జర్మనీలో ఫిబ్రవరి 23న జరిగిన 21వ బుండ్‌స్టాగ్ (జర్మనీ పార్లమెంట్) ఎన్నికలు అక్కడి ప్రజల్లో పెరుగుతున్న జాతీయవాద కాంక్షకు ప్రతిరూపంగా నిలిచాయి. ఇదేసమయంలో వామపక్షం గతంలో కంటే తన ఓట్ల శాతంతో పాటు సీట్ల సంఖ్యను కూడా మెరుగుపరచుకోవడం గమనార్హం. అక్రమ వలసదారుల వల్ల పెరుగుతున్న సామాజిక హింస నేపథ్యంలో స్థానిక జర్మన్లలో వారిపట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నదీ జాతీయవాద పార్టీ ఏఎఫ్‌డీకి గతంలో కంటే రెట్టింపు స్థానాలు కట్టబెట్టడాన్ని బట్టి అర్థమవుతోంది. తమ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న ఈ అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీలిచ్చిన పార్టీలకే వారు తమ మద్దతు పలికినట్టు కూడా ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఇది కేవలం జర్మనీకి మాత్రమే పరిమితం కాదు.
ఐరోపా సమాజంలో పెరుగుతున్న అభద్రతా భావం నేపథ్యంలో, ఆయా దేశాల ప్రభుత్వాలు వలసదారుల పట్ల ఇప్పటివరకు తాము అనుసరిస్తున్న విధానాలను సమీక్షించుకోక తప్పని పరిస్థితి ఏర్ప డిరది. అంతేకాదు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల్లో మార్పులు తీసుకురాకపోతే స్థానిక సంస్కృతుల విధ్వంసంతో పాటు తమ మనుగడ కష్టసాధ్యమవు తుందన్న అభిప్రాయం ఐరోపా దేశాల సమాజాల్లో క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే డెన్మార్క్ ప్రధాని అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. జర్మనీ ఎన్నికల్లో విజయం సాధించి కొత్త ఛాన్స్‌లర్‌గా అధికారాన్ని చేపట్టనున్న సీడీయూ / సీఎస్‌యూ కూటమి నాయకుడు మెర్జ్ ఇప్పుడు వలసల పట్ల కఠిన వైఖరి అనుసరించడంవైపే మొగ్గు చూపుతారన్నది స్పష్టం. ఎందుకంటే ఈ వలసలకు వ్యతిరేకంగా ఆయన గతంలో జర్మనీ పార్లమెంట్‌లో ఒక బిల్లును ప్రతిపాదించారు కూడా. కాకపోతే ఆ బిల్లు ఓడిపోయింది. ఇదిలావుండగా అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపడం వల్ల తాత్కాలికంగా మంచి ఫలితాలు వచ్చినా దీర్ఘకాలంలో, పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న వాదన కూడా ఉంది. ఇప్పటికే జర్మనీతో పాటుగా ఐరోపా దేశాల్లో తగినంత శ్రామికశక్తి లేకపోవడంతో చాలా ప్రైవేటు సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వలసదారుల్లో నిపుణులను పనుల్లో పెట్టుకోవడంవల్ల మాత్రమే అనుకున్న ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం సాధ్యమనేది ప్రైవేటు సంస్థల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం మాత్రమే కాదు, వాస్తవం కూడా! దీనికి ప్రధాన కారణం స్థానిక ఐరోపా జాతుల ప్రజల జనాభా వేగంగా తగ్గిపోతుండటం! మరి మెర్జ్ ఈ సమస్యపట్ల సమతుల్యంగా వ్యవహరిస్తారా లేక దూకుడుగానే ముందుకెళతారా అన్నది వేచి చూడాలి.
ఈ ఎన్నికల్లో సెంట్రల్ డెమోక్రటిక్ యూనియన్ ఆఫ్ జర్మనీ (సీడీయూ), క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్‌యూ) కూటమి 28.5% ఓట్లతో 208 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద కూటమిగా నిలిచింది. 2021లో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీకి 197 సీట్లు (24.1% ఓట్లు) రాగా ఇప్పుడు 11సీట్లు పెరగడం గమనార్హం. అల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ)20.8% ఓట్లతో 152 స్థానాల్లో గెలుపొంది రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2021 ఎన్నికలతో పోలిస్తే ఈ పార్టీ అత్యధిక లబ్ధిపొందిందనే చెప్పాలి. గత ఎన్నికల్లో 10.4% ఓట్లతో 83 స్థానాల్లో గెలుపొందగా ఈసారి ఓట్ల శాతం రెట్టింపు కావడందో 82 స్థానాలు అదనంగా గెలుచుకోవడం ఈ పార్టీ సాధించిన ఘనత. ఇక అధికారంలో ఉన్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ (ఎస్‌డీపీ) గతంతో పోలిస్తే 9% ఓట్లు కోల్పోయి 120 (16.4% ఓట్లు) సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో ఈ పార్టీ 206 (25.7% ఓట్లు) స్థానాలను గెలుచుకుంది. ఎస్‌డీపీకి 1887 తర్వాత ఇంత తక్కువ ఓటింగ్ శాతం ఎప్పుడూ నమోదు కాలేదు. ఈ పార్టీకి జూనియర్ భాగస్వామిగా ఉన్న గ్రీన్స్ పార్టీ కూడా గతంతో పోలిస్తే ఈసారి 3% ఓట్లు కోల్పోయింది. గత ఎన్నికల్లో ఈ పార్టీ 14.7% ఓట్లతో 118 స్థానాల్లో గెలుపొందగా, ఇప్పుడు 12% ఓట్లతో 33 స్థానాలను కోల్పోయి 85 స్థానాలతో సరి పెట్టుకుంది.
సోషలిస్ట్ లెఫ్ట్ పార్టీ గత ఎన్నికల (4.9%)తో పోలిస్తే పరిస్థితిని మెరుగుపరచుకొని 9% ఓట్లతో 64 స్థానాల్లో గెలుపొందింది. ఆ పార్టీకి గత ఎన్నికల్లో గెలిచిన 39 సీట్లతో పోలిస్తే ఇప్పుడు 25 స్థానాలు అదనం. ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడం ద్వారా మధ్యంతర ఎన్నికలకు కారణమైన ఫ్రీ డెమోక్రటిక్ పార్టీ(ఎఫ్‌డీపీ)కి ప్రజలు ఈ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పారు. ఫలితంగా ఎఫ్‌డీపీ కేవలం 4.3% ఓట్లు మాత్రమే సాధించింది. ఈ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోవడంతో 2013 తర్వాత మొట్టమొదటిసారి బుండ్‌స్టాగ్‌లో ప్రాతినిధ్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది. లెఫ్ట్ పార్టీనుంచి విడిపోయి ఏర్పడిన సహ్రా వాగెన్‌నెఛెట్ అలయన్స్ (బీఎస్‌డబ్ల్యు) 4.97% ఓట్లు సాధించి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయింది. ఇక సౌత్ షెల్స్‌విగ్ వోటర్స్ అసోసియేషన్ (ఎస్‌ఎస్‌ఏ) 5% ఓట్లతో ఒక్క స్థానంలో గెలిచి, బుండ్‌స్టాగ్‌లో తన ఉనికిని చాటుకుంది. ఈ ఎన్నికల్లో 82.5% ఓట్లు పోలయ్యాయి. ఇది 2021లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఆరుశాతం ఎక్కువ! పార్ల మెంట్‌లో మొత్తం 630 స్థానాలుండగా అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన సీట్లు 316.
వలసలు – ఆర్థిక సమస్యలు
ఐరోపా దేశాల్లో అత్యంత బలమైన జర్మనీ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయిన నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిరది. ముఖ్యంగా దేశంలోకి విపరీతంగా పెరిగిన వలసలు, రష్యా`ఉక్రెయిన్ యుద్ధం వంటివి దేశ రాజకీయ, ఆర్థికవ్యవస్థలను అస్తవ్యస్తం చేశాయి. అంతేకాదు గత రెండేళ్లుగా స్తంభించిన ఆర్థిక వ్యవస్థ ఓటర్లపై చాలా ప్రభావం చూపిందనే చెప్పాలి. దీంతో పాటు ఇటీవలి కాలంలో స్థానికులపై వలసదార్ల దాడులు పెరిగిపోవడం కూడా ఓటర్లు జీర్ణించుకోలేకపోయారు. సీడీయూ / సీఎస్‌యూ కూటమి నాయకుడు ఫ్రెడ్రిక్‌మెర్జ్ అక్రమ వలసలను అరికడతామని, సరైన పత్రాలు లేకుండా ఎవరినీ దేశంలోకి అనుమతించేది లేదని, అక్రమంగా దేశంలో ఉంటున్నవారిని స్వదేశాలకు తిప్పిపంపుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఓటర్లపై సానుకూల ప్రభావం చూపి ఈ కూటమికి 28.5% ఓట్లు రావడానికి దోహదం చేసింది.
ముగ్గురు నేతల రాజకీయ సన్యాసం
ప్రస్తుతం సీడీయూ / సీఎస్‌యూ నాయకుడు ఫెడ్రిక్ మెర్జ్ జర్మనీ కొత్త ఛాన్సలర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్టర్‌నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) గతంతో పోలిస్తే తన ఓటుషేరును రెట్టింపు సాధించినప్పటికీ మిగిలిన పార్టీలు మద్దతివ్వడానికి ముందుకు రాకపోవడంతో అధికారానికి దూరంగా ఉండక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనా మేరకు విపక్ష కన్జర్వేటివ్ గ్రూపు నాయకుడు ఫెడ్రిక్ మెర్జ్‌కు తర్వాతి ఛాన్స్‌లర్ అయ్యే అవకాశాలు మెరుగైన నేపథ్యంలో దేశ రాజకీయాల్లో ఇప్పటివరకు కీలక పాత్ర పోషిస్తున్న ముగ్గురు నాయకులు తాము రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం గమనార్హం. వీరిలో ప్రస్తుత ఛాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్, పదకొండేళ్లుగా ఎఫ్‌డీపీకి నాయకత్వం వహిస్తున్న క్రిస్టియన్ లిండ్నర్, గ్రీన్స్ వైస్`ఛాన్స్‌లర్ రాబర్ట్ హెబక్‌లున్నారు. క్రిస్టియన్ లిండ్నర్ ఒలాఫ్ స్కోల్జ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘డెబిట్ నిబంధనలను’ తీవ్రంగా వ్యతిరేకించి, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో ప్రస్తుత ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఆర్థిక ప్రగతిపైనే దృష్టి
కన్జర్వేటివ్ గ్రూపు నాయకుడు ఫెడ్రిక్ మెర్జ్ జర్మనీ ఆర్థిక ప్రగతిపైనే ప్రధానంగా దృష్టి సారించే అవకాశముంది. రాబోయే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ప్రస్తుతం పన్నులద్వారా వస్తున్న ఆదాయం ఎంతమాత్రం సరిపోదు. ఈ నేపథ్యంలో మెర్జ్ సామాజిక సేవల్లో కోతలు విధించే అవకాశ ముంది. పెరుగుతున్న సైనిక వ్యయం, ధ్వంసమైన మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, పర్యావరణానికి సానుకూల కార్యక్రమాలు అమలు చేయాలంటే బిలియన్ల కొద్దీ యూరోలు అవసర మౌతాయి. నిజం చెప్పాలంటే 1990లో జర్మనీ పునరేకీకరణ తర్వాత మొట్టమొదటిసారి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. 2022 ఫిబ్రవరి 24న రష్యా`ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. అప్పటినుంచి జర్మనీ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు సైనిక సహాయం నిమిత్తం 28 బిలియన్ యూరోలు (29 బిలియన్ అమెరికన్ డాలర్లు) ఖర్చు చేసింది. తద్వారా జర్మనీ అమెరికా తర్వాత ఉక్రెయిన్‌కు అతిపెద్ద మద్దతుదారుగా నిలిచింది. అయితే ట్రంప్ ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడైన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఉక్రెయిన్ విషయంలో ఆయన వ్యవహారశైలి ప్రభావం, అప్పటివరకు రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఐరోపా యూనియన్ (ఈయూ) దేశాలపై పడిరది. డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఈయూను పట్టించుకోవడంలేదు. అమెరికా నేతృత్వంలో ఉక్రెయిన్‌కు గుడ్డిగా మద్దతివ్వడం జర్మనీ ఆర్థిక వ్యవస్థపై దారుణమైన ప్రతికూల ప్రభావం పడిరది. తమకు సంబంధంలేని ఈ యుద్ధంలో అమెరికా ప్రోద్బలంతో రంగంలోకి దిగిన ఈయూ దేశాలు ఇప్పుడు ట్రంప్ వైఖరితో దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ప్రధానంగా జర్మనీ ఈ ప్రభావానికి గురైంది. ఇక ముందు ఉక్రెయిన్‌కు అండగా నిలబడటం ఈయూ దేశాల ప్రాథమిక విధి అని అమెరికా చెబుతున్న నేపథ్యంలో, దాని ద్వంద్వ వైఖరికి బలైపోయామన్న బాధ ఈ దేశాలను పట్టిపీడిస్తోంది. ఇప్పటివరకు అమెరికా రక్షణ కల్పిస్తుందన్న భావనలో ఉన్న ఈయూ దేశాలు ఇప్పుడు తాము స్వయంగా రక్షణపరంగా బలోపేతం కావాల్సిన అవసరం ఏర్పడిరది. అధికార మార్పిడి జరిగినప్పుడల్లా అమెరికా విదేశాంగ విధానం మారితే, జర్మనీ వంటి బలీయమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన ఈయూ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనక తప్పదన్న సత్యం ఇప్పుడు బోధపడుతోంది. కొత్తగా జర్మనీ అధికార పగ్గాలు చేపట్టనున్న ఫెడ్రిక్ మెర్జ్ ఈ పెను సవాలును ఎట్లా ఎదుర్కొంటారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సీడీయూ ప్రధాన కార్యదర్శి కార్‌స్టన్ లెన్నీమాన్ మాటల్లో ఇదే అభిప్రాయం వ్యక్తం కావడం గమనార్హం. ఈయూ దేశాల్లో జర్మనీ కీలక పాత్ర పోషించాలంటే ఫ్రాన్స్, పోలెండ్ దేశాలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. జర్మనీ రాజ్యాంగం ప్రకారం ఎన్నికల తర్వాత 30రోజుల్లోగా బుండ్‌స్టాగ్ సమావేశం కావాల్సి ఉంది. అంటే మార్చి 25లోగా కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టాలి. ఒకవేళ అప్పటికి కొత్త ప్రభుత్వం ఏర్పడకపోతే పాత ప్రభుత్వమే అపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగుతుంది.
మెర్జ్ ఐదు పాయింట్ల ఫార్ములా
వలసదార్ల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో మెర్జ్ ఈ అక్రమ వలసలను అరికట్టేందుకు గతంలో ఐదు పాయింట్ల ఫార్ములాతో కూడిన బిల్లును పార్లమెం ట్‌లో ప్రవేశపెట్టారు. ఈ ఫార్ములా ప్రస్తుతం జర్మనీలో అమల్లో ఉన్న చట్టాలు, ఈయూ శరణార్థి చట్టాలు, జెనీవా కన్వెన్షన్‌ను అతిక్రమించేవిగా ఉండటం గమనార్హం. ఈ బిల్లుకు మద్దతు విషయంలో ఏఎఫ్‌డీ మద్దతు తీసుకోవడానికి కూడా ఆయన వెనుకాడలేదు. ఈ విషయంలో ఇదే పార్టీకి చెందిన యాంజెల్లా మెర్కెల్ ఈయనతో విభేదించారు. చివరకు ఈ బిల్లు బుండ్‌స్టాగ్‌లో ఓడిపోయింది. కాగా అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపాలన్నది ఏఎఫ్‌డీ విధానం. కేవలం ఈ కారణంగానే 20% ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచినప్పటికీ ఏఎఫ్‌డీతో పొత్తుకు మిగిలిన పార్టీలు ముందుకు రావడంలేదు. ఈయూ అనుసరిస్తున్న శరణార్థి విధానం నిర్వీర్యమైపోయిందని, ప్రస్తుతం వలసల కారణంగా హింస, దాడులు పెరిగిపోతున్నాయనేది మెర్జ్ వాదన. ఈ విషయంలో ఆయన డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫెడ్రిక్సన్ వలసలపై అమలు చేస్తున్న కఠిన వైఖరినే అనుసరించాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం డెన్మార్క్ ప్రధాని శరణార్థులకు కల్పించే ప్రయోజనాల్లో కోత విధించడం, స్వదేశాలకు పంపేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని అంశాల్లో డెన్మార్క్ ప్రధాని తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి కూడా. 2024లో డెన్మార్క్ కేవలం 860 శరణార్థి అభ్యర్థనలను మాత్రమే అనుమతించిందంటే వలసలపట్ల కఠినచర్యలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మెర్జ్ ఏఎఫ్‌డీ యేతర పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, వలసల విషయంలో అంతర్గతంగా ఏఎఫ్‌డీ మద్దతు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జర్మన్లు కూడా (ముఖ్యంగా తూర్పు జర్మనీ వాసులు), వలసలు వచ్చేవారికోసం ఎక్కువ ఖర్చుచేస్తున్నా రని, ఉక్రెయిన్‌కు దండగమారి సహాయం చేస్తున్నారని ఆగ్రహంతో వున్నారు. ప్రజల అభిమతానికి అనుగుణంగానే,
ఉక్రెయిన్‌కు సైనిక సహాయం బాగా తగ్గించాలని, రష్యాతో చర్చలు జరిపేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకు రావాలని ఏఎఫ్‌డీ బలంగా కోరుతోంది. ఈ విషయంలో మెర్జ్‌ను అంతర్జాతీయంగా తమ దేశంపై ఉన్న అంచనాలు ఒకపక్క, దేశీయంగా ఎదురవుతున్న ఒత్తిళ్లు మరొకపక్క ఉక్కిరిబిక్కిరి చేయకమానవు.
దీర్ఘకాలంలో నష్టం
మెర్జ్ వలసల విధానం తాత్కాలికంగా బాగానే ఉన్నదనిపించినా దీర్ఘకాలికంగా దేశానికి ఇది ప్రతికూల ఫలితాలనివ్వడం ఖాయమని తాజాగా నిర్వహించిన ఒక సర్వే స్పష్టం చేస్తోంది. వలసలు ఆగిపోతే 2060 నాటికి జర్మనీలో ప్రస్తుతం వున్న 46.4 మిలియన్ల శ్రామిక శక్తి 35.1 మిలియన్లకు పడిపోతుందని అంచనా.
నిజానికి ఇప్పుడు కూడా దేశంలోని ప్రైవేటు రంగంలోని సంస్థలు నిపుణులైన పనివారులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వలస వచ్చేవారిలో నిపుణులను నియమించుకుంటే తప్ప సంస్థలు మనుగడ సాగించలేని దుస్థితి నెలకొంది. ఇప్పుడు మెర్జ్ వలసల పట్ల కఠిన వైఖరి అనుసరిస్తే, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. అక్రమ వలసదారుల వల్ల సామాజిక అశాంతి పెరుగుతున్న మాట వాస్తవమే. కానీ వీటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటూనే దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు వలసల పట్ల కొంత సహన వైఖరి అవలంబించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క జర్మనీ మాత్రమే కాదు, మిగిలిన ఐరోపా దేశాలు కూడా సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
అమెరికాకు అనుకూలం
మెర్జ్ ఇప్పుడు దేశాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలన్న దృక్పథంతో వేసే ముందడు గులు అమెరికాకు కలిసొచ్చే అంశం. జర్మన్ అమెరికన్ బిజినెస్ ఔట్‌లుక్`2024 ప్రకారం, 96శాతం జర్మనీ కంపెనీలు అమెరికాలోని నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు రాబోయే మూడేళ్లకాలానికి ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మెర్జ్ వాణిజ్యపరమైన ఆలోచనా ధోరణి కారణంగా ప్రైవేటు రంగానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే అవకాశముంది. అమెరికా దీన్ని ఒక సావకాశంగా తీసుకొని, జర్మనీతో లాభసాటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ఉత్సాహం చూపవచ్చు.
– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్