సినిమా ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రపంచం కూడా సినిమా నుంచి నేర్చుకుని, ఇంకా చెప్పాలంటే అనుకరించి తనను తాను మార్చుకుంటున్నది. సినిమా, ప్రపంచం- ఒకదానికొకటి బింబప్రతిబింబాలంటే తొందరపాటు కాదు. నేడు, సినిమా ఒక విశ్వభాష. అందుకే సినిమా అనే ఆ మాధ్యమం మీద అన్ని అభిప్రాయాలు, నిర్వచనాలు, వ్యాఖ్యానాలు. మూడు గంటల చిత్రం చూసి మూడు మాసాల పాటు గుణగణాలు చర్చించే వారు ఉన్నారు. ఏ ఇతర రంగం మీద లేనన్ని వక్రీకరణలు ఈ రంగం మీద స్వారీ చేయడానికి కారణం అదే కావచ్చు. దానితో సినిమా చరిత్ర, నిర్మాణాల మీద వెలువడే అంచనాలలో నిజాలెన్నో అబద్ధాలెన్నో నిర్ధారణకు రావడం కూడా కష్టంగా మారింది. అసలు చరిత్ర రచన మీదే మనకు శ్రద్ధ తక్కువ. అదే సినిమా చరిత్ర మీద కూడా కనిపిస్తున్నది. కానీ ప్రపంచం మీద ఇంత గాఢమైన ప్రభావం చూపుతున్న ఈ మాధ్యమం వాస్తవ చరిత్ర ఏదో ప్రజలకు తెలియవలసి ఉంది.
మన సినిమా
ఫస్ట్‌రీల్
రచన: రెంటాల జయదేవ
ఎమెస్కో
పే.566, వెల: రూ.750/-
వక్రీకరణలు, అవగాహనా రాహిత్యంతో ఒక దేశానికి లేదా ఒక కళాకారుడికి రావలసిన ఖ్యాతి వేరొకరి ఖాతాలోకి వెళ్లడం భావ్యం కాదు. సరైన తేదీలు ఉదహరించకపోవడం వల్ల ఏది ముందు ఏది వెనుక అనేది కూడా సందిగ్ధంలోనే ఉండి పోతోంది. ఇలాంటి తప్పిదాలు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కూడా ఎక్కువే. అటు ఆ తప్పిదాలు, లేదంటే ఒప్పులుగా చెలామణి అయిపోతున్న తప్పిదాల గురించి, ఇటు చరిత్ర గురించి విశేషంగా చర్చించిన పుస్తకం ‘మన సినిమా: ఫస్ట్ రీల్’. ప్రముఖ పత్రికా రచయిత రెంటాల జయదేవ ఈ ప్రయత్నం చేశారు. ఎమెస్కో ముచ్చటగా ముద్రించింది.
‘సినిమా లేదా మూవీ ఇంకా మేజిక్. వీటికి సన్నిహిత బంధం ఉంది. సినిమాలు నిర్మించిన తొలితరం వారంతా అలాంటి మేజీషియన్‌లే’ అన్నాడట ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొపోలా (హాలీవుడ్ దర్శక నిర్మాత). 1913 ప్రాంతంలో మన వెండితెరలను పండించిన దర్శకులు, నిర్మాతలు ఈ కోవకే చెందుతారని నిస్సందేహంగా చెప్పవచ్చు. సినీ నిర్మాణంలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉందని చెబుతారు. అందుకు ఆద్యులు వారే. కదలాడే బొమ్మలు మొదట ప్యారిస్‌లో 1895లో కనిపిస్తే, 1896లో అమెరికాలోను, హాలీవుడ్ నేల మీద కనిపించిన కేవలం మూడు మాసాలకే మన బొంబాయిలోను దర్శనమిచ్చాయి. కాబట్టి కదిలే బొమ్మలతో మన ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలోనిదే. ఆ కాలంలో భట్వాడేకర్, ఆర్‌పి పరాంజపే (బొంబాయి), హీరాలాల్ సేన్ (కలకత్తా) వంటి ఎందరో ఈ కళకు అంకురార్పణ చేశారను కోవాలి. అవి ఇప్పటిలాగా 18 వేల అడుగుల సినిమాలు కాదు. వంద నుంచి రెండు వందల అడుగులవే. ఇప్పుడు ఎక్కువ తరగతి అంటే తెరకు దూరంగా ఉంటుంది. అప్పుడో! తెరకు దగ్గరగా కూర్చుంటే ఎక్కువ చెల్లించుకోవలసి ఉండేదట. సినిమా అంటే నాడు కేవలం కథా చిత్రాలే కాదు, డాక్యుమెంటరీలు కూడా. రెండూ సమానంగానే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ప్రాథమిక దశ సాంకేతిక పరిజ్ఞానంతోనే థియేటర్లకు ప్రేక్షకులను రప్పించారు వారు. అంత కష్టపడ్డా త్రుటిలో ‘తొలి’ గౌరవాన్ని పోగొట్టుకున్నవారు చాలామంది ఉన్నారు. ‘పుండలీక్’ అనే సినిమా (మూకీ) రంగస్థల నాటకాన్ని యథాతథంగా చిత్రీకరించి విడుదల చేశారు (కాబట్టి మన చలనచిత్రాల మూలాలు రంగస్థలంలోనే ఉన్నాయి. నాటి తెర నటులంతా రంగస్థలం నుంచి వెళ్లినవారే కూడా). 1912లో బ్రిటిష్ సాంకేతిక నిపుణులతో ఇది సాధ్యమైంది. కానీ 1913లో ‘రాజా హరిశ్చంద్ర’తో మన దేశంలో సినిమా యుగం ఆరంభమైందనడం సబబు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంలో నిర్మించిన చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’. ఇది దాదాసాహెబ్ ఫాల్కే నిర్మించారు. ‘పుండలీక్’ తయారీలో తొలి చిత్రమే. కానీ స్వదేశీ పరిజ్ఞానంతో వచ్చిన తొలి చిత్రం రాజా హరిశ్చంద్ర. ఉత్తరాదిన రాజా హరిశ్చంద్రకు ఆ కీర్తి దక్కితే, దక్షిణాదిన ఆ కీర్తి ‘కీచక వధమే’కి దక్కింది. హిందీ తొలి టాకీ ఆలం ఆరా 1931లో విడుదలైంది. ఆలం ఆరాకి బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముడుపోయాయి. కానీ ఈ సినిమాని ఇప్పుడు చూడాలంటే ఒక్క ప్రతి కూడా లేదట. తెలుగులో తొలి టాకీ ‘కాళిదాస్’ అని నిరూపించే మంచి ప్రయత్నం చేశారు రచయిత. అంటే ఇంతకాలం మనం చెప్పుకుంటున్న ‘భక్త ప్రహ్లాద’ తొలి టాకీ కాదు. ‘కాళిదాస్’ తొలి తెలుగు, తమిళ టాకీ అని తేల్చారు పరిశోధకుడు. చిత్రంగా ఆలం ఆరా కోసం వేసిన సెట్స్‌లోనే కాళిదాస్ కూడా చిత్రీకరించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, ఒడియా, గుజరాతీ, అస్సామీ, పంజాబీ వంటి భాషలలో సినిమా ఆవిర్భావం గురించి చెప్పిన ఈ పుస్తకంలో లెక్కలేనన్ని విశేషాలు ఉన్నాయి. వాటిని ఆసక్తికరంగా, శ్రుతి మించకుండా మన ముందుం చారు. ఒక్కొక్క భాషలో సినిమా ఆరంభానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ పుస్తకానికి సింగీతం శ్రీనివాస రావు రాసిన పీఠకకు అగ్ర తాంబూలం ఇవ్వడం సముచితమే. తెలుగువారి సినిమా ప్రయాణాన్ని రమణీయంగా చిత్రించారు సింగీతం. తెర మీది వారూ, తెర వెనుక వారూ కూడా సినిమా రూపకల్పనలో కీలకమేనన్న సత్యాన్ని రమణీయంగా ఆవిష్కరించారు ఆ దర్శక దిగ్గజం. నటి శారద, నటుడు ప్రకాశ్‌రాజ్, దర్శకుడు రాజమౌళి రాసిన ముందుమాటలు కూడా ఉన్నాయి. శారద జ్ఞాపకాలు మంచి సెల్యులాయిడ్ కథతో పోటి పడ్డాయి. తెలుగు నటీమణుల స్థాయిని మన ముందుంచింది శారద రాసిన అవతారిక.
45 భాగాలను ఎనిమిది అధ్యాయాలుగా అందించారు రచయిత. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, గ్రామ్‌ఫోన్ రికార్డుల ముచ్చట్లు, ఆహార్యం విషయంలో నాటి సినిమా దర్శకులు ఎదుర్కొన్న ఇబ్బందులు, నటీమణుల ఆంక్షలు వంటి విషయాలు కూడా పరిచయం చేశారు. సినిమా ప్రస్థానాన్ని అంటే చరిత్రనే ప్రధానంగా తీసుకున్నప్పటికీ ‘తొలి’ ఘనత ఉన్న కథానాయికలు, నాయకుల గురించి కూడా రచయిత పరిచయం చేసుకుంటూ వచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఆంధ్రపత్రిక, సినిమా చరిత్ర మీద వచ్చిన కొన్ని ప్రత్యేక సంచికలు, కొందరి ప్రముఖులతో ఇంతక్రితం వచ్చిన ముఖాముఖీలు ఈ పుస్తకంలోని సమాచారానికి ఆధారం. కాబట్టి ఇదొక పరిశోధక గ్రంథమే. ప్రామాణిక రచనే.
సినిమా రంగం అడుగులు నేర్చుకుంటున్న సమయానికి ఇక్కడ సెన్సార్ లేదు. తరువాత బ్రిటిష్ ఇండియాలో కొన్ని సినిమాలు సెన్సార్ కత్తెర పదును రుచి చూశాయి. ‘అస్వతంత్ర భారతావనిలో మన మూకీలు, ఆపైన టాకీలు సైతం వీలున్నప్పుడల్లా జాతీయవాద ప్రబోధానికి పెద్ద పీట వేశాయి. మన దేశంలో తొలిసారిగా ఎదురైన సెన్సార్ వివాదం దాని వల్లే వచ్చింది. మహా భారత పౌరాణిక గాథలోని విదురుడు పాత్రనూ, పాత్రధారినీ గాంధీ ఫక్కీలో చూపడంతో ‘భక్త విదుర్’ (1921) అనే సైలెంట్ సినిమా బ్రిటిషు హయాంలో సెన్సార్ సమస్యలను ఎదుర్కొంది’. ఇదొక కీలకమైన అంశం, ఈ పుస్తకంలో. భారత స్వరాజ్య సమరం ఛాయలు ఆనాటి సినిమాలలో అంతర్లీనంగా ఉన్నాయనే అంటారు రచయిత. అది నిజమే కూడా. ఈ పుస్తకం రాయడానికి రచయిత ఎంతో శ్రమించారు. 566 పేజీల ఈ పుస్తకంలో పేజీకి సగటున రెండు ఫోటోలు వంతున అందించారు. నిజంగా ఇదొక యజ్ఞం. ఆనాటి నటులు, దర్శక నిర్మాతల చిత్రాలే కాదు, మంచి అభిరుచితో నిర్మించిన నాటి సినిమా థియేటర్ల ఫోటోలు కూడా సేకరించారు. ఈ రచనతో జయదేవ సినిమా రంగానికి ఎనలేని సేవలను అందించినట్టే.
ఇంతకీ సినిమా అంటే, అలసి సొలసిన మనిషిని కొద్దిసేపు లాలించే వినోదమా? కొందరు అన్నట్టు అది దర్శకుడి రాజకీయ ప్రకటనా? సమాజాన్ని మేల్కొల్పేదా? ‘సినిమా అంటే నీవు ఒక థియేటర్‌లో కూర్చున్న సంగతిని విస్మరించేటట్టు చేయాలి’ అన్న రొమన్ పోలాన్‌స్కీ వ్యాఖ్యకు దగ్గరగా ఉండాలా? దీని మీద చర్చ జరగవలసిన అవసరం ఉంది. జయదేవ రచన, అందులోని ఆర్తి అలాంటి చర్చకు దోహదం చేస్తే అది ‘ఫస్ట్ రీల్’కు నిజమైన సార్థకత.