ప్రతి పర్వదినం వెనుక ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక కోణాలు ఉంటాయి. వాటి అంతరార్థం దైవలీలలతో ముడిపడి ఉంటుంది. హోలీ వేడుక కూడా అలాంటిదే. ఈ ప0డుగను యుగయుగాలుగా జరుపుకుంటున్నట్లు ‘ధర్మ సింధువు’లాంటి స్మృతి గ్రంథాలు, దీని వెనుక గల ఆరోగ్య రహస్యాలను వైద్య గ్రంథాలు చెబుతున్నాయి. అసుర శక్తులపై దైవీ శక్తుల విజయానికి ఈ పర్వదినం ప్రతీకగా నిలుస్తుంది.
హోలీ పండుగ వర్తమానంలో భావిస్తున్నట్లు కేవలం రంగుల చల్లుకునే పండుగే కాదు. ఆధ్యాత్మిక కోణంలోనూ, ఇందుకు సంబంధించిన పౌరాణిక గాథలు చూస్తే… దాని యదార్థ స్వరూపం బోధపడు తుంది. ఈ పండుగ, దీని విశిష్టతల గురించి ఎన్నో కథనాలు ఉన్నాయి. ఒక ప్రత్యేక ఉద్దేశంతో ప్రారంభ మైన ఈ ఉత్సవానికి కాలక్రమంలో అనేక రకాల ప్రాముఖ్యతలు ఏర్పడ్డాయి. అన్ని వర్గాను చేరదీసి, చిన్నా-పెద్ద, ధనిక-బీద, అధికార – అనధికార లాంటి భేదభావాలకు అతీతంగా, హిందూ జాతి వీరత్వాన్ని, ఏకత్వాన్ని, అఖండ త్వాన్ని స్ఫురింప చేసే మహత్తర పర్వదినంగా దీనిని జరుపు కుంటున్నారు.
శ్రీకృష్ణుడు మొట్టమొదటగా గోపీ గోపికలతో హోలీ ఆడాడని పురాణోక్తి. అయితే ఆయన ఆడిన ఆటకు, వర్తమానంలో జరుపుకొనే పండుగకు అంతరం ఎంతో ఉంది. జ్ఞానవిజ్ఞాన రూపాలనే రంగులు మోక్షసాధనకు చక్కటి మార్గాలని శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించాడు. జ్ఞానమనే గులాంతో, విజ్ఞానమనే కుంకుమ రంగుతో తన భక్తుల మనసులను పరిశుద్ధ పరచి, వారిలో పవిత్రను నింపి మైమరపింపచేసేందుకు ఈ క్రీడ ఆడాడని యోగులు వ్యాఖ్యానించారు. యమునాతీరంలోని బృందావనంలో శ్రీకృష్ణుడు గోపికలపై వసంతాన్ని చిలకరిస్తే వారు ప్రేమాతిశయంతో ఆయనపై పన్నీరు, పుష్పాలు విరజిమ్మారని శ్రీమద్భాగవతం చెబుతోంది. సమస్త కలహాలకు ఈర్ష్యా ద్వేషాలే మూల కారణమని, జ్ఞాన యోగాల ద్వారానే వాటిని తొలగించడం సాధ్యమని, అప్పుడే ఆత్మపరమాత్మల కలయికకు మార్గం ఏర్పడుతుందని ఆధ్యాత్మిక, తత్వవేత్తలు అంటారు.
సామాజిక కోణంలో చూస్తే హోలీ సామాజిక పర్వదినం. అంతవరకు మనోవైషమ్యాలు కలిగి ఉన్నవారు పండుగవేళ పరస్పరం ర0గులు చల్లు కోవడం, ఆలింగనలు చేసుకోవడం కనిపిస్తుంది. అలా ఈర్ష్యాద్వేషాలు కొంతవరకైన సమసిపోతాయని విశ్వాసం. అయితే ఈ చర్యలు అప్పుడప్పుడు, అక్కడక్కడ వికటిస్తుంటాయి. ‘జ్ఞానమనే రంగులలో మానవులు తమ ఆత్మలను పరమాత్మలో విలీనానికి ప్రయత్నించాలి’ అనే ఆధ్యాత్మిక చింతనకు బదులుగా, వర్తమానంలో కేవలం వేడుక కోసమే ఈ పండుగను జరుపుకుంటున్నారనే వ్యాఖ్యానాలు ఉన్నాయి. జనం వ్యవహార శైలీ అందుకు భిన్నంగా లేదని చెప్పవచ్చు. హద్దు దాటితో చేదు అనుభవాలు ఎదురవుతాయ నేందుకు బలవంతంగా రంగులు చల్లడం, మద్య పానం, శ్రుతిమించిన మాటలతో వేళాకోళాలు ఉదాహరణలు
హోలీ సంబంధించి యుగానికి ఒక కథ ప్రచారంలో ఉంది. కృతయుగంలో హోళిక (హిరణ్య కశిపుడి సోదరి) అనే రక్కసి తన ఒడిలో కూర్చున్న వారిని భస్మం చేయగల వరాన్ని పొందింది. హిరణ్యకశిపుడు తన పుత్రుడు ప్రహ్లాదునితో హరి నామస్మరణను మాన్పించే క్రమంలో పలు రకాల దండనలు విధించాడు. అయినా మార్పులేని కుమారుడిని భస్మం చేయాలని సోదరిని ఆదేశించాడు. ఆమె ప్రహ్లాదుడిని ఒడిలోకి తీసుకుని మంటల్లో చేరి ఆ ‘బాలభక్తి’ ప్రభావంతో దగ్ధమైంది. ప్రహ్లాదుడు బయట పడ్డాడు. ఈ సంఘటన చోటు చేసుకున్న ఫాల్గుణ పౌర్ణమినే ‘ప్రహ్లాద పౌర్ణమి’ అంటారు.
త్రేతాయుగంలో, శిశువులను చంపుతున్న హోలిక అనే రాక్షసిని రఘుమహారాజు సంహరించాడని, ఆ ఆనంద సమయంలో జరుపుకున్న పండుగ హోలీగా మారిందని కొన్ని గ్రంథాలు పేర్కొన్నాయి. రాక్షసి పీడ వదలినందుకు సంతోషంతో ప్రజలు వసంతాలు చిమ్ముకుంటూ వేడుక జరుపుకున్నారట. ఈ ఉత్సవం నాడు ఆ రాక్షసి బొమ్మను దహనం చేస్తారని ‘పురుషార్థ చింతామణి’ గ్రంథం పేర్కొంది.
ద్వాపరయుగంలో… కంసుని ఆజ్ఞ మేరకు తన ప్రాణం తీసేందుకు పాలు ఇచ్చే నెపంతో వచ్చిన పూతనను బాలకృష్ణుడు సంహరించాడు. అందుకే వ్రేపల్లెవాసులు ఈ పండుగను ఆనందోత్సాహలతో జరుపుకుంటారు. ఆ రోజున బాలకృష్ణుడి విగ్రహాన్ని ఊయలలో వేసి ఊపుతారు. అదే ‘డోలోత్సవం’. ‘నిర్ణయామృతం’ అనే సంస్కృత గ్రంథ కథనం ప్రకారం, ధర్మరాజు పాలనలో ప్లేగు వ్యాధి ప్రబలి పెద్ద సంఖ్యలో జనం మృత్యువాత పడుతుండడంతో ‘ఇది హోలిక అని బ్రహ్మ రాక్షసి చర్యని, ప్రజలు నిద్రించే సమయంలో వారిని పొట్టన పెట్టుకుంటోందని, దీనిని ఎదుర్కొనే క్రమంలో హోలీ మంటలు వేయాలని శ్రీకృష్ణుడు సూచించాడట.
మరోవంక ‘కుమారసంభవం’ హోలీ పండుగకు కారణమని పౌరాణిక గాథ. తారకాసుర సంహారానికి కుమారస్వామి జన్మించాలి. అందుకు మహాతపస్సులో ఉన్న మహేశ్వరుడి మనసును చలింప చేయాలి. బ్రహ్మ సూచన మేరకు మన్మథుడు (మదనుడు) ఆ పనిని నెరవేర్చగా, ఉగ్రుడైన శివుడు తన మూడవ కంటితో మన్మథుడిని భస్మం చేశాడు. రతీవిలాపంతో మన్మథుడిని పునర్జీవితుడిని చేసి, ఆమెకు మాత్రం కనిపిస్తూ, అందరి హృదయాలలో ఉంటాడని ప్రకటించాడు శంకరుడు.
దక్షిణాదిలో ఈ పండుగను ‘కామదహన గాథ’కు సంబంధించినదిగా పరిగణిస్తారు. ఇక్కడ కామం అంటే శృంగారపరమైన ‘వాంఛ’ అనే అర్థంలోనే కాకుండా ‘కోరిక/ఆకాంక్ష’ అనే లౌకిక అర్థంలో తీసుకోవాలని పెద్దలు సూచిస్తారు. ఐహికమైన కోరికలను త్యజించి నిష్కామకర్మతో సమాజ మేలుకు ఉపకరించాలనే సందేశం ఇందులో ఇమిడి ఉంది.
పౌరాణిక గాథలను అటుంచి ఆ ఆనంద•కేళిలో ఆరోగ్య రహస్యాలూ దాగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. రుతువు మారే క్రమంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేలా ప్రకృతి వనరులతో తయారయ్యే రంగులు దోహదపడతాయని అంటారు. అలా వేప గింజలు, కుంకుమ, పసుపు తదితర ప్రకృతి సిద్ధ, ఆయుర్వేద పదార్థాలతో సంప్రదాయ బద్ధంగా రంగులు తయారు చేసేవారు.
శీతకాలం నుంచి వేసవి ప్రవేశించే వేళ గాలిలో మార్పుల కారణంగా, జలుబు, జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, వాటి నివారణకు ఔషధ గుణాలు గల బిల్వ, వేప ఆకులు; మందార, మోదుగ, అగ్నిపూల పొడులను చందనం, పసుపు కుంకుమలను నీటిలో కలిపి చల్లుకోవడం ఈ వేడుకలో భాగమని ఆయుర్వేదం పేర్కొంటోంది. కాలక్రమంలో వాటి స్థానంలో పూర్తిగా రసాయనాలతో నిండిన రంగులు వాడకంలోకి వచ్చాయి. వీటిని చల్లుకోవడంలో ఆనందం, వినోదం మాట ఎలా ఉన్నా ఆరోగ్యపరంగా నష్టం వాటిల్లుతోందని, వాతావరణం కలుషితమవు తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రసాయనకారక రంగుల కారణంగా చర్మ వ్యాధులు, అంధత్వం, మూత్రపిండాల వ్యాధులు వంటివి సంక్రమించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉగాది పచ్చడి తరహాలో… మామిడిపూత, వేప చిగురు, కరక్కాయపొడి, తేనె మిశ్రమాన్ని తీసుకోవడం (హోలీ మధు ప్రాశనం) వల్ల వేసవి తాపాన్ని తట్టుకొనే శక్తి సమకూరుతుందని ఆయుర్వేదం చెబుతోంది. పొలాల్లోని ధాన్యం, దినుసులు సేకరించి, ఆవు పాలతో మోదుగు పుల్లలపై తయారు చేసే మధుర పదార్థాన్ని ‘హోలి’ అంటారు. ఫాల్గుణ, చైత్ర మాసాల సంధికాలంలో పక్షం రోజుల పాటు నియ మబద్ధంగా దీనిని స్వీకరిస్తే ఆరోగ్యం చేకూరుతుందని ‘యోగ చింతామణి’ పేర్కొంటోంది. ప్రకృతి సహజమైన రంగులతోనే హోలీ జరుపు కోవాలని ‘పర్వ చూడామణి’ పేర్కొంటోంది. సంప్రదాయకంగా వస్తున్న పండుగలను జరుపుకోవలసిందే. అదే సమయంలో పూర్వికులు రూపొందించిన నియమాలను పాటించడం ద్వారా ఆరోగ్యాలను, పర్యావరణాన్ని కాపాడినవారమవుతాం.
సమైక్య భావనా మాధుర్యాన్ని ప్రకటించేలా ఆసేతు శీతాచలం జరుపుకునే ఈ జాతీయ పండుగను విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ ‘జనపర్వం’ అని అభివర్ణించారు. వసంత రుతువు ఆగమనానికి ఈ పండుగను సంకేతంగా పరిగణిస్తారు.
- మధుర మీనాక్షీదేవి ఘోరతపస్సు చేసి సుందరేశ్వరుడిని పరిణయమాడిందీ ఫాల్గుణ పౌర్ణమి నాడే. ఆ రోజున ఆదిదంపతులకు పూజాదికాలు నిర్వహించి ‘హోలికా మిశ్రమం’ (మామిడిపూత, వేపచిగుళ్లు, తేనె మిశ్రమం)ను భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు.
- శ్రీ మహాలక్ష్మి పాలకడలి నుంచి ఫాల్గుణ పౌర్ణమినాడే ఆవిర్భవించిందని, అయ్యప్పస్వామి పంబల రాజుకు కనిపించిందీ ఈ రోజునేనని, వారిని పూజిస్తే మంచిదనే విశ్వాసం ఉంది.
- శ్రీకృష్ణుడు మేధాముడనే రాక్షసుడిని చంపిన సందర్భాన్ని పురస్కరించుకొని బెంగాల్‌లో ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. పెద్ద గడ్డి బొమ్మను తయారు చేసి, దహనం చేస్తారు. తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించి, మెడలో పూలమాలలతో వీధిలోకి వచ్చి వసంత రుతువును స్వాగతిస్తూ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తారు. దీనిని ‘దోల్ పూర్ణిమ’ అంటారు.
- ఈ రోజున అష్టవిధ శక్తిమాతలను పూజించే సంప్రదాయాన్ని బట్టి దీనిని ‘శక్తి పౌర్ణమి’గా పేర్కొంటారు.
- హోలీ నాడు జనావాస కూడళ్లలో పెద్ద మంటలు (భోగి మంటల మాదిరి) వేసి అగ్నికి ప్రదక్షిణ చేసి ఆ భస్మాన్ని నుదుట ధరిస్తారు. కొన్ని ప్రాంతాలలో దీనిని ‘ధూళి వందన్’గా వ్యవహరిస్తారు.
- ఆంధప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో డోలోత్సవం నిర్వహిస్తారు. ఆ తిరునాళ్లకు ‘డోలాయాత్ర’గా పేరు.
- కాముని పున్నమి నాడు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో పశువుల కాపరులు వారిలో ఒకరికి ఎలుగుబంటి వేషం వేసి ఇళ్ల ముందు ఆడిస్తూ పాటలతో భిక్షాటన చేసేవారని తెలుస్తోంది.
ఉత్తర భారత-దేశంలో ప్రధాన ఆహార పంట గోధుమలు కోతల సందర్భంగా ‘హోహో’ కోలాహలమే ‘హోలి’ అయ్యిందనీ కొందరి అభిప్రాయం.
డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్