శ్రీశైలం ఎడమగట్టు కాలువ, శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌, అందరూ సింపుల్‌గా పిలుచుకుంటున్నట్లు ఎస్‌ఎల్‌బీసీ. ఇప్పుడీ సొరంగం తెలంగాణ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సొరంగం నిర్మాణ పనుల్లో ఉన్న ఎనిమిది మంది లోపల చిక్కుకోవడం జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తింది. ఇంత భారీ ప్రాజెక్టులో ఎనిమిది మంది చిక్కుకుంటే.. వాళ్లను బయటకు తీసుకు రాలేనంత విపత్కర పరిస్థితి ఉందా? సొరంగం నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ ఎలా రూపొందించారు? జరగరాని ప్రమాదం జరిగితే సహాయక చర్యలు చేపట్టే ప్రత్యామ్నాయ మార్గాలు, అవకాశాలు లేవా? అసలు ఏంటీ ప్రాజెక్టు? ఎంత కాలం నుంచి నడుస్తోంది? ప్రాజెక్టు పనులు మొదలై 20 యేళ్లయినా ఇంకా ఎందుకు పూర్తి కాలేదు? వంటి ప్రశ్నలు అందరినీ చుట్టుముడుతున్నాయి. అసలు ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు చరిత్ర ఏంటి? ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఆలస్యం ఎందుకు అవుతోంది? అవరోధాలు ఎక్కడ ఎదురవు తున్నాయి? వంటి అంశాలను వివరంగా చూద్దాం…

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్ట్‌ ఆలోచన 42ఏళ్ల క్రితమే వచ్చింది. అయితే, ఇప్పటికీ ఇంకా ఆచరణలోకి రాలేదు. కానీ, నిర్మాణ దశలో మాత్రం ఉంది. శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాకు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టును అప్పట్లోనే డిజైన్‌ చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 45 కిలోమీటర్ల మేర టన్నెల్‌ నిర్మాణం అతిక్లిష్ట మైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ టన్నెల్‌లోనే ఎనిమిది మంది చిక్కుకుపోయారు. 9 మీటర్ల వ్యాసం.. 45 కిలోమీటర్ల దూరం, భూ ఉపరితలానికి 500 మీటర్ల లోతులో ఒక పెద్ద సొరంగం. ఆ సొరంగం గుండా 3 లక్షల ఎకరాలకు సాగునీరు, నల్గొండ జిల్లా ప్రజలకు తాగునీరు అందించాలి. ఈ ఆశయం కోసం డిజైన్‌ చేసిందే శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌-ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌. తెలంగాణలో సుదీర్ఘకాలంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టు నిలుస్తోంది. దీని నిర్మాణానికి సుమారు 42 ఏళ్ల కిందట ఆలోచన మొదలుకాగా, 20 ఏళ్ల కిందట నిధుల ఆమోదంతో పనులు కొనసాగుతూ వస్తున్నాయి.

1978లోనే టన్నెల్‌ ఆలోచన, 1980లో శంకుస్థాపన

నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ద్వారా తెలంగాణ ప్రాంతానికి సరిపడేంత నీటి వనరులు అందడం లేదన్న విమర్శలు మొదటినుంచీ ఉన్నాయి. దీనిపై ప్రజా ప్రతినిధులు, ప్రతిపక్షాల నుంచి తరచూ చర్చలు జరిగేవి. ఈ క్రమంలోనే 1978లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెనుకబడిన ప్రాంతాలకు నీటిపారుదల సదుపాయాలు అందించడంపై చర్చ జరిగింది. అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి సుధాకర్‌ రావు నేతృత్వంలో శ్రీశైలం నుంచి నీటిని అందించడానికి సాధ్యా సాధ్యాలపై ఒక టెక్నికల్‌ కమిటీ వేశారు. ఈ టెక్నికల్‌ కమిటీ సర్వే పూర్తిచేసి శ్రీశైలం నుంచి మూడు లక్షల ఎకరాలకు టన్నెల్‌ ద్వారా నీరు అందించ వచ్చన్న రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. ఈ రిపోర్టులోనే శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగాన్ని 9 మీటర్ల వ్యాసంతో 45 కిలోమీటర్ల పొడవున 300 నుంచి 500 మీటర్ల దిగువన కొండల్లో తవ్వాల్సి వస్తుందని ప్రతిపాదన చేశారు. దీని ఆధారంగానే శ్రీశైలం ఎడమ గట్టు నుండి సొరంగ మార్గం తెరపైకి వచ్చింది. దీంతో, 1980లో అక్కమ్మ బిలం వద్ద సొరంగం నిర్మాణానికి ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం అప్పుడే రూ.3 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం మారిన తర్వాత 1983 మే నెలలో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎడమగట్టు కాలువ, కుడి గట్టు కాలువకు శంకుస్థాపన చేశారు. కానీ, సొరంగం తవ్వకం పనులు సంక్లిష్టంగా మారాయి. ఆ తర్వాత 1995లో సొరంగం నిర్మాణం ఆలస్యమవుతోందని భావించిన ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయంగా నల్లగొండ జిల్లా పుట్టంగండి నుంచి ఎత్తిపోతల పథకం చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి.. పుట్టంగండి నుంచి నీటిని తరలించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీటతోపాటు హైదరాబాద్‌ తాగునీటి అవస రాలకు కూడా నీటిని తరలిస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ.. సొరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దక్కుతుందనే వాదన దశాబ్దాలుగా ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2005లో మళ్లీ ఈ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది.

నల్లమల అటవీ ప్రాంతంలో అతి పెద్ద సొరంగ నిర్మాణం ?

ప్రతిపాదిత ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి నీళ్లు తరలించాల్సిన ప్రాంతం మొత్తం నల్లమల అటవీ అమ్రాబాద్‌ రక్షిత అటవీ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మించాల్సిన ప్రాంతంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీనివల్ల అటవీ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులు ఇచ్చింది. పర్యావరణ నిబంధనల మేరకు భూమి ఉపరితలంపై కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని. అలాంటి కాలువ తవ్వడానికి అటవీ శాఖ అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే అతిపెద్ద సొరంగం తవ్వాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు.. గ్రావిటీ పరంగా కూడా సొరంగం ద్వారానే నీటిని తరలించాలనేది నిపుణుల సూచన.

2007లో నిర్మాణ పనులు ప్రారంభం

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం నిర్మాణ పనులు 2005 ఆగస్టులో రూ.2813 కోట్లతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేయగా.. 2007లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 43.93 కిలోమీటర్ల సొరంగం మార్గం నిర్మించడం కీలకమైనది. టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం)తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. రెండుచోట్ల సొరంగాలు, హెడ్‌ రెగ్యులేటర్‌, రెండు లింక్‌ కెనాల్స్‌, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 52 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత గత పదిన్నరేళ్లలో 23 శాతం పనులు జరిగాయని చెబుతున్నారు.

తుది దశకు ప్రాజెక్టు టన్నెల్‌ నిర్మాణం

శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగాన మొదటి సొరంగం 9.2 మీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 34.37 కిలోమీటర్లు నిర్మాణం పూర్తయినట్లు నీటిపారుదల శాఖ ప్రకటించింది. సొరంగం రెండు వైపుల నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు. నాగర్‌ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్‌ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద టన్నెల్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నెల్‌ నిర్మించాల్సి ఉంది. మరో సొరంగం 8.75 మీటర్ల వ్యాసంతో 7.13 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉండగా.. ఆ రెండో సొరంగం నిర్మాణం పూర్త య్యింది. ఇది నల్లగొండ జిల్లా చందంపేట మండల తెల్‌దేవరపల్లి నుంచి నేరెడుగొమ్మ వరకు ఉంది. ఇక, ఈ ప్రాజెక్టులో భాగంగా డిరడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, పెండ్లిపాకాల, ఉదయ సముద్రం రిజర్వాయర్‌ నిర్మించాల్సి ఉంది.

2010 నాటికే పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్‌

ఈ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టు ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలనేది లక్ష్యం. దీనిద్వారా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలని నిర్ణయించారు. 2010 నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా, కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పటివరకు ఆరుసార్లు ప్రాజెక్టు పూర్తి చేయడానికి గడువులు పొడిగించుకుంటూ వచ్చారు.

ప్రస్తుతం 2026 జూన్‌ లోపు పూర్తి చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించారు. అయితే, ఇన్‌లెట్‌ వైపు టన్నెల్‌ నుంచి పెద్దఎత్తున సీపేజీ -ఊటనీరు వస్తుండటంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారిందని అధికారులు చెబుతున్నారు. డీవాటరింగ్‌, డీ సిల్టింగ్‌ చేసుకుంటూ పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కొండల కిందినుంచి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో సీపేజీని నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో జరుగుతున్న పనుల్లో ఊట భారీగా ఉంటుంది. ఆ నీటిని తోడిపోస్తూ పనులు చేయడం సవాల్‌గా మారుతోంది. ఇక, సొరంగంలో పెచ్చులూడి పడకుండా రింగులు ఏర్పాటు చేసి సిమెంటు పూత పూస్తూ పనులు చేస్తున్నారు. మరోవైపు.. ప్రాజెక్టుకు అవసరమైన టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ పలుసార్లు చెడిపోయింది. టీబీఎం పాడైనప్పుడల్లా రిపేర్‌ చేసి నిర్మాణ పనులు సాగిస్తున్నారు.

భారీగా పెరిగిన అంచనా వ్యయం

మరోవైపు.. ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకు మొత్తం రూ.2647 కోట్లు ఖర్చు అయ్యింది. గత పదేళ్లలో రూ.500 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా 2019 నుంచి మూడేళ్లలో రూ.10 కోట్లే కేటాయింపులు చేసింది అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. ఈ నిధులు నిర్వహణకు కూడా సరిపోని పరిస్థితి.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు అంచనా మరోసారి కూడా పెంచింది. 2017లో రూ.3,152 కోట్లకు అంచనా వ్యయం పెరగగా.. దాన్ని రూ.4,637 కోట్లకు పెంచింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. అలాగే, నీటి పారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌ కుమార్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. తిరిగి సొరంగం పనులు ప్రారంభించాలంటే సీపేజీ నివారణ, బోరింగ్‌ మెషిన్‌ బేరింగులు ఏర్పాటు చేయాల్సి ఉందని కమిటీ భావించింది. ఇందుకు ముందస్తుగా రూ.50 కోట్లను నిర్మాణ సంస్థకు కేటాయించేందుకు ప్రతిపాదించింది. ఈ మేరకు గత యేడాది ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అలాగే 2024-25 బడ్జెట్‌లో రూ.800 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. దీంతో, దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత ఇటీవలే ఈ సొరంగం పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నెలకు 300 మీటర్ల చొప్పున టన్నెల్‌ తవ్వాలనేది నిర్మాణ సంస్థ ప్రణాళిక. దానికి తగ్గట్టుగా రెండు, రెండున్నరేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని భావిస్తున్నారు. ఏళ్ల తరబడిగా టన్నెల్‌ పనులు జరుగుతుండటంతో సమస్యలు కూడా పెరుగుతూ వచ్చాయంటున్నారు నీటిపారుదల రంగ నిపుణులు.

– సుజాత గోపగోని, సీనియర్‌ జర్నలిస్ట్‌, 6302164068

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE