భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘ఏం‌టండీ అలా ఉన్నారు?’’ బజారు నుండి వచ్చి సొఫాలో నీరసంగా కూర్చున్న చలపతికి మంచినీళ్లు ఇస్తూ అడిగింది నీలవేణి.. చెప్తాను అన్నట్లు చేత్తో సైగ చేసి మంచినీళ్లు తాగి గ్లాసు అందిస్తూ అన్నాడు. ‘‘పెళ్లిళ్లు విపరీతంగా ఉన్నాయి కదా.. ఇదివరకు రెండులక్షలు ఉన్న మ్యారేజ్‌ ‌హాల్‌ ఇప్పుడు పది లక్షలు అయింది. అంత డబ్బు పెట్టడం మన వల్ల కాదు. సంబంధమేమో కుదిరింది. వాళ్లకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియటం లేదు.. మనం మరీ అంత ఉన్న వాళ్లం కాదు..పోనీలే అనుకొని ఉన్నదానితో పెళ్లి అయ్యిందనిపించినా రేపటి రోజున పిల్లాడి చదువుకు కావాలి కదా. ఉద్యోగంలో ఇల్లు కట్టుకోగలిగాం.. వీళ్లిద్దరి బాధ్యతలు జాగ్రత్తగా నెరవేర్చగలుగుతున్నాం మనం వేసుకున్న ప్లాన్స్ అన్ని తికమకగా అయ్యేట్లుంది.. ఈ సిటీలో పెళ్లి ఎలా చేయగలం?’’ చేతులు శూన్యంలోకి ఊపుతూ దిగులుగా అన్నాడు చలపతి. గదిలో కూర్చుని తల్లి తండ్రి మాటలు వింటున్న పుష్యమి బయటకు వచ్చింది. ‘‘కొత్త కత్తి అని మెడ కోసుకుంటామా నాన్నా? మీరు కష్టపడి కూడపెట్టినదంతా నా పెళ్లికి ఖర్చు పెట్టకండి నాకు చాలా బాధగా ఉంటుంది. మనకు ఎలాంటి ఆర్భాటాలు ఆడంబరాలు వద్దు. పెళ్లి ఎట్ల చేసినా పెళ్లే’’ ‘‘అది మన ఆలోచన.. వాళ్లు మనలాగా ఎందుకు ఆలోచిస్తారు? వాళ్ల అమ్మాయి పెళి వాళ్లు ఘనంగా చేశామని చెప్పారుగా.. కొడుకు పెళ్లి కూడా అలా జరగాలని వాళ్లు కోరుకోవడంలో తప్పేముంది?’’

‘‘సంప్రదాయబద్దంగా మన స్థాయిలో పెళ్లి చేస్తామని వాళ్లతో చెబితే ఏమవుతుంది? వాళ్లు అర్థం చేసుకోరా?’’

‘‘అర్థం చేసుకోరు తల్లి.. మన కుటుంబం చూసి.. ముఖ్యంగా నీ వినయ విధేయతలు గమనించి నీతో మాట్లాడి మన సంబంధాన్ని ఇష్టపడ్డారు. కట్నం వద్దన్నారు.. పెళ్లి ఘనంగా చేయాలని కోరారు. మరి.. వాళ్లు అడిగిన దాన్ని మనం నెరవేర్చాలి కదా.. మనం ఏదైనా చెబితే మన సంబంధాన్ని కాదనుకుంటే ఏం చేస్తాం?’’

‘‘నాన్న.. మీరు ఇంకోలా ఆలోచించకండి. ముందుగానే ఏదేదో అనుకోవటం ఎందుకు? అడిగి చూడండి’’

‘‘పుష్యమి చెప్పింది బాగానే ఉంది. ఆలోచిం చండి.. వాళ్లు మంచివాళ్లలాగానే ఉన్నారు’’ అంది నీలవేణి.

‘‘మనుషులు మంచిగా ఉండటం వేరు. వాళ్ల విషయాలు వచ్చేసరికి వాళ్ల ఆలోచనలు వేరుగా మారుతాయి..అయినా ఇక చేసేది కూడా ఏమీలేదు.. ఏదో ఒక ప్రయత్నంగా వాళ్లతో మాట్లాడి విషయం చెప్తాను’’ అంటూ వాళ్లకు ఫోన్‌ ‌కలపబోతుంటే వారించింది పుష్యమి.

‘‘ఫోన్లో వద్దు నాన్న.. కలిసి మన పరిస్థితి చెప్పటం మంచిది’’ ఆ విషయం మీద చాలాసేపు చర్చించుకున్నారు ముగ్గురూ.. తెల్లవారి వాళ్లను కలవడానికి వెళ్లాడు చలపతి.

                                                                                              *     *     *

కాబోయే వియ్యంకుడు వియ్యపురాలు చేస్తున్న మర్యాదలు చూసి ఆశ్చర్యంతో విస్తుపోయాడు చలపతి. కాసేపు మామూలు విషయాలు మాట్లాడుకున్న తర్వాత వాళ్లకున్న ఆస్తులు..వాళ్ల మనస్తత్వ విధానాలు.. వాళ్ల బంధువర్గం.. అమెరికాలో కూతురు అల్లుడు ఇల్లు కొనుక్కున్నారని.. కొడుకు కూడా ఇంకో ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నాడని..ఇలా అన్ని విషయాలు ఇద్దరూ చెబుతుంటే చలపతి గుడ్లప్పగించి శ్రోతలాగా అయ్యాడు.

‘‘నేను మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను’’ చాలా ఇబ్బందిగా అన్నాడు చలపతి.

‘‘మీ అమ్మాయిని మా ఇంటికి ఇస్తున్నారని ఇవన్నీ మీకు తెలియాలని మీకు చెప్పాం. ఏదో గొప్పకోసం కానేకాదు.. చెప్పండి.. త్వరలో మన రెండు కుటుం బాలు ఒకటి కాబోతున్నాయి’’ వరప్రసాద్‌ ‌ప్రోత్సహిస్తూ మాట్లాడటం ప్రభావతి ఆపేక్షగా చూస్తుంటే చలపతి తాను చెప్పాలనుకుంది వాళ్ల ముందుంచాడు. తాను ఎంత కష్టపడి పిల్లల్ని చదివించింది, పిల్లల్ని ఎంత పద్ధతిగా పెంచుకున్నది, తనకున్న ఆదాయం.. ఖర్చు.. పెళ్లిని అంత భారీ ఎత్తుగా చేయలేని పరిస్థితిని ఇలా అన్ని విషయాలు చెప్పాడు.

వరప్రసాద్‌ ‌ప్రభావతి కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు.

‘‘మీకు డబ్బు సహాయం చేయమంటారా?’’ అడిగింది ప్రభావతి.

‘‘అయ్యయ్యో ఎంత మాట..అలా వద్దండి..నేను పాత పద్ధతిలో నా ఇంటి ముందు అమ్మాయి పెళ్లి చేస్తాను.. మీకు ఏ చిన్నలోటు రానీయను. అన్ని సౌకర్యాలు కలుగచేస్తాను’’ ఇంట్లో అనుకున్న విషయాలన్నీ వాళ్లతో వివరంగా చెప్పాడు.

వరప్రసాద్‌ ‌ప్రభావతి ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.‘‘ పిల్లలతో మాట్లాడి ఏ విషయం చెప్తాం’’ అని చెప్పారు. ఇద్దరికీ నమస్కరించి వెళ్లొస్త్తానంటూ లేచాడు చలపతి. క్యాబ్‌లో వస్తుంటే ఇదే ఆలోచన అతన్ని చాలా వేధించింది. ఈ కారణంగా సంబంధం తప్పిపోతుందేమో అని భయపడ్డాడు.

                                                                                              *     *     *

తెల్లవారి సాయంత్రం వాళ్ల నుండి ఫోన్‌ ‌రావడంతో ముగ్గురు ఒకచోట చేరారు. వాళ్లు ‘సరే’ అనటం ముగ్గురిని ఎంతో ఆశ్చర్యపరిచింది. శుభవార్తను హైదరాబాదులో బీటెక్‌ ‌రెండో సంవత్సరం చదువుతున్న కొడుకు శౌర్యతో ఆనందంగా చెప్పారు. కొత్త ఉత్సాహంతో ఎదురుగా నూటయాభై గజాలు పక్కన రెండువందలయాభై గజాల జాగా ఉన్న ఇద్దరికీ ఫోన్లు చేశాడు. ఇలా పెళ్లికి వాడుకుంటానని.. తుప్పలుగా పెరిగిన మొక్కలను తీసేయించి నేలను చదునుచేసి తనకు అనుకూలంగా మార్చుకుంటామని చెప్పాడు. వాళ్లు సరే అన్నారు.. ఎదురుగా ఉన్న జాగా పెళ్లి వేదిక.. పక్కనున్న జాగా భోజనాలకు అనుకున్నాడు. తెల్లవారి పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి. రెండు జాగాలను శుభ్రం చేయించాడు. అడుగుతున్న వాళ్లందరికీ విషయం చెప్పాడు. ‘‘మీ పెళ్లి ఇలాగే జరిగి ఉంటుంది కద నాన్నా’’

 ‘‘అవును..అప్పటి మా పెళ్లిలా ఇప్పుడు నీ పెళ్లి జరిపిస్తాం..నిజానికి ఇలాగే నీ పెళ్లి చేయాలని ఉంది.. కానీ ఇప్పటి ఆలోచనలు పద్ధతులు పూర్తిగా మారిపోయాయి కదా.. వాళ్లు ఒప్పుకున్నారు అదే చాలు మాకు.. మనకు ఎంతో భారం తగ్గింది.. ఈ మధ్యకాలంలో మనవాళ్లు ఇలా పెళ్లిళ్లు ఎవరూ చేయలేదు’’ నవ్వుతూ అన్నాడు చలపతి.

                                                                                              *     *     *

పెళ్లిరోజు రానే వచ్చింది. రెండు బస్సులలో, కొన్ని కార్లలో దిగిన పెళ్లివారికి చక్కటి వేడుకలు మర్యాదలు చేసి ప్రేమగా ఆహ్వానించారు చలపతి, నీలవేణి. ఎక్కడ ఏ చిన్న లోటు లోపం రాకుండా దగ్గరి బంధువులకు స్నేహితులకు పనులు అప్పచెప్పటంతో వాళ్లు సైనికుల్లా రెడీగా ఉన్నారు. ‘ఇంటి దగ్గర పెళ్లి అంటే ఎంత కంజెస్టెడ్‌గా ఉంటుందో’ అని చిరాగ్గా అనుకుంటూ వచ్చిన వాళ్లంతా మలయమారుతంలా వీస్తున్న చల్లటి గాలికి హాయిగా ఫీలయ్యారు. లోపలికి వెళ్లగానే ముత్తయిదువులకు బొట్టు, గంధం, పసుపు, పువ్వు ఇచ్చి ఆహ్వానించారు. చలి వాతావరణం కావటంతో వెల్కమ్‌ ‌డ్రింక్‌ ‌వేడిగా టమాటా సూప్‌ ఇచ్చారు. డిజే హోరు లేకుండా చక్కటి సన్నాయిమేళం కృతులు వాయించారు. అరటి బోదెలు కొబ్బరి ఆకులతో వేదికను అలంకరించి శుభప్రదంగా మామిడి తోరణాలు కట్టారు. ఆకుపచ్చదనంతో ఆ ఏరియా అంతా అందరికీ నచ్చింది. పెళ్లయిపోగానే అందరూ భోజనాల వైపు వెళ్లారు. పసుపురంగు అందమైన షామియానా కింద నాలుగు వరుసల్లో విడతకు రెండొందల మంది భోజనం చేసేలా టేబుల్స్ ‌వేసి ఉంచారు. అరిటాకుల్లో భోజనం.. పప్పు.. రెండు కూరలు.. ఒక పచ్చడి.. పూర్ణం బూరెలు.. క్యారెట్‌ ‌సొరకాయ హల్వాతో స్వీట్‌..‌పులిహోర.. ఆలుగడ్డ బజ్జీ.. సాంబారు గడ్డపెరుగు..వడియాలు అప్పడాలతో చక్కటి విందు భోజనాన్ని చేయి తిరిగిన వంట వాళ్లతో వండించారు.. అనుభవం ఉన్న ఇద్దరు మగవాళ్ల పర్యవేక్షణలో ఆరుగురు ఆడవాళ్లు పాత పద్ధతిలో ఎంతో హుషారుగా వడ్డనకు పూనుకున్నారు. మగపెళ్లివాళ్లు చాలా సంతృప్తిగా భోజనాలు చేయటం చలపతి నీలవేణిని ఎంతగానో ఆనందపరిచింది. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ ‘‘ఈమధ్య కాలంలో ఇంత రుచికరమైన భోజనం చేయలేదు’’ అని అభినందించారు.

                                                                                              *     *     *

‘‘సార్‌.. ‌మీ ఇద్దరూ మీ జాగాల ఇచ్చి నాకు చాలా చాలా భారం తగ్గించారు. థాంక్యూ సర్‌ ‌థాంక్యూ వెరీ మచ్‌’’ అం‌టూ సొంత అన్నదమ్ములైన నరేష్‌ ‌సురేష్‌లకు చెయ్యి కలిపి సంతోషంతో ధన్యవాదాలు తెలుపుకున్నాడు చలపతి. ‘‘సార్‌.. ‌మీకే మేము థాంక్స్ ‌చెప్పుకోవాలి. మా నాన్నగారు తాను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఈ జాగా కొని భవిష్యత్తులో పిల్లలకు ఉంటుంది అనుకున్నారు. మేము అక్కడెక్కడో చాలా దూరంగా ఉంటున్నాం.. ఎప్పుడో ఒకసారి వచ్చి చూసి వెళ్తున్నాం. ఈ మధ్య కబ్జాల వ్యవహారం ఎక్కువగా నడుస్తుంది కదా! మా జాగాలు ఉన్నాయో ఎవరైనా కబ్జా చేశారో అని భయపడుతున్న సమయంలో మీరు మా ఫోన్‌ ‌నెంబర్‌ ‌సంపాదించి ఫోన్‌ ‌చేసారు’’

‘‘ఇకనుండి మీ జాగాలకు నేను కాపలాగా ఉంటాను. అయినా మీరో పని చేయండి సార్‌.. ‌జాగా చుట్టూ ప్రహరీ కట్టించి ఒక గదివేసి కరెంట్‌ ‌పెట్టించి ముఖ్యమైన అవసరాలు తీరేలా చేసి ఎవరికైనా అద్దెకు ఇస్తే మంచిది. ఇప్పుడు ఎవరినీ నమ్మేట్లుగా లేదు. మన జాగ్రత్త మనం పడాల్సిందే. మీరు సరే అనుకుంటే మీకు నేను సహాయంగా ఉంటాను. మీరు పదే పదే రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరిగే పని మీకు చెప్తుంటాను. అంతదాకా ఇలా ఎవరైనా అడిగితే ఇవ్వండి’’

‘‘ధర బాగానే పలుకుతుంది కాబట్టి అమ్మితే మంచిదా అనే ఆలోచన మా ఇంట్లో చేస్తున్నారు.. మీరేమైనా కొంటారా?’’

‘‘అమ్మో.. నాకు అంత శక్తి ఎక్కడుంది? మా వియ్యంకుడు వస్తున్నారు’’ అంటూ చలపతి వియ్యంకుడికి ఎదురెళ్లాడు.

‘‘మేము ఏమో అనుకున్నాం. మా అబ్బాయి వాడి ఫ్రెండ్స్ ఎం‌తో సంతోషపడ్డారు. వాడు మళ్లీ మీతో మాట్లాడుతాడు. ఆర్భాటం లేకుండా ఎంతో విశిష్టంగా పెళ్లి జరిపించారు. ఇలాంటి భోజనమే ఎవరైనా కోరుకుంటారు. అరవై ఆరు రకాల వంటకాలు అవసరమా? నిజానికి మనిషి ఎంత తింటాడో తెలియదా? ఒకరిని చూసి ఒకరు తప్పదని బాగుం డదని ఉన్నదంతా వృథాగా ఖర్చుపెట్టి గొప్పలకు పోవడం తప్ప.. ఇలా మన ఇంట్లో పెళ్లి మన ఇష్టం అని అనుకుంటే.. ఇదిగో ఇలాగే ఎప్పటికీ గుర్తుండే పెళ్లి భోజనాలు ఉంటాయి. ఆరు వందల మందికి అవలీలగా మీ వాళ్లు వడ్డించారు. మీకు ఒక మాట చెప్పాలని పిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్లలో కనీసం సగంమంది తప్పకుండా మీ మార్గంలో నడుస్తారు’’ అంటూ వియ్యంకుడు కౌగిలించుకుంటుంటే చలపతికి కళ్లు చెమర్చాయి. ప్రభావతి నీలవేణితో ఇదే విషయంలో మెచ్చుకోలుగా మాట్లాడింది. ‘‘అప్పగింతల కార్యక్రమం రండి’’ అంటూ పురోహి తుడు పిలిచేసరికి నవ్వుతూ కదిలారు ఆ నలుగురు.

– కోటమర్తి రాధాహిమబిందు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE