నాసికాత్య్రయంబకంలో గోదావరి చిన్న పాయలాగే, జలాంకురం లాగే కనిపిస్తుంది. సాగర సంగమం దగ్గర అఖండంగా దర్శనమిస్తుంది. ఆ మరాఠా నేల మీదే నాగపూర్‌లో శ్రీకారం చుట్టుకున్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రస్థానం కూడా పవిత్ర గోదావరినే తలపిస్తుంది. నాగపూర్ పట్టణంలో గుప్పెడు మంది బాలలతో ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్‌ను నేడు ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థగా అంగీకరించడానికి ఎక్కువ మందికి ఎలాంటి అభ్యంతరం లేదు. దేశం నలుదిక్కులా నిత్యం 60,000 శాఖలలో లక్షలాది స్వయంసేవకులు నిండుగుండెతో భారత్ మాతాకీ జై అంటారు. ఇదొక ఐక్యతామంత్రం. జాతీయత కోసం, ధర్మం కోసం సాగిన ఎన్నో మహత్తర పోరాటాలకే కాదు, నిరుపమాన సేవానిరతికి కూడా అదే ప్రేరణ. వీరే కాదు, శాఖలకు రాకపోయినా కొన్ని లక్షల మంది ఆర్‌ఎస్‌ఎస్ ప్రేరణతో సమాజ సేవలో, దేశమాత సేవలో తరిస్తున్నారు. ఇదే సంఘ పరివార్. హిందూ ఐక్యతే ఆర్‌ఎస్‌ఎస్ ఊపిరి. వేయేళ్ల బానిసత్వం నుంచి విముక్తం కావాలనీ, ఆత్మ విస్మృతి అనే పెను నిద్దర వీడాలనీ మొదలైన స్వాతంత్య్ర సమరం ‘స్వ’ చింతనకు దూరంగా జరగడం ఎంత ప్రమాదమో గుర్తిస్తూ అంకురించింది ఆర్‌ఎస్‌ఎస్. ఆత్మ గౌరవం, చరిత్ర సారం అనే రెండు తీరాలను తాకుతూ వర్తమానం సాగిపోవడం ఎంత అవసరమో సరైన సమయంలో గ్రహించిన సంస్థ కూడా. చారిత్రక తప్పిదాలను ఎండగడుతూ దేశం మిన్న, దేశమే సర్వస్వం అనుకోగల వ్యక్తుల సమూహాలను అందిస్తున్నది. ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాంటి సంస్థకు అంకురార్పణ చేసిన మనీషి నిజమైన ద్రష్ట. ఆయన జీవించిన కాలం, ఆ కాలం మీద ఆయన అవగాహన ఎలాంటిది? అలాంటి దృష్టికి ఆయన వచ్చేటట్టు చేసిన చారిత్రక పరిస్థితులు ఎలాంటివి? ఆ దృష్టి వర్తమాన భారతానికి ఎలాంటి ఆకృతిని ఇస్తున్నది. భవిష్యత్తును ఎలా శిల్పించబోతున్నది? ఇవన్నీ భారతీయత మౌలిక అంశాల పునర్‌నిర్వచనానికి సంబంధించినవే. అంతేకాదు, భారతీయుల చారిత్రక దృక్పథాన్ని కొత్త పుంతలు పట్టించినవి. ధర్మం, ఆధ్యాత్మిక వారసత్వాలకు కాలానుగుణమైన కొత్త నిర్వచనం పలికినవి. ఇది చరిత్ర రుజువు చేసింది. ఆ రుజువులలో మొదటిది ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల ముంగిట సగర్వంగా నిలబడడమే. ఇది ప్రపంచ చరిత్రలో అపురూపం.
కొన్ని దశాబ్దాల క్రితం బీబీసీ నిర్వహించిన క్విజ్ కార్యక్రమంలో ఒక ప్రశ్న వేశారు. ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆ ప్రశ్న- ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ ఏది? చివరికి క్విజ్ మాస్టర్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఫ్‌ు, హిందూ స్వచ్ఛంద సేవా సంస్థ, భారత్‌లో పని చేస్తున్నది అని. పరమ పూజనీయ డాక్టర్‌జీ ఇందుకు ఆద్యులు.
జాతీయవాది జననం
డాక్టర్‌జీ ఏప్రిల్ 1,1889, ఆదివారం (భారతీయ పంచాంగం ప్రకారం వర్ష ప్రతిపాద) నాగపూర్‌లోనే జన్మించారు. ఆయన పూర్వికులు తెలంగాణలోని నిజామాబాద్ దగ్గరి కందకుర్తి వాసులు. అక్కడ మూడు నదులు సంగమిస్తూ ఉంటాయి. అవి గోదావరి, మంజీర, హరిద్ర. అలాగే మూడు భాషలు వినిపిస్తాయి – తెలుగు, మరాఠీ, కన్నడ. బలీరాం పంత్, రేవతీబాయి దంపతుల ఆరుగురు సంతానంలో ఐదోవారే కేశవ హెడ్గేవార్. 12 లేదా 13వ ఏటనే ప్లేగ్ ఆ ఇద్దరినీ మింగేసింది. ఇద్దరి భౌతికకాయాలు ఒకేసారి శ్మశానవాటికకు వెళ్లాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ను అకారణంగా ద్వేషించే వారి సంఖ్య దేశంలో ఎక్కువే. ఇలాంటి వాళ్ల (హ్రస్వ) దృష్టిలో ఆర్‌ఎస్‌ఎస్ అంటే నాగపూర్ బ్రాహ్మణుల, నాగపూర్ ప్రాంతీయుల ఆధిపత్యంలో ఉంటుంది. కానీ డాక్టర్‌జీ మూలాలు తెలుగు ప్రాంతంలోనివి. నాగపూర్, యవత్‌మల్, పూనాలలో ఆయన ప్రాథమిక విద్యనభ్యసించారు. ఆ సమయంలోనే ఆయన లోకమాన్య బాలగంగాధర తిలక్ ఆలోచనలతో ప్రభావితుడయ్యారు. పరాయి పాలన నుంచి మాతృ దేశాన్నీ, విదేశీ భావజాలం దాడి నుంచి ధర్మాన్నీ రక్షించడానికి పేదరికం అడ్డుకాదు. ఆనాటి అనేక మంది దేశభక్తుల వలనే డాక్టర్‌జీ కూడా నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. ఇంకా చెప్పాలంటే కటిక పేదరికం వారిది.
తొలి అడుగులు నేర్పిన తీవ్ర జాతీయవాదం
భారత స్వాతంత్య్రోద్యమం అనేక స్రవంతుల సంగమం. గదర్ వీరులు, అనుశీలన్ సమితి, ఆజాద్ హింద్ ఫౌజ్ వంటి తీవ్ర జాతీయవాద సంస్థలు తమ వంతు నెత్తురును ధారపోశాయి. అలాంటి ఉద్యమాలే డాక్టర్‌జీ సామాజిక, ఉద్యమ జీవితానికి తొలి అడుగులు నేర్పాయి. డాక్టర్‌జీలో కనిపించే అకుంఠిత జాతీయవాద ఛాయతో కూడిన సాంస్కృతిక చింతన తిలక్ మహరాజ్ ఆలోచనా ధార నుంచి స్వీకరించినదేననిపిస్తుంది. అంతకు ముందు నుంచే డాక్టర్‌జీ శివాజీ మహరాజ్ పట్ల అచంచలమైన భక్తితో ఉండేవారు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం లేదా వందేమాతరం ఉద్యమం సమయంలో డాక్టర్‌జీ పాఠశాల ప్రవేశం చేశారు. మోరేశ్వర్ సంరక్షణలో నాగపూర్‌లోని ఒక పాఠశాలలో చేర్పించారు. పాఠశాలలో శివాజీ పేరిట మిత్రబృందం ఏర్పాటు చేసుకున్నారు. తరువాత జీవితంలో గదర్ వీరుడు డాక్టర్ పాండురంగ సదాశివ ఖాన్‌ఖోజీ ఆయనకు మిత్రులయ్యారు. ఖాన్‌ఖోజీ స్థాపించిన స్వదేశ బాంధవ సమితిలో డాక్టర్‌జీ సభ్యుడు. తిలక్ ‘కేసరి’ పత్రిక, శివరామ్ మహాదేవ్ పరాంజపే ‘కౌల్’ పత్రిక డాక్టర్‌జీకి అలాంటి మనోభూమికను ఏర్పరిచాయి. ఆ రోజులలో విద్యాసంస్థలలో ‘వందేమాతరం’ అని నినదించకుండా రిస్లే సర్క్యులర్ ఉండేది. దీనిని డాక్టర్‌జీ నిరంతరం ఉల్లంఘించేవారు. ఫలితం` పాఠశాల నుంచి పంపేశారు. తరువాత నాగపూర్ వదిలి యవత్‌మల్‌లోని రాష్ట్రీయ విద్యాలయంలో చేరారు. బాపూజీ ఆణే అనే వారి పర్యవేక్షణలో ఉండేవారు. తిలక్ మహరాజ్ అభిమాని ఆణే. ఇక్కడ డిప్యూటీ కమిషనర్ విల్సన్‌కు సలాం కొట్టనందుకు చదువు ఆపివేయవలసి వచ్చింది. పూనా వెళ్లి రాష్ట్రీయ విద్యాపీఠ్‌లో మెట్రిక్యులేషన్ చేశారు డాక్టర్‌జీ.
కలకత్తాలో
1910లో వైద్యశాస్త్రం చదవడానికి డాక్టర్‌జీ కలకత్తాలోని నేషనల్ మెడికల్ కాలేజీకి వెళ్లారు. ఆయనను అక్కడకు పంపించినది కూడా నాగపూర్ కేంద్రంగా పనిచేసే కొందరు తీవ్ర జాతీయవాదులేనని చెబుతారు. ఆనాడు నాగపూర్‌లో పనిచేస్తున్న తీవ్ర జాతీయవాదులలో ఒకరు దాజీ సాహెబ్ బుటి డాక్టర్‌జీకి ఆర్థికసాయం అందించారు. కలకత్తాలో ఆయన అనుశీలన్ సమితిలో చేరి ఆ సంస్థలో ప్రముఖుడు ఫులిన్ బిహారీదాస్ వద్ద తీవ్ర జాతీయ వాద కార్యకలాపాలలో శిక్షణ పొందారు. త్రైలోక్యనాథ్ చక్రవర్తి రచించిన ‘ముప్పయ్ ఏళ్ల జైలు జీవితం’ అన్న పుస్తకంలో కేశవ బలిరామ్ హెడ్గేవార్‌కు ‘అనుశీలన్ సమితి’లో సభ్యత్వం ఇచ్చినట్టు రాశారు. అనుశీలన్ సమితిలో డాక్టర్‌జీ ఎలాంటి బాధ్యతలు నిర్వహించారు! ఆయనకు అప్పగించిన బాధ్యత దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న తీవ్ర జాతీయ వాదులకు ఆయుధాలు అందించే పని. మరొకటి, రహస్య సాహిత్యం చేరవేయడం. విప్లవ కార్యకలాపాల సమయంలో డాక్టర్‌జీ అజ్ఞాత నామం ‘కొకెన్’. ఇంద్రప్రస్థ విశ్వసంవాద కేంద్రం సీఈఓ అర్జున్ ఆనంద్ డాక్టర్‌జీ జీవితంలోని నిప్పురవ్వల వంటి అనేక అనుభవాలను క్రోడీకరించారు.
కలకత్తాలో ఉన్నప్పుడే నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్‌కే మాలిక్ (ఎంఎస్, ఎండి, ఎడిన్‌బరో) డాక్టర్‌జీకి స్ఫూర్తిదాయకంగా ఉండేవారు. ఆయన చాలా దేశాలలో పని చేశారు. కానీ స్థానీయతను ఆయన విస్మరించలేదు. సంస్కృతిని మరచిపోలేదు. తరగతి గదిలో పాఠం చెప్పేటప్పుడు తప్ప, మిగతా సమయాలలో మాతృభాషలోనే మాట్లాడేవారు. భారతీయ భాషలను తక్కువగా చేస్తూ ఎవరైనా ఇంగ్లిష్‌లో మాట్లాడడానికి ప్రయత్నించి నప్పుడు డాక్టర్‌జీ డాక్టర్ మాలిక్‌ను ఉదాహరణగా చూపేవారు. అనుశీలన్ సమితిలో చాలామంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికి కలకత్తాలో డాక్టర్‌జీకి శాంసుందర్ చక్రవర్తి, మౌల్వీ లియాఖత్ హుస్సేన్ సన్నిహితంగా ఉండేవారు. చక్రవర్తి బర్మా జైలులో ఏకాంత శిక్ష అనుభవించి కలకత్తా రావడం, డాక్టర్‌జీ వైద్య విద్య కోసం వెళ్లడం 1910లోనే జరిగాయి. ‘ప్రతివాసి’, ‘సంధ్య’, ‘వందేమాతరం’ వంటి పత్రికలలో బ్రిటిష్ జాతికి వ్యతిరేకంగా చక్రవర్తి పదునైన భాషతో వ్యాసాలు రాసేవారు. వైద్య విద్యార్థిగాను డాక్టర్‌జీ అత్యంత నిరుపేద జీవితమే గడిపారు. ఒకే జత బట్టలతో ఆయన విద్యార్థి జీవితం గడిచింది. చాలాసార్లు కాళ్లకు చెప్పులు కూడా ఉండేవి కావు. ఎక్కువ సమయాలలో మిత్రులే సహకరించేవారు. హుస్సేన్ తిలక్ అభిమాని. ఒకసారి హుస్సేన్ తీవ్ర అస్వస్థతకు గురైతే డాక్టర్‌జీ రెండు మాసాల పాటు వైద్య సేవలు అందించారు.
వైద్య విద్య పూర్తయింది
వైద్యవిద్యను పూర్తి చేసుకుని 1916లో డాక్టర్‌జీ తన మిత్రుడు భావుజీ కార్వేతో కలసి నాగపూర్ తిరిగి వచ్చారు. లాభసాటిగా ఉండే ఉద్యోగం చేరవలసిందంటూ బ్యాంకాక్ ఆహ్వానించింది. అయినా చేరలేదు. భావుజీ కార్వే సాయంతో క్రాంతిదళ్ అనే సంస్థను నెలకొల్పారు. ఇది కూడా విప్లవ సంస్థయే. అనుశీలన్ సమితి అడుగు జాడలలోనే మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాలలో తీవ్ర జాతీయవాద సంస్థను నిర్మించాలని డాక్టర్‌జీ భావించారు. ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఆ ప్రయత్నంలో డాక్టర్‌జీకి నాగపూర్‌లోని అఖాడాలు, వ్యాయామశాలలతో మంచి పరిచయం ఏర్పడిరది. 1921 నాటికి 230 అఖాడాలు అక్కడ ఉండేవి. వాటి సంఖ్య 1931నాటికి 570కి చేరింది. ఇది డాక్టర్‌జీ ప్రభావంలోకి వచ్చిన తరువాతి పరిణామం.
1919 ప్రాంతంలో డాక్టర్‌జీ భారత జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ సంవత్సరం అమృత్‌సర్‌లో జరిగిన వార్షిక సమావేశాలకు కూడా హాజరయ్యారు. అంటే జలియన్‌వాలా బాగ్ దురంతం తరువాత జరిగిన సమావేశాలు అవి. నాగపూర్ కాంగ్రెస్ సమావేశాలలో రాష్ట్రీయ మండల్‌లో పని చేశారు. ఇది తిలక్ అనుచరులు ఏర్పాటు చేసినది. నాటి జాతీయవాద నేతల ప్రేరణతో రాష్ట్రీయ ఉత్సవ మండల్ అనే సంస్థను ఆయన స్థాపించారు. 1920లోనే డాక్టర్ ఎల్‌వీ పరాంజపే స్థాపించిన భారత్ సేవక్ మండల్‌లో కూడా డాక్టర్‌జీ పనిచేశారు. కాంగ్రెస్ సమావేశాలలో సేవలు చేసేందుకు 1000 నుంచి 1500 మందితో కూడిన ఒక స్వచ్ఛంద సేవకుల దళాన్ని నిర్మించేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అంతలోనే తిలక్ అస్తమించారు. స్వాతంత్య్రోద్యమం గాంధీజీ నాయకత్వంలోకి వస్తున్న తరుణంలో భారత్‌కు తగిలిన పెద్ద గాయం తిలక్ మరణమే. ఆనాడు గాంధీజీ కూడా ఆయన మరణాన్ని పెద్ద విపత్తుగా భావించారు. అతివాద, మితవాద భావాలు కాంగ్రెస్‌ను వేధిస్తున్నాయి. తీవ్ర జాతీయ వాదులు సాయుధ సమరం మీద నమ్మకం పెంచుతున్నారు. పలు ప్రాంతాలలో వారిదే పైచేయిగా ఉంది. అయినా వారందరి లక్ష్యం దేశానికి స్వాతంత్య్రమే.
వందల ఏళ్లపాటు అంధకారంలో ఉండిపోయిన జాతిని మేల్కొల్పడానికి చేసే మహా చికిత్సలో కొన్ని ‘సైడ్ ఎఫెక్ట్స్’ తప్పవు. అదే జరిగింది. కానీ డాక్టర్‌జీలోని వైద్యుడు వాటిని గొప్పగా గమనించాడు. తిలక్ మరణించిన (జులై 31, 1920) తరువాత స్వాతంత్య్రోమ గతిని డాక్టర్‌జీ సరిగానే ఊహించారని అనిపిస్తుంది. స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించదగిన వ్యక్తి అని భావించిన డాక్టర్‌జీ తన మిత్రుడు డాక్టర్ మూంజేతో వెళ్లి ఆయన్ను దర్శించు కున్నారు. ఆయనే అరవింద ఘోష్. కాంగ్రెస్‌ను నడిపించవలసిందిగా ఆ ఇద్దరు పుదుచ్చేరి వెళ్లి ఆయన్ను అడిగారు. కానీ ఆయన నిరాకరించారు. డిసెంబర్ 1920లో నాగపూర్ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. 15,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మరొక 3000 మంది ఆహ్వాన సంఘం సభ్యులు ఉన్నారు. వీరు కాక సాధారణ ప్రజలు ఉన్నారు. ఈ సమావేశాల సమయంలో డాక్టర్ పరాంజపే, డాక్టర్‌జీ ప్రతినిధు లందరికీ బస, భోజనవసతి బాధ్యత తీసుకున్నారు.1921లోనే గాంధీజీ పిలుపు మేరకు డాక్టర్‌జీ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. కాటోల్, భరత్వాడా (భండారా)లలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణతో దేశద్రోహం కేసు పెట్టారు.ఈ కేసు విచారణ సమయంలోనే డాక్టర్‌జీ ఒక లిఖిత పూర్వక ప్రకటన చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌కూ, స్వరాజ్య సమరానికీ సంబంధమే లేదన్న దివాంధుల కోసం ఆ కేసు విచారణ గురించి చరిత్రకెక్కిన నాలుగు విషయాలు గుర్తు చేస్తున్నాం. డాక్టర్‌జీ అరెస్టుకు కారణమైన ప్రసంగం కంటే, దానిని సమర్థిస్తూ కోర్టు ఎదుట చేసిన ప్రకటన మరింత రాజద్రోహంగా పరిగణించ వలసినదిగా ఉందని న్యాయాధికారి వ్యాఖ్యానించారు. ఏం చెప్పారు డాక్టర్‌జీ! ఒక ‘విదేశీ శక్తి’ ఒక భారతీయుడు భారతదేశంలో చేసిన పని మీద విచారణకు పూనుకోవడం నాకూ, మహత్తరమైన నా దేశానికీ అవమానకరమని భావిస్తున్నాను.’ ఇది జన్మ చేతనే జాతీయవాది అయిన భారతీయుడి నోటి నుంచి మాత్రమే వస్తుంది. దీనస్థితిలో ఉన్న నా మాతృభూమి పట్ల ప్రేమను, జాగృతం చేసేందుకు నేను ప్రయత్నించాను అని ప్రకటించారు డాక్టర్‌జీ. తాము మర్యాదగా వైదొలగవలసిన (భారత భూమి నుంచి) తరుణం మించిపోతున్నదన్న హెచ్చరికను వారు గమనించడం మంచిది అని విస్పష్టంగా పలికారాయన (జాగృతి, ఏప్రిల్ 5,1962).
రెండేళ్ల శిక్ష తరువాత అజనీ కారాగారం నుంచి డాక్టర్‌జీ విడుదలయ్యారు. అదే రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన అభినందన సభలో మోతీలాల్ నెహ్రూ, హకీమ్ అజ్మల్ ఖాన్ ప్రసంగించారు. డాక్టర్‌జీ 1922లో ప్రాంతీయ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. కాంగ్రెస్‌లో స్వచ్ఛంద సేవకుల దళం హిందుస్తాన్ సేవాదళ్‌లో కూడా డాక్టర్‌జీ భాగస్థులయ్యారు. హిందుస్తాన్ సేవాదళ్ స్థాపకుడు డాక్టర్ ఎన్‌ఎస్ హర్దీకర్ (హుబ్లీ) డాక్టర్‌జీకి విద్యార్థి దశ నుంచి తెలుసు. 1923లో ఖిలాఫత్ ఉద్యమం నేపథ్యంలో దేశంలో మత ఘర్షణలు జరిగాయి.ఆనాడు ఒక చిత్రమైన పరిస్థితి ఉంది దేశంలో, స్వాతంత్య్ర సమరంలో. సహాయ నిరాకరణోద్యమాన్ని గాంధీజీ నిలిపివేశారు. అందుకు కారణం చౌరీ చౌరా ఉదంతమని అన్నారు. కానీ దానితోనే మొదలైన ఖిలాఫత్ ఉద్యమం దేశంలో పెను విపత్తుకు బాటలు వేసింది. ఆ సమయంలో దారుణంగా గాయపడిన హిందువుల మనోభావాలను గుర్తించడంలో, అభిప్రాయాలను స్వీకరించడంలో, గౌరవించడంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమైందని డాక్టర్‌జీ అభిప్రాయానికి వచ్చారు. ‘జాగృతి’ సంపాదకీయంలో (మార్చి 10,1969) కొన్ని వాక్యాలు ఇక్కడ ప్రస్తావించడం అవసరం. ‘అనంతర చరిత్ర (ఖిలాఫత్ ఉద్యమం మొదలైన తరువాత) డాక్టర్‌జీ హెచ్చరికలోని సత్యాన్ని నూటికి నూరుపాళ్లు రుజువు చేసింది. ఖిలాఫత్ ఉద్యమం తరువాత 1921లో కేరళలో మోప్లాలు హిందువు లపై భారీయెత్తున హత్యాకాండ సాగించారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ప్రకటించిన నివేదిక ప్రకారం ఆ దారుణకాండలో 1500 హిందువులు హత్య గావించబడ్డారు.20 వేల మంది హిందువులు బలాత్కారంగా ముస్లింలుగా మార్చబడ్డారు. కాంగ్రెస్ నాయకత్వం ఈ వాస్తవాలను గుర్తించడానికి నిరాకరించింది.’ ముస్లింలను జాతీయోద్యమంలో, జీవన స్రవంతిలో కలపడమనే ప్రక్రియ ఒక పెద్ద చారిత్రక తప్పిదానికి బీజం వేస్తున్న సంగతి అర్ధం చేసుకున్నవారిలో డాక్టర్‌జీ ప్రథములు. అప్పుడే ఆయనలో హిందువుల ఐక్యతకు ఒక సంస్థ అవసరమన్న భావన కలిగి ఉండాలి.
‘సంఘ స్థాపనకు పూర్వరంగం’ అన్న వ్యాసంలో (ఏప్రిల్ 5, 1962) భయ్యాజీ దాణే ఆ నేపథ్యాన్ని సరైన రీతిలో అంచనా వేశారు. దాని సారాంశం: గాంధీజీ నాయకత్వం తరువాత దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడే శక్తి పెరిగింది. కానీ కొంచెం త్యాగం చేసి ఆత్మ సంతృప్తిని వెతుక్కోవడం కూడా మొదలయింది. తమ ఉన్నతికి త్యాగం పెట్టుబడిగా చేసుకునే తత్వం ప్రబలింది. అప్పుడు వచ్చిన ఖిలాఫత్ ఉద్యమం మాత్రం భారతీయ సమాజం ఆలోచనను ప్రశ్నించింది. దీనికి గాంధీజీ నాయకుడు. కానీ ఖిలాఫత్ ఉద్యమాన్ని డాక్టర్‌జీ అఖిల ఆఫత్ (పెద్ద ప్రమాదం) అని వ్యాఖ్యానించేవారు. హిందూ సమాజం పిరికిదనీ, ముస్లింలు దుడుకు స్వభావం కలిగినవారని గాంధీజీ భావించడమే కాకుండా, అదే అభిప్రాయాన్ని బాహాటంగానే వ్యక్తం చేస్తూ ఉండేవారు. ముస్లింలలోని దుందుడుకుతనం లక్షణాన్ని అంగీకరిస్తూనే అందుకు అవిద్య కారణమని భావించారాయన. ఆ అవిద్యే మతోన్మాదులుగా చేస్తున్నదని కూడా ఆయన నమ్మినట్టు కనిపిస్తుంది. గాంధీజీ నమ్ముతున్నారు కాబట్టి ప్రతి కాంగ్రెస్ నాయకుడు అదే ధోరణిలో ఉండేవారు. ఇదే పెద్ద అగాధాన్ని తెచ్చింది. ఈ సూత్రీకరణను డాక్టర్‌జీ పూర్తిగా నిరాకరించారు. ముస్లింలలో అవిద్య, పేదరికం ఉన్నమాట వాస్తవమే అయినా, అవి మాత్రమే మతోన్మాదానికి కారణమనుకోవడం సరికాదని డాక్టర్‌జీ విశ్వసించారు. చదువుకున్న ముస్లింలు ఈ దేశంలో తమ పూర్వ వైభవాన్ని కోరుకోవడమే మతోన్మాదానికి కారణమని డాక్టర్‌జీ నిష్కర్షగా పేర్కొనేవారు. శకులు, హూణులు దండయాత్ర చేసినప్పుడు భారతీయ సమాజం తనవైన జీవన మూల్యాలతో దృఢంగా ఉంది. దీనితోనే ఆక్రమణదారులు కూడా ఈ జీవనంలో భాగస్థులుగా ఉండిపోయారు. అలాగే కొత్త ఆక్రమణదారులను కూడా అదే విధంగా భారతీయ సమాజంలో ఐక్యం చేసుకోలేమా? ఇందులో సాధ్యాసాధ్యాలు వెతక్కుండా సాధ్యం చేసుకోవడం ఎలా అన్నదే ప్రధానంగా చూడాలన్నదే డాక్టర్‌జీ దృఢ నిశ్చయం. వీటన్నిటికి మూల సూత్రం, పరిష్కారం హిందూ ఐక్యత అని ఆయన అంతిమంగా నిర్ణయానికి వచ్చారు. అది నిజమని చరిత్ర నిరూపించింది.
1925లో విజయదశమికి హిందూ ఐక్యత ఉద్దేశంతో డాక్టర్‌జీ కొద్దిమంది బాలురతో ఒక సంస్థను స్థాపించారు. తన హిందూ సంఘటనా యజ్ఞానికి అదే అంకురార్పణ. అప్పుడు ఆయన వయసు 36 ఏళ్లు. ఆదిలో ఆ సంస్థను ఆర్‌ఎస్‌ఎస్ అని పిలవలేదు. ఏప్రిల్ 17,1926న 26 మంది స్వయంసేవకులతో ఒక సమావేశం జరిగింది. అది సంస్థకు ఏం పేరు పెట్టాలనే దాని మీదే. కొన్ని పేర్లు అనుకున్న తరువాత చివరకు ఆర్‌ఎస్‌ఎస్ పేరును ఖరారు చేశారు.
కొందరు ఎంత మహాత్ములైనా, చరిత్ర పురుషులైనా వారి అభిప్రాయాలను మాత్రం యథా తథంగా స్వీకరించలేం. తాత్కాలిక ప్రయోజనాల కోసం చరిత్రకూ, ధర్మానికీ హాని చేసే అభిప్రాయా లనూ, కార్యక్రమాన్నీ ఆచరించలేం. అక్కడ రాజీ పడితే భవిష్యత్ అంధకార బంధురమే. రేపటి తరం ఉనికి ప్రశ్నార్థకమే. జాతి నిర్మాణమే ప్రధానం. వ్యక్తులను తృప్తిపరచడం కాదు. వర్తమానంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలకు శాపాలు కాకూడదు. తాత్కాలిక పరిష్కారాల కోసం వ్యవస్థ మౌలిక విలువలను ఫణంగా పెట్టకూడదు. అందుకే తన కాలంలో ఎంతటి మహాపురుషులయినా వారి అన్ని అభిప్రాయాలను డాక్టర్‌జీ స్వీకరించలేదు. కాలపరీక్షకు నిలిచిన ఒక నిర్ణయం చేశారు. హిందూ ఐక్యత హిందూ దేశ లేదా భారతావనికి శ్రీరామరక్ష అని ఆయన భావించారు. ఇవాళ విశ్వగురు నినాదం వెనుక, హిందువు సగర్వంగా తలెత్తుకు తిరగడం వెనుక ఉన్నది ఆయన ఆ భావనా బలమే.
– జాగృతి డెస్క్
ఆయన జీవితం ఒక దివ్య సందేశం
నిరంతర కష్టాలతో, క్లేశాలతో నిండిన డాక్టర్ కేశవరావ్ బలీరామ్ హెడ్గేవార్ జీవితం నుంచి సమాజంలోని సర్వసాధారణ వ్యక్తులకు ఒక ఆశాజనకమైన సందేశం లభించింది. దుర్భర దారిద్య్రం, ప్రసిద్ధులు కాకపోవడం, పెద్దల ఉదాశీనత, పరిస్థితుల ప్రతికూలత, అడుగడుగున విఘ్నాలు, విరోధాలు, ఉపేక్షాభావం, హేళన వంటి కఠిన లోకానుభవాలతో పాటు ఎన్ని కంటక ప్రాయమైన దారులు ముందున్నా చింతించకుండా నిత్యం తమ ప్రయత్నం తాము చేసేవారికి విజయం తథ్యమని వారి జీవితాన్ని చూసి చెప్పవచ్చును. ‘క్రియా సిద్ధి: సత్త్వేభవతి మహతాం నోపకరణే’ అన్న సుభాషితం డాక్టర్‌జీ జీవితానికి సంపూర్ణంగా సరిపోతుంది. ఏదో ఒక సామాజిక కార్యక్రమం స్వీకరించి చేయడం మొదలుపెట్టిన తరువాత, వచ్చిన కష్టాలను ఎదుర్కొనలేక నిరాశానిస్పృహలకు లోనయ్యేవారికి డాక్టర్‌జీ జీవితం నుంచి ఒక ఆశాజ్యోతి, దివ్య సందేశం ప్రాప్తమై ప్రేరణ లభించగలదు.
– గురూజీ (జాగృతి, మార్చి 29,1965)
డాక్టర్ జీ ఓ వాస్తవికవాది
డాక్టర్ హెడ్గేవార్ కేవలం ఆదర్శవాది కాదు. వాస్తవికవాది కూడా. ఆయన కలలు గన్నారు. ఆ కలలకు రూపకల్పన చేయడానికి జీవించారు. ఈ ప్రయత్నంలో ఆయన మనకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘమనే మహా సంస్థను ప్రసాదించారు. అది ఆయన జీవితకార్యానికి చిహ్నం. ఈ సాధనం ద్వారానే ఆయన సార్థక జీవితం గడిపే సమర్ధవంతమైన సమాజ దృశ్యాన్ని దర్శించదలిచారు. డాక్టర్‌జీ ప్రారంభించింది సంస్కరణ ఉద్యమం కూడా కాదు. వ్యవస్థలను మార్చితే అటు వ్యక్తి, ఇటు సమాజం కూడా సంస్కరించబడతాయని సంస్కర్త అనుకుంటాడు. కొన్ని సందర్భాలలో అతడు చేసేది సరైనదేననిపించవచ్చు. కానీ మనకు కావలిసింది సంస్కరణోద్యమం కాదు, సంఘటన అని డాక్టర్‌జీ భావించారు.
– దీనదయాళ్ ఉపాధ్యాయ (జాగృతి, ఏప్రిల్ 5, 1962)
సాత్వికశక్తి మహానిర్మాణం
సంఘ సిద్ధాంతం ఏమిటి? సంఘ సంస్థాపకులు ఏదో కొత్త సిద్ధాంతాన్ని తమ మస్తిష్కం నుంచి సృష్టించలేదు. యుగయుగాలుగా పరంపరగా వస్తున్న సనాతన హిందూ రాష్ట్ర శాశ్వత తత్వజ్ఞానం, జీవన దర్శనం గత కొన్ని శతాబ్దాలుగా ప్రజల మనసులలోను, ప్రజా జీవనంలోను లోపిస్తూ వస్తున్నది. దానిని జాగృతం చేసే పనినే పూజనీయ డాక్టర్‌జీ ప్రారంభించారు. కనుక హిందూ విచార ధారయే సంఘ విచారధార. ఆ విచార ధార ఆధారంగా సమాజమంతటినీ తిరిగి సంఘటిత పరచడమే సంఘకార్యం.
– ఏకనాథ్‌జీ రానడే (జాగృతి, ఏప్రిల్ 5, 1962)
జాతిని సాహసోపేతం చేశారు
డాక్టర్ హెడ్గేవార్ పుట్టుకతోనే వికసించిన ప్రఖర దేశభక్తుడు. నిప్పుకణం లాంటి దేశభక్తుడు. స్వాతంత్య్రోద్యమంలో చాలాకాలం అగ్రశ్రేణి కార్యకర్తలలో ఒకరిగా పనిచేశారు. విప్లవవీరులతో మొదట్లో, ఆ తరువాత కాంగ్రెస్‌లో పని చేశారు. సంఘాన్ని ప్రారంభించాలని నిర్ణయించే సమయానికి సెంట్రల్ ప్రావిన్స్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రముఖ కార్యకర్తలలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. కాని మనల్ని బానిసలుగా మార్చిన ఆంగ్లేయులనూ, పెరుగుతున్న ముస్లిం వేర్పాటువాదాన్నీ ఎదుర్కొవాలంటే భిన్నమైన మరో మార్గం అవసరమని భావించి రాజకీయ ఆందోళనల నుంచి పూర్తిగా విరమించుకుని రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించారు.
– హెచ్‌వీ శేషాద్రి (జాగృతి, నవంబర్ 8, 1997)