వనితల సాధికారత…ప్రాంతీయం, జాతీయం, అంతర్జాతీయం – ఏ స్థాయి ఉత్సవాలకైనా ఇదే ప్రధాన నినాదం. వారిలో నేతృత్వ పటిమకు అన్ని అవకాశాలూ కలిగించాలన్నది దీనిలో కీలకం. తనను తాను కాపాడుకుంటూ తోటివారినీ కాపాడటమన్నది రక్షణ నాయకత్వ లక్షణం. పరిరక్షణ అనగానే దృశ్య సంబంధంగా మనముందు నిలిచేది భారత స్వాతంత్య్ర, గణతంత్ర మహోత్సవాల్లో దేశ రాజధాని వేదికగా ఉండే విన్యాస పరంపర. అలాగే ఏటా రాష్ట్రపతి భవన్‌లో జరిగే ‘పద్మ’ పురస్కారాల స్వీకరణలో మహిళా ప్రాతినిధ్యం. వీటి ఈ నేపథ్యంలో ముగ్గురు అతివల సాహసోపేత రీతిని స్మరించుకోవాలి. వారే రాధిక, రితికా, డింపుల్. వారే సైన్యంలోని మేజర్, బృంద కమాండర్, కెప్టెన్. ఇంకొక నాయకురాలూ ఉన్నారు. పేరు రాధ. వయసు 92!
వీరధీర శూర నారి రాణీరుద్రమ. సమరరంగాన అనుపమాన.‘ఆమే నా ఆదర్శం’ అంటారు రాధికాసేన్. ‘హిమాచల్ స్వస్థలమైన మీకు ఆనాటి ఆ తెలుగు తేజం ఎలా స్ఫూర్తి’ అని అడిగితే, చరిత్ర రచనల్లో చదివానని బదులిస్తారామె.
రుద్రమదేవి, అవక్రపరాక్రమశాలి. కాకతీయ వంశాన ధ్రువతార. పరిపాలన పగ్గాలు చేపట్టిన నిర్వహణ దక్షురాలు. అసూయాపరులు చుట్టుముట్టి నపుడు ఆయుధధారిణి అయి స్త్రీ శక్తిని భరించలేని త•త్వాన్ని ఆసాంతం తరిమిన సాధికార యుక్తి రూపిణి. అశ్వారోహణంలో ఆరితేరి, యుద్ధ విద్యలో నిపుణత గడించి, అస్త్రశస్త్ర ప్రయోగాల్లో పేరొంది, చతురోపాయాలనీ తెలిసి, రణకౌశలాన్ని ఆసాంతమూ సొంతం చేసుకున్న సబల.
ప్రళయకాల మహోగ్ర భానుకిరణం
కల్పాంత కుపిత సాగర తరంగం
సంవర్త సమయ ఝంఝామారుతం
పరిణామ ఫలితంగానే సామ్రాజ్యంలో వెలుగు వెల్లువలు నిండాయి. గౌరవ పతాక వినువీధిన సగర్వంగా ఎగిరింది. ఇదే భావార్థాన్ని పాఠ్య పుస్తకాల్లో చదివిన రాధిక… శక్తి, స్వావలంబన అనేవి సాధిస్తేనే వస్తాయని ఆవాహన చేసుకున్నారు. రక్షణ విద్య ప్రతి స్త్రీకీ అత్యవసరమన్నది ఆమె నిశ్చితాభి•ప్రాయం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్క రించుకొని వనితా సాధికారత వారోత్సవాలూ ఏర్పాటయ్యాయి. అందులో భాగంగా, రక్షణ విభాగాలు దేశం లోని పలు ప్రాంతాల్లో .. ప్రత్యేకించి విద్యార్థినులకు ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాలను చేపట్టాయి. అమ్మాయిలకు భద్రత కలిగించే చట్టాలు, న్యాయ నిబంధనల వివరాలను విపులీకరించారు. అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఉపయోగించే అనేకానేక ఆయుధాలను ప్రదర్శనగా ఉంచారు. ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగేలా విశదీకరించారు. కాంగ్రా ప్రాంతానికి చెందిన రాధిక ఇంజనీరింగ్‌లో పట్టభద్రులయ్యారు. సైన్యంలో ప్రవేశానికి పోటీ పరీక్షలో విజయం సాధించి పదాతి దళంలో చేరారు. నిత్యమూ ఉల్లాసంగా ఉంటూ ఎన్నో సందర్భాల్లో ప్రత్యేకత నిరూపించుకున్నారు. పర్యవసానంగా సీనియర్ సేనాధికారిణిగా మేజర్ అనిపించుకున్నారు.
ఐక్య రాజ్య సమితికి చెందిన శాంతి పరిరక్షక దళంలో ఆమెకి ముఖ్యస్థానం లభించింది. కాంగో దేశానికి వెళ్లి ప్రత్యేక విధులు నిర్వర్తించిన ఆమెకు ‘సమితి’ విశిష్ట పురస్కారం అందించింది. శాంతియుత వాతావరణ పరికల్పన కృషికి దక్కిన అది అత్యున్నత ప్రతిఫలం.
భారత రక్షణ వ్యవస్థలోని సత్తువను ఎర్రకోట ఆవరణలో చాటి చెప్పిన పాటవం రాధికది. ఆమె పాల్గొన్న ఆ విలక్షణ కార్యక్రమం పేరు ‘కర్తవ్యపథ్’. క్విక్ రియాక్షన్ ఫోర్స్ వాహనానికి కమాండర్‌గా వ్యవహరించారు. అది అసమాన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. ఎంతటి పేలుడు తీవ్రతనైనా నిలువరి స్తుంది. ఆ శకట ప్రదర్శక బృందానికి నేతగా ఉండడం ఎంతో ఘనతర బాధ్యత. మహిళా మణుల నివాస ప్రాంతాల్లో గస్తీ / నిఘా పనులు నెరవేర్చటం మరో విశిష్ట అనుభవంగా చెబుతారు.
దేశ రాజధాని నగరంలో పుట్టి పెరిగిన రితికా… తనకు స్ఫూర్తినిచ్చింది తండ్రి అని చెబుతుంటారు. ఆయన ఢిల్లీలోనే పోలీసు అధికారి. రక్షణ బాధ్యతల నిర్వహణను మించింది మరేదీ ఉండదని అంటుం టారు. ఆ ఉత్సాహ ప్రోత్సాహాలతోనే సైనికదళంలోకి ప్రవేశించారు. ‘మా అమ్మ ఉపాధ్యాయిని. పిల్లల భవితకు బంగరు బాట వేసే వృత్తి తనది. ఏ పని తీసుకున్నా తనదైన విశిష్టత చూపితేనే గుర్తింపు, గౌరవం లభిస్తాయన్నది తన భావన. ఆ గుణాన్నే నేనూ అలవాటుగా మలుచుకున్నా’ అంటున్నప్పుడు రితికా కళ్లలో సగర్వం ప్రతిఫలించింది.
సిగ్నల్ ట్రైనింగ్ సెంటర్ విభాగంలో ఎంద రెందరో నిపుణత్వ శిక్షణ పొందుతుంటారు. వారిలో అత్యధికులు పురుషులే. వారి మధ్య ఒకే ఒక యువతి రితికా! వందల మంది నుంచి కేవలం పన్నెండు మందిని ఎంచుకున్నారు కవాతు ప్రదర్శనకి. ఆ కొద్దిమందిలోని ఏకైక వనిత రితాకానే. అదే సిగ్నల్ టీమ్‌కి నాయకురాలిగా ముందు నడిచిందీ ఆమె!
‘భారత సేన అంటే ఎంతో విఖ్యాతం. వనితా శక్తినీ ఆహ్వానిస్తోంది. అందులో నేనూ ఉండటం ఎంత సంతోషాన్ని పెంచుతోందో మాటల్లో చెప్పలేను. అవకాశాలు అరుదుగా వస్తాయి. అందిపుచ్చు కోవాల్సింది యువతరమే! పట్టుదలగా ప్రయత్నించాలే కానీ, సాధ్యంకాని దంటూ ఉండదీ ప్రపంచంలో. నేను కలలు కన్నాను. సాకారం చేసుకున్నాను. మీరే చెప్పండి ఇప్పుడు! ఇది కాదా వనితా సాధికారత అంటే? అంటున్న రితికా అందరికీ భవ్యదీప్తి.
రవి సహస్ర ప్రభాసి చిరత్న రత్న
కాంచన కిరీటమది శిరోగ్రమున మెరసె
సమద శత్రు భయంకరోజ్వల కరాళ
కాళి కరవాలమది కరాగ్రమున నొరసె!
అని మనోనేత్రం ముందర సాక్షాత్కారం సిద్ధిస్తుంది. ఎంతో మంది సైనికులు కదం తొక్కుతుంటే, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది కళ్లు తిలకిస్తుంటే, బృందానికి నాయకత్వం వహించ డమనేది ఎనలేని భావోద్వేగాన్ని కలిగించింది రితికాకు! ఆ ఉద్వేగం వెనక ఆశలూ ఆశయాలూ ధ్యేయాలూ, లక్ష్యాలూ లెక్కలేనన్ని, అన్నింటి కేంద్రీకృత రూపమే కమాండర్ హోదాలో తాను అగ్రేసరి కావడం.
జనగణ విక్రాంత రథము జయపథాన కొనసాగెను
ధరాతలము నలువైపుల చిరునవ్వులు చిలికించను
అనిపించక తప్పదు ఎప్పుడైనా, ఎక్కడైనా!
పేరూ, తీరూ ఉత్సాహభరితం అని ‘డింపుల్’ను (పూర్తి పేరు డింపుల్ సింగ్‌భా•) చూడగానే అనిపిస్తుంది. రాజస్థాన్ ప్రాంతం జోధ్‌పూర్ తన స్వస్థలమైనా, విద్యాభ్యాసం పలుచోట్ల సాగింది. సోదరి దివ్య ప్రేరణతో డింపుల్ చెన్నై చేరి, అక్కడి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ సర్వసమగ్ర శిక్షణ పొందారు. అనేకమంది క్యాడెట్లు ఉన్న అక్కడ పాటవ పోటీలో స్థానం సంపాదించారు. ఉన్నతాధికారుల నుంచి పతకాన్ని స్వీకరించారు. అన్నింటికన్నా మిన్న అయిన స్వీకరణ ఏమిటంటే…ఆమె నుంచి గౌరవ వందనాన్ని భారత రాష్ట్రపతి స్వీకరించడం! పన్నెండు అడుగుల పైగా ఎత్తుగల నిచ్చెనపై నిలచి ఉండి, మోటారు వాహనం నడుపుతూనే సెల్యూట్ చేశారు కెప్టెన్ డింపుల్. ఆమె అలా వందన సమర్పణ చేసిన మొదటి యోధురాలు. ఆ విన్యాస ప్రదర్శన కోసం నెలల తరబడి శిక్షణ, సంసిద్ధత వహించారు. ఎంతో శారీరక పటిమ, మరెంతో మహాదారుఢ్యం ఉంటే తప్ప అలాంటి సాహసకృత్యం చేయలేరు. అప్పుడు ఆమె మనోమందిరాన..
భారతీయ నారి నేను!
నిత్యశక్తి ధాత్రి నేను!
ప్రియకర త్రివర్ణ రమ్య
జయపతాక విలసిల్లెను!…అని ప్రతిధ్వనించినట్లు ఉండిఉంటుంది.
డింపుల్ బాల్యమంతా సైనిక కంటోన్మెంట్ ప్రదేశంలోనే గడిచింది. కంప్యూటరు సైన్స్ కోర్సుచదువుతూనే సైనిక బాధ్యతల మీద మక్కువ పెంచుకున్నారంటే- అదంతా జాతీయ భావ ప్రపూర్ణం. కళాశాల రోజులలోనే సేనా శిక్షణార్థిగా ఉన్నారు. రక్షణ అంశాల ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయి ర్యాంకును సాధించారు. మెరుపు వేగాన్ని తలపించే వాహన బృంద సార•థి•గా అందరితో శభాష్ అనిపించుకున్నారు. ‘కుటుంబ సభ్యుల్లో మీపై ఎవరి ప్రభావం అధికం?’ అన్న ప్రశ్నకు తాతగారి పేరు చెప్పారు. ఆయన త్రివిధ దళాల సైనికులకు సంబంధించి అత్యున్నత పురస్కారం పరమవీరచక్ర స్వీకర్త. ఇదంతా తనలోని చైతన్య వ్యాప్తికి దోహదకారి అంటున్నారు కెప్టెన్ డింపుల్.
ఆమె తాతగారి గురించి అనుకున్నాం కదా. ఇప్పుడిక తొమ్మిది పదుల వయసును మించిన రాధా బెన్‌భట్ గురించి! చిన్న నాటి నుంచీ తానొక సిసింద్రీ. అల్మోరా (ఉత్తరాఖండ్) వాస్తవ్యురాలైన ఆమె ఇప్పుడు గుజరాత్ ఆశ్రమవాసిగా ఉంటున్నారు. అమ్మాయిల ధీశక్తిని పెంపొందించే ఉద్యమాన్ని చేపట్టి, ఎందరో అనుయాయుల్ని సంపాదించుకున్నారు. స్త్రీలు సబలలు అంటూ,సాహసిక ప్రవృత్తిని పెంపొందింప చేస్తూ వస్తున్నారు. ఇరవై ఏళ్ల వయసులో విమోచన ఉద్యమ సమయాన కారాగారానికి వెళ్లడం ఇంకెంతో విలక్షణత.
రాధదీ సైనిక కుటుంబం. క్రమశిక్షణకు పేరొందిన తరం. గ్రామీణ మహిళాలోకానికి సేవలందించడంతోనే ఆమెకు తృప్తీ, సంతోషం. ఆ లక్ష్యంతోనే సముద్ధరణ సంస్థ నిర్వహణను చేపట్టి, అదే తరుణాన గ్రామ స్వరాజ్య వ్యవస్థను స్థాపించి, ఎంత ప్రశస్తిని అందుకున్నారు. అందుకు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
ఇలా ఆ ముగ్గురూ, ఈ ఒక్కరూ… మొత్తం నలుగురూ నిశ్శబ్ద సంచలనానికి ప్రతీకలు. నారీలోక మణిహారాలు. వారికి నిఖిల జన జయజయధ్వానాలు. వనితల సాధికారతే జాతి పురోగమనానికి ప్రతీక.
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్