రాష్ట్ర ప్రజలలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి పాలన పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తొమ్మిది నెలల తర్వాత రాష్ట్రంలోని శాసనమండలి స్థానాలకు జరిగిన మొదటి ప్రత్యక్ష ఎన్నికలలో కూటమికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఉమ్మడి గుంటూరు – కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు కూటమికి ఏకపక్ష విజయం కట్టబెట్టారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో మొదటి ప్రాధాన్య ఓటుతోనే కూటమి అభ్యర్థులు గెలుపొందడం ఒక ప్రత్యేకత కాగా, శాసనసభ, లోక్‌సభ ఎన్నికల తరహాలో భారీ మెజారిటీ సాధించడం మరో విశేషం.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అమరావతి అభివృద్ధికి రూ.21 వేల కోట్లు, విశాఖలో రైల్వే జోన్, అమరావతి అవుటర్ రింగ్‌రోడ్డు, పోలవరం నిర్మాణానికి రూ.15 వేల కోట్లు, దెబ్బతిన్న డయాఫ్రంవాల్ నిర్మాణం కోసం మరో రూ.900 కోట్లు, విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ. 11,440 కోట్ల ఆర్థిక సహాయంతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రూ.2 లక్షల విలువైన ప్రాజెక్టులు ఇచ్చిన వైనంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల సానుకూల ధోరణి నెలకొంది. అలాగే ఎన్నికల్లో గెలిచిన మరుసటి నెల నుంచే సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్లను… ఎన్నికల హామీ మేరకు పెంచి ఇవ్వసాగింది. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా అమలుచేశారు. ఈ ఏడాది నుంచి రైతులకు రూ.20 వేల ఆర్థిక సహాయం, విద్యార్ధికి రూ.15 వేల చొప్పున అమ్మకు వందనం పథకం, మహిళలకు ఉచిత బస్ సర్వీసులను అమలు చేస్తామని ప్రకటించి 2025-26 బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించింది. దాని ఫలితమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో లభించిన ఘన విజయాలుగా చెప్పవచ్చు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల గెలుపు
ఉమ్మడి కృష్ణా – గుంటూరు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్ర ఉపా ధ్యాయ శాసనమండలి ఎన్నికలకు ఫిబ్రవరి 27న ఎన్నికలలో కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపు పొందటం విశేషం.
ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ లక్ష్మణరావుపై 82,320 ఓట్ల మెజారిటీ సాధించారు. ఆలపాటికి వచ్చిన 1,45,057 ఓట్లు… మొత్తం చెల్లుబాటయిన ఓట్లలో 67.51 శాతం. ఈ జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి 58.19 శాతం ఓట్లే వచ్చాయి.ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 77,461 ఓట్ల మెజారిటీతో పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులుపై జయభేరి మోగించారు. రాజశేఖరానికి 1,24,702 ఓట్లు రాగా ఇవి మొత్తం చెల్లుబాటయిన ఓట్లలో 62.59 శాతం. సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లాల్లో కూటమికి 59.28 శాతం ఓటు షేర్ రాగా, ఎమ్మెల్సీ ఎన్నికలో అది 62.59 శాతానికి పెరిగింది. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి సరాసరి 58 శాతం ఓట్లురాగా పట్టభద్రుల ఎన్నికల్లో అది 65 శాతానికి పెరిగింది.
67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం
ఎన్నికలు జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో 67 అసెంబ్లీ నియోజక వర్గాలు న్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 33, ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 శాసనసభ పరిధిలోని విద్యావంతులు ఈ ఎన్నికల్లో తీర్పిచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వ పనితీరుకు, చెక్కుచెదరని ప్రజాదరణకు నిదర్శనమని అధికారపార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
పీడీఎఫ్‌కు వైసీపీ మద్దతు
కూటమికి గల ప్రజాదరణను ముందుగానే పసిగట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అస్త్రసన్యాసం చేసినట్లుపైకి ప్రకటించింది. కానీ చిరకాల మిత్రులైన పీడీఎఫ్ అభ్యర్థులకు లోపాయికారీగా మద్దతిచ్చింది. అది వారికి ఉపయోగపడక పోగాఎదురు తిరిగింది. వైఎస్సార్సీపీ పట్ల గల వ్యతిరేకత ప్రభావం పీడీఎఫ్ అభ్యర్థులపైనా పడిరది. దీనికి కారణాలూ లేక పోలేదు. గత ప్రభుత్వ హయాంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆ పార్టీతో అంటకాగారు. ముఖ్యంగా, వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని నాటి ప్రతిపక్షం తెలుగుదేశం మండలిలో డిమాండ్ చేయగా, అప్పట్లో పీడీఎఫ్ సభాపక్ష నేతగా ఉన్న విఠపు బాలసుబ్ర హ్మణ్యం నాటి సర్కార్‌కు వత్తాసు పలికారు. ప్రతిపక్షం డిమాండ్‌ను తోసిపుచ్చాలంటూ అప్పటి మండలి ఛైర్మన్ షరీఫ్‌పైనా పీడీఎఫ్ అభ్యర్థులు ఒత్తిడి తెచ్చారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గుంటూరుకు చెందినవారైనప్పటికీ మూడు రాజధానులను వ్యతిరే కించలేదు. ఇవన్నీ ప్రజలు గుర్తుంచుకుని ఈ ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పారనే వాదన వినిపిస్తోంది.
వైసీపీ ప్రచారం
కూటమి అభ్యర్థుల్ని ఎలాగైనా ఓడిరచేందుకు వైఎస్సార్సీపీ తన సొంత మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ వ్యతిరేక ప్రచారం చేసింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను కావాలనే వాయిదా వేయలేదంటూ నిరుద్యోగుల్ని ఉసిగొల్పేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ సర్కార్ చేసిన మోసాల్ని మరచిపోని నిరుద్యోగులు వారి మాయలో పడకుండా కూటమి అభ్యర్థులపై అచెంచల విశ్వాసం ప్రకటించారు. రాష్ట్రంలో పెట్టుబడుల్ని ఆకర్షించి 20 లక్షల ఉద్యో గాల కల్పనకు ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న కృషినీ నమ్మారు.
నాడూ నేడూ వైసీపీకి షాకులే…
వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో గతేడాది జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయ ఢంకా మోగించింది. రాయలసీమ పట్టభద్రుల స్థానాన్ని కూడా భారీ మెజారిటీతో తన ఖాతాలో వేసుకుంది. అప్పట్లో టీడీపీ అభ్యర్థులను పోటీలో నిలవకుండా అధికార వైసీపీ తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చింది. బెదిరింపులకు దిగింది. అన్నింటినీ అధిగమించి టీడీపీ అభ్యర్థులు మూడు పట్టభద్రుల స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. ‘మా ఓటర్లు వేరే ఉన్నారు’ అంటూ ఈ ఓటమికి వైసీపీ ‘కవరింగ్’ ఇచ్చింది. ఇప్పుడు.. రెండు చోట్ల అసలు అభ్యర్థులనే నిలపలేక పోయింది. కానీ.. పీడీఎఫ్ అభ్యర్థులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు పలికింది. ఇది వారి గెలుపునకు దోహదపడకపోగా, ఓటమికి కారణమైంది.
కలసి పనిచేసిన కూటమి
పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రితో సహా బీజేపీ,జనసేన పార్టీల అగ్రనేతలు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఆయా నియోజక వర్గాల్లోని ఎమ్మెల్యేలతో, ముఖ్య నేతలతో సమీక్షించారు. ‘కూటమి’ నేతలూ మూకుమ్మడిగా కదిలారు. విశేషమేమిటంటే.. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని అన్ని నియోజక వర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు.
సోముకు ఎమ్మెల్సీ….
ఎన్డీఏ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ తరపున సోము వీర్రాజు పేరును అధిష్టానం ఖరారు చేసింది.2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. పొత్తులో భాగంగా ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీకి కేటాయించగా, సోము వీర్రాజు నామినేషన్ వేశారు. ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమిలో తెలుగుదేశం పార్టీకి మూడు, జనసేన, బీజేపీలకు ఒక్కొక్కటి సర్దుబాటు జరిగింది. తెదేపా అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలను ప్రకటించారు. జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేశారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీయే కూటమి అన్ని స్థానాలూ గెలుచుకునే అవకాశముంది.
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్