శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ-ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఫిబ్రవరి 22న ప్రమాదం జరిగింది. మార్చి 8న ఎట్టకేలకు ఒక నిపుణుడి మృతదేహాన్ని కనుగొనగలిగారు. అంటే వెలికితీత పనులు కూడా ఫలితమివ్వడం లేదు. దీంతో, ఆ ఎనిమిది ప్రాణాలు మట్టిలో సజీవ సమాధి అయ్యాయన్న వాస్తవాన్ని జీర్ణించుకోక తప్పడం లేదు. వారు ప్రాణాలతో ఉండే అవకాశమే లేదని ప్రభుత్వం కూడా నిర్థారణకు వచ్చింది. కనీసం వాళ్ల అవశేషాలు బయటకు తెచ్చేందుకు నిపుణుల బృందాలు, సాంకేతిక సాయంతో అన్వేషిస్తున్నాయి. 12 సంస్థలు 18 రోజుల నుంచి సాగిస్తున్న వెతుకులాటలో, కేరళ నుంచి రప్పించిన కడావర్ కుక్కల సాయంతో గురుప్రీత్ సింగ్ అనే రాబిన్స్ సంస్థ ఉద్యోగి భౌతికకాయం కనుగొన్నారు. దీనిని వెలికితీయడానికి పది గంటల సమయం పట్టిందని అంటున్నారు. మొదటి రోజు చేయి కనిపించిన చోటే మృతదేహం కనిపించింది. ఇతడు ఆపరేటర్. పంజాబ్‌కు చెందినవారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ. 25 లక్షలు పరిహారం ప్రకటించింది.
రోజు రోజుకూ రెస్క్యూ ఆపరేషన్ నివేదిక సమర్పించడం తప్ప అందులో చిక్కుకున్న వాళ్ల ఆనవాళ్లు దొరకడంలేదు. అత్యంత భారీ సొరంగ మార్గం కావడం, నీళ్లు, బురద పూర్తిగా నిండి పోతుండటం వంటి పరిణామాలతో రెస్క్యూ ఆపరేషన్ కష్టమవుతోందంటున్నారు.
ప్రమాదం జరిగిన ఫిబ్రవరి 22వ తేదీ నుంచే సహాయక చర్యలు మొదలుపెట్టారు. రెండురోజుల్లో దేశంలోని కీలకమైన రెస్క్యూ బృందాలు, నిపుణుల బృందాలు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు చేరుకున్నాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలను నిర్వహించడంలో ప్రసిద్ధి చెందిన దేశంలోని అగ్రశ్రేణి సంస్థలు నిరంతరం పనిచేస్తున్నాయి. వాటిలో భారత సైన్యం (Indian Army), భారత నావికాదళం (Indian Navy), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), జాతీయ జల పరిశోధన సంస్థ, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) రెస్క్యూ బృందాలు, SCCL సిల్డ్ క్లియరింగ్ బృందాలు, దక్షిణ మధ్య రైల్వే మెటల్ కటింగ్ నిపుణుల బృందం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS)బృందం, గ్రౌండ్ ప్రోబింగ్ రాడార్ అధ్యయనం కోసం నేషనల్ జియోఫిజిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) బృందం, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) వంటి సంస్థల సుశిక్షితులైన నిపుణుల బృందాలు, సహాయక బృందాలు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. ఈ నిపుణులందరితో పాటు.. కేరళ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కడావర్ డాగ్స్ కూడా సొరంగంలో చిక్కుకున్న వాళ్ల ఆనవాళ్ల కోసం అన్వేషిస్తున్నాయి.
ఈ ఊహించని ప్రమాదం రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సొరంగం తవ్వకం చివరి దశకు చేరింది. ఈ పరిస్థితుల్లో సొరంగం కూలిపోవడం, సొరంగమంతా బురద నిండి పోవడం సవాల్‌గా మారింది. అయితే, అసలు సొరంగం లోపలి పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియడం లేదు. ప్రభుత్వం ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచీ వివరాలు పూర్తిగా బయటకు చెప్పడం లేదన్న అనుమానాలు కలుగుతున్నాయి. అసలు సొరంగం లోపల కూలి పోయిందా? నిర్మాణ పనులు తిరిగి కొనసాగించే అవకాశం ఉందా? ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగించాలా, లేదా అన్న అంశంలో ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది. లేదంటే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఏమైనా చేయాలా? అన్నది కూడా ఇప్పుడు కీలకం.
ఇక, సొరంగం లోపల పనిచేస్తున్నప్పుడు ప్రకృతితో పోటీ పడి, సవాల్ చేస్తూ పని చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో లోపల ఉపయోగిస్తున్న మెషినరీ, టన్నెల్ బోరింగ్ మెషీన్ వంటి భారీ యంత్ర సామాగ్రి పనితీరును, వాటిలో తలెత్తే లోపాలను నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. కానీ, దాదాపు పదేళ్ల పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణం సాగలేదని చెబుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు తిరిగి నిర్మాణ పనులు కొనసాగించే క్రమంలో యంత్ర సామాగ్రి.. ప్రధానంగా టన్నెల్ బోరింగ్ మిషన్ పనితీరును పూర్తిస్థాయిలో పరిశీలించలేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్టును తాము పూర్తి చేస్తున్నామంటూ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఆదరా బాదరాగా పనులు చేయిస్తోందని, ఈ క్రమంలో రక్షణ, భద్రతలను గాలికి వదిలేసిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
సొరంగంలో చిక్కుకుపోయిన వాళ్ల అవశేషా లను కుటుంబసభ్యులకు అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే, సొరంగం లోపల ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ప్రాజెక్టు నిర్మాణ పనులు మళ్లీ మొదలు పెట్టేందుకు ఎంత సమయం పడుతుంది? లోపల ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అన్న వాటిపై సమగ్రంగా అధ్యయనం చేయించిన తర్వాతే తిరిగి పనులు మొదలు పెట్టాలన్న సలహాలు, సూచనలు వస్తున్నాయి.
– గోపగోని సప్తగిరి, ఎంఫిల్, పీహెచ్‌డీ