కరీంనగర్‌లో ఆరురోజులు వైభవంగా జరిగిన మేళా

స్వయం సమృద్ధి, దేశ ఆత్మ నిర్భరతను అన్ని రంగాల్లో సాకారం చేసే తారకమంత్రం స్వదేశీ. స్వదేశీ భావజాలం, విధానాలు బలపడిన కొద్దీ దేశ ఆర్థికవ్యవస్థ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచి, ఆదర్శవంతమవుతుంది. దిగుమతులపై ఆధారపడే దుస్థితిని తగ్గిస్తుంది. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల దేశానికి ఆర్థిక ప్రయోజనమే కాకుండా కుటుంబం, గ్రామం, రాష్ట్రం, దేశం మొత్తం స్వయం సమృద్ధిని సాధిస్తాయి. స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌, ‌కరీంనగర్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11 నుంచి 16వ తేదీ వరకు ఆరురోజులు జరిగిన స్వదేశీ మేళా ఇదే స్ఫూర్తితో దిగ్విజయంగా సాగింది. స్థానిక పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను, వ్యాపారులను ప్రోత్సహించే లక్ష్యంతో, చేతితో తయారుచేసిన వస్తువుల నుండి తాజా సాంకేతిక ఆవిష్కరణల వరకు విస్తృతమైన స్వదేశీ ఉత్పత్తులను ప్రదర్శించిన ఈ మేళాకు కరీంనగర్‌ ‌పట్టణంలోని అంబేడ్కర్‌ ‌స్టేడియం వేదికైంది. స్వదేశీ భావనను ప్రచారం చేయడంలో మంచ్‌ ‌చేస్తున్న కృషికి ప్రశంసలు అందుకుంది. స్వదేశీ నినాదంతో మార్మోగిన మేళా, ‘స్వ’జాతీయులైన నేతలకే ఇక్కడ చోటు ఉండాలన్న కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ ‌గర్జనతో ముగియడం యాదృచ్ఛికం.

సేంద్రియ ఉత్పత్తులు, సహజ సౌందర్య ఉత్పత్తులు, ఆయుర్వేద మందులు, దేశీయ వాహనాలు, వస్త్రాలు, గృహోపకరణాలు, పూజా ద్రవ్యాలు, రోజువారి వినియోగించే వస్తువులు, దేశీయ ఆహార ఉత్పత్తుల వంటి వివిధ రకాలైన స్వదేశీ వస్తువులతో 210కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. స్వావలంబన దిశగా భారత్‌ను ముందుకు తీసుకు వెళ్లడంలో, వికసిత్‌ ‌భారత్‌ ‌దృక్పథాన్ని బలోపేతం చేయడంలో స్వదేశీ మేళా వంటి కార్యక్రమాలు దోహదపడతాయని దీనిలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రెండు లక్షల మంది పాల్గొనేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు భూమిపూజ (ఫిబ్రవరి 8) సందర్భంగా స్వదేశీ మేళా కన్వీనర్‌ ‌చల్మెడ రాజేశ్వరరావు, స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌రాష్ట్ర కన్వీనర్‌ ‌సీఏ ముక్క హరీశ్‌బాబు ప్రకటించారు. ఉద్యోగాల కల్పన కోసం 120 కంపెనీలు మేళాలో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయని ఆనాడే తెలిపారు. 9వ తేదీన ఉదయం కరీంనగర్‌ ‌లోని పలు ప్రాంతాల మీదుగా సైకిల్‌ ‌ర్యాలీని, 10వ తేదీన 5 కె రన్‌ను నిర్వహించి మేళాను విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు.
స్థానిక ఉత్పత్తులక•, కళాకారులకు గుర్తింపు;
ప్రారంభసభలో వక్తలు
స్వదేశీ మేళాతో స్థానిక కళాకారులు, ఉత్పత్తులు, వ్యాపారులను అమితంగా ప్రోత్సహించడం అభినంద నీయమని స్వావలంబి భారత్‌ అభియాన్‌ ‌ప్రాంత కో కన్వీనర్‌ ఇం‌ద్రసేనారెడ్డి, స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌క్షేత్ర సంఘటక్‌ ‌జగదీశ్‌, ‌రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌పూర్వ సంఘచాక్‌ ‌బూర్ల దక్షిణామూర్తి అన్నారు. ఫిబ్రవరి 12న జరిగిన మేళా ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. స్వదేశీ అనేది మన స్వయంసమృద్ధితో పాటు దేశ ఆత్మ నిర్భరతను అన్ని రంగాల్లో సాకారం చేసే తారక మంత్రమన్నారు. ముఖ్యంగా స్వదేశీ వస్తువుల తయారీ దిగుమతి చేసుకున్న వస్తువులపై ఆధారపడటాన్ని అధిగమించడంలో సహాయ పడుతుందని, ప్రజలు స్వదేశీ వస్తువులు, ఉత్పత్తులను ఉపయోగించాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రధానంగా స్వదేశీ వస్తువుల తయారీదారుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, ప్రయోజనాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మేక్‌ ఇన్‌ ఇం‌డియా, ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌ ‌నుండి వికసిత్‌ ‌భారత్‌ ‌వైపు…
దేశాన్ని, పౌరులను స్వతంత్రంగా, స్వావలంబన కలిగిన వారిగా మార్చడమే లక్ష్యంగా నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ దిశలో స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌చేస్తున్న కృషి అభినందనీయమని ప్రజ్ఞాభారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు, సమాలోచన రాష్ట్ర కన్వీనర్‌, ‌ప్రజ్ఞా ప్రవాహ కేంద్రీయ కార్యసమితి సభ్యులు మామిడి గిరిధర్‌ అన్నారు. మేళాలో భాగంగా ఫిబ్రవరి 13న డిగ్రీ, పీజీ విద్యార్థులకు స్వదేశీ, గ్లోబలైజేషన్‌ అం‌శాలపై నిర్వహించిన సెమినార్‌కు ఆయన ముఖ్యవక్తగా హాజరైనారు. భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడా నికి ప్రారంభించిన మేకిన్‌ ఇం‌డియా లాంటి కార్యక్రమం స్వావలంబన వైపు భారత్‌ను ముందుకు తీసుకెళ్లడంలో, వికసిత్‌ ‌భారత్‌ ‌దృక్పథాన్ని నెరవేర్చడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. దేశ ఉపాధి రంగంలో గణనీయమైన పరివర్తన చోటు చేసుకుంటుందని, మేక్‌ ఇన్‌ ఇం‌డియా, ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌, ‌ప్రొడక్షన్‌ ‌లింక్డ్ ఇన్సెంటివ్స్ ‌పథకాల ద్వారా ఉపాధి రేటు గణనీయంగా పెరిగిందని, మూడు దశాబ్దాలుగా స్వదేశీ భావనను ప్రచారం చేయడంలో స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.
మార్కెటింగ్‌ ‌ప్రొఫెషనల్‌, ‌మీడియా స్ట్రాటజిస్ట్ ‌సురేష్‌ ‌కొచ్చాటిల్‌, ‌నేషనల్‌ ‌లిస్ట్ ‌హబ్‌ ‌సీఈవో అవునూరి సాయికృష్ణ మాట్లాడుతూ పెట్టుబడి, ఆవిష్కరణ, వ్యవస్థాపకతకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా దేశీయ తయారీ రంగాన్ని గణనీయంగా పెంచుకోవచ్చన్నారు. ఆ దిశగా నేటి ప్రభుత్వం ముఖ్యమైన కీలక రంగాలపై దృష్టి సారించిందని, తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, ఉపాధిని సృష్టించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షిం చడం లాంటి విధానాలతో ముందుకు కొనసాగుతూ, దేశంలో ప్రపంచ పోటీ తత్వాన్ని పెంచడం లక్ష్యంగా ప్రయాణాన్ని కొనసాగిస్తుందన్నారు. కరీంనగర్‌ ‌డెయిరీ చైర్మన్‌, ‌స్వదేశీ మేళా కన్వీనర్‌ ‌చల్మెడ రాజేశ్వరరావు మాట్లాడుతూ స్వదేశీ జాగరణ మంచ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మేళా స్థానిక పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో, చేతితో తయారుచేసిన అద్భుతమైన వస్తువులు మొదలుకొని, తాజా సాంకేతిక ఆవిష్కరణల వరకు విస్తృతమైన స్వదేశీ ఉత్పత్తులను అందుబాటులోకి తేవడమే మేళా లక్ష్యమని అన్నారు. గోష్టికి అధ్యక్షులు, రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌జిల్లా సంఘచాలక్‌ ‌సి.ఎ. నిరంజనాచారి, వీహెచ్‌పీ ప్రాంత టోలి సభ్యులు ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి మాట్లాడారు. మధ్యాహ్నం జరిగిన మెడికల్‌, ‌ఫార్మసి, నర్సింగ్‌ ‌విద్యార్థుల సెమినార్‌ ‌కార్యక్రమంలో మామిడి గిరిధర్‌ ‌మాట్లాడుతూ భారతదేశ వైద్యవృత్తి గొప్పదనాన్ని వివరించారు. సాయంత్రం ప్రముఖ వైద్యులచే సాంప్రదాయ వస్త్ర ప్రదర్శన కార్యక్రమాన్ని కోఆర్డినేటర్‌ ‌డాక్టర్‌ శ్రీ‌లక్ష్మి, డాక్టర్‌ ‌మానస ఆధ్వర్యంలో చేపట్టారు.
ప్రకృతి వ్యవసాయమే మేలు
అదే రోజు (ఫిబ్రవరి 14) మధ్యాహ్నం పాడిపంట, రైతు ఆర్థిక స్వావలంబన సెమినార్‌ ‌కార్యక్రమానికి ఎన్నారై సామ ఎల్లారెడ్డి ముఖ్యవక్తగా హాజరయ్యారు. వ్యవసాయం అనేక విషయాల సమ్మిళితమని, ప్రధానంగా వ్యవసాయాభివృద్ధి, గ్రామీణాభివృద్ధితో దగ్గరి సంబంధం కలిగి ఉందని ఆయన అన్నారు. గ్రామీణ జనాభాలో ఎక్కువమంది ఏదో రూపంలో వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. అత్యధిక వ్యవసాయ ఉత్పత్తి గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతుందన్నారు. రసాయన వ్యవసాయం కంటే ప్రకృతి వ్యవసాయమే శ్రేయస్కర మన్నారు. ప్రకృతి వ్యవసాయం నేల పునరుత్పత్తి, నీరు, గాలి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయ పడుతుందని, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుందన్నారు. సమగ్ర వ్యవసాయంతో రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, పంటలతో అనుసంధానానికి ఎన్నో రంగాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా రైతులు తమ ప్రాంతంలో ఉన్న వనరులను అనుసరించి వ్యవసాయంపై శ్రద్ధ చూపితే మన సాంప్రదాయ వృత్తిగా ఉన్న వ్యవసాయంలో ఉంటూనే కుటుంబానికి అదనపు ఆదాయం, ఉపాధి కలిగించుకోవచ్చన్నారు. సమగ్ర వ్యవసాయ విధానంతోనే రైతు ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయానికి ప్రగతి సాధ్యమని అన్నారు. స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌తెలంగాణ ప్రాంత మహిళా సహప్రముఖ్‌ ‌బల్ల స్వప్న, రాష్ట్ర సేవికా సమితి జిల్లా కార్యవాహిక బూర్ల విజయలక్ష్మి, నగర కార్యవాహిక కళ్లెం కవిత, సహ కార్యవాహిక కామారపు మంజుల, పాక సంధ్యా రే•, రమ, స్వరూపరాణి, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ‌కాచం దీప్తి తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచంతో భారత్‌ ‌పోటీ పడుతోంది!
సామాజిక సమరత వేదిక తెలంగాణ సంయోజక్‌ అప్పాల ప్రసాద్‌
‌భారతదేశంపై ఎన్నో దేశాలు దాడులు చేసి, మన సంస్కృతిని నాశనం చేసినా నిలదొక్కుకుని, నేడు ప్రపంచ దేశాలతో అన్నింటా పోటీ పడుతున్నదని, స్వదేశీ పరిజ్ఞానం, ఆలోచనలతో ముందుకెళ్తూ వికసిత్‌ ‌భారత్‌ ‌వైపు అడుగులు వేస్తున్నదని సామాజిక సమరసత వేదిక తెలంగాణ ప్రాంత సంయోజక్‌ అప్పాల ప్రసాద్‌ అన్నారు. మేళాలో భాగంగా ఫిబ్రవరి 15న అంబేడ్కర్‌ ‌స్టేడియంలో ఇంటర్‌ ‌విద్యార్థులతో నిర్వహించిన సెమినార్‌కు అప్పాల ప్రసాద్‌ ‌ముఖ్యవక్తగా హాజరయ్యారు. జపాన్‌పై అణు దాడి జరిగినప్పుడు ఆ దేశం పూర్తిగా నాశనం అయిపో యిందని అందరూ అనుకున్నా, కొద్ది సంవత్సరాలలోనే అమెరికాతో పోటీ పడే స్థితికి వచ్చిందన్నారు. 250 ఏళ్లు భారతదేశ సంస్కృతిని, సంపదను దోచుకున్నారని, అయినా అన్నింటినీ తట్టుకొని నిలబడిందని, ఇదే భారతదేశ గొప్పతనమన్నారు.
ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు రావాలని, మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుంటూ, కాపాడుకోవాలని, భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలని ప్రసాద్‌ ‌పిలుపునిచ్చారు. స్వదేశీ అంటే విదేశాలకు వ్యతిరేకం కాదన్నారు. మన దేశంలో తయారైన వస్తువులను మనమే కొనాలని, మన డబ్బు మన దేశంలోనే ఉండేలా చూసుకోవా లన్నారు. 1947లో స్వాతంత్య్ర వచ్చిన తరువాత పేద దేశంగా ఉన్న భారతదేశం అమెరికా పంపించే గోధుమలు తినే పరిస్థితుల్లో ఉండేదని, 75 సంవత్సరాల తర్వాత నేడు ఆర్థిక అభివృద్ధి సాధించి 102 దేశాలకు అన్నం పెడుతున్నదన్నారు.1947లో ప్రపంచంలో 168 ఆర్థిక ర్యాంకింగ్‌తో ఉన్న దేశం నేడు 5 వ స్థానంతో దూసుకుపోతున్నదన్నారు. దేశం ఇంకా ఆర్థికంగా బలోపేతం కావాలంటే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. దేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాలలో స్వావలంబన సాధిం చేందుకు స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయ మన్నారు. మన సంస్కృతి, వారసత్వాన్ని రాబోయే తరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుందన్నారు. ఇవాళ ప్రపంచీకరణ ప్రభావంతో బహుళ జాతి సంస్థల తుపానులో చిక్కుకొని కులవృత్తులు, వివిధ వృత్తులు, మన పటిష్ట ఆర్థిక కేంద్రాలకు మూల స్తంభాలైన వారపు సంతలు వంటివెన్నో విలవిల్లాడుతూ కొట్టుకుపోతున్న పరిస్థితుల్లో గత మూడు దశాబ్దాలుగా దేశ ఆర్థిక ప్రయోజనాలను రక్షించడానికి, మన ఆర్థిక వ్యవస్థపై విదేశీ శక్తుల ప్రభావాలకు వ్యతిరేకంగా స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌పోరాడుతుందన్నారు. ఆ దిశలోనే స్వదేశీ భావజాల వ్యాప్తికి సదస్సులు, సమావేశాలు, కార్యక్రమాలతో పాటు స్వదేశీ మేళాలు నిర్వహిస్తూ మళ్లీ మనదైన సాంస్కృతిక సామాజిక ఆర్థిక రంగాల పునర్‌ ‌వైభవం కోసం కృషి చేస్తున్నదన్నారు. స్వదేశీ మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రతి ఒక్కరు సందర్శించాలని, ఇక్కడి వస్తువులను కొనుగోలు చేసి వారికి ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన కోరారు. సభాధ్యక్షులు, మేళా కో కన్వీనర్‌ ‌కళ్లెం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, భారతదేశం పరం వైభవస్థితికి చేరుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, జీవితంలో రాణించే రంగాన్ని ఎన్నుకొని భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దు కోవాలన్నారు. అవసరానికి మించి సోషల్‌ ‌మీడియాను వినియోగించవద్దన్నారు. ఈ కార్యక్రమంలో స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌కన్వీనర్‌ ‌ముక్క హరీశ్‌బాబు, ముత్యాల జగన్‌రెడ్డి, వసంత్‌ ‌వ్యాలీ స్కూల్‌ ‌కరస్పాం డెంట్‌ ఇనుకొండ బుచ్చిరెడ్డి, సప్తగిరి హైస్కూల్‌ ‌చైర్మన్‌ ‌నగేష్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జన జాతరను తలపించిన స్వదేశీ మేళా…
ముగింపు రోజున స్వదేశీ మేళా ప్రజలతో కిటకిట లాడింది. సెమినార్లు, సంగీత విభావరి, సాంప్రదాయ వస్త్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. ఉద్యోగ మహోత్సవ్‌ ‌జాబ్‌ ‌మేళాతో, దాదాపు 210 స్వదేశీ వస్తు ప్రదర్శన స్టాల్స్‌తో వైభవంగా ప్రారంభమైన మేళా, ప్రతిరోజు ప్రముఖులతో వివిధ అంశాలతో సెమినార్‌లు, సాయంత్రం సంగీత సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించింది. ముగింపులో భాగంగా ఫిబ్రవరి 16న జరిగిన సెమినార్‌కు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రముఖ రచయిత భాస్కరయోగి ముఖ్య వక్తలుగా హాజరైనారు. 1991లో నాగపూర్‌ ‌కేంద్రంగా ప్రారంభమై స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌దేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల వికాసం కోసం స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం కోసం పనిచేస్తున్న ఏకైక స్వచ్ఛంద సంస్థ అని వారు కొనియాడారు. మన సాంస్కృతిక, సామాజిక, ఆర్థికరంగాల పునర్‌ ‌వైభవం కోసం జరుగుతున్న ఈ కార్యక్రమాలు అభినందనీయ మన్నారు.
రాజీవ్‌ ‌గాంధీ హిందువే కాదు
రాజీవ్‌ ‌గాంధీ అసలు హిందువే కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వదేశీ మేళా ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌చేస్తున్న కృషిని అభినందించారు. ఇవాళ కాంగ్రెస్‌ ‌నేతలు మాట్లాడిన మాటలు టీవీల్లో చూశాననీ, తండ్రి కులమే కొడుకుకు వర్తిస్తుందనీ, రాజీవ్‌ ‌గాంధీ హిందువు అయినందున ఆయన కుమారుడు రాహుల్‌ ‌గాంధీ కూడా హిందువేనని వారు చెప్పడం విడ్డూరమని వ్యాఖ్యా నించారు.
అసలు రాజీవ్‌ ‌గాంధీ హిందువు ఎట్లా అవుతాడని ప్రశ్నించారు. రాజీవ్‌ ‌గాంధీ తండ్రి ఫిరోజ్‌ ‌జహంగీర్‌ ‌ఖాన్‌ ‌పార్శీ మతస్థుడు. పర్షియా లోని ముస్లిం సంతతికి చెందిన వారి పూర్వికులు ఇక్కడికి వచ్చి పార్శీలుగా మారారని సంజయ్‌ ‌గుర్తు చేశారు. ఆ ఫిరోజ్‌ ‌జహంగీర్‌ ‌ఖాన్‌ ‌మతమే రాజీవ్‌ ‌గాంధీకి వర్తిస్తుందని, కాబట్టి రాజీవ్‌ ‌హిందువు కానేకాదని సంజయ్‌ అన్నారు. టెన్‌ ‌జన్‌పథ్‌లోని రాహుల్‌ ‌గాంధీ కుటుంబానికి కులం, మతం, జాతి, దేశం లేవని విమర్శించారు. కానీ మోదీ పక్కా ఇండియన్‌ అనీ, మోదీకి విదేశీయులే సాష్టాంగ నమస్కారం చేస్తున్నారని గుర్తు చేశారు. విదేశాల్లో ప్రతి భారతీయుడు గర్వంగా ఇండియన్‌ అని తలెత్తుకుని తిరిగేలా చేస్తున్నారని అన్నారు.
బీసీ కులగణన పేరుతో హిందువులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని, ఒక వర్గానికి, మతానికి కొమ్ము కాసేందుకు కాంగ్రెస్‌ ‌నేతలు బీసీల జనాభా తగ్గించే కుట్ర చేస్తున్నరని సంజయ్‌ ‌దుయ్యబట్టారు. 10 శాతమున్న ముస్లింలను బీసీల్లో కలిపారని, 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినా అందులో 10 శాతం ముస్లింలకే చెందుతాయని చెప్పారు. ఈ లెక్కన బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు మాత్రమే వర్తిస్తాయి. మరి 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారో సమాధానం చెప్పాలని ఆయన నిల దీశారు. ముస్లింలను బీసీ జాబితాలో కలిపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హిందూధర్మ సమాజం కోసం నిరంతరం పనిచేస్తామని, తమపై మతతత్వ వాదులుగా ముద్రవేసినా భయపడే ప్రసక్తే లేదని ప్రకటించారు.
బీసీ జాబితాలో నుండి ముస్లింల జనాభాను తీసేసి కేంద్రానికి పంపిస్తే తప్పనిసరిగా ఆ జాబితా ఆమోదం పొందేలా చేస్తామని హామీ ఇచ్చారు. సంజయ్‌ ‌దాదాపు రెండు గంటలకుపైగా అక్కడే గడిపారు. ప్రతి స్టాల్‌ను సందర్శిస్తూ స్వదేశీ ఉత్పత్తులను తిలకించారు.


ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు మహిళలు
స్వశక్తి మహిళల కార్యక్రమంలో వక్తలు

‌ప్రపంచ ఆర్థికవ్యవస్థకు మహిళలు మూల స్తంభా వంటివారని, నేడు వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, గృహిణిగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే పలు వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాలను సమర్థ వంతంగా నిర్వహిస్తున్నారని, పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతూ విజయాల బాటలో పయనిస్తున్నారని మహిళా సాధికారత, వ్యాపార వ్యవస్థాపకత కమిటీ చైర్‌పర్సన్‌ ‌బెల్లం మాధవి అన్నారు. మేళాలో భాగంగా ఫిబ్రవరి 14న మహిళా ఆర్థిక స్వావలంబన, అభివృద్ధి అంశంపై స్వశక్తి మహిళలకు నిర్వహించిన గోష్టిలో మాధవి ముఖ్య వక్తగా పాల్గొన్నారు. మహిళలు చిన్న తరహా, కుటీర పరిశ్రమల వంటివి స్థాపించి స్వయం ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నా రని మాధవి అన్నారు. సాధికారత అంటే బాధ్యత తీసుకునే సామర్ధ్యమని, జీవితంలో తమ ఎంపికలను తామే నిర్ణయించుకునే హక్కు మహిళలకు ఉందన్నారు. అలాగే లింగ సమానత్వం, లైంగిక వేధింపులు, గృహహింస, చట్టపరమైన హక్కుల వంటి అంశాలపై అవగాహన పెంచడానికి, సాంప్రదాయ నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడానికి, అదే సమయంలో కొత్త నైపుణ్యాలను ప్రోత్సహించడానికి వివిధ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలలో మహిళలు తప్ప కుండా పాల్గొనాలన్నారు. ఇవన్నీ కూడా మహిళలకు సాధికారత కల్పించే అంశాలేనన్నారు. ముఖ్యంగా మహిళలు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని, జీవనోపాధిని మెరుగు పరచుకోవాలన్నారు.
అహల్యాబాయి పేరిట స్త్రీశక్తి పురస్కారం
లోకమాత, ధీరవనిత అహల్యబాయి హోల్కర్‌ ‌గురించి కేశవ మెమోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీ హైదరాబాద్‌, ‌స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌ ‌తెలంగాణ ప్రాంత మహిళా ప్రముఖ్‌ ‌డా. కళ్లెం స్వప్న వివరించారు. భారతదేశ సంస్కృతికి అహల్యా బాయి విశేష కృషి చేశారని, ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఆమె పేరిట స్త్రీశక్తి పురస్కారాన్ని నెలకొల్పాలని కోరారు. అహల్యాబాయి సేవకు, దానధర్మాలకు మారుపేరుగా నిలిచారని, మహ్మదీయుల దాడుల్లో శిథిలమైన అనేక దేవాలయాలను పునర్నిర్మించారన్నారు. హిందూ ధర్మ పునరుత్తేజ్జానికి ఆమె విశేష కృషి చేశారన్నారు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE