‌ప్రభవాది 60 సంవత్సరాలలో 39వది విశ్వావసు నామ సంవత్సరం. ఈ ఏడాది ధాన్య దానం విశేష ఫలితాలనిస్తుంది. సంవత్సరాధిపతి రాహువు. రాహువు దోషపరిహారం కోసం దుర్గా మాతను, నాగదేవతను (సర్పాన్ని) పూజించాలి.

ఇక ఈ సంవత్సరానికి రాజు, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి రవి, మంత్రి చంద్రుడు. పూర్వసస్యాధిపతి గురుడు, అపర సస్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. నవనాయకుల్లో ఆరుగురు పాపులు, ముగ్గురు శుభులు.

పుష్కరాలు…  

ఈ ఏడాది 15.05.2025వ తేదీ వైశాఖ శు. తదియ, గురువారం నుండి 26.05.2025వ తేదీ సోమవారం వరకు సరస్వతీ నదీ పుష్కరాలు.

గ్రహణములు…

ఈ ఏడాది మన దేశంలో కనిపించే సూర్యగ్రహణాలు లేవు. 07.09.25వ తేదీ భాద్రపద పౌర్ణమి, ఆదివారం రాత్రి 9 గంటల 50 నిమిషాల నుంచి ఒంటి (1) గంట 31నిమిషాల వరకు సంపూర్ణ చందగ్రహణం. ఇది శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రాలలో ఏర్పడుతుంది. అందువల్ల కుంభరాశి వారు చూడరాదు.

అలాగే, 03.03.2026వ తేదీ ఫాల్గుణ పౌర్ణమి, మంగళవారం రాత్రి (తెల్లవారితే బుధవారం) 3గంటల 21 నిమిషాల నుంచి 6.47 వరకు పాక్షిక చందగ్రహణం. ఇది పుబ్బ నక్షత్రంలో ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణం బహు స్వల్పంగా కనిపిస్తుంది. సింహరాశి వారు చూడరాదు.

రాజు రవి, మంత్రి చంద్రుడు మిత్రులు కావడం వల్ల పాలకుల మధ్య మరింత సమన్వయం ఏర్పడుతుంది. ప్రభుత్వాలు చేసే పనులు పారదర్శ కంగా ఉండి అందరి మన్ననలు పొందుతాయి. ఆర్థికరంగం బలం పుంజుకుని దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. ఇతర దేశాల్లో అలజడులు మనకు కొంత ఇబ్బంది కలిగించినా పటిష్టమైన విధానాల వల్ల ప్రజలపై ప్రభావం కనిపించదు. అయితే దేశం లోపల, బయట కొన్ని శక్తులు అశాంతి సృష్టించేందుకు ప్రయత్నాలు సాగిస్తాయి. రక్షణ రంగాన్ని మరింత పటిష్ట పరచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొని సైనికచర్యకు సైతం సిద్ధపడాల్సి ఉంటుంది. సంక్షేమంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తాయి. నూతన ఆయుధసంపత్తి సమకూరుతుంది. దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష ప్రగతి సాధించి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. అయితే ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా చమురు, పప్పు ధాన్యాలు, బంగారం, వెండి, ఇనుము ధరలు పెరుగు తాయి. ఎర్రటి నేలల్లోని పంటలు విరివిగా పండు తాయి. ధాన్యం దిగుబడులు పెరిగి రైతులకు ఉత్సా హంగా ఉంటుంది. గిట్టుబాటు కూడా లభిస్తుంది. నువ్వులు, మినుములు, నూనెగింజల ఉత్పత్తులు కూడా ఆశాజనకంగా ఉంటాయి.

ఈశాన్యప్రాంతంలోనూ, దక్షిణాదిన వర్షాలు సమృద్ధిగా ఉంటాయి. మిగతా ప్రాంతాల్లో మధ్యస్థంగా కురుస్తాయి. షేర్ల మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొన్నా స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి.

అశాంతి… అలజడులు….

విశ్వావసు నామ సంవత్సరంలో కొన్ని గ్రహాల స్థితిగతులు అలజడులకు, విచిత్ర రోగాలకు, సర్వత్రా ఆందోళనలకు దారితీస్తాయి. సంవత్సరారంభం నుంచి మే నెల 6వ తేదీ వరకూ మీనరాశిలో చాతుర్గ్రహ (నాలుగు గ్రహాలు ఒకే రాశిలో) కూటమి వల్ల విశేష సూర్యతాపం, అకాల మరణాలు, యుద్ధ భయాలు, ధరల పెరుగుదల వంటి ఫలితాలు చూడాల్సిన పరిస్థితి.

ఏప్రిల్‌ 1‌వ తేదీ నుంచి 13 రోజుల పాటు మీనరాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడనుంది. దీనివల్ల దుర్భిక్ష పరిస్థితులు, కొన్ని దేశాలలో వ్యాధుల వ్యాప్తి, జననష్టం, ప్రకృతి బీభత్సాలు వంటివి నెలకొంటాయి.

జూన్‌ ఒకటో తేదీ నుంచి జులై 28వ తేదీ వరకూ కుజరాహువుల పరస్పర వీక్షణాల వల్ల (సమసప్తకస్థితి) యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు, కొన్ని వ్యాధులు వ్యాపించే సూచనలు.

ఉగాది నుండి సుమారు మూడు నెలల పాటు అపసవ్య రీతిన కాలసర్పదోష ప్రభావం కారణంగా వివిధ సమస్యలు, రోగాలతో ప్రజలు అవస్థ పడతారు. జాతీయ, అంతర్జాతీయ నేతలు కొందరిపై ఆరోపణలు, అరెస్టులు, ఆందోళనలు రేకెత్తవచ్చు.

 డిసెంబర్‌ ‌నుంచి 12 జనవరి, 2026 మధ్యకాలంలో తిరిగి చాతుర్గ్రహ కూటమి, ప్రకృతి వైపరీత్యాలు, ధరల భారం, కొన్నిచోట్ల కరవు పరిస్థితులతో కల్లోలంగా మారే అవకాశం. జనవరి 17- ఫిబ్రవరి 2వ తేదీ మధ్య తిరిగి చాతుర్గ్రహ కూటమి వల్ల విమాన, జలప్రమాదాలు, భూకంపాది భయాలు ఉంటాయి.

కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలకు ముప్పు, నేతలకు పదవీ గండాలు ఉంటాయి. ఇదే ఫలితాలు సర్వవ్యాప్తంగా ఉంటాయి. ప్రజలు ఆయా కాలాలలో దైవభక్తి కలిగి, తగిన పరిహారాలు జరుపుకుంటూ ఉండడం శ్రేయస్కరం.

గ్రహసంచారం…

ఈ సంవత్సరం మే 14 వరకు గురుడు వృషభరాశిలో సంచరిస్తాడు. మే 15 నుంచి అక్టోబర్‌ ‌వరకు మిథునరాశిలోనూ, అక్టోబర్‌ 19 ‌నుంచి నవంబర్‌ 11 ‌వరకు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. 12 నుంచి వక్రీకరించి మిథునరాశిలో పునఃప్రవేశించి సంవత్సరమంతా అదే రాశిలో సంచారం. ఇక శని మార్చి 29 వరకు కుంభరాశిలో సంచరించి, 30వ తేదీ నుంచి సంవత్సరమంతా మీనరాశిలో ఉంటాడు. అలాగే, రాహు, కేతువులు మే 19 వరకు మీనం, కన్యారాశులలోనూ, తదుపరి కుంభం, సింహరాశుల్లోనూ సంచరిస్తారు.


మేషం 

ఆదాయం-2 వ్యయం-14, రాజపూజ్యం-5, అవమానం-7

ఈ రాశి వారికి ఏలిననాటి శని ప్రారంభమైంది. గురు, రాహు,కేతువుల సంచారం అనుకూలం. సమస్యలు ఎదుర్కొన్నా మొత్తానికి సుఖసంతోషాలతోనే గడుపుతారు. శని ప్రభావం వల్ల ఆదాయం కంటే ఖర్చులు పెరిగి సతమతం అవుతారు. అనవసర వివాదాలతో చిక్కుల్లో పడతారు, అప్రమత్తతో పాటు, మౌనం మంచిది. ఇక గురుడు మే 18 వరకు వృషభరాశిలో సంచార సమయంలో ఆర్థిక లాభాలు, ఆస్తులు కొనుగోలులో ముందడుగు వేస్తారు. సంతాన సౌఖ్యం వంటి ఫలితాలు పొందుతారు. రాహు, కేతువుల నుంచి అనుకూల ఫలితాలే కనిపిస్తాయి.

ప్రధాన సమస్యల నుంచి బయటపడతారు. సోదరులు, బంధువుల నుంచి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నిరుద్యోగులకు అనూహ్యంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో మీ నిర్ణయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సమాజంలో పేరుప్రతిష్ఠలు నిలుపుకుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపండి. ముఖ్యంగా ఉదరం, ఎముకల సంబంధిత రుగ్మతలు ఎదుర్కొంటారు. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురించి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కొన్ని విద్యావకాశాలు సాధిస్తారు.

ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి పరిశోధనల్లో విజయాలు, కీర్తి దక్కుతుంది. వ్యాపారస్తులు ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. మధ్యలో కొన్ని అవాంత రాలు ఎదురైనా అధిగమిస్తారు. పెట్టుబడుల విషయంలోనూ వెనక్కితగ్గరు. ఉద్యోగస్తులు విధి నిర్వహణకు అంకితమై సత్తా చాటుకుంటారు. ఉన్నత హోదాలలోని వారి మన్ననలు పొందుతారు. కొందరికి బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. కొత్త కంపెనీల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారు. రాజకీయవర్గాలకు ఉన్నత పదవీయోగం.

కళాకారులు చేజారిన అవకాశాలు దక్కించు కుంటారు. వ్యవసాయదారులకు తగినంత పెట్టుబడులు సమకూరుతాయి. మే-అక్టోబర్‌ ‌మధ్య కాలం, నవంబర్‌ ‌నుంచి సంవత్సరాంతం వరకు సామాన్యంగానే గడుస్తుంది. శనైశ్చరునికి తైలాభిషేకాలు, ఆంజనేయ స్వామికి అర్చనలు, దుర్గాస్తోత్రాల పఠనం ఉత్తమం.


వృషభం

ఆదాయం-11, వ్యయం-5, రాజపూజ్యం-1 అవమానం-3.

ఈ రాశివారికి శని,గురుల సంచారం విశేషంగా కలిసివస్తుంది. రాహువు కూడా కొంతమేర శుభాలనిస్తాడు. వీరికి ఆదాయం తగినంత లభించి ఉత్సాహం, ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులను అదుపులో ఉంచుకుని పొదుపు చర్యలు పాటిస్తారు. సమాజంలో గౌరవానికి లోటు రాదు. అయితే కుటుంబంలో కొంత వ్యతిరేకత రావచ్చు. మనశ్శాంతి లోపిస్తుంది. మొత్తానికి వీరికి అన్ని విధాలా గతం కంటే శుభఫలితాలు ఎక్కువగా ఉంటాయి. బంధువుల ద్వారా సంపూర్ణ సాయం అందుతుంది. వివాహాది శుభకార్యాల సందడితో సంతోషంగా గడుపుతారు. వాహన చోదకులు జాగ్రత్తలు పాటించడం మంచిది. కొన్ని ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. శాస్త్ర, సాంకేతికరంగాలవారు విదేశీ ఆహ్వానాలు అంది పర్యటనలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి మొత్తానికి ఫలిస్తుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారస్తులు పెట్టుబడులను మరింత సమీకరించి విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. అలాగే, లాభాలు అందుతాయి.

ఉద్యోగవర్గాలకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మే-అక్టోబర్‌ ‌మధ్య మార్పులు జరిగే వీలుంది. పారిశ్రామిక, రాజకీయవర్గాల చిరకాల ఆశలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. కళాకారుల శ్రమ ఫలించి ఊహించని అవకాశాలు అందుకుంటారు. ఏడాది మధ్యలో ఘనవిజయాలు చూస్తారు. వ్యవసాయదారులకు రెండు పంటలూ సానుకూలం. అక్టోబర్‌, ‌నవంబర్‌, ‌జనవరి నెలల్లో కొన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా చికాకులు, ధనవ్యయం, మానసిక ఆందోళన వంటివి కలుగుతాయి. వీరు కేతువుకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.


మిథునం

ఆదాయం-14 వ్యయం-2, రాజపూజ్యం-4, అవమానం-3.

ఈ రాశి వారికి మే 15 నుంచి గురుడు రాణిస్తాడు. శని, రాహుకేతువులు మిశ్రమ ఫలితాలు ఇస్తారు. ఆదాయంతో పాటు, సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. కొంత అదనపు ఖర్చులను తట్టుకోవలసి వస్తుంది. బంధువర్గం నుంచి సాయంతో పాటు విమర్శలు, ఒత్తిళ్లు పెరుగుతాయి. పరిచయాలు మరింత విస్తృతం కాగలవు. మిత్రుల సహకారం ఎంతగానో ఉంటుంది. ఆర్థిక విషయాలలో హామీలు ఇవ్వడం మంచిది కాదు. కుటుంబంలో మనస్పర్థలు, వివాదాలు మధ్యలో కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అయినా మనోనిబ్బరంతో ప్రతి విషయంలోనూ ముందడుగు వేస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యంగా నరాలు, చర్మ సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. జీవిత భాగస్వామి ద్వారా ధనం లేదా ఆస్తి లాభం కలుగుతుంది. వారసత్వ ఆస్తి పొందే వీలుంది. గృహ నిర్మాణ యత్నాలు క్రమేపీ వేగవంతమవుతాయి. వివాహాది శుభకార్యాల నిర్వహణలో భాగస్వాములవుతారు.

తరచూ తీర్థయాత్రలు చేస్తారు. వాణిజ్య, వ్యాపారాలలో లాభాలకు లోటు రాకపోయినా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులు తగ్గి సత్తా చాటుకునే సమయం. ద్వితీ యార్థంలో పదోన్నతులకు అవకాశముంది. పారిశ్రామికవర్గాల వారు విరివిగా విదేశీ పర్యటనలు, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సమాయత్తం కాగలరు. రాజకీయవర్గాల వారు కొత్త నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తుకు మార్గం వేసుకుంటారు. కళాకారులు అవకాశాలు మరింతగా దక్కించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు. వ్యవసాయదారులకు పెట్టుబడులు సమకూరుతాయి. ఏప్రిల్‌, ‌జూలై, నవంబర్‌ ‌సాదాసీదాగా ఉంటాయి. ఆంజనేయ స్వామికి అర్చనలు చేయడం ఉత్తమం. అలాగే, విష్ణుధ్యానం మంచిది.


కర్కాటకం 

ఆదాయం-8, వ్యయం-2, రాజపూజ్యం-7, అవమానం-3.

మే 14వరకు గురుడు విశేషమైన ఫలితాలు ఇస్తాడు. తదుపరి అక్టోబర్‌ 18 ‌వరకు గురుని వ్యయరాశి సంచారం వల్ల ఖర్చులు పెరుగుతాయి. అవసరం లేని వాటికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి, అక్టోబర్‌18-‌నవంబర్‌11 ‌మధ్య కాలం గురుడు కర్కాటరాశిలో సంచారం శుభకరం. ఇది గురునికి ఉచ్ఛస్థితి కావడంతో పట్టింది బంగారమే అన్నట్లు ఉంటుంది. కలిసివచ్చే అంశం. గత రెండున్నరేళ్లుగా ఇబ్బందులు పెట్టిన అష్టమ శని దోషం తొలగినా మే 19 నుంచి అష్టమ రాహువు, కుటుంబస్థానంలో కేతు సంచారం ప్రతికూలం.

మొత్తానికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాబడితో సమానంగా ఖర్చులు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు నెమ్మదిస్తాయి. ఎంతగా కష్టించినా ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు. ఆప్తుల ద్వారా వివిధ విషయాలపై ఒత్తిడులు ఎదుర్కొంటారు. కుటుంబపరంగా కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. జీవిత భాగస్వామితో విభేదిస్తారు. సంతానపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అక్టోబర్‌-‌నవంబర్‌లలో సానుకూలమవుతాయి. అష్టమ రాహు దోషం వల్ల వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే ఉదర, ఎముకలకు సంబంధించిన రుగ్మతలు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రథమార్థంలో బంధువుల రాకతో కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. గృహంలో శుభకార్యాల హడావిడి ఉంటుంది.

ఆస్తుల తగాదాలు నేర్పుగా పరిష్కరించు కుంటారు. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. వాణిజ్య, వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఊహించని భాగస్వాములు జత కడతారు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. కొత్త బాధ్యతలు మీదపడి సతమతం కాగలరు. పారిశ్రామికవర్గాలకు అనుకున్న కార్యాలలో అడ్డంకులు కొంత తొలగు తాయి. రాజకీయవర్గాల వారికి మిశ్రమంగా ఉంటుంది. కళాకారులు అనుకున్నది సాధించినా కొంత కష్టపడాలి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. అయితే విదేశీ విద్యావకాశాల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యవసాయదారులలో కొత్త ఆశలు చిగురిస్తాయి. గురు, రాహు, కేతువులకు పరిహారాలు చేయడం మంచిది.


సింహం 

ఆదాయం-11, వ్యయం-11, రాజపూజ్యం-3, అవమానం-6

ఈ రాశివారికి అక్టోబర్‌18- ‌నవంబర్‌11 ‌మధ్య గురుడు కర్కాటకరాశిలో సంచారం మినహా, మిగతా కాలమంతా శుభదాయకుడే. ఇక అష్టమ శని సంచారం ప్రభావం చూపుతుంది. జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహువు కూడా మిశ్రమంగా ఫలితాలు ఇస్తారు. గురుని ప్రభావంతో ఆదాయం సమకూరినా శని ప్రభావం వల్ల వృథా ఖర్చులు వచ్చిపడతాయి. కుటుంబంలో కలహాలు, మానసిక సంఘర్షణ మధ్య గడుపుతారు. అయితే గురుబలం వల్ల కొంత గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై అధికంగా దృష్టి సారిస్తారు. సప్తమ రాహువు కారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొనవచ్చు. కొంత సంయమనం పాటిస్తూ ముందుకు సాగడం ఉత్తమం. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతూ, సమయానుసారం ఆహార విహారాదులు పూర్తి చేయడం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో నమ్ముకున్న వ్యక్తులే ముఖం చాటేసే అవకాశం ఉంది. సమాజంలో విశేష గౌరవం పొందుతారు. కుటుంబంలో మాత్రం వ్యతిరేకత కనిపిస్తుంది. వివాహయత్నాలు సఫలమవుతాయి. ముఖ్య వ్యవహారాలు కొంత ఆలస్యంగా పూర్తి కాగలవు. వాహనాలు, కొత్త ఇల్లు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు నలుగుతూనే ఉంటాయి. వ్యాపార, వాణిజ్యరంగాల పెట్టుబడులకు ఇబ్బంది ఉండదు. అయితే సరైన ఆదాయం సమకూరక ఆందోళన చెందుతారు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి మంచి గుర్తింపు లభించే కాలం. పారిశ్రామికవర్గాలవారు తరచూ విదేశీ పర్యటనలు చేస్తారు. రాజకీయ వర్గీయులకు ఒక పిలుపు ఊరటనిస్తుంది. కళాకారు లకు కొత్త అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. విద్యార్థులు శ్రమానంతరం ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయ దారులకు రెండవ పంట లాభిస్తుంది. అక్టోబర్‌- ‌నవంబర్‌ ‌మధ్య మరింత అప్రమత్తతో మెలగాలి. శనికి పరిహారాలు చేయించుకోవాలి. నృసింహ స్తోత్రాలు పఠించండి.


కన్య

ఆదాయం-14, వ్యయం-2, రాజపూజ్యం-6, అవమానం-6

ఈ రాశివారు గురుబలంతో ముందుకు సాగుతారు. సప్తమంలో శని కొంత ప్రతికూలం కాగా, రాహుకేతువుల ప్రభావం మిశ్రమంగా ఉంటుంది. మొత్తానికి వీరికి ఎదురులేని కాలమనే చెప్పాలి. ఆర్థిక విషయాలలో ఎనలేని ప్రగతి సాధిస్తారు. ఆశలు వదులుకున్న ధనం కూడా అందుతుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూల తీర్పులు రావచ్చు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులు ఆచరిస్తారు. కొన్ని సమస్యలు తీరి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆస్తులు కొనుగోలుకు సమాయత్తమవుతారు. సంవత్సరం మధ్యలో గృహ యోగం, వివాహాది శుభకార్యాల నిర్వహణ వంటి వాటికి ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు.

వ్యాపార, వాణిజ్య రంగాల వారికి ఇతోధికంగా లాభాలు రాగలవు. అలాగే, భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రావచ్చు. పారిశ్రామిక వర్గాల కృషి ఎట్టకేలకు ఫలించి నూతన ప్రాజెక్టులు చేపడతారు. ఐటీ నిపుణులకు చెప్పుకోతగిన మార్పులు ఉంటాయి. రాజకీయవేత్తలకు పదవులు, సన్మాన యోగాలు కలుగుతాయి. కళాకారులు అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. వ్యవసాయదారుల ఆశలు నెరవేరతాయి. అయితే సప్తమ శని, వ్యయంలో కేతువు ప్రభావం వల్ల చర్మ, నరాలు, జ్వర సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు నెలకొంటాయి. తొందరపాటు మాటలు లేకుండా, ఆచితూచి వ్యవహరిస్తూ సాగడం మంచిది. మే 18వరకు ప్రయాణాలు, ఇతర ముఖ్య వ్యవహారాలలో మరింత జాగ్రత్తలు పాటించాలి. మిగతా నెలలు అనుకూలమే. శని, కేతువులకు పరిహారాలు చేయించుకోవాలి. శ్రీదత్తాత్రేయ స్వామి స్తోత్రాలు పఠించండి.


తుల 

ఆదాయం-11, వ్యయం-5, రాజపూజ్యం-2, అవమానం-2

ఈ రాశివారికి మే14తో అష్టమ గురుదోషం తొలగిపోనుంది. ఇక అంతా మంచిరోజులే. ప్రధానంగా గురు, శని అనుకూల సంచారం శుభకరం. రాహు, కేతువులు సామాన్య ఫలితాలు ఇస్తారు. మొత్తానికి గతం కంటే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ముఖ్యంగా ఆర్థికంగా పరిపుష్ఠి సాధిస్తారు. ఇతరుల వద్ద నిలిచిపోయిన ధనం చేతికందుతుంది. స్థిరాస్తులు సైతం సమకూరుతాయి. ముఖ్యంగా తండ్రి ద్వారా రావలసిన ఆస్తులు దక్కవచ్చు. కుటుంబం లోనూ ప్రశాంతత చేకూరుతుంది. గతకొంత కాలంగా భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్థలు తొలగి సమన్వయంతో ముందుకు సాగుతారు. సంతాన విషయంలో మీ అంచనాలు నిజం కాగలవు. శత్రువులుగా మారిన బంధువులు కొందరు తప్పిదాన్ని తెలుసుకుంటారు. వివాహాది శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పొందుతారు. వాహన, గృహయోగాలు కలుగుతాయి. కాంట్రాక్టర్లకు ఊహించని టెండర్లు దక్కవచ్చు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు.

వాణిజ్య, వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. కొత్త పెట్టుబడులకు సైతం అనుకూలం. ఉద్యోగస్తులకు పైస్థాయి వారి కీలక సలహాలు అందుతాయి. కొందరికి పదోన్నతులు సంభవం. పారిశ్రామికవర్గాలకు చిక్కులు తొలగి ప్రోత్సాహ కరంగా ఉంటుంది. రాజకీయ నాయకుల ఆశయాలు ఫలించే శుభకాలం. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయదారులకు నూతనోత్సాహం. శాస్త్రసాంకేతిక రంగాల వారు పరిశోధనల్లో విజయాలు సాధిస్తారు. మే వరకూ ఆరోగ్య, కుటుంబసమస్యలు. వృథా ఖర్చులు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఈకాలంలో గురునికి పరిహారాలు చేయించుకోవాలి. జులై, ఆగస్టు, సెప్టెంబర్‌లలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. ఆంజనేయ దండకం పఠించడం ఉత్తమం.


వృశ్చికం

ఆదాయం-2, వ్యయం-14, రాజపూజ్యం-5, అవమానం-2

ఈ రాశివారికి గురు, రాహువుల ప్రతికూల సంచారం పరీక్షాకాలంగా ఉంటుంది. మే 14 నుంచి అక్టోబర్‌ 18 ‌వరకు, తిరిగి నవంబర్‌ 11 ‌నుంచి అష్టమ గురు దోషం. మే 19 నుంచి సంవత్సరమంతా అర్ధాష్టమ రాహు దోషం ఇబ్బందులు కల్పించవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు లేకున్నా ఖర్చులు అధికమై సతమతం కాగలరు. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు చేస్తారు. మీ మాటకు కుటుంబంలోనే వ్యతిరేకత రావచ్చు. ప్రతి వ్యవహారాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఏ నిర్ణయమైనా ఆప్తుల సలహా మేరకు తీసుకోవడం ఉత్తమం. మిత్రులు, సన్నిహితులతో అకారణంగా వైరం. వాహనాలు, భూములు కొనాలన్న ఆలోచన కలిగి ఆదిశగా అడుగులు వేస్తారు. అయితే కష్టసాధ్యమైనా ప్రయత్నం ఫలిస్తుంది. ఇంతకాలం మీరే సాయం అందించగా, ప్రస్తుతం వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి. చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురై ఆశ్చర్యపడతారు. అక్టోబర్‌- ‌నవంబర్‌ ‌మధ్య గురుబలం వల్ల ఆకస్మిక ధనలబ్ధి. మానసిక ప్రశాంతత, పరిపూర్ణ ఆరోగ్యం సమకూరుతాయి. శాస్త్రసాంకేతిక రంగాల వారు తమ ప్రతిభను చాటుకుంటారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమస్థాయిలో ఉండవచ్చు. ఉద్యోగస్తులకు విధుల్లో కొన్ని అవాంతరాలు వచ్చిన అధిగమిస్తారు. కొన్ని బదిలీలు నిలిచిపోయే అవకాశం ఉంది. పారిశ్రామిక• వర్గాలకు విదేశీ పర్యటనలు, కొత్త సంస్థలకు అనుమతుల కోసం యత్నిస్తారు. రాజకీయవర్గాలకు సరైన గుర్తింపు దక్కవచ్చు. కళాకారులకు అనుకోని అవకాశాలు కొంత ఊరటనిస్తాయి. విద్యార్థుల యత్నాలు శ్రమానంతరం ఫలిస్తాయి. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. గురుని అష్టమస్థితి, రాహువు అర్ధాష్టమ స్థితి వల్ల మానసిక ఆందోళన. చికాకులు. ఇతరులతో మాటపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కనకధారా స్తోత్రాలు పఠిస్తే మంచిది.


ధనుస్సు

ఆదాయం-5, వ్యయం-5, రాజపూజ్యం-1, అవమానం-5.

కొన్ని సమస్యలు, ఇబ్బం దులు ఎదురైనా అత్యంత చాకచక్యంతో పాటు దైవకృపతో అధిగమిస్తారు. మనోబలమే ఆయుధంగా భావించాలి. పట్టుదల, దీక్షలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధిస్తారు. అర్ధాష్టమ శనితో పాటు, మే 14 వరకు, తిరిగి అక్టోబర్‌- ‌నవంబర్‌  ‌మధ్య అష్టమ గురుడు దోషకారులు. రాహు,కేతువులు శుభ ఫలితాలు ఇస్తారు. శని, అష్టమ గురుడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతారు. ఆయా కాలాల్లో కొంత జాగ్రత్తలు పాటించడం మంచిది. అలాగే, నేత్ర, ఉదర, హృదయ సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. పేరు ప్రతిష్ఠలకు కూడా భంగం కలుగుతుంది. ఎవరినీ అతిగా విశ్వసించకుండా దైవంపై భారం మోపి ముందుకు సాగడం మంచిది. ప్రయాణాల్లోనూ విలువైన వస్తువులు చేజారే వీలుంది. కుటుంబంలో సమస్యలు పెరిగి సవాలుగా నిలుస్తాయి. కొన్ని వ్యవహారాలలో పట్టువిడుపు ధోరణి మంచిది. ఇక డిసెంబర్‌ ‌నుంచి గురుడు శుభఫలితాలు ఇస్తాడు. ఆదాయం పెరిగి అవసరాలకు లోటు రాదు. అలాగే, మానసిక ప్రశాంతత, ఒడుదొడుకుల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి.

వాణిజ్య, వ్యాపారాలలో లాభనష్టాలను సమానంగా స్వీకరించాల్సి వస్తుంది. అయితే భాగస్వాముల చేయూతతో సమస్యలు తీరతాయి. ఉద్యోగస్తులకు పనిభారం మరింతగా పెరిగినా కొంత కీర్తి కూడా దక్కుతుంది. అయితే సంవత్సరాంతంలో పదోన్నతులు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాల యత్నాలు ముందుకు సాగని పరిస్థితి. అధికారుల నుండి సమస్యలు రావచ్చు. రాజకీయ వర్గాలకు గందరగోళ పరిస్థితి నెలకొన్నా గౌరవానికి లోటు రాదు. కళాకారులు అనుకున్న అవకాశాలు సాధించేందుకు శ్రమపడాలి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యవసాయదారులకు ద్వితీయార్ధంలో అనుకూలస్థితి. శని, గురులకు తగిన పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. రుద్రాభిషేకాలు చేయించుకుంటే మంచిది.


మకరం

ఆదాయం-8 వ్యయం-14, రాజపూజ్యం-4, అవమానం-5

ఈ రాశివారికి మే 14 వరకు, తిరిగి అక్టోబర్‌-‌నవంబర్‌ ‌మధ్య గురుడు యోగకారకుడు, మిగతా కాలమంతా దోషకారి. శని సంవత్సరమంతా శుభ ఫలితాలు ఇస్తాడు. ఇక రాహు, కేతువుల సంచారం మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడతారు. ఖర్చులు అధికమై అప్పుల కోసం యత్ని స్తారు. అయితే సమాజంలోనూ, కుటుంబంలోనూ మీ మాటే చెల్లుబాటు కాగలదు. మీకు దూరంగా ఉన్న వ్యక్తులు దగ్గరకు చేరడం సంతోషాన్నిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారానికి చేరువగా ఉంటాయి. ఆపదలో ఉన్నవారికి చేతనైన సహాయం అందించేం దుకు ముందుంటారు.

ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించి పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో సఫలమవుతారు. జీవిత భాగస్వామితో మరింత సఖ్యత నెలకొంటుంది. బంధుమిత్రులతో మీ అభిప్రాయాలను పంచు కుంటారు. కొన్ని సేవా కార్యక్రమాలు చేపడతారు. తరచూ ప్రయాణాలు సంభవం. విదేశీ ప్రయాణాలు కూడా ఉండవచ్చు. శుభకార్యాల నిర్వహణకు సమాయత్తమవుతారు. ఆర్థికంగా కొంత ఒడుదొడు కులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం కూడా తరచూ ఇబ్బంది కలిగిస్తుంది. వైద్యసేవలు అవసరం కావచ్చు. రాహు, కేతువులు, మే-అక్టోబర్‌ ‌మధ్య కాలంలో, డిసెంబర్‌ ‌తరువాత గురుని ప్రభావంతో కొన్ని హఠాత్తు పరిణామాలు, సంఘటనలు ఎదురుకాగలవు. నరాలు, చర్మ సంబంధిత రుగ్మతలు కలిగే అవకాశం.మొత్తానికి వీరు మనోనిబ్బరంతో గడపడం ఉత్తమం.

ఇక వాణిజ్య, వ్యాపారాలలో సమన్వయం పాటించాలి. లాభాలు దక్కినా వాటిని నిలబెట్టు కోవాలి. ఉద్యోగస్తులు విధుల పట్ల అంకితభావం చూపుతారు. ఇంతకాలానికి సరైన గుర్తింపు దక్కుతుంది. పారిశ్రామికవర్గాలకు ఊహించని రీతిలో అనుమతుల దక్కి ఒప్పందాలు కుదురుతాయి. రాజకీయవేత్తలకు నవంబర్‌ అత్యంత శుభదా యకంగా ఉంటుంది. కళాకారులు స్వయంగా నిర్ణయాలు తీసుకుని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు ఆశించిన విధంగా ఫలితాలు రావచ్చు. వ్యవసాయ దారుల కృషి, యత్నాలు ఫలిస్తాయి. గురు, రాహు, కేతువులకు పరిహారాలు చేయడం, దుర్గాదేవిని ఆరాధించడం మంచిది.


కుంభం 

ఆదాయం-8, వ్యయం-14, రాజపూజ్యం-7, అవమానం-5

ఈ రాశి వారికి ఏలిననాటి శని చివరి భాగానికి చేరుకుంది. అయితే శని సువర్ణమూర్తి కావడం శుభకరం. గురు సంచారం కూడా శుభదాయకమే. ఇక జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు సంచారం ప్రతికూల అంశాలు. మొత్తానికి వీరికి శని, గురులు మంచి ఫలితాలు ఇస్తారు. ధనానికి లోటు రాకుండా గడచిపోతుంది. ఎవరిపైనా ఆధారపడకుండా వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. ఒక సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంట శుభకార్యాల హడావిడి పెరుగుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. భార్యాభర్తల మధ్య నెలకొన్న అపోహలు తొలగు తాయి. వాహనాలు, ఖరీదైన ఇళ్లు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల కోరిక నెరవేరే కాలం.

సమాజంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. అనుకున్నది సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. కోర్టు వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశముంది. అక్టోబర్‌-‌నవంబర్‌ ‌మధ్యకాలంలో అనారోగ్యం. ముఖ్యంగా నరాలు, జ్వర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. వాణిజ్య,వ్యాపారాలు క్రమేపీ పుంజుకుని లాభాలు ఊరటనిస్తాయి. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులతో కూడిన బదిలీలు ఉంటాయి. పనిభారం నుంచి ఉపశమనం. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవం తంగా గడుస్తుంది. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే సూచనలు. వీరి మాటకు తిరుగు ఉండదు. కళాకారుల కలలు ఫలిస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు రెండుమూడు అవకాశాలు దక్కవచ్చు. వ్యవసాయదారులకు రెండవ పంట లాభసాటిగా ఉంటుంది. శనికి తైలాభిషేకాలు, దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయడం ఉత్తమం.


మీనం 

ఆదాయం-5, వ్యయం-5 రాజపూజ్యం-3, అవమానం-1

ఈ జన్మరాశిలో శని సువర్ణమూర్తి కావడం, రాహువు, కేతువులు కూడా సువర్ణమూర్తులుగా సంచారం, మే 14 తరువాత గురుని ప్రభావంతో కొంత అనుకూల ఫలితాలు. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండానే సర్దుబాటు కాగలదు. అప్పులు చేసినా వెనువెంటనే తీరుస్తారు. ఇష్టమైన వ్యక్తులు మరింత దగ్గరవుతారు. తీర్థయాత్రలు విరివిగా చేసి ఆధ్యాత్మికతను పెంచుకుంటారు. సంవత్సర ప్రారంభంలో కొన్ని సమస్యలు, కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురైనా మనోబలంతో అధిగమిస్తారు. అలాగే, ఆరోగ్యం కొంత సహకరించక ఇబ్బంది పడతారు. అయితే త్వరగానే స్వస్థత చేకూరుతుంది. చేసే పనిపై ఏకాగ్రత కలిగి సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. బలమైన ప్రత్యర్థులు కూడా మీ మంచితనానికి విధేయులై మసలుకుంటారు. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగార్ధులు తమ ప్రయత్నాలలో సఫలం చెందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే, ఇళ్ల నిర్మాణం లేదా కొనుగోలుకు సన్నద్ధమవుతారు. కాంట్రాక్టర్లు, రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారులు ద్వితీయార్ధంలో మరింత లబ్ధి పొందుతారు. వాణిజ్య, వ్యాపారవేత్తలు పెట్టుబడులు అంది ముందడుగు వేస్తారు.

సంస్థలను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తారు. ఉద్యోగులపై ఒత్తిడులు పెరిగినా అధిగమి స్తారు. పైస్థాయి నుంచి ప్రోత్సాహం ఉంటుంది. రాజకీయవర్గాలకు ప్రజాదరణ పెరుగుతుంది. పారిశ్రామికవర్గాల వారు తరచూ విదేశీ పర్యటన లతో గడుపుతారు. కళాకారులను అవకాశాలతో పాటు విజయాలు వరిస్తాయి. విద్యార్థులకు శ్రమానంతరం మంచి ఫలితాలు రాగలవు. వ్యవసాయదారులు రెండవ పంటలో లాభాలు పొందుతారు. శని, రాహు, ప్రథమార్ధంలో గురునికి పరిహారాలు చేయాలి. అలాగే, నృసింహ స్తోత్రాలు పఠనం ఉత్తమం.

సర్వేజనా సుఖినోభవంతు…

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE