‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన
మామా! నే చెప్పింది విను… నేను అమెరికా వెళ్లింది సమీర కోసం కాదు… వేరే పని మీద. ఆ విషయం సమీరకు చెప్పలేదు. కానీ నా స్నేహితుడు ద్వారా నేనక్కడికి వచ్చినట్లు తెలుసుకొనీ సమీరే తనను కలవమనీ నాకు ఫోన్ చేసి చెప్పింది. అందుకే వెళ్లాను. అప్పుడు ఆ పెళ్లికొడుకు విపరీత ప్రవర్తన గురించి చెప్పింది. రోజూ అతను ఆమె ఆఫీసుకి, ఇంటికి వెళుతూ, ఫోన్లో అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడనీ, ఆతని ప్రవర్తన అనుమానంగా ఉందనీ, నీకు చెబితే నువ్వు వినటం లేదనీ నాకు అతని వివరాలు చెప్పి అతని గురించి కనుక్కోమని చెబితే నేను హైదరాబాద్లో పోలీసుల సహాయంతో ఆ వివరాలు ఆరా తీసాను. అతనికి ఇదివరకే ఒకావిడతో పెళ్లైపోయి పిల్లడున్నాడనీ, ఆమెకి తనకు గొడవలొచ్చి ఆ వివాహం విడాకుల దాకా వెళ్లిందని, ఆమె భర్తపై గృహహింస కేసు పెట్టినట్లు, ఆ తరువాత అతను అమెరికా వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ విషయాలేవీ నువ్వు తెలుసుకోకుండా అతని ట్రాప్‌లో పడి తనతో సమీరకు వివాహం చేద్దామనీ ప్రయత్నించావు. కూతురు పెళ్లి విషయంలో ఒక తండ్రిగా నువ్వు కనీస జాగ్రత్తలు తీసుకోవద్దా? ఎవరో చెబితే వాళ్ల మాటలు నమ్మి కూతు
రికి ముక్కూ మొహం తెలియని వాడితో వివాహం చెయ్యడానికి సిద్ధపడటం సరియైన చర్యేనా? సమీర తెలివైనది కాబట్టి నాకు అన్ని విషయాలు చెప్పి అతని మోసం నుంచి బయటపడిరది. నీ మాటలు గుడ్డిగా నమ్మి ఉంటే తను కూడా ఆ ఊబిలో కూరుకుపోయేది? ఏ తండ్రైనా కూతురి జీవితాన్ని బంగారంలా తీర్చిదిద్దాలనీ అనుకుంటారు. కానీ ఇలా తెలివి తక్కువగా వ్యవహరించడు. కనీసం నీ కొడుక్కైనా అతని గురించి చెప్పి కనుక్కోవాలన్న ఆలోచన నీకు రాలేదు… కేవలం నామీద మా కుటుంబం మీద కోపంతో కూతురి జీవితం నాశనం చెయ్యడానికి కూడా సిద్ధపడ్డ మూర్ఖుడివి. నేనే లేకపోతే సమీర జీవితం ఛిన్నాభిన్నం అయ్యేది. ఆ పని చేసినందుకు నన్ను అభినందించాల్సిది పోయి తిరిగి తగుదునమ్మా అనీ వచ్చి తిడుతున్నావు. మా కుటుంబం గురించి, నీ గురించి ఈ ఊరివాళ్లతో ఏం చెబుతావు? నువ్వు చెబితే ఊళ్లో వాళ్లు గుడ్డిగా నమ్మేస్తారను కుంటున్నావా? నువ్వెలాంటి వాడివో వాళ్లకి తెలియ దనుకుంటున్నావా? ఈ ఊళ్లో సగం తగువులకు, గొడవలకు నువ్వే కారణం అనీ ఊరందరికీ తెలుసు? నువ్వు నా గురించి, నిప్పు లాంటి మా కుటుంబం గురించి ఊరివాళ్లకు ఏది పడితే అది చెబితే నమ్మడానికి వాళ్లు నీలా పిచ్చివాళ్లు కారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దాని జీవితాన్ని చక్కదిద్దు. అది నీకు ఈ విషయాలన్నీ చెప్పలేక చాలా రోజుల నుంచీ తనలో తానే కుమిలిపోతున్నది. నీతో మాట్లాడే స్వేచ్ఛకూడా ఇవ్వని నువ్వేం తండ్రివి? పిల్లలు ఎదిగిన తరువాత తండ్రి ఒక స్నేహితుడిలా ఉండాలి. కానీ శత్రువులా కాదు. నువ్వు అందరి తండ్రుల్లా ఉంటే నీతోనే చెప్పేది. నువ్వు వినని మూర్ఖుడివి కాబట్టే నాకు చెప్పింది. ఇంకో విషయం… నేనెప్పుడు నీ కూతురి వెంటపడలేదు. ఆ అవసరం కూడా నాకు లేదు. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నామన్న చనువుతో ఒక స్నేహితురాలి గానే ఆమెను భావించాను గానీ నాకెటువంటి దురుద్దేశాలు లేవు. ఆమె జీవితం బాగుంటే సంతోషించే వాళ్లలో మొదటివాడిని నేను. అయినా కక్ష కార్పణ్యాలతో చెల్లెలి కుటుంబాన్ని ఆడిపోసుకోవడం తప్పా ఎప్పుడైనా ఆమెను తోడబుట్టువుగా చూశావా? నువ్వు మా మీద ఇంత విషం కక్కుతున్నా మా అమ్మ నిన్ను గానీ, మీ కుటుంబాన్ని గానీ ఒక్క మాట అనదు.వెళ్లు… ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొనీ అందరితో మంచిగా ఉండి కూతురి జీవితాన్ని చక్కదిద్దు. అప్పుడు నిన్ను అందరూ మంచి తండ్రనే కాక మంచి మనిషివనీ మెచ్చుకుంటారు’’ అంటూ గట్టిగా చెప్పడంతో మా మావ మౌనంగా వెళ్లిపోయాడు. వెళుతున్నప్పుడు అతని ముఖంలో వచ్చినప్పటి కోపం లేదు. సరికదా పశ్చాత్తాపం కనిపించింది.
పుట్టుకతో ఎవ్వరూ చెడ్డకారు. పరిస్థితులు, డబ్బు మనుషుల్ని పాడు చేస్తాయి. నేను మా మామ వెళ్లిపోతుంటే చాలా సేపటివరకు అతన్నే చూస్తూ నిలబడిపోయాను. ఇప్పుడు నాలో కూడా ఆవేశం తగ్గి ప్రశాంతత కలుగుతోంది.. రాగద్వేషాలకు ఎవ్వరూ అతీతులు కారు…
* * * *
తొలకరి మొదలైంది. ఏరువాకలు ఊపందు కున్నాయి. అప్పుడప్పుడు చిరుజల్లులు నేలతల్లిని ముద్దాడుతున్నాయి. చెట్లు పచ్చగా మారుతున్నాయి. రైతన్నలంతా ఉత్సాహంగా పొలాల బాట పడుతున్నారు…
‘‘పొలాలనన్నీ హలాల దున్నీ’’ అన్నట్లు నాగళ్లతో కాకుండా ట్రాక్టర్లతో దున్నుతున్నారు. వరి ఆకులు పోస్తున్నారు. మళ్ళీ వేసవి తరువాత చదువుల సంవత్సరం మొదలైనట్లే పంటల కాలం ప్రవేశించింది.
ఒకప్పడు రైతులు నాగళ్లు,ఎడ్ల బళ్లు వాడేవారు. కానీ కొన్ని సంవత్సరాల నుంచీ వ్యవసాయ పద్ధతులు మారిపోసాగాయి. చాలా మంది రైతులు ట్రాక్టర్లు, వరికోసే యంత్రాలు కొన్నారు. నీటి కోసం చెరువుల మీదా, వర్షం మీద ఆధారపడకుండా బోర్లు విరివిగా తవ్వడం మొదలైంది. పూరిళ్ల స్థానంలో శ్లాబిళ్లు వెలిశాయి. పూర్వం ఎక్కడ చూసినా మట్టిళ్లు, పూరిళ్లు ఉండేవి. ఇప్పుడు అవి మచ్చుకి కూడా కనిపించటం లేదు. వీధులన్నీ కాంక్రీటు రోడ్లుగా మారిపోయాయి. అలాగే ఇంటింటికీ కొళాయిలు వచ్చాయి. పూర్వం ఊరంతా ఏటి దగ్గరే ఉండేది.
పూర్వం మా ఊళ్లో ఎక్కువగా వాలీబాల్, కబాడీ లాంటి ఆటలు ఆడేవారు. ఇప్పుడవన్ని పోయాయి. అందరూ సెల్ఫోన్లో రకరకాల ఆన్లైను గేమ్స్ ఆడుకుంటు న్నారు. రైతుల పిల్లలెవ్వరూ వ్యవసాయం చెయ్యడానికి మొగ్గు చూపటం లేదు. పూర్వం పదవ తరగతి పూర్తికాగానే వ్యవసాయంలో దిగేవారు.
ఇప్పుటి వాళ్లంతా పట్నంలో కాలేజీ బాటపట్టి బాగా చదువుకుంటున్నారు. అందరూ మోటారు సైకిళ్లు వాడుతున్నారు. మా చిన్నప్పుడు ఊళ్లోకి మోటారు సైకిలు వచ్చినా, రిక్షాలు వచ్చినా మేమందరం వాటి చుట్టూ గుమిగూడే వాళ్లం. ఇప్పుడూ వీధóతా మోటారు సైకిళ్లు. ఊళ్లో పదిహేను ఆటోలున్నాయి. బస్సులెవ్వరూ ఎక్కటం లేదు. పూర్వం ఊరికి నాలుగుసార్లు వచ్చే బస్సు ఇప్పుడు ఒక్కసారే వస్తోంది.
మా ఊళ్లో హైస్కూలు ఉంది. అందులో పనిచేసిన ఉపాధ్యాయులంతా ఇక్కడే నివసించేవారు. కానీ ఇప్పుడు రోడ్లు వేయడంతో వారంతా దగ్గరున్న పట్నంలో ఉంటూ మా ఊరికి మోటారు సైకిలు మీద వస్తున్నారు.
ఆటోలు ఎక్కువ అవడంతో చాలా మంది పిల్లలు పట్నంలోని కాన్వెంట్లలో చేరిపోయారు. దానివల్ల మా ఊరి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. చాలా మంది పట్నం బాట పట్టేయడంతో చాలా ఇళ్లు ఖాళీ అయిపోయి మొండి గోడలు దర్శనమిస్తున్నాయి.
పూర్వం మా అగ్రహారం వీధిలో 50 ఇళ్లు ఉండేవి. ఇప్పుడు పదిళ్లలోనే మనుషులుంటున్నారు. అందరూ చదువుల కోసం, వైద్యం కోసం పట్నాలకు వెళ్లి పోతున్నారు. మరి కొన్నాళ్లకు మన పల్లెసీమలు ఖాళీ అయిపోతాయేమోనన్న భయం వేస్తోంది.
ఇప్పటి తరం యువతీయువకులు పల్లెలలో ఉండటానికి ఇష్టం చూపటం లేదు…
టీవిలు, స్మార్ట్‌ఫోన్‌ల వల్ల సినిమాలు చూసేవారు తగ్గిపోయేరు. మా చిన్నప్పుడు దగ్గర పట్నంలో సినిమాకి ఎడ్ల బండ్ల మీద వెళ్ళేవారు…
చాలామంది టీవీకి అతుక్క పోవడం వల్ల బయట రచ్చబండ మీద కూర్చొనే వాళ్లే కరువయ్యారు. కబుర్లు తగ్గిపోయాయి… పక్క ఊళ్లలోని టూరింగ్ టాకీసులు మాయమయ్యాయి. పౌరాణిక నాటకాలు పూర్తిగా కనుమరుగై వాటి స్థానంలో డాన్స్ బేబీ డాన్స్‌లు వచ్చాయి. రోడ్ల మీద నగ్నంగా అమ్మాయిల చేత డాన్సులు చేయిస్తూ యువత గంతులేస్తున్నారు. నైతికత, నైతిక విలువలు, సంప్రదాయాలు బాగా తగ్గిపోయాయి.