్షణ కేంద్రం పెట్టాలనే ఆలోచన వెనుక నా స్వార్థం కూడా ఉంది.అలా చేస్తే మా ఊళ్లో వ్యవసాయం చేసుకుంటూ దానిని నిర్వహించవచ్చు. అమ్మ మా ఊళ్లో తప్ప ఎక్కడా ఉండలేదు. నాకు ఉద్యోగం వచ్చి బయటకు వెళ్లిపోతే ఆమెకు ఇబ్బంది. అందుకే ఒక కోచింగ్‌ సంస్థ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చాను.

(సశేషం)

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE