భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– ‌బండారి రాజ్‌కుమార్‌

అరుగుల మీది ఎండ సుర్రు మంటాంది. జర అటేటు జరిగి ఈతాకులు దగ్గరికి జరుపుకొని కూసున్నది చంద్రమ్మ. ఈతాకుల తోటి సాప అల్లుతాంది. కొత్త పెళ్లికూతురు జడ లెక్క పొడుగ్గా ఉంది. పోయిన వారమే ఒక సాపను అల్లి అటక మీద దాపెట్టింది. ఇది రెండోది. మొఖంల సులుకున్నది. నవ్వు పెదాల మీంచి వాకిట్లకు జాలు కొడుతాంది.

‘‘సోమరాజు వచ్చి పోయినట్టున్నడు.. లేకపోతే ముసల్దాని కళ్లలో  ఆ వెలుగెందుకుంటది?’’ బాట పొంటి పోవుకుంట పక్కింటి రాముల కిసుక్కుమన్నది.

ఆఠాణ బిల్ల మనవడి చేతుల పెట్టి దాసి పెట్టుకోమన్నది చంద్రమ్మ. తీర్థంలో చిలుకల పేరు కొనుక్కోవచ్చని తనబ్బిల పెట్టుకొని బెల్లం పుట్నాలు బుక్క వట్టిండు గీశిగాడు. నాయనమ్మ సాప అల్లుతాంటే పుట్నాలు బుక్కుడు.. బెల్లం కొరుకుడు ఇదే తంతు. ఉబ్బా గని మల్లిగాడు బుడ్డ జోక్కున్నట్టు..గడికీ తనబ్బి తెర్సుడు..ఆఠాణ బిళ్ల జూసుకుని ముర్సుడు. ఇప్పటికే ఇరవై మాట్ల గీశిగాడు అటీటు తిరిగిండు. నాయనమ్మ గీశిగాని యవ్వారం జూసుకుంట ముసిముసిగా నవ్వుకుంటాంది.

‘‘ఏమే.. చంద్రి.. ఎట్లున్నవ్‌? ‌పానం మంచిగున్నదా!’’ ఆకు వక్క దౌడ కేసుకుని దొండపండు నోరు తోటి మందలిచ్చుకుంట రాంబాయమ్మ రానే వచ్చింది. ఉప్పోసకు పదిండ్లు తిరిగి ముచ్చట పెట్టందే పొద్దుగూకదాయే..

‘‘ఏదో ఇట్లున్నం. మోకాళ్లు తీపులు దీత్తానయి. దవాఖానకు పోదామంటే కొడుకులకు ఎదురుచూసే బతుకులేనాయే’’ సాపల్లుకుంటనే సమాధానం జెప్పవట్టింది.

‘‘సోమరాజు వచ్చి పోయినట్టు ఉన్నది కదా!’’ రెట్టించి అడిగింది.

‘‘అవ్‌ అక్కా! పెద్దోడు పైసలు మనియార్డర్‌ ‌జేసిండు. గవ్వి ఇచ్చి పోదామని వచ్చిండు’’.

‘‘పోరడు చిమ్మిచ్చి పోత్తె వాని వాకిట్ల పడుతది. ఒక్క అడుగు వచ్చి పోతే ఏం బాయె నవ్వ? పోస్ట్ ఆఫీసుల యేసుడు ఏందో! వాని కతేందో! తెల్వకున్నది’’ రాంబాయమ్మ లోపలున్నదంత బైటేసుకున్నది.

‘‘ఎవరి ఇంటి రామాయణం వాళ్లకు ఉన్నది. వాన్ని అనేం లాభం తీయ్‌’’ ‌నశ్యం డబ్బా బొడ్ల సంచి నుంచి బయటికి తీసి రాంబాయమ్మకు గింతిచ్చి రెండు ముక్కుల నిండా దట్టించి ఆ..చ్చి. ఆ..చ్చి అని రెండు మాట్ల తుమ్మింది. ముక్కు నలుసుకుని, చీరకొంగు తోటి తుడుసుకుని మల్ల సాప అల్లుతనే ఉన్నది చంద్రమ్మ. ఇంకొక పాయ అల్లుతే ఒడిసి పోతది. మాట్లాడుకుంట మాట్లాడు కుంటనే ఎర్రమన్ను తోటి అలికినట్టున్న వాకిలంతా తుప్కు తుప్కు మని ఊంచుకుంట రాంబాయమ్మ సడుగెక్కింది.

‘‘గీశిగాన్ని తీసుకొని ముసలోడు, ముసల్ది పెద్దోని ఇంటికి పోతే గేటు కాడి నుంచే బయటికి పంపించేసిండని ఊరంతా గుప్పుమన్నది. ముసలోని పానం దస్సుమన్నది. మన్సు మన్సుల లేదు. దూరంగా ఉన్న కొడుకు మీదనే పానం పెట్టుకున్నడు. ఇయ్యాల ఇంట్లకు రానీయకుండనే ఎల్ల గొట్టిండని మనాది పెట్టుకున్నడు’’ వాకిట్ల ఆరబోసిన కందులు నేర్పుకుంట పక్కింటి రాముల రాంబాయమ్మకు పూసగుచ్చినట్టు చెప్పవట్టింది.

పెద్ద కొడుక్కి సర్కారీ కొలువు వచ్చిందని ఎంత సంబురపడ్డరో..అంత దూరమై పాయె. ఉన్నదో,లేన్దో తిని ఇద్దరు పోరగాండ్లను సదువిచ్చిన్లు. పెద్దోని నసీబ్‌ ‌బాగున్నది. సర్కారీ కొలువొచ్చింది. చిన్నోడింకా డొక్కామొక్కీలు తింటనే బతుకెల్లదీత్తాండు.

‘‘ఈ నా కొడుకులు నౌకరీ రాంగనే అయ్యవ్వలను ఎట్ల మర్చిపోతరో ఏందో.. ?’’ నొసలు చిట్లించింది రాంబాయమ్మ.

మొదట్ల మంచిగనే వున్నడే ..అవ్వ. అయ్యవ్వలను పానం లెక్కనే సూసుకునేటోడు. పెండ్లైంది. పెండ్లామొచ్చింది. పిల్లలు బుట్టిన్రు. బిడ్డకు ఇంట్ల సవురిత్తానికి కష్టమైతాందని వాని అత్తా మావ వచ్చి దిగవడిన్రు. ఇంకేమున్నది. అంతా లోకం మీది ముచ్చటేనాయె! ఇంతల తబాదలయ్యింది. కూరాడు కుండ వేరైంది. అత్తమామకు పాడింది పాట ఆడింది ఆట అయిపాయె. ఇగ అయ్యవ్వ ఏం కానొత్తరు?

‘‘ఈరయ్య వుత్తగనే ఊకున్నడానే..రాముల!’’ రాంబాయమ్మ సుట్టాకు నారదీసుకుంట అడిగింది.

వాడ మీద పులి బతుకు ఈరయ్యది. ఎందుకు ఊకుంటడు? సదువు రాకున్నా దిమాక్‌ ‌వున్నోడు. లోకం తీరు తెల్శినోడు. సూసిండు సూసిండు కచ్చీర్ల పెట్టిచ్చిండు. అమీన్‌ ‌సాబ్‌ ‘‘‌గిదేంది వయా..’’ అని నాలుగు అచ్చింతలు ఏశిండు. గప్పటి సంది పెద్దోనికి మనసు ఇరిగింది. ఇంటి మొఖం సుత సూడలె. ‘ఏందిరా..పెద్దోడా’ అని కారటు వేసినప్పుడే ఎవలతోనన్న పదో పరకో పంపిచ్చెటోడు,లేకపోతే లేదు.

‘‘కచ్చీర్ల పెట్టిచ్చినా మారలేదానే..’’ ఈ పాలి రాంబాయమ్మ పొట్లం కట్టినట్టు గౌర మాదిరి సుట్టాకు వడిదిప్పి పట్టుకుని రాముల మొఖం జూసింది.

