ఈశాన్య రాష్ట్రాల్లో రత్నాల భూమిగా, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్‌లో ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలో మరోసారి ఘర్షణలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా తర్వాత కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు అవకాశం ఉన్నా.. ముందుగా అక్కడి పరిస్థితులను చక్కదిద్దే దిశగా రాష్ట్రపతి పాలన విధించింది కేంద్ర ప్రభుత్వం.
శాంతి పక్రియకు అవరోధాలు కల్పిస్తూ కొన్ని వర్గాలు దుందుడుకుగా ప్రవర్తించడంతో తాజాగా మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల మధ్య సామరస్యాన్ని పెంచేందుకు కలిసిరావాల్సిన విపక్షాలు బాధ్యత మరిచి విద్వేషపూరిత రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. మణిపూర్‌లో జాతుల మధ్య వైరం కొత్తదేం కాదు. రాష్ట్రంలోని ప్రధాన తెగలైన మెయితీ, కుకి-జోల మధ్య పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ ఘర్షణతో ఇరువర్గాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. వేలాది మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. వారి నివాసాలు ధ్వంసమయ్యాయి, వందలాది మంది మరణించారు. విదేశీ జోక్యం ఈ పోరాటాన్ని ప్రమాదకర మలుపు తిప్పింది. ఈ కారణంగానే మణిపూర్ నిరంతరం మీడియాలో నిలుస్తోంది. మణిపూర్‌లో 2023 మే 3వ తేదీ నుంచి నుంచి ఇప్పటి వరకూ 260 మంది బలి కాగా, 60 వేల మంది ఇప్పటికీ రక్షణ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రాష్ట్రం రెండు తెగలమధ్యా చీలిపోయింది. ఒకరి ప్రాంతాల్లోకి మరొకరు వెళ్లే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రయత్నాలను కేంద్రం ఇప్పుడు ముమ్మరం చేసింది.
మణిపూర్‌లో జరుగుతున్న పోరాటం రాజకీయ పార్టీల మధ్య కాదు. జాతుల మధ్య జరుగుతున్న పోరాటం ఇది. దేశ భద్రత, సమగ్రతలను దృష్టిలో పెట్టుకొని అక్కడ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా తన వంతు కృషి చేయాలి. కానీ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో కొనసాగుతున్న చిచ్చు నుంచి చలికాచుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రతీసారి పార్లమెంట్ సమావేశాలకు ముందు ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ సమావేశాలను అడ్డుకోవడం ఆనవాయితీగా మారింది. తాజాగా మరోసారి సరిగ్గా పార్లమెంట్ సమావేశాలకు రెండు రోజుల ముందు మణిపూర్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి.
రాష్ట్రంలో శాంతి నెలకొనే చర్యల్లో భాగంగా నిర్బంధాలు, దిగ్బంధాలను తొలగించి, ప్రజలంతా స్వేచ్చగా• తిరిగేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కల్పించిన అవకాశాన్ని కొన్ని శక్తులు దుర్విని యోగం చేయడంతో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.
కేంద్రంపై కుకీల కన్నెర్ర
మణిపూర్‌లో ఈ నెల 8వ తేదీన కుకీ తెగ ప్రాబల్య కాంగ్పోక్పి జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజారవాణాకు, ప్రజల సంచారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కుకీలు తమ ప్రాబల్య ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు. తమకు ప్రత్యేక పాలనా విభాగం కావాలని డిమాండ్ చేశారు. అప్పటివరకూ ఇతరులను తమ ప్రాంతాల్లోకి అనుమతించేది లేదంటూ నిరసనకారులు ప్రైవేటు వాహనాలకు, ప్రభుత్వ బస్సులకు నిప్పంటించారు. ఇంఫాల్-దిమాపుర్ రహదారిపై రాకపోకలకూ ఆటంకం కలిగించారు. నిరసనకారులు వాహనాలపై రాళ్లు రువ్వడమేకాకుండా రోడ్లను తవ్వారు. భద్రతా బలగాలు వారిని అడ్డుకోవడంతో ఘర్షణలు జరిగాయి. నిరసనకారులు ఇంఫాల్ నుంచి సేనాపతి జిల్లా వైపు వెళ్తున్న రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి చేయి దాటింది. దీంతో, భద్రతా దళాలు ప్రదర్శన కారులను చెదరగొట్టడానికి భాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో పాటు కాల్పులు జరిపాయి. ఈ ఘర్షణల్లో ఒకరు మృతి చెందారు. మహిళలు సహా 43 మంది గాయపడ్డారు. వీరిలో 27 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మెయితీ వర్గానికి చెందిన పౌర సమాజ సమాఖ్య చేపట్టిన శాంతి ప్రదర్శనను వ్యతిరేకిస్తూ కూడా కుకీ ప్రజలు ఆందోళనలకు దిగారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో చేపట్టిన శాంతి ర్యాలీని పోలీసులు కాంగ్‌పోక్పికి రాకమునుపే అడ్డుకున్నారు. ర్యాలీ ముందుకు సాగాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వెళ్లాలని వారికి షరతు విధించారు. చివరికి వారందరినీ 10 ప్రభుత్వ బస్సుల్లో తరలిస్తుండగా కుకీల మెజారిటీ ప్రాంతమైన కాంగ్‌పోక్పి వద్ద ఆందోళనకారులు బస్సులను అడ్డుకుని, ఒక బస్సుకు నిప్పంటించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. నిరసనకారులను చెదరగొట్టాక మైతేయి శాంతి ర్యాలీ నిర్వాహకులున్న బస్సులు ముందుకు సాగాయని చెప్పారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. మరోవైపు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కుకీ జో కౌన్సిల్ నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ఘర్షణల తరువాత రాష్ట్రంలో దాదాపు 114 ఆయుధాలు, ఐఈడీలు, గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు సీజ్ చేశాయి. కాంగ్‌పోక్పి, చురచంద్‌పూర్, టెంగ్నౌపాల్‌తో సహా ఐదు కొండ జిల్లాల్లో ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ పరిస్థితి ప్రశాంతంగా ఉంది.
17 మంది ఉగ్రవాదుల అరెస్టు
హింసాత్మక ఘటనలు జరిగిన కొద్ది గంటల్లోనే మణిపూర్ పోలీసులు వేర్వేరు ప్రాంతాల నుంచి 17 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వారి నుంచి కార్లు, ద్విచక్ర వాహనాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లా, ఇంఫాల్ తూర్పు జిల్లా, టెంగ్నౌపాల్ జిల్లా నుంచి ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఉగ్రవాదులు నేషనల్ రివల్యూషనరీ ఫ్రంట్ ఆఫ్ మణిపూర్, కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ, పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్, కాంగ్లీ యావోల్ కన్నా లూప్‌లకు చెందినవారని వారు వెల్లడించారు. ఉగ్రవాదులు అధికారులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, సామాన్య ప్రజల నుంచి డబ్బును దోచుకోవడంతో పాటు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి రవాణా, తదితర అనేక నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 14 మొబైల్ ఫోన్లు, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనం, రూ.1.07 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చిన తర్వాత మణిపుర్‌లో శాంతి పునరుద్ధరించే లక్ష్యంతో గవర్నర్ అజయ్ భల్లా ఓ ప్రకటన విడుదల చేశారు. అక్రమంగా ఉంచుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఏడు రోజుల్లోగా అప్పగించాలని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గవర్నర్ పిలుపు తర్వాత ఏడు రోజులలో దాదాపు 300 ఆయుధాలను ప్రజలు ప్రభుత్వానికి అప్పగించినట్లు సమాచారం.
మరోవైపు ఈశాన్య ప్రాంతాల్లోని తిరుగుబాటు దారులు తమ ఆయుధాలను వీడి జన జీవన స్రవంతిలోకి రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో వారి భాగ స్వామ్యాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలో అస్సాం రైఫిల్స్ నిర్వహించిన ‘యూనిటీ ఉత్సవ్- వన్ వాయిస్, వన్ నేషన్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈశాన్య భారత్ శాంతి, అభివృద్ధిని కోరుకుంటోందని, దేశంలో ముఖ్యమైన భూమిక పోషించాలని అనుకుంటోందని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఈశాన్య భారతంలో 10వేల మంది తిరుగుబాటుదారులు లొంగి పోయారని, 12 శాంతి ఒప్పందాలు కుదుర్చు కున్నామని తెలిపారు. 70శాతం హింస తగ్గిందని వెల్లడించారు.
మణిపూర్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్
రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2025-26 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఖర్చు రూ.35,103.90 కోట్లు ఉంటుంది. మొత్తం అంచనా ఆదాయం రూ.35,368.19 కోటు. ఇది 2024-25లో రూ.32,471.90 కోట్లుగా’’ అని సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ తెలిపారు.
హిందూ దేవాలయాల పునరుద్ధరణ
మణిపూర్‌లో కొనసాగుతున్న సంఘర్షణలో దెబ్బతిన్న హిందూ దేవాలయాలు, ఇతర మతపరమైన ప్రదేశాలను పునరుద్ధరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలను జారీ చేశారు. సాయుధ గ్రూపులు ధ్వంసం చేసిన మెయితీలకు చెందిన మతపరమైన ప్రదేశాలను పునర్నిర్మించడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిర్ణయాన్ని అరంబై టెంగోల్‌తో పాటు మెయిటీ గ్రామ వాలంటీర్లు స్వాగతించారు. అమిత్ షా నిర్ణయం రాష్ట్ర సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ దిశగా ఒక ముఖ్యమైన అడుగు’’ అని అభివర్ణించింది అరంబై టెంగోల్. ఇది సమాజంలో శాంతి, ఐక్యతను తీసుకురావడానికి సహాయపడుతుందని అని పేర్కొంది. ‘‘కేంద్ర ప్రభుత్వం సామరస్యపూర్వక పరిష్కారం వైపు అడుగు వేసింది. వారి ఆదేశాలను పాటించడం మన బాధ్యత. సంక్షోభం కొనసాగితే మేము మౌనంగా ఉండము. మన భూమిని, మన ప్రజలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపింది.
అందరూ ఆలోచించాల్సిందే..
గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయంలో ఈశాన్య రాష్ట్రాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో అక్కడి ప్రజలు మిగతా దేశ ప్రజలతో కలిసిపోలేక పోయారు. మన హైదరాబాద్ లేదా ఢిల్లీ, ముంబైల నుంచి ఎవరైనా అక్కడి రాష్ట్రాల పర్యటనకు వెళ్లితే ‘ఇండియా నుంచి వచ్చారా?’ అని అక్కడి ప్రజలు అడిగిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ఈశాన్య ప్రజలు విద్యా, ఉపాధి అవకాశాల కోసం దేశంలోని మిగతా రాష్ట్రాలకు వెళ్లినప్పుడు వారిని చూసి చైనా, టిబెట్, భూటాన్, నేపాల్ వారని అనుకోవడం కూడా చూసే ఉంటాం. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి చాలా వరకూ మారింది. ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. ఈ కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ లేదా ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
మణిపూర్ సమస్య కేవలం ఈశాన్యరాష్ట్రానికే పరిమితమైన చిన్న ఘటనలుగా వదిలేస్తే అది దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఇది విస్తరించే ప్రమాదం ఉంది. పంజాబ్‌లో ఖలిస్తానీలు, తమిళనాడులో ద్రవిడ వేర్పాటువాదులు, జమ్మూ కశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదం, కొన్ని రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం కారణంగా మన దేశం ఇప్పటికే సమస్యలను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్, చైనా దేశాలు మన దేశంలో నిరంతరం అశాంతిని ఎగదోసే కుట్రలు కొనసాగిస్తున్నాయి. ఆగ్నేయాసియాతో మన దేశాన్ని అనుసంధానించే ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి జ్వాలలను ఎగదోసేందుకు చైనా కుట్రలెన్నో పన్నుతోంది. మణిపూర్ సంక్షోభ నివారణకు రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
కులాల వ్యవహారం కోర్టులతో కాదు
ఇటీవల దేశవ్యాప్తంగా ఆరె కటిక (ఖటిక్) కులస్తులను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. మణిపూర్‌లో జరిగిన అల్లర్లను ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. కులాల జాబితాలో సవరణలు చేసే అధికారం కేవలం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుంది కాబట్టి పార్లమెంట్‌నే ఆశ్రయించాలని సూచించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆరె కటిక కులస్తులను ఎస్సీల జాబితాలో చేర్చాలని కోరుతూ తెలంగాణ ఆరె కటిక (ఖటిక్) అసోసియేషన్ జనవరి 8న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. కొన్ని రాష్ట్రాల్లో ఆరె కటిక కులస్తులు ఎస్సీ సామాజిక వర్గంలో ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గంలో ఉన్నారని ఆరె కటిక అసోసియేషన్ కోర్టుకు తెలిపింది. దీంతో వేరే రాష్ట్రానికి చెందిన అమ్మాయి లేదా అబ్బాయితో పెళ్లి జరిగినప్పుడు రిజర్వేషన్ల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయని పిటిషన్‌లో పేర్కొంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ‘అసలు మీ పిటిషన్ విచారణకు ఎలా సమర్థనీయం?’ అని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ‘‘మణిపూర్‌లో ఏం జరిగిందో మీకు తెలుసు కదా? అక్కడ మైతేయి కులస్తులకు సంబంధించిన కేసులో హైకోర్టు నిర్ణయం తర్వాత ఏం జరిగింది? మణిపూర్‌లో ఎలా అల్లర్లు జరిగాయో చూశారు కదా?’’ అంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని, హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అందుకు సైతం ధర్మాసనం అభ్యంతరం తెలుపుతూ ‘‘కులాల జాబితాను సవరించడం, కొత్త చట్టాలను రూపొందించడం పార్లమెంట్ చేస్తుంది. హైకోర్టుకు వెళ్లినా మీకు పరిష్కారం దొరకదు. కాబట్టి పార్లమెంట్‌ను ఆశ్రయించండి’ అని చెప్పింది.
క్రాంతిదేవ్ మిత్ర
సీనియర్ జర్నలిస్ట్