మార్చి 21 కవితా దినోత్సవం
కవిత్వాన్ని సమాజానికి మరింత చేరువ చేయడం, భాషా వైవిధ్యానికి మద్దతు ఇవ్వడం, అంతరించిపోతున్న భాషలను కాపాడే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఏటా మార్చి 21వ తేదీని కవితా దినోత్స వంగా ప్రకటించింది. రెండున్నర దశాబ్దాల (1999) క్రితం ప్రారంభమైన ఈ దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తెలుగుసాహిత్యంలో కవిత్వం ఒక సృజనాత్మక, విలక్షణ పక్రియ. ప్రతి సాహిత్య పక్రియ ప్రత్యేకమైనదే. కాకపోతే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పక్రియ ప్రాచుర్యం పొందడం గురించి నన్నయ యుగం నుంచి వర్తమానం వరకు చోటు చేసుకున్న పరిణా మాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఇతర అంశాలతో సమాంతరంగా కవితా పక్రియ ప్రాభవం సాగుతోంది. సాధారణ వాక్యానికి భిన్నంగా నిగూఢతను కలిగి ఆలోచింప చేయడంతో పాటు మనసును రంజింపజేసే రచనను కవిత్వంగా నిర్వచించారు. కథకైనా, కవితకైనా సామాజిక ప్రయోజనం ఒక్కలానే ఉంటుంది. కాకపోతే కథలో విస్తృతి, కవితలో క్లుప్తత ఉంటుంది. కథ ఒక మేఘంలా ముందు ప్రత్యక్షమైతే, కవి చెప్పదలచిన అంశం అందులో మెరుపులా ఉంటుంది.అదే కవిత అయితే, కవి చెప్పాలనుకున్న అంశం తొలుత మెరుపులా తోచి, తరువాత పాఠకుడిని ఆలోచింప చేసి, దాని నేపథ్యం మేఘంలాగా దర్శనమిస్తుంది.
ఒకటి రెండుసార్లు చదవడంతోనే పాఠకుడి మనస్సులో ఉండిపోవడం, సందర్భానుగుణంగా జ్ఞప్తికి తెచ్చుకొని ఉదహరించగలిగేది సిసలైన కవితగా కొందరు విశ్లేషించారు. అలాంటి ఉటంకింపులనే ‘ధారణ యోగ్యత’ అంటారు. కవితను లయబద్ధంగా రాయడం ధారణకు ప్రధాన సాధనమని, రచన ఛందో బద్ధమైనా, గేయరూపమైనా లయబద్ధత, ఒక ఊపు ముఖ్యమని చెబుతారు. ఆ లక్షణాలు లోపించినప్పుడు, కవిత ఎంత గంభీరంగా, భావబంధురంగా ఉన్నా అంత తేలికగా మనస్సుకు పట్టదు. అనేకులు భారత భాగవతాదుల నుంచి కొన్నిటిని తరచూ ఉదహరించడానికి ఆయా కవులు పాటించిన లయబద్ధత, పాద పద్ధతులే కారణంగా చెబుతారు. కవిత ప్రజల నాలుకల పైన నాట్యమాడాలంటే వాటిని తప్పక పాటించాలని సాహితీ విమర్శకులు అంటారు.
తెలుగులో కవిత ఆవిర్భావాన్ని పరిశీలిస్తే… తెలుగు కవిత రాసేందుకు తొలి ప్రయత్నం తూర్పు చాళుక్యరాజు గంగ విజయాదిత్యుని కాలం (848-892) నాటి అద్దంకి శాసనంలో కనిపిస్తుందని ఆచార్య దివాకర్ల వెంకటావధాని వెల్లడించారు. విజయాది త్యుని సేనాపతి పాండురంగడి జైత్రయాత్రలు అందులో వర్ణితమయ్యాయి.‘పదకొండవ శతాబ్దం వరకు శాసనాలలో కనిపించే తెలుగు కవిత దేశిపద్ధతిలోనే సాగింది (తెలుగులో మార్గ, దేశి కవితలు అనే వాటిలో.. సంస్కృత సంప్రదాయాన్ని అనుసరించినది మార్గకవిత కాగా, భాషా ఛందస్సు, ఇతి వృత్తం విషయంలో అచ్చమైన తెలుగు శైలి దేశి అని స్థూలంగా నిర్వచించారు సాహితీవేత్తలు). గూడూరు శాసనంలో తొలి మార్గకవిత కనిపిస్తుంది. నాటి కవులు సంస్కృతం నుంచి కొన్ని ఛందోరీతులను గ్రహించి మార్గశైలిలో రాసినట్లు తెలుస్తోంది. అద్దంకి తదితర శాసనాలలోని కవితలు-ఆయా రాజుల ఘనత, జైత్రయాత్రలు, వ్యక్తులకు-సంస్థలకు చేసిన భూరి విరాళాలను తెలియచెప్పేవే తప్ప సాహిత్య ప్రధాన మైనవని కావు’ అని కూడా దివాకర్ల వివరించారు.
కవులు తమ భావనలను, భావోద్వేగాలను అనుభవాలను, సామాజిక సందేశాలను వ్యక్తీకరించడా నికి సాధనం కవిత. ‘కవిత్వమొక తీరని దాహం.. కాదేది కవితకనర్హం’ అని శ్రీశ్రీ, ‘అబద్ధాలాడడమంత సులభం అవదు సుమా! కవిత అల్లడం’ అని దాశరథి, ‘కవిత్వం చదివితే కమ్మని భోజనం చేసినట్టుండాలి’ అని ఆరుద్ర.. ఇలా అనేకులు కవితల సృజన గురించి వ్యాఖ్యానించారు. కవి నిరంకుశుడు అన్నట్లే ‘కవిత్వం ఎవరికి వంగి సలాం చెయ్యదు… జీవితం ఎవరికీ గులాంగిరి కాదు’ అని, చెప్పాలనుకున్నది చెప్పి తీరాల్సిందే అంటారు కవి, విశ్రాంత ఆచార్యులు మాడ•భూషి సంపత్ కుమార్.
నవల-నవలిక, కథ, కథానిక, గల్పిక, స్కెచ్ తదితర పక్రియలుగా ‘నవల,కథా సాహిత్యం’ అనే పేరుతో; పద్యం-గేయం, వచన కవిత, మినీ కవిత, హైకూ, నానీలు అనే రకాలుగా ‘కవితా సాహిత్యం’ పేరుతో స్థిరపడ్డాయి. నిగూఢమైన భావాన్ని కొన్ని పంక్తులలో పొదిగి, రసత్కావ ఖండికను చదివిన అనుభూతిని కలిగించడం కవిత.. ప్రధానంగా మినీ కవిత ప్రత్యేకత. వ్యర్థ పదం ఒక్కటీ లేకుండా చెప్పదలచిన భావం పూర్తయ్యాక అది పూర్తయ్యిందా లేదా అని చూడక అక్కడే ఆపివేయిడం ఇందులో కనిపిస్తుంది.
జీవనశైలిని బట్టి కూడా సాహిత్య పక్రియలలో మార్పులు చేసుకుంటాయనేందుకు కవితా పక్రియను ఉదాహరణగా చెబుతారు. ఆధునిక నాగరికతలో సుదీర్ఘ రచనలు చదివి ఆస్వాదించేంత తీరిక లేనందు మినీ కవిత, నానీ, హైకూల వంటివి వ్యాప్తిలోకి వచ్చాయి. ‘హైకూ’ అనేది జపాన్‌లో 5,7,5 అక్షరాల పరిమితితో ఎన్నడో ప్రాచుర్యంలోకి వచ్చిన మినీ కవిత. నిరాడంబరత, సులువుగా రాయగలగడం దీని ప్రత్యేకత.
ఉప పక్రియ ఏదైనా, అది విమర్శల పాలుకా కుండా నిలిచేందుకు, పదుగురి నాలుకల మీద పదికాలాల పాటు ఆడేందుకు అందులో భావపుష్టితో పాటు లోకవృత్త పరిజ్ఞానం అవసరం. అంటే రచయిత/కవి, తన చుట్టూ గల సమాజం లోని వివిధ వర్గాల జీవన విధానాలు,ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను బాగా పరిశీలించవలసి ఉంటుంది. కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు కవిని కదిలించేలా ఉండడం ప్రధానం. కవి తన అనుభ వాన్ని వ్యక్తం చేయడమే కాక, దానివల్ల పాఠకులను అనుభూతులయ్యేలా ఉండడం ఉత్తమ కవిత్వ లక్షణం.
తక్కువ అక్షరాలు/పదాలలో ఎక్కువ అర్థాన్ని చెప్పాలన్న భావన కవితలకు మరింత వర్తిస్తుంది. అలాంటప్పుడు వాటిలో ఒక అక్షరం కూడా వ్యర్థంగా ఉండకూడదనే సూత్రాన్ని చాలా వరకు కవులు పాటించారు, పాటిస్తున్నారు. తొలితరం ఆధునిక రచయితలలో అగ్రగణ్యుడు మహాకవి గురజాడ వారి…
‘‘వట్టి మాటలు కట్టి పెట్టోయ్
గట్టి మేల్ తలపెట్ట వోయ్’’
‘‘తిండి కలిగితె కండగలదోయ్
కండ గలిగిన వాడె మనిషోయ్’’….
కవితా పంక్తులు అందుకు ఉదాహరణ. అంతేకాదు.. కవిత్వంమంటే గ్రాంథికమే కాదని, వ్యవహారిక పదాలకూ భావప్రకటన సామర్థ్యం ఉందని నిరూపించారు.
– స్వామి