ఇగ ముసలోనికి వశపడలే. కొడుకులిద్దర్నీ నలుగుట్లకు గుంజిండు. పంచాది పెట్టిచ్చిండు బాంచెద్‌. ‌పెద్ద మనుషులు ‘నెలకు చెరో రెండు వందలు ఇయ్యాలే’ అని తీర్మానించిండ్రు. తప్పేది లేక పెద్దోడు ‘పుట్టిన ఊరిలో బర్కతి వుండదు’ అని మనియార్డర్‌ ‌జేత్తాండు.

‘‘ఊళ్లో వున్న కొడుకు సంగతేంది? వాడన్న మంచిగ సూసుకుంటడా లేదా?’’ వేలికి సుట్టిన నారుంగురం సుట్టాకుకు తొడిగిచ్చుకుంట ఉండబట్టలేక అడిగింది రాంబాయమ్మ.

‘‘ నెలకి ఇంత ఇచ్చేటట్టు పెద్దమనుషులల్ల తీర్మానం అయింది గని చిన్నోడికి ఎల్లినప్పుడే గడికింత చేతుల పెడతడు. నెల తిరిగేసరికి అప్పుడింత అప్పుడింత ముట్టజెప్పుతడు. కండ్ల ముంగట అవుపడుతరు గన్క అంతో ఇంతో అర్సుకుంటరు’’ రాముల వివరంగా చెప్పుకుంటనే మోదుగాకుల సుట్ట ముట్టిచ్చి గుప్పుగుప్పున పొగ వదిలింది. రాంబాయమ్మ కండ్లు పొగాకు పొట్టె మీద పడ్డయి. రాములకు తప్పలేదు.

పొవ్వాకు మట్రంగ సుట్టాకుల వెట్టి మిగిలిన పొట్టె వట్టుకుని ఇంటి బాట పట్టిన రాంబాయమ్మ చంద్రమ్మ ఇంటికాడ ఆగి ‘‘నీ సాపల అల్లిక జోరుమీదున్న దేమే! ఆదివారం అంగట్ల గిట్ల అమ్ము కొత్తవా ఏంది? నీ అల్లిక సుత నీయంత సక్కదనంగ ఉంటది. గిట్టుబాటు సుత మంచిగనే అయ్యేటట్టున్నదిలే’’ శాత్రానికి ఓ మాట ఇసిరి నెత్తి మీది కొంగు సదురుకుంట, పెద్ద పెద్ద జంగ లేసుకుంట ముందుకు కదిలింది.

* * *

 ‘‘ఇప్పటిదాంక లేని ఆలోచన మతిల పడ్డది. ముసలాయన రాంగనే గీ ముచ్చట ముందటేయాలె. ఏమంటడో సూడాలె. ఎవ్వలకు ఎదురు చూడని బతుకు బతుకుదమంటే కాదంటడా!’’ రకరకాలుగా ఆలోచన జేత్తాంది చంద్రమ్మ.

నిన్నటిదన్క వాళ్ల ఆలోచనలు వేరే తీరుగా వుండె. ఈత సాపలు అల్లిన మతలబే వేరు. ఎవలకు బరువు గావద్దని ఒక్కశిత్తం జేసుకున్నంకనే ఈత సాపల అల్లిక సురువుజేన్రు. రేపు పొద్దున సాప ఖర్చు సుత కన్న బిడ్డల మీద పడొద్దని గట్టిగనే అనుకున్నరు. ‘సచ్చి ఎవల సాదించేదున్నది’ మతిలవడ్డది. చంద్రమ్మ తెలివిల కొచ్చింది. ఎంత కష్టమొచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా ఇద్దరూ కలిసి నిబ్బరంగ దాటొచ్చిన కాలాన్ని యాజ్జేసుకున్నది.

‘‘కలో గంజో తాగి, ఉన్నదో లేనిదో తిని పిల్లలను సాదుకున్నోల్లం. ఇయ్యాల పిల్లలకు కానివాళ్లమైనంత మాత్రాన ఇట్లా చేసుడు పిరికితనమే అయితది. ధీరగ బతకాలె, కొట్లాడి బతకాలె’’ చంద్రమ్మ గట్టిగ నిర్ణయించుకుంది.

* * *

పిట్టలు గూళ్లు చేరే యాల్లకు ముసలాయన ఇంటికి వచ్చిండు. కాళ్లకు  నీళ్లిచ్చింది. ఒత్తు కుండల నీళ్లు జాలాట్ల పెట్టింది. ఉడుకుడుకు నీళ్లు పెయి మీద పోసుకున్నడు. జర నిమ్మలం అనిపించింది. అట్ల అరుగు మీద వొరిగిండు. చంద్రమ్మ కూర పొయ్యిమీదేశి వచ్చి పక్కన కూసున్నది.

ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకున్నప్పుడు నాదాను గాని అరవై ఏండ్ల బతుకు ఇద్దరికీ లీలగా అవుపించింది. ప్రేమను కొసరి కొసరి తినిపించి పెద్ద చేసిన పిల్లలకు బరువైనమని వారి సూపులు మాట్లాడుకుంటానయి. తమ పిచ్చి నిర్ణయం గురించి చంద్రమ్మ ఈరయ్యకు చెప్పడం మొదలు పెట్టింది. తన కంటిని కప్పిన మాయపొరలు ఒక్కొక్కటిగా విడివడుతున్నట్టుగ ఈరయ్య అనుభూతి చెందుతున్నడు.

* * *

చంద్రమ్మ వంటింట్లకు నడిచింది.

మసాలా వాసన గుప్పుమని వత్తాంది. కోడి కూర కుతకుత ఉడుకుతాంది. ఓ పక్క అన్నం ఉమొగులుతాంది. గీశిగాడు నిద్రకు ఆసడు. అందుకే వాళ్ల అమ్మ వచ్చి తీసుకుపోయింది. వాడు పిడికిట్ల ఆఠాణ బిల్లను గట్టిగ పట్టుకున్నడు. అప్పటికే రామదాసు పావుశేరు అస్లీ సారా ఇచ్చి పోయిండు. ముసలోడు బాకీ శెల్లగట్టిండు. ముసల్ది ముచ్చట చెపుతోంది. రాంబాయమ్మ మాటల్ని అనువదిస్తూ ఉంది. ముసలోడు సమ్మతిస్తున్నట్టుగా ఊకొడుతూనే తత్వాలు పాడుతున్నడు. మాగి జాము మాయిల్నే చీకటి పడ్డది. ముసలోల్ల ముచ్చట వొడ్తలేదు తీర్తలేదు. ఆమె ఇన్నేండ్ల సాంగత్యాన్ని వరుసబెట్టి కథలు కథలుగా చెబుతాంది.

ఆయన తన్మయత్వంతో అలనాటి తీపి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఊ కొడుతాండు. ఆయన మైమరిచి ఆమె ఔన్నత్యాన్ని పాట అందుకుంటాండు. ఆమె సిగ్గుల మొగ్గై గారాలు పోతోంది. అంత సందడిలో గుడిసెలోకి వెన్నెల ఎట్ల చొరబడ్డదో ఇద్దరూ ఏర్పాటు జేయలే. ఒకరి నవ్వుల్లో ఒకరు కలిసి పొర్లాడుతున్నరు. రాత్రి జాగరణకు కీచురాళ్లు సుత వంత పాడుతున్నట్టనిపించింది. కొంత విసురుగా వీచిన గాలికి అటక మీది ఈత సాపలు రెండూ పెనవేసుకున్నయి. తెల్లారేసరికి ఎండపొడ గుడిసె మీదికొచ్చింది.

* * *

‘‘తాతా.. తాతా’’ అవుతలి నుండి గీశిగాడు తలుపు మీద దబా దబా బాదుతాండు.

ఈరయ్య గాఢనిద్రలో వున్నడు. లేశి తలుపు తెర్శింది. గీషిగాడు చంద్రమ్మ సంకలజేరిండు.

‘గాశారం దక్కువైతే గోశి పామైతదని ఎరుకైంది. కొడుకుల తోటి పోయిన రాజిర్కం మనుమని తోటి వత్తదో ఏందో…’ మాటలు మర్లేసుకుంట పాయిరంగ ముద్దాడింది. వాడి నవ్వుల వెలుతురు బతుకు మీద కొత్తగా పరుసుకున్నట్టనిపించింది.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE