ఇవాళ తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ నిర్మాణంలో జరిగిన ప్రమాదం చర్చకు వచ్చి, అందరినీ కలచివేస్తున్నది. ఆ ఎనిమిది మందిలో  ఏడుగురి ఆచూకీ ఇంకా దొరకలేదు. దేశంలో చాలా నీటి పథకాల వలెనే ఎస్‌ఎల్‌బీసీ కూడా జాప్యం శాపానికి గురైంది. 42 ఏళ్ల క్రితం ప్రారంభించినప్పటికీ ఇంతవరకు పూర్తి కాలేదు. నలుగురైదుగురు ముఖ్యమంత్రులను ఈ ప్రాజెక్టు చూసింది. ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం 2026 సంవత్సరానికి పూర్తి చేయాలని సంకల్పించింది. సొరంగంలో పని జరుగుతుండగా కన్వేయర్‌ బెల్ట్‌ తెగి, పై కప్పు కూలింది. ఫిబ్రవరి 22న దోమలపెంట అనే చోట ఇది జరిగింది. టన్నెల్‌ నిర్మాణంలో ప్రమాదానికి కారణాలు ఏమిటి? అవి సాంకేతిక పరమైనవా? నిధుల పరమైనవా? పాలనా పరమైనవా? మరేమిటి? అంటూ ఇప్పుడు అంతా చర్చిస్తున్నారు. సొరంగ మార్గంలో జరిగిన ఆ ప్రమాదం ఏదో ఒక కోణం నుంచే చూడదగినది కాదు. దానికి అనేక కోణాలు ఉన్నాయి. జాప్యం ప్రధాన కారణం. ప్రకృతికి విరుద్ధంగా వెళ్లడం ఒక కారణం, రాజకీయ నాయకుల వైఫల్యం కూడా ఇందులో ఉంది. అలాగే ఇలాంటివి జరగకుండా ఉండాలని మనందరం కోరుకుందాం. ఈ పరిణామం గురించి నీటి పారుదల శాఖలో అనుభవజ్ఞులైన ఇంజనీర్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ ఇంజనీర్‌గా పని చేసిన ఎం. వెంకట రంగారెడ్డితో జాగృతి జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని కొన్ని అంశాలు:

ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ నిర్మాణం. ఇందులోనే ప్రమాదం జరిగింది)` దేశమంతా వినిపిస్తున్న మాట. ఆ ప్రమాదం జరిగిన తీరు అందరిని కలిచివేస్తోంది. వార్త తెలిసిన వెంటనే ప్రధానమంత్రి కూడా ఫోన్‌ చేసి కావాల్సిన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు, తెలంగాణ ముఖ్యమంత్రికి. ఆ ప్రమాదానికీ, ఆ నిర్మాణం తీరు తెన్నులకీ సంబంధం ఏదైనా ఉందా? అది తప్పించ లేనిదా?

సొరంగమార్గం ద్వారా నీటిని తీసుకువెళ్లే పథకాలలోనే అతి పొడవైన వాటిలో ఒకటి ఎస్‌ఎల్‌బీసీ. ఈ ప్రాజెక్టు మన తెలంగాణలో ఉండడం గర్వించదగినది. అదో గొప్ప ప్రాజెక్టు. రెండవది` అంత గొప్ప ప్రాజెక్టును మనం విజయవంతంగా పూర్తి చేశామంటే ఇంకా గొప్ప. ప్రాజెక్టు అయితే మొదలు పెట్టాం. ఆ ప్రాజెక్టుకు కావలసినది టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ (టీబీఎం). దీన్ని ప్రత్యేకమైన ఆర్డర్‌తోనే తయారుచేస్తారు. ఆ ఫీల్డ్‌లో ఎంతో అనుభవం ఉంటే గాని చేయలేరు. టీబీఎంను వివిధ పరిమాణాలలో సరఫరా చేయడం కూడా ఉంది. కానీ ఇంత పెద్ద పరిమాణం సాధారణంగా ఉండదు. ఈ పథకం కోసం మాత్రమే వాళ్లు డిజైన్‌ చేసి తయారు చేసి ఇస్తున్నారు. కాబట్టి ఇందుకు సంబంధించిన యంత్ర పరికరాల తయారీదారులకు కూడా కొన్ని పరిమితులు తప్పవు. ఎస్‌ఎల్‌బీసీకి రాబిన్సన్‌ కంపెనీ (అమెరికా) యంత్రాలు తయారు చేసి ఇచ్చింది. జయప్రకాష్‌ అసోసియేట్స్‌ కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీ. ఇక్కడ సాంకేతిక అవసరాలు ఎంత క్లిష్టమో గమనించి, కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీ ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంది. అందులో ఒక జాగ్రత్త ఏంటంటే, కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీ యంత్రం కొనుక్కున్నది. వీళ్లే దానిని ఆపరేట్‌ చేసుకోవాలి. కానీ ఎవరైతే ఆ యంత్రాన్ని సరఫరా చేశారో, వాళ్లతోనే ఇంకో కాంట్రాక్ట్‌ చేసుకొని ఆ యంత్రాన్ని ఆపరేట్‌ చేయమని ఇచ్చారు. అంటే ఏమన్నట్లు? మనకు కొన్ని పరిమితులు ఉన్నమాట నిజం. మనం ఆ పరిమితులను అర్థం చేసుకొని కావాల్సినంత, సరైన సహకారం అందించాలి. పెద్ద ప్రాజెక్టు నిర్మాణమంటే ఆషామాషీ కాదు. సాంకేతికంగా ఎన్నో ఇబ్బందులు వస్తాయి, మనం ఊహించని సమస్యలు ఎన్నో ఎదురవుతాయి. వాటినన్నిటిని సానుకూలంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగిపోవాలి. ప్రభుత్వం కూడా పరిపూర్ణ మద్దతు ఇవ్వాలి. ఏ కాంట్రాక్టర్‌ డబ్బులు పోగొట్టుకోనికి రాడు. పథకానికి ఆకృతిని ఇచ్చే ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మనకు పని కావాలి, అది ఎంత తొందరగా అయితే మనకు అంత తొందరగా ఫలితాలు వస్తాయి. రెండున్నర లక్షలో, మూడు లక్షల ఎకరాలకో సాగునీరు వస్తుంది.

మీరు చెప్పినది వింటే సొరంగ మార్గాలలో పని, అక్కడ ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం, టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ (టీబీఎం), యంత్రపరికరాలు ఇవన్నీ ప్రత్యేకమైనవని అర్ధమవుతున్నది. ఆ విధానం గురించి కొంచెం చెబుతారా?

ఈ ప్రాజెక్టు ఆరంభంలోనే టన్నెల్‌ బోరింగ్‌ టెక్నాలజీ ప్రపంచానికి పరిచయం అయింది. అంతకు ముందు టీబీఎంలు చిన్న చిన్నవి ఉన్నాయి. పొడవు తక్కువ, పరిమాణం కూడా తక్కువ. ఎస్‌ఎల్‌బీసీ పరిమాణానికి, పొడవుకు తగ్గట్టు ప్రత్యేకంగా యంత్రసామాగ్రి రూపొందించారు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం`టీబీఎం ముందరికి మాత్రమే వెళుతుంది. వెనక్కి రాదు, రాలేదు. సొరంగం మొత్తం 42 కిలోమీటర్లు కాబట్టి రెండు పక్కల నుంచి మొదలు పెట్టారు. టీబీఎం కాలపరిమితి కూడా తక్కువే. కొద్ది కిలోమీటర్లు వరకే దాని సేవలు. అందువల్ల ఇన్లెట్‌ నుంచి మొదలు పెట్టారు. అలాగే అవుట్లెట్‌ నుంచీ మొదలు పెట్టారు. మధ్యకు వచ్చిన తర్వాత ఇవి ఏం చేయాలి? డిజ్‌మేంటిల్‌ (విచ్ఛిన్నం) చేయడమే. కాదంటే, సొరంగంలోనే పక్కన మళ్ల్లీ గండి కొట్టి దానిలో తోసి పూడ్చేయాలి. అంతేతప్ప ఆ మెషీన్లు బయటికి తెచ్చుకోవడానికి లేదు.

టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ ఇక్కడిదాకా ఎలా వచ్చింది?

అమెరికన్‌ కంపెనీ రాబిన్‌సన్‌ టీబీఎంను తయారుచేసింది. ప్రాథమిక పనుల కాలంలోనే టెండరింగ్‌ ఏజెన్సీ ఆ మెషీన్‌ తయారు చేసే సంస్థతో సంప్రతించి ఆ తర్వాత ముందుకి వెళ్లారు. మెషీన్‌ ఏ పరిమాణంలో ఉండాలి? ఈ సొరంగం తవ్వుతున్నాం కాబట్టి అందుకు తగ్గట్టు ఉండాలి. నేలలో రకరకాల జియోలాజికల్‌ ఫార్మేషన్స్‌ ఉంటాయి. పై నుంచి పెచ్చులు ఊడి పడొచ్చు. సీపేజ్‌ ఉంటుంది. ఇవన్నీ తట్టుకోవాలి. మరొకటి, సొరంగం తవ్వడం, వెంటనే లైనింగ్‌, కవరింగ్‌ జరిగిపోతాయి. లేకపోతే పైన ఊడి పడుతుంది. అలా పడిపోతే అంతే సంగతులు. ఒక మీటర్‌ తవ్వకం పూర్తి అయితే మరుక్షణం, ఆ వెనుకే ఆ మీటర్‌ మేర లైనింగ్‌ అయిపోతుంది. చాలా అడ్వాన్స్‌డ్‌. తర్వాత ఆ లైనింగ్‌ చేసేందుకు ఏడెనిమిది ఎలిమెంట్స్‌ వాడతాం. వాటి క్యూరింగ్‌ కూడా స్టీమ్‌ క్యూరింగ్‌, క్విక్‌ క్యూరింగ్‌. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే పని మొదలు పెట్టాం. కానీ ఏ పెద్ద ప్రాజెక్ట్‌ అయినా అండర్‌ గ్రౌండ్‌ పని ఏదైనా కూడా జాప్యం అనేది దానికి మొట్టమొదటి శత్రువు. నీవు ఎంత సాంకేతిక పురోగతి సాధించినా సమయానికి పూర్తి చేయడం ముఖ్యం. అక్కడ ఆటలాడకూడదు.

ఇంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా 40 ఏళ్ల నుంచి పని జరుగుతోంది. సకాలంలో పూర్తి చేస్తే నల్గొండ జిల్లాలో, ఆ ఫ్లోరోసిస్‌ ఏరియాలో నాలుగు లక్షల ఎకరాలకి కృష్ణాజలాలు వెళ్లి ఉండేవి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జల పథకా ల్లోనే జరుగుతాయా మిగతా ఎక్కడైనా సహజ మేనా?

ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. నీరు అత్యంత శక్తిమంతమైనది. ఎంత మేలు చేస్తుందో, అంత ప్రమాదం కూడా తెస్తుంది. రెండవది ` మనం చేస్తున్నది అండర్‌ గ్రౌండ్‌ వర్క్‌. అండర్‌ గ్రౌండ్‌ వర్క్‌ అనేసరికి, మనం సాంకేతికంగా ఎంత పురోగమించినా, ఎంత ముందుకు వెళ్లామని అనుకున్నా ఇంకా 30, 40 శాతం మనకు తెలియని ఎలిమెంట్స్‌ ఉన్నాయని మరచిపోకూడదు. మన టెక్నాలజీకి కూడా అవి దొరకవు. వాటన్నిటిని కూడా దృష్టిలో పెటుకోవాలి. ఏ ప్రాజెక్టు అయినా కూడా వీలైనంత తొందరగా మంచిగా పూర్తి చేసుకుంటే సమస్యలు రావు.

అంటే, ఇవాళ మనం చూసిన ఈ ప్రమాదానికీ, పరిణామానికీ ప్రధాన కారణం జాప్యమే కారణ మంటారా?

ఏ స్టిచ్‌ ఇన్‌ టైమ్‌ సేవ్స్‌ నైన్‌ అంటారు ఇంగ్లిష్‌లో. ఆ సామెత ఊరికే రాలేదు. జాప్యమే మొట్టమొదటి కారణం. ఒకచోట కొద్దిగా కూలిపడ్డది అంటే అక్కడ ఏదో కొంచెం డామేజ్‌ లేదా సమస్య ఉన్నట్టే కదా! ఒకేసారి అంత దూరం వెళ్లింది అంటే అది ఏమిటి, సమస్య తీవ్రమైందనే. ఇక్కడ మీకు ఇండికేషన్‌ ఇచ్చింది, చెప్పింది. అది ముందే హెచ్చరించింది. దానిని మనం పట్టించుకోలేదు.

ఆ తప్పిదాన్ని ప్రభుత్వపరంగా చూడాలా? సాంకేతిక నిపుణుల పరంగానా? పథకాన్ని అమలు చేస్తున్న సంస్థలదిగా చూడాలా?

మొదటి లోపం జాప్యమే. ఈ జాప్యానికి కారకులు ఎవరు? దానిని లోతుగా దర్యాప్తు చేయాలి. ఇప్పటికే బ్లేమ్‌ గేమ్‌ మొదలయింది. ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటున్నారు. అది సరికాదు. ఏం చేయాలి? పని జరగాలి. ఇది చాలా క్లిష్టమైన ప్రాజెక్టు. అంతా సహకరిస్తేనే సాధ్యం. కొంత పని చేశారు. నాలుగేళ్లు అలాగే ఉంచేశారు. సొరంగం పైన 400 మీటర్ల ఎత్తున గుట్ట ఉంది. ఆ గుట్ట మీద వర్షాలు పడ్డాయి. ఆ వర్షపు నీరు లోపలికి దిగింది. ఆ నీరు ఎక్కడికి పోవాలి? ఇంతకు ముందు లేని కొత్త మార్గం దొరికింది. దాని గుండా పోతాయి. కొద్దిగా ఓపెన్‌ అయినాక ఇంకా ఓపెన్‌ చేసుకుంటూ పోతాయి నీళ్లు. ఎక్కడైనా కొద్దిగా లీకేజ్‌ వస్తే, శ్రద్ధగా పరిశీలించి ఉంటే ఆ సమస్య తలెత్తేది కాదు.

జరుగుతున్న సహాయక చర్యల గురించి మీరేమనుకుంటున్నారు?

మనం చెడు మాట్లాడకూడదు. వాస్తవం అందరికీ తెలిసిందే. ఈరోజు ఏమన్నారు, ఇంకా 20 అడుగుల మట్టి పేరుకొని ఉంది, ఎవరూ కనిపించడం లేదన్నారు. దురదృష్టం. ఇక సహాయక చర్యలలో జాప్యం అనేదేం లేదు. జరిగిన తర్వాత వెనువెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినారంటే పరిస్థితిని సరిగానే అంచనా వేశారు. అన్ని వనరులని అప్రమత్తం చేసుకున్నాం. అయితే జరిగే ప్రమాదాన్ని ప్రతిసారి ముందే పసిగట్టి తయారుగా ఉంచుకోలేం కదా! యాక్సిడెంట్‌ ఇస్‌ ఆన్‌ యాక్సిడెంట్‌. గవర్న మెంట్‌ సరిగానే పనిచేస్తున్నది.

జాప్యం, తదనంతర పరిణామాలు.. ఇవన్నీ సరే! 42 ఏళ్ల క్రితం ప్రాజెక్టు పని మొదలయింది. నలుగురు ఐదుగురు ముఖ్యమంత్రులు మారారు. ఈ పరిస్థితి ఎందుకు? నిధుల సమస్యా? రాష్ట్ర విభజన?

నిధులు పెద్ద సమస్య కాదు. ఇక్కడ ప్రాథమ్యాలు చూడాలి. ఏది ముందు? అన్నం వండుతున్నాం, నీళ్లు తక్కువైనాయి. ఒక్క గ్లాస్‌ నీరే ఉంది. అటు ఉడుకుతున్న అన్నం, అదే సమయంలో దాహం. ఆ గ్లాస్‌ నీళ్లు పోస్తే అన్నం మంచిగా ఉడుకుతుంది. లేదు దాహంగా ఉంది కాబట్టి ఆ నీళ్లు తాగేస్తే ఏమైంది? అన్నం ఉడకదు! ఇది కూడా అంతే అనుకో వచ్చు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు రావడం చాలా కష్టం. ఎన్విరాన్మెంటల్‌ క్లియరెన్స్‌ అనేది కష్టం. కష్టమే అయినా సంపాదించుకున్నాం. ఈ ప్రాజెక్టును ఓపెన్‌గా కూడా నిర్మించవచ్చు. కానీ అక్కడి వృక్ష, జంతుజాలానికి ఎలాంటి నష్టం వాటిల్లరాదన్నారు. అంటే ఈగలు, దోమలు కూడా చంపకుండా ప్రాజెక్టు కట్టండి అన్నారు.

ఎన్ని చెప్పినా ఎంత టెక్నాలజీ, అదెంత అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ అయినా ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా వెళ్లకూడదు అన్న సూత్రం మరచిపోకూడ దని అంటారు. ఆ సూత్రం ఇక్కడ వర్తిస్తుందంటారా?

కచ్చితంగా వర్తిస్తుంది. మనం ప్రకృతి విరుద్ధం గానే వెళ్తున్నాం. కానీ విషాదం ఏమిటంటే, ప్రకృతికి విరుద్ధంగా వెళుతున్న క్రమంలోనే ఆ ప్రకృతి ఎంత వినాశనం చేస్తుందో మనకు అర్థమవుతుంది, అనుభవానికి వస్తుంది. ఆ క్రమం అంతా తెలిసి కూడా మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్లరాదన్న సూత్రాన్ని పాటించం. ఆ సొరంగం పైన గుట్ట ఉంది. దాని మీద వర్షాలు పడతాయి. గుట్ట మీద రాళ్లూ రప్పలూ ఉంటాయి. మట్టి నీటిని పీల్చుకుంటుంది. నీళ్లు ఒక దగ్గర ఉండవు. నీరు పల్లమెరుగు. అది నిజం. నీరు పల్లాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోతుంది. అది ఎక్కడికి వెళ్లగలుగుతుందో అక్కడికల్లా వెళ్తూనే ఉంటుంది. నువ్వు ఆపలేవు. అట్లా వెళ్లకుంటే ఇక్కడికి వస్తుంది. అది వచ్చేసరికి ఆరు నెలల సమయం పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. రెండు సంవత్సరాలు పట్టొచ్చు. ఆ లోపల నీవు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుంటే అది ఇంకో వేరే దారి వెతుక్కుంటుంది. అది మామూలుగా మా అందరి ఇరిగేషన్‌ ఇంజనీర్లకు తెలిసిన విషయం. తెలవాల్సిన విషయం.

ఈ విపత్తు నేపథ్యంలోనే ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిగారు ఒక మాట అన్నారు. టన్నెల్‌ పనిని అంటే ఈ 42 కిలోమీటర్లలో పని చాలా వరకు పూర్త యింది. అంటే 35 కిలోమీటర్ల వరకు పూర్తయింద న్నారు. మిగిలినది ఆరేడు కిలోమీటర్లు అను కుందాం.  ఆ పని పునఃప్రారంభించడానికి ఎంత సమయం పడుతుంది?

కొన్ని సమస్యలు వచ్చాయి. వాటిని విజయ వంతంగా అధిగమించి, మళ్లీ మెషీన్‌ బోరింగ్‌ ప్రారంభించాలి. ఇప్పుడు మనకు వస్తున్న న్యూస్‌ ప్రకారం టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ కూడా విరిగిపోయిందనో దాన్ని ముక్కలు చేసి తీస్తున్నామనో చెప్తున్నారు. అక్కడ అంతా శుభ్రపడిన తరువాత యంత్రసామాగ్రి తయారీదారులు తనిఖీ చేసి అసలు లోపల ఉన్న టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ ఇంకా పనిచేయగలదా? ఇంకా పని చేయించుకునేందుకు ఏమైనా చేయగలమా? వంటి అంశాలన్నీ వాళ్లు చెప్పాలి. వాళ్లు అది చెప్పనంత వరకు ఏం చేయాలి అనేది ప్రశ్నగానే మిగిలి ఉంటుంది

ఇంతకుముందు ఒక టీబీఎం పాడైపోయినట్టు చెబుతారు.

అవును. ఇక్కడ ఏదైతే తవ్వుతుందో ఆ డ్రిల్లరు 10 మీటర్ల వ్యాసార్థంలో ఉంటుంది. దానిని అత్యంత కఠినమైన ఉక్కుతో తయారు చేస్తారు. వాటిలో టంగ్‌స్టన్‌ కార్బైడ్‌ బిట్స్‌ అవన్నీ వాడతారు. ఆ టంగ్‌స్టన్‌ కార్బైడ్‌ అనేదే రాయిని కోయగలుగు తుంది. ఇది రొటేట్‌ అవుతుంది. ఇది చాలా బరువు. అన్ని టన్నుల బరువుతో రొటేట్‌ కావాలంటే ఎట్లా? కొన్ని బేరింగ్‌ల మీద అమర్చాలి. ఆ బేరింగ్స్‌ మీద ఫ్రిక్షన్‌ లేకుండా ఈజీగా తిరిగితేనే దాన్ని తక్కువ పవర్‌ తోటి తిప్పగలుగుతాం. ఆ బేరింగ్స్‌కి కూడా కాలపరిమితి ఉంటుంది. అట్లా ఒక దాని బేరింగ్‌ విఫలమయింది. బేరింగ్‌ విఫలమైతే, మెషిన్‌ వెనక్కి పోదు, ముందర చోటులేదు. ఎట్లా ఫిక్స్‌ చేయాలి? పనంతా చాలా క్లిష్టమైనది. మోస్ట్‌ రిస్కీ. ఏ సమస్య రాకుండా చూసుకోవాలి. వచ్చిందంటే మాత్రం మిగిలేది ప్రతిష్టంభనే.

ఇంతకీ సొరంగ మార్గంలో మిగిలిన ఆ ఐదు కిలోమీటర్లు పూర్తి కావడం అనేదాని మీద మీ అభిప్రాయం? కానీ వాళ్లకి నీళ్లు వెళ్లడం అన్నది అనివార్యం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ నాలుగు లక్షల ఎకరాలు తడవాలి. ఆ ఫ్లోరోసిస్‌ బాధితులను ఆదుకోవాలి. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం?

మనం ఒక సంధిగ్ధావస్థలో ఉన్నాం. వచ్చే కష్టనష్టాలు ఏమిటి? యంత్రసామాగ్రినీ, సొరంగ మార్గం పనిని సరిగా అంచనా వేసుకోవాలి. ఇంకొకటి, మన వాళ్లు అది ఆలోచించారో లేదో! ఒకవైపు 20 నుంచి 22 కిలోమీటర్లు అయిపోయింది. అది వాడకంలో లేదు.

దాని పరిస్థితి ఏమిటి?ఎస్‌ఎల్‌బీసీకి ముగింపు ఎప్పుడు?

దాని పరిస్థితి మొత్తం పరీక్షించుకోవాలి. సమీక్షించుకోవాలి. చెప్పాను కదా! నీరు బతికించ డానికి ఉపయోగపడుతుంది. సమూలంగా తుడిచేస్తుంది. నీటి ఉధృతిని ఎవరు ఆపలేరు. ఇప్పటిదాకా జరిగిన పనినంతటినీ ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. సురక్షితమేనని నిర్ధారించుకోవాలి. పాడైన యంత్ర సామాగ్రినే తిరిగి ఉపయోగించుకో గలుగుతామా లేదా, అది కూడా చూసుకోవాలి. అది పనికిరాదంటే మళ్లీ కొత్త యంత్రసామాగ్రి తెచ్చుకోవాలి. సరైన తీరులో పని సాగేందుకు వీలుగా సొరంగంలో లోపల తయారు కావడానికి కొద్దిగా సమయం పడుతుంది.చాలా రోజులు అట్లా ఖాళీగా వదిలేశాం కాబట్టి మొత్తం సొరంగ మార్గాన్ని తనిఖీ చేసుకోవాలి. చొక్క ఒక దగ్గర చినిగిపోయి ఉంది, వెంటనే కుట్లు వేస్తే ఉపయోగపడుతుంది. లేకుంటే చిరుగు పెద్దదవుతుంది. అది ఎంతవరకు వెళుతుందో తెలియదు.

కొత్త యంత్రసామాగ్రి అయినా అమెరికా నుంచే రావాలి కదా!

అంతే! అదైనా వాళ్ల దగ్గర సిద్ధంగా ఉండదు. అది మేడ్‌ టు ఆర్డర్‌. ఆ యంత్ర సామాగ్రికి మార్కెట్‌ ఉండదు. అలాంటి పని వరకే అవి. ఎవరికి అవసరమో వాళ్లు ఆర్డర్‌ చేశాక తయారీ మొదలు పెడతారు. వాళ్లు మొదలు పెట్టిన తర్వాత ఎంత త్వరగా ఇవ్వగలుగుతారు అనేది వేరే అంశం.

రక్షణ చర్యలలో భాగంగా ఇంకో సొరంగం తవ్వాలన్న ప్రతిపాదన ఉన్నట్టు ఒక వార్త వచ్చింది. ఇంతక్రితం మీరు చెప్పిన టీబీఎంను పక్కకు తప్పించడానికి, ఆ టన్నెల్‌  లోనే ఇంకో టన్నెల్‌. అది నమ్మదగిన వార్తే అంటారా?

శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని సామెత. టెక్నికల్‌ ప్రూడెన్స్‌, ఫైనాన్షియల్‌ ప్రూడెన్స్‌ అంటాం. అంటే కనీసంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి, కనీసంగా ఖర్చు పెట్టి కావాల్సిన ఫలితాలు తెచ్చుకోవాలి. అది విఫలమైందే అనుకుందాం! అయినా మనకు ప్రాజెక్టు అయితే కావాలి కదా. ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఉన్న ఆ ప్రత్యామ్నాయాలలో ఏది మనకు ఉత్తమమైనది అనే దాని మీద అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటాం.

నీటిపారుదల శాఖలో ఇంజనీర్‌గా మీకు అపార అనుభవం ఉంది. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, పనులు ఒక నిరంతం  ప్రక్రియ. అలా జరుగుతూనే ఉంటాయి. కానీ ఎస్‌ఎల్‌బీసీ వంటి దుర్ఘటనలు ఎదురు కాకూడదు. కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ అది మన చేతుల్లో లేదు. అయినా జాగ్రత్తలు అనివార్యం. అవి ఎలా ఉండాలంటారు?

వృత్తి ఏదైనా కానివ్వండి! ఆ వృత్తిలో ఉన్నవారు పాటించవలసిన కొన్ని నీతినియమాలు ఉంటాయి. ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌ అంటారు కదా! వృత్తి అనేది దైవం. ఆ వృత్తి నిర్వహణ దైవ కార్యంలా చేయాలి. తెలిసో తెలియకనో ఎక్కడైనా తప్పు జరుగుతుంటే చెప్పే ధైర్యం వృత్తి నిపుణుడికి ఉండాలి. అప్పుడే అతను ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌ను అనుసరిస్తున్నట్టు లెక్క. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది చేస్తే ఏమి ఇబ్బంది కలుగుతుందో మనకు అనుభవం నేర్పింది. ఆ అనుభవం అందరికీ లేదు. మనకే ఉంది, మనమే అక్కడ చేయగలుగుతాం. అందరికీ అన్ని ప్రాజెక్టులు కట్టే అవకాశం రాదు. మనం ఓ ప్రాజెక్టులో పని చేశామంటే అదృష్టం అనుకోవాలి. భగవంతుడు ఆ అదృష్టం ఇచ్చాడు. ఆ హోదా ఇచ్చాడు. అనుభవం వచ్చింది. ఆ అనుభవం సద్వినియోగం కావాలి అంటే నీవు ఆ వృత్తిని దైవంగా భావించి ఏది మంచో ఏది చెడో నిష్కర్షగా చెప్పాలి.

ఇలాంటివి ప్రత్యేక అంశాలు ఒక నిపుణుడు చెబుతున్నారు, మనం కనీసం ఆలోచించాలి అన్న ఇంగిత జ్ఞానం పాలకులకు కూడా ఉండాలి కదా?

తప్పకుండా ఉండాలి. ఎందుకంటే, అతన్ని నిపుణుడు అని ఎందుకు అంటున్నావ్‌? మనకంటే కొద్దిగా ఎక్కువ తెలుసుననే. మనకంటే అనుభవం ఉందనే కదా. మరి అతను చెప్పినది వినాలి, అర్థం చేసుకోవాలి. సందేహం ఉంటే పునఃపరిశీలించాలి. అంతేగాని వాళ్ల మాటలు పెడచెవిన పెట్టరాదు.

దీనిని ఒక ఉదాహరణతో చెప్పగలరా?

చెప్తాను. మేము జలాశయాలు కడతాం. చిన్న, మధ్య తరహా, పెద్దవి కూడా కడతాం. మా ఎథిక్స్‌ ఏం చెబుతాయి! రిజర్వాయర్‌ పని పూర్తయినాక మొదటి సంవత్సరం 25% సామర్థ్యం మేరకు నీళ్లు నింపండి అని చెబుతాయి. ఐదు టీఎంసీల రిజర్వాయర్‌ అనుకోండి. పనంతా అయిపోయింది, బండ్‌ తయారైంది. అందులో 25% నీళ్లు నింపాలి. ఆపై దాని తీరును పరిశీలించాలి. తొలి ఏడాది మిగిలిన నీటిని జలాశయంలో ఉండకుండా వదిలేయాలి. ఒక సంవత్సరం ఒక సీజన్‌ మొత్తం అది ఎట్లా ఉంది? 25% నీరు నింపాక ఎక్కడైనా లీకేజ్‌ ఉందా, సీపేజ్‌ వస్తున్నదా.. ఇవన్నీ చూసుకో వాలి. తరువాతి ఏడాది 50% నీరు నింపుతాం. కానీ ఇప్పుడు! జలాశయం సిద్ధం కదా, నీళ్లు నింపండి నింపండి అంటున్నారు. సరికాదని చెప్పే ధైర్యం లేదు. అది 50 ఏళ్లు 100 ఏళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు. ఒక్కరోజులో కట్టేది కాదు. వందల కోట్లు పెట్టి కట్టాం. దాని పనితీరును పరిశీలించడానికి ఒక సంవత్సరం ఆగలేరా? ఎవరైతే ఇంచార్జ్‌ ఇంజనీర్‌ ఉన్నాడో, వాస్తవం చెప్పడం అతని బాధ్యత. నిపుణులు చెప్పినదానిని వినడం పాలకుల బాధ్యత.

సొరంగం తవ్వకం పని తిరిగి ప్రారంభించి, పూర్తి చేయడానికి అంచనా వేసిన దాని కంటే ఎంత అదనంగా ఉండొచ్చు!

ప్రస్తుత పరిస్థితిలో దానిని అంచనా వేయడం కష్టం. వెంటనే దెబ్బతిన్న వ్యవస్థకు మరమ్మతులు చేయాలి. తరువాత అవసరాలు ఏమిటో సరిగా గుర్తించాలి. యంత్ర సామాగ్రి కొనుగోలు ఖర్చు కూడా మారుతుంది. ఒక టీబీఎం చాలా, రెండు కావాలా? ఒకటే అయినా వాళ్లు ఎంతకు అందిస్తారు? ఇవన్నీ చాలా వస్తాయి. నన్ను ఒకసారి ఒక పెద్ద మనిషి అడిగాడు. ఇదే ప్రాజెక్టు పైన. నేను ఆయన్ను ఒకటే అడిగాను, మీకు రాజకీయాలు కావాలా ప్రాజెక్టు కావాలా? అని. ఏమిటి అట్లా అంటున్నావ్‌ అన్నాడు. ఇది ఒక ప్రత్యేక ప్రాజెక్టు, దీనికి ఇదే సాటి. అక్కడ జరిగేది, జరగబోయేది ఏమిటో ఒక్క భగవంతుడు తప్ప వేరెవ్వరు అంచనా వేయలేరు. ఎంత సైన్స్‌ ఎంత నాలెడ్జ్‌ ఉన్నా అనుకోని అవంతరాలు ఎన్నో వస్తాయి. మనం అర్థం చేసుకొని కోఆపరేట్‌ చేస్తే మనకు ప్రాజెక్ట్‌ పూర్తవుతుంది. రాజకీయం చేస్తే ఖతం. ఇక్కడ జరిగింది అది.

స్పష్టంగా చెప్పారు. ఈ ప్రాజెక్టుల భవిష్యత్తు ఏమిటి? ఇట్లాంటి ప్రాజెక్టులు కొనసాగాల్సిందే, కొనసాగి తీరాలి భారతదేశంలో తడవాల్సిన భూమి చాలా ఉంది.ఈ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ఏ రీతిలో ఉండాలి? ఎవరు నష్టపోకుండా ఎలా మనం నిర్మించుకోవాలి, ఫలితాలు తెచ్చుకోవాలి?

ఇంత క్రితం చెప్పాను. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అనేది 100 సంవత్సరాలకు పనికొచ్చే విధంగా కట్టు కుంటాం. ఆ విధంగా ప్రాజెక్టు కట్టాలంటే ప్రాజెక్టును గ్రౌండ్‌ చేసే ముందర చాలా అధ్యయనం చేయాలి. ఇంతక్రితం పెద్ద పెద్ద ప్రాజెక్టు చాలా కట్టాం` నాగార్జునసాగర్‌ కట్టాం, శ్రీశైలం కట్టాం. ఆ ప్రాజెక్టులు డిపార్ట్‌మెంటల్‌ ఇంజనీర్స్‌ ఎక్కువ ఇన్వాల్వ్‌ అయ్యి రూపకల్పన చేసినవి. టెక్నీషియన్స్‌ ముందున్నారు. అనుభవజ్ఞులు, కొత్తవారు అందరూ కలిసి పని చేశారు. ఆ అనుభవం ఉన్నవారు కొత్తవారికి నేర్పి పనిలో ఒక కొనసాగింపునకు అవకాశం ఇచ్చారు. నాగార్జున సాగర్‌ నిర్మించి 60, 70 ఏళ్లు అయింది. శ్రీశైలం కూడా ఆ వయసుదే. శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు కూడా 50 60 ఏళ్ల క్రితానిదే. ఇవన్నీ ఒక్క రోజులోనే గ్రౌండ్‌ కాలేదు. ఇవాళ ప్రాజెక్టు అనుకుని, వెంటనే మొదలుపెట్టలేదు. వాటి వెనుక ఎంతో అధ్యయనం, విశ్లేషణ జరిగాయి.అప్పుడే ఆ ప్రాజెక్టుకు లైఫ్‌ ఉంటుంది. ఈ మధ్య 20,25 సంవత్సరాల నుంచి ఇవన్ని పక్కన పెట్టేసాం. అందువల్లనే ఈ ఇబ్బం దులు. అనుభవానికీ, జ్ఞానానికీ ప్రత్యామ్నాయాలు, అడ్డతోవలు ఉండవు. అనుభవజ్ఞులను పట్టించుకో కుండా పక్కన పెడితే అవాంఛనీయ పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE