కరవు పీడిత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 4 లక్షల 15 వేల ఎకరాల బీడు భూములకు సాగునీరు, ఫ్లోరైడ్‌ పీడిత 5 వందల పై చిలుకు గ్రామాలకు తాగునీరు, రాజధాని హైదరాబాద్‌ వాసులకు నీటి సరఫరా కోసం రూపొందించినదే ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ) సొరంగ మార్గ పథకం. అర్ధశతాబ్ద కాలంగా ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న తీరులో తెలంగాణలో సుదీర్ఘ కాలంగా నిర్మాణం జరుగుతూ వేరువేరు ప్రభుత్వాల పక్షపాతం, తీవ్ర నిర్లక్ష్యం, ప్రకృతి కన్నెర్రలకు గురైన బృహత్తర ప్రాజెక్టు ఇదే. ఫిబ్రవరి 22, శనివారం ఉదయం టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌తో తవ్వకం పనులు జరుగుతుండగా పైకప్పు కూలింది. అందులో చిక్కుకున్న కార్మికుల కోసం గాలింపు చర్యలు విషాదకరంగా ముగిసినట్టే. చిక్కుపోయిన వారిలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు ఉండగా ఒకరి జాడ తెలిసింది.


ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు అధ్యయనానికి 1978లో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నిపుణుల కమిటీ వేశారు. సర్వే చేసిన కమిటీ సొరంగం ద్వారా నీటిని తరలించాలని తొలిసారిగా సూచన చేసింది. 1980లో అక్కమ్మ బిలం వద్ద సొరంగ నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి టి.అంజయ్య శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జూలై 29, 1982న రూ. 480 కోట్లతో సొరంగం పనులకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం జీవో 306 విడుదల చేసింది. అయినా పదేళ్లు అయినా 10% నిధులు కూడా ఖర్చు పెట్టక పోవడంతో ఉద్యమాల గడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జల సాధన సమితి ఉద్యమించింది. అది ఉధృతం కావడంతో టన్నెల్‌కు తాత్కాలిక ప్రత్యామ్నాయంగా 1995 లో పుట్టంగండి వద్ద ఎత్తిపోతల పథకం తెరపైకి వచ్చి ఏఎంఆర్‌గా రూపు దిద్దుకుని 2003 నాటికి రూ. 1260 అంచనాలో రూ. 562 కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక పథకాన్ని కూడా అసంపూర్తిగా ప్రారంభించారు.

ఈ ఎత్తిపోతల పథకం నిర్వహణ భారీ వ్యయంతో కూడినది కావడంతో శాశ్వత ప్రాతిపదికన శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ సొరంగం డిమాండ్‌ అలాగే ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు శాశ్వతంగా సాగు తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే ఈ సొరంగ మార్గమే కీలకం అని జిల్లా ప్రజలు ఉద్యమించారు. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో 2004లో వచ్చిన వైఎస్‌ఆర్‌ సర్కార్‌ శ్రీశైలం సొరంగ మార్గానికి శ్రీకారం చుట్టింది.

కానీ టన్నెల్‌ ఇన్లెట్‌ స్థానాన్ని 1980లో టి. అంజయ్య శంఖుస్థాపన చేసిన అక్కమ్మ బిలం వద్ద నుండి 10 కిలోమీటర్లకు పైగా దూరంగా ఉన్న దోమలపెంటకు 2005లో అప్పటి సీఎం మార్చడంతో మొదటికే మోసం వచ్చింది. ఆ అనవసర 10 కిలోమీటర్ల పొడవు పెంపుతో ప్రాజెక్టు ఇన్ని సమస్యలకు, ఇప్పటి పరిస్థితులకు అంకురమైంది.

టన్నెల్‌ పనులకు ప్రభుత్వాల ఆలస్యంతో పాటు, ప్రకృతి కూడా ప్రతికూలంగా మారింది. ప్రకృతి కారణంగా ఏర్పడిన తొలి పెద్ద ఆటంకం 2009 నాటిది. అదెలా అంటే, నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌కు శ్రీశైలం జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా నీళ్లు వదలడంలో జాప్యం జరిగింది. దీనితో శ్రీశైలం డ్యామ్‌ వాటర్‌ లెవెల్‌ 870 అడుగులు దాటింది. దీనికి తోడు ఎగువన కుండపోత వర్షాలతో డ్యామ్‌ ఔటఫ్లో కెపాసిటీ (13 లక్షల)కి రెండిరతల వరద నీరు వచ్చింది. శ్రీశైలం రిజర్వాయర్‌ నీటి మట్టం గరిష్ఠా(885 అడుగులకు)నికి 11 అడుగులకు పైగా మించి 896.5 అడుగులకు చేరడంతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వరద నీటితో నిండిపోయింది. యంత్ర పరికరాలు పాడయ్యాయి. సిల్టింగ్‌ సమస్యలు తలెత్తాయి.

వరద జలాల వినియోగం పేరుతో వచ్చిన శ్రీశైలం కుడిగట్టు కాలువ ఈ రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో దశలను పూర్తి చేసుకుని వందలాది టీఎంసీల నికరజలాలను అందులో ఇతర నదీ బేసిన్‌ ప్రాజెక్టులకు తరలించారు. కానీ ఈ ఐదు దశాబ్దాలలో ఎస్‌ఎస్‌బీసీ టన్నెల్‌ చుక్క నీటిని అందించలేదు. అసలు ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని గందరగోళ పరిస్థితి.

సొరంగ పథకానికి సంబంధించి శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌ నుంచి రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 30 టీఎంసీల నీటిని తరలించి సాగు, తాగు నీటిని తరలించాలని నిర్ణయించారు. ఆగస్టు 11,2005న పరిపాలన అనుమతులు ఇచ్చి 2006లో పనులకు శంకుస్థాపన చేశారు. జైప్రకాష్‌ అసోసియేట్స్‌ సంస్థ 2007లో పనులు ప్రారంభించింది. కానీ, ఆది నుంచి సంక్లిష్ట పరిస్థితుల మధ్యనే కొనసాగుతున్నది. ప్రధానంగా టైగర్‌ రిజర్వు ఫారెస్టు మీదుగా జలాలు ప్రవహించాల్సి ఉన్నందున నల్లమల అటవీ ప్రాంతాన్ని దాటే వరకు ఎక్కడా బయటికి రాకుండా భూగర్భంలో నుంచే ఈ సొరంగ మార్గాన్ని నిర్మించాలి. టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ ఆ పనికే. శ్రీశైలం నుంచి ఒక టీబీఎం (ఇన్‌లెట్‌), నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి నుంచి మరో టీబీఎం (అవుట్‌లెట్‌) ద్వారా పనులు జరుగుతున్నాయి. మొత్తం 43.93 కిలోమీటర్ల ప్రధాన సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా నేటికీ 34.71 కిలోమీటర్లు పూర్తి అయింది. మిగతా 9.56 కిలోమీటర్ల సొరంగం పూర్తి చేయాలి. అందుకోసం శ్రీశైలం వైపు ఉన్న ఇన్‌లెట్‌ నుంచి పనులు మొదలు పెట్టగా ఈ భారీ ప్రమాదం చోటుచేసుకుంది

తాజాగా పెంచిన అంచనా వ్యయం సహా, మొత్తంగా ప్రాజెక్టుకు ఇప్పటివరకు కేటాయించిన 4637.75 కోట్లల్లో రూ.2647 కోట్లు మాత్రమే ఈ రెండు దశాబ్దాల కాలంలో ఖర్చు చేశారు. గత పదేళ్లలో రూ.500 కోట్లే కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా 2019, 2020, 2021లో చూస్తే మూడేళ్లలో రూ. 10 కోట్లే కేటాయించారు. ఈ నిధులు సరిపోయే పరిస్థితి లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వాల అత్యంత తీవ్ర నిర్లక్ష్య వైఖరికి ప్రత్యక్ష నిదర్శనాలు ఇంకేం కావాలి.


టీబీఎం గురించి కొంచెం..

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం నేపథ్యంలో ప్రధానంగా వినిపించిన మాట` టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ (టీబీఎం). సొరంగ మార్గాల కోసం వాడే తవ్వోడ అనొచ్చు. మోల్‌ అని వార్మ్‌ అని కూడా పిలుస్తారు. 19వ శతాబ్దంలో వచ్చిన ఈ యంత్రం భూమిలో లోపల పనులలో విప్లవాత్మక మార్పును తెచ్చింది. అసాధ్యం అనుకున్న చాలా పథకాలను టీబీఎం సుసాధ్యం చేసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా నగరాలలో సబ్‌వేలు తయారీలో వినియోగిస్తారు. రాతి నేలలు, ఇసుక నేలలు, తడి పొడి నేలలు తవ్వడానికి వేర్వేరు టీబీఎంలు ఉపయోగిస్తారు. డ్రిల్లింగ్‌, బ్లాస్టింగ్‌ ప్రక్రియలకు ప్రత్యామ్నాయం టన్నెల్‌ బోరింగ్‌. ఇందులో ముందు భాగాన్ని కట్టర్‌ హెడ్‌ అంటారు. ఇది టన్నెల్‌ను తొలుస్తుంది. సాధారణంగా హైడ్రాలిక్‌ జాక్స్‌ ఈ యంత్రాన్ని ముందుకు నడిపిస్తాయి. వీటిలో అనేక రకాలు ఉన్నాయి. మెత్తటి నేలను తవ్వడానికి ఎర్త్‌ ప్రెషర్‌ బ్యాలెన్స్‌ మెషీన్స్‌ అంటారు. ఇంకా హార్డ్‌ రాక్‌ టీబీఎం, మిక్స్‌డ్‌ షీల్డ్‌ టీబీఎం అని కూడా ఉంటాయి. వేర్వేరు నేలలో తవ్వకం కోసం టీబీఎంలు తయారయ్యాయి. దేని ఘనత దానితే. చైనాలోని షాంఘైలో ఒక ప్రాజెక్టు కోసం తయారు చేసిన పెద్ద టీబీఎం వ్యాసార్థం 15.43 మీటర్లు (దాదాపు 46 అడుగులు). దీనిని హెరెంక్‌చెట్‌ కంపెనీ తయారు చేసింది. నిజానికి ఒక మీటరు వ్యాసార్థం మొదలు, 17.6 మీటర్ల వ్యాసార్థం ఉన్న సొరంగ నిర్మాణం వరకు వీటిని తయారు చేయించుకున్నారు. టీబీఎం నిర్మాణం, పని చేయవలసిన ప్రదేశానికి తరలించడం రెండూ ఖర్చుతో కూడుకున్నవే. ఈ కంపెనీయే మార్టినా పేరుతో 15.62 వ్యాసార్థం కలిగిన సొరంగం కోసం నిర్మించింది.దీని మొత్తం పొడవు 130 మీటర్లు. అంటే 430 అడుగులు. మొత్తం బరువు 4500 టన్నులు.


మరి, ఇంత జాప్యందుకంటే.. 

ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఆరుసార్లు గడువు పొడిగించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం 2026 జూన్‌ లోపు పూర్తి చేయాలనేది లక్ష్యం. ఇన్‌లెట్‌ వైపు టన్నెల్‌ నుంచి పెద్దఎత్తున సీపేజీ (ఊట) వస్తుండటంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. డీవాటరింగ్‌, డీ సిల్టింగ్‌ చేసుకుంటూ పనులు చేయాల్సిన పరిస్థితి. ప్రాజెక్టులో సీపేజీని నియంత్రించడం కష్టంతో కూడుకున్నది. ముఖ్యంగా టన్నెల్‌ ఇన్లెట్‌లో జరుగుతున్న పనుల్లో ఊట భారీగా ఉంటుంది. ఆ నీటిని తోడిపోస్తూ పనులు చేయడం సవాలే. నిధుల సమస్య కూడా ఉంది. విద్యుత్తు బిల్లుల చెల్లింపులు సక్రమంగా జరగలేదు. అటు నిర్మాణ సంస్థ.. ఇటు ప్రభుత్వం.. ఇద్దరి వద్ద నిధుల సమస్యతో పనులపై తీవ్ర ప్రభావం పడిరది. అలాగే షియర్‌ ట్రీట్‌మెంట్‌ కోసం ఏడాదిన్నరపాటు పనులు ఆగిపోయాయ. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు అంచనా మరోసారి కూడా పెంచింది. 2017లో రూ.3,152 కోట్లకు అంచనా వ్యయం పెరగగా.. దాన్ని రూ.4,637 కోట్లకు పెంచింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. నీటి పారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) అనిల్‌ కుమార్‌ సారథ్యంలో ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. తిరిగి ప్రాజెక్టు (సొరంగం) పనులు ప్రారంభించాలంటే సీపేజీ నివారణ, బోరింగ్‌ మెషీన్‌ బేరింగులు ఏర్పాటు చేయాల్సి ఉందని కమిటీ భావించింది. ఇందుకు ముందస్తుగా రూ.50 కోట్లను నిర్మాణ సంస్థకు కేటాయించేందుకు ప్రతిపాదించింది. ఈ మేరకు నిరుడు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అలాగే 2024-25 బడ్జెట్‌లో రూ.800 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రెండేళ్లలో పూర్తి చేసేలా చర్యలు చేస్తామని 2024 జులైలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం నెలకు 300 మీటర్ల చొప్పున టన్నెల్‌ తవ్వాలనేది నిర్మాణ సంస్థ ప్రణాళిక. దానికి తగ్గట్టుగా రెండు, రెండున్నరేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని అని మంత్రి చెప్పారు. ఏళ్ల తరబడిగా టన్నెల్‌ పనులు జరుగు తుండటంతో సమస్యలు పెరుగుతూ వచ్చాయని, ప్రాజెక్టుకు సమీపంలో టన్నెల్‌ లోపల పనిచేయడానికి ఎన్నో సమస్యలు ఉంటాయని సొరంగం నిర్మాణ మార్గంలో భూమి ‘లూజ్‌’గా ఉండే ప్రాంతాన్ని రాడార్‌ సాయంతో గుర్తించుకుంటూ వెళ్లాలి. సొరంగం లోపల కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

టన్నెల్‌ మెషీన్‌ నడుస్తున్న సమయంలో పెద్ద శబ్దం వస్తుంది. శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు. అది చెవులు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకు తగ్గట్టుగా అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. అవి జరుగలేదు.

–  అండెం రాంరెడ్డి, సాగునీటి రంగ విశ్లేషకులు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE