ప్రశాంతంగా ఉండే చరిత్రాత్మక నగరం నాగపూర్ మళ్లీ రణరంగమైంది. కారణం- మరాఠాల మీద మూడు వందల ఏళ్ల క్రితం మొగలులు ప్రారంభించిన యుద్ధం ఇంకా కొన సాగుతూ ఉండడమే. ఔరంగజేబ్ ప్రేతాత్మ ప్రేరణతో ముస్లిం మతోన్మాదులు రెచ్చి పోయారు. క్రీస్తుశకం 1707లో చనిపోయిన ఆఖరి మొగల్ పాదుషా ఔరంగజేబ్ పంథాలోనే నడవాలను కుంటున్న మతోన్మాదులే దీనికి కారణం. శివాజీ మహరాజ్‌నూ, ఆయన కుమారుడు శంభాజీనీ ముప్పుతిప్పలు పెట్టిన ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ ఆరంభమైన నిరసనను దారి మళ్లించారు. రంజాన్ మాసంలో ముస్లింల మత గ్రంథానికి అవమానం జరిగిందనే దుష్ప్రచారంతో ఔరంగజేబ్ భక్తులు విధ్వంసానికి దిగారు. వక్ఫ్ చట్ట సవరణ ముహూర్తం దగ్గర పడడం ముస్లిం మతోన్మాద శక్తులను నిలవనీయక పోవడం మరొక కారణం. ‘ఛావా’ చిత్రం తర్వాత మరాఠా ప్రజల్లో పెల్లుబుకుతున్న చైతన్యాన్ని ఆ వర్గాలు జీర్ణించుకోలేకపోవడం మరొకటి. ఈ సినిమా మీద నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను కూడా వక్రీకరించి, అల్లర్లకు పథకం వేశారు. పాకిస్తాన్ మనస్తత్వం కలిగిన ఉన్మాదులకు, బాంగ్లా కుట్రదారులు తోడయ్యారన్న అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నది.
చారిత్రక సత్యాలు కటువుగానే ఉంటాయి. విదేశీయులైన మొగలులపై ఎందరో పోరాడారు. ఔరంగజేబ్ సామ్రాజ్య విస్తరణ, దాని వెనుక దాగి ఉన్న హిందూ ద్వేషాలను గట్టిగా ప్రతిఘటించిన వీరుడు ఛత్రపతి శివాజీ. శివాజీని ఎదుర్కొనడానికి ఔరంగజేబ్ మరాఠా నేలకు వచ్చాడు. దక్కను పాలకులతో యుద్దాలు చేస్తూనే అహ్మద్‌నగర్‌లో మరణించాడు. ఔరంగజేబ్ కోరిక మేరకు అతడి మృతదేహాన్ని ఆధ్యాత్మిక గురువు షేక్ జైనుద్దీన్ దర్గాలో పక్కనే ఖననం చేశారు. ఇది శంభాజీనగర్ (గతంలో ఔరంగాబాద్) సమీపంలోని ఖుల్దాబాద్‌లో ఉంది.
అసెంబ్లీలో ఔరంగజేబ్‌కు ప్రశంసలా?
ఔరంగజేబ్ క్రూరత్వాన్ని చరిత్ర ప్రతి పుట ఘోషిస్తుంది. శివాజీ, ఔరంగజేబ్ ఘర్షణ తెలిసి నంతగా శంభాజీ విషాద గాథ చరిత్రకు ఎక్కలేదు. శంభాజీ హిందూధర్మం నుంచి దూరం కావడం కంటే చావే నయం అనుకున్నాడు. అదే ఛావా సినిమా. ఇటీవల విడుదలైన ‘ఛావా’ శంభాజీని గుర్తు చేసింది. శంభాజీ మహారాజును చంపిన ఔరంగజేబ్ సమాధి మరాఠా నేలపై ఉండటం అవమానకరంగా ప్రజలు భావిస్తున్నారు. అప్పుడే అసెంబ్లీలో ఔరంగజేబ్‌పై పొగడ్తలు కురిపించిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ ఆసిమ్ అజ్మీపై సస్పెన్షన్ వేటుపడింది. ఔరంగజేబ్, ఛత్రపతి శంభాజీ మహారాజ్ మధ్య జరిగిన యుద్ధాన్ని అబూ ఆసిమ్ అజ్మీ రాజకీయ పోరాటంగా అభివర్ణించాడు. ఈ వ్యాఖ్యలపై ఉభయసభలు దద్దరిల్లాయి. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తీవ్రంగా స్పందించారు. ‘అజ్మీ ఉద్దేశ పూర్వకంగానే శివాజీని, శంభాజీని అవమా నించారు. ఔరంగజేబ్‌ను పొగిడారు. అటువంటి అజ్మీ ద్రోహి, అసెంబ్లీలో కూర్చునే అర్హత ఆయనకు లేదు’ అని నిప్పులు చెరిగారు. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేను అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. ఈ క్రమంలో ప్రశాంతంగా ఉండే నాగపూర్‌లో చిచ్చు రగిలింది. వీహెచ్‌పీ, బజరంగళ్ అల్లర్లు ప్రారంభించాయంటూ ఒక వర్గం మీడియా బొంకడం సమస్యను తీవ్రం చేసింది.
ఆరంభం
మార్చి 17న నాగపూర్‌లోని మహల్ ప్రాంతంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం వద్ద బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆందోళన నిర్వహిం చారు. శంభాజీ హంతకుడు ఔరంగజేబ్ సమాధి మహారాష్ట్రలో ఉండకూడదని, తొలగించాలని డిమాండ్ చేశారు. జరిగింది ఇదే. అయితే ఈ ప్రదర్శనలో ఓ వర్గానికి చెందిన మత గ్రంథాన్ని కాల్చారన్న వదంతులు వ్యాపించాయి. దీనిపై గణేశ్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఆ తర్వాత భారీ సంఖ్యలో ఆ మతానికి చెందిన వారు నగరంలోని మహల్, కొత్వాలి, గణేశ్‌పేట్, చిత్నిస్ పార్క్, తలావ్ తదితర ప్రదేశాల్లో గుమిగూడారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఓ గుంపు శివాజీ చౌక్ సమీపంలోకి చేరుకుంది. వీరు ఔరంగజేబ్‌కి మద్దతుగా నినాదాలు చేశారు. వీరి దగ్గర ఆయుధాలు, పెట్రోలు కనిపించాయి. పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్, రాష్ట్ర రిజర్వ్ బలగాలను భారీ ఎత్తున అక్కడ మొహరించారు. పలుచోట్ల 144 సెక్షన్ విధించారు. చిత్నిస్ పోలీసుస్టేషన్‌పై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు. టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. దుండగులు రాళ్లు రువ్వుతూ ఇళ్లు, దుకాణాలు, వాహనాలకు నిప్పంటించారు. నిప్పంటించిన వాహనాల్లో పేలుళ్ల శబ్దం వినిపించి నట్లు సమాచారం. హన్సపురి ప్రాంతంలో రాత్రి 10.30 నుండి 11.30 గంటల మధ్య మరో ఘర్షణ చెలరేగింది. ఒక అల్లరి మూక వాహనాలను తగలబెట్టింది. కొన్ని ఇళ్లు, ఒక క్లినిక్‌ను ధ్వంసం చేసింది. అల్లర్ల తీరు ఒక పథకం ప్రకారం జరిగినట్లు ఉంది. మత గ్రంథానికి అవమానం జరిగిందనే పుకార్లను సృష్టించడం ద్వారా దుండగులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆ ప్రాంతాల నుంచి తమ వారి వాహనాలను ముందుగానే తరలించేశారు. ఆ తర్వాతే హింసకు పాల్పడ్డారు. నాగపూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేంద్ర కార్యాలయం ఉంది. ఈ నగరంలో మతఘర్షణలను లేవదీసి సంఘ్‌ను ఈ వివాదంలోకి దించే కుట్ర కూడా ఉందని భావిస్తున్నారు
మహిళా పోలీసులతో అసభ్యంగా..
అల్లర్లలో 30 మందికి పైగా సామాన్య ప్రజలు, 34 మంది పోలీసులు గాయపడ్డారు. వారిలో నాగపూర్ డీసీపీ నికేతన్ కదమ్ ఒకరు. ‘అకస్మాత్తుగా ఓ వీధి నుంచి 100 మంది గుంపు వచ్చేసింది. ఆయుధాలు, పెట్రోల్, కర్రలతోనే వచ్చారు. వారిని వెనక్కి పంపడానికి ప్రయత్నాలు చేశాను. కొందరు తగ్గారు. కానీ.. ఒకడి వద్ద గొడ్డలి ఉంది. దీంతో ముందుకు వచ్చి, దాడి చేశాడు. దీంతో నా చేతికి తీవ్రంగా గాయమైంది. రాళ్లు రువ్వడంతో కొందరు అధికారులు గాయపడ్డారు’ అని కదమ్ వెల్లడించారు. ఆ ప్రాంతంలో కొందరు ఆర్సీపీకి చెందిన మహిళా కానిస్టేబుల్‌పై అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించి నట్లు గుర్తించారు. ఇతర మహిళా పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై గణేశ్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది
పరిస్థితులు అదుపులోకి..
అల్లర్లను అదుపులోకి తెచ్చిన పోలీసులు కర్ఫ్యూ విధించారు. నాగపూర్‌లో మొత్తం ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. సీసీ టీవీ కెమెరాల ఆధారంగా 104 మంది విధ్వంసకారులను గుర్తించారు. 92 మందిపై చర్యలు ప్రారంభించారు. వారిలో 12 మంది మైనర్లే. సామాజిక మాధ్యమాల్లోని 68 పోస్టులు నాగపూర్‌లో అల్లర్లను రెచ్చగొట్టాయని, వాటిని తొలగించి.. వాటికి కారకులైన వారిపై కేసులు పెడుతున్నామని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందగానే మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ స్పందించారు. రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ మేము ఔరంగజేబ్ సమాధిని రక్షిస్తాం.. కానీ కీర్తించడానికి అనుమతించమని తెలిపారు. ‘‘50 సంవత్సరాల క్రితం భారత పురావస్తు సర్వే సంస్థ ఔరంగజేబ్ సమాధిని రక్షిత ప్రదేశంగా ప్రకటించి నప్పటి నుండి మనం దానిని రక్షించాల్సి రావడం దురదృష్టకరం. దానిని రక్షించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అన్నారు. ఔరంగజేబు వేలాది మందిని చంపాడు, కానీ మనం అతని సమాధిని రక్షించాలి… కానీ ఔరంగజేబును కీర్తించాలనే ఆలోచనను నేను అణిచివేస్తాను’’ అని ఫడణవీస్ సభకు చెప్పారు. ఎలాంటి ప్రచారాలను నమ్మవద్దని, ప్రజలు శాంతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. నాగపూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ప్రచారాల వల్ల హింస చెలరేగినట్లు తెలిపారు.
నాగపూర్ అల్లర్ల సూత్రధారి ఫహీమ్ షమీమ్ ఖాన్ (38)ను పోలీసులు మార్చి 19న అరెస్ట్ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో అతడి పేరును ప్రధాన నిందితుడిగా అధికారికంగా చేర్చారు. ఫహీమ్ షమీమ్ ఖాన్ మైనారిటీస్ డెమొక్రటిక్ పార్టీ నగర అధ్యక్షుడు. నాగపూర్‌లోని యశోధరనగర్ సంజయ్ బాగ్ కాలనీలో ఉంటాడు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నాగపూర్ నియోజకవర్గం నుంచి ఎండీఏ తరఫున పోటీ చేశాడు. ఘర్షణలు చెలరేగడానికి కొద్దిసేపటి ముందు ఫహీమ్ ఖాన్ 500 మందిని సమీకరించి రెచ్చగొట్టే ప్రసంగం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
నాగపూర్•లో అల్లర్లకు పాల్పడిన విధ్వంసకారులే ఆస్తుల నష్టాన్ని భరించాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ శాసనసభలో స్పష్టం చేశారు, వారి నుంచే నష్ట పరిహారాన్ని వసూలు చేస్తామని, అవసరమైతే వారి ఇళ్లపైకి బుల్డోజర్లను ప్రయోగిస్తామని తెలిపారు. తాము కూల్చిన భవనాలు, దుకాణాలకు విధ్వంస కారులు పరిహారం చెల్లించకపోతే వారి ఆస్తులను విక్రయించి బాధితులకు అందజేస్తామని అన్నారు. ఈ అల్లర్లలో బాంగ్లాదేశ్ ప్రమేయం ఉందనే వార్తలు కలకలం రేపాయి. దుండగుల్లో కొందరు బంగ్లా చొరబాటుదారులు ఉన్నారని అంటున్నారు. నాగపూర్ పోలీస్ సైబర్ సెల్ తాజా అల్లర్లకు, బాంగ్లాదేశ్‌కు మధ్య సంబంధాలను కనుగొంది. ఇప్పటివరకు, 97 సోషల్ మీడియా పోస్టులు అభ్యంతరకరంగా, నకిలీగా గుర్తించారు. బంగ్లాదేశ్ ఐపీ చిరునామాలు కలిగిన కంప్యూటర్ల నుండి ఇలాంటి అనేక సోషల్ మీడియా పోస్టులు జనరేట్ అయినట్లు కనిపెట్టారు.
ఆర్‌ఎస్‌ఎస్ ఖండన
ఆ ఘర్షణలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఖండించింది. ‘ఔరంగజేబ్ సమాధి అంశం తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. ఈ సమాధి నేటికి సంబంధించింది కాదు. ఈ హింస సమాజానికి హానికరం’ అని ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ పేర్కొన్నారు. దేశ నిర్మాణం, నిర్మాణాత్మక సంభాషణలపై దృష్టి పెట్టాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సునీల్ అంబేకర్ పిలుపు నిచ్చారు. ప్రజలు విభజన భావజాలాలను తిరస్క రించాలని కోరారు. అల్లర్లపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. బజరంగ్ దళ్ కార్యకర్తలపై, వారి ఇళ్లపై, మహిళలపై ముస్లిం సమాజంలోని ఓ వర్గం దాడికి దిగిందని విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి మిళింద్ పరాండే అన్నారు. హింసాకాండకి ముందు హిందువులు ఖురాన్‌ను తగలబెట్టారని మత ఛాందసులు తప్పుడు వార్తలను ప్రచారం చేశారన్నారు. ఔరంగజేబ్ సమాధిని అభివృద్ధి చేయాలన్న ఆలోచనే సరికాదన్నారు. దీనికి బదులుగా ఔరంగజేబును ఓడించిన మరాఠా యోధులు ధనాజీ, శంభాజీ, రాజారాం మహారాజ్ స్మారకాన్ని అదే స్థానంలో నిర్మించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.
జేబ్‌తో ఫడణవీస్‌కు పోలికా?
దేవేంద్ర ఫడణవీస్ ఔరంగజేబ్ వంటి క్రూరుడని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్ విమర్శించడం కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర రాజకీయ సంస్కృతికి ఉన్న గుర్తింపును అవమానిస్తూ.. కాంగ్రెస్ మరింత దిగజారిపోయిందని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే దుయ్యబట్టారు. హర్షవర్ధన్ సప్కల్ వ్యాఖ్యలు మహారాష్ట్ర ఉభయసభల్లో కూడా దుమారం చెలరేగింది. సప్కల్‌పై చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవంకులే హామీ ఇచ్చారు.
క్రాంతిదేవ్ మిత్ర
సీనియర్ జర్నలిస్ట్