సంపాదకీయం

శాలివాహన 1946 శ్రీ క్రోధి ఫాల్గుణ బహుళ తదియ – 17 మార్చి 2025, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


చిన్న చిన్న పాకిస్తాన్‌లకు ప్రపంచంలో చాలా చోట్ల విత్తనాలు పడ్డాయి. అవి చాలాచోట్ల మొలకలెత్తాయి కూడా. ఖండాంతరాలకు ఆవల ఉన్న పారిస్‌ శివార్లలో ముస్లిమేతరులకు ప్రవేశమే లేదని చదువుతున్నాం. ఆంగ్లేయుల రాజధాని లండన్‌ మేయర్‌గా మూడు పర్యాయాలు ముస్లిం ఎన్నికయ్యాడని, అక్కడ ముస్లిం మతోన్మాద గ్యాంగ్‌లు శ్వేతజాతి బాలికలను వెంటాడడమే పనిగా పెట్టుకున్నాయని నివేదికలు చూశాం. వీటన్నిటికీ ప్రాణం పోసినదే కాబట్టి పాకిస్తాన్‌లో మైనారిటీల పరిస్థితి మాటలకు అందదు. బాంగ్లాదేశ్‌ కూడా ఆ ‘రోగ్‌’ నేషన్‌ను వలచి  అదే బాటలో అడుగులు వేస్తున్నది. ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల చిన్న చిన్న పాకిస్తాన్‌లు మొలకలెత్తడం పాత పరిణామమే. పశ్చిమ బెంగాల్‌ ఆ మొలకలకి అనువైన వాతావరణం కల్పించింది. చిత్రంగా ఆ విత్తనాలు తెలుగు రాష్ట్రాలలో కూడా పడ్డాయన్న సంగతి బయటపడుతోంది. అవి కూడా మొలకెత్తడం సహజం. కొన్నేళ్లుగా తెలుగురాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు అందుకు సంబంధించినవే. కానీ బాధితులు ఎక్కువ కాలం మౌనంగా ఉండలేరు. మనోభావాలు నిరంతరం గాయపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోరు. వారూ గొంతెత్తుతారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో మార్చి 4న జరిగిన పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల హిందువులకు పెను నిద్దుర వదిలించేవే. ప్రభుత్వాలకు గట్టి హెచ్చరికలే. శతాబ్దాల నాటి వీరభద్రస్వామి ఉత్సవం మసీదు దరిదాపులకు కూడా రాకూడదని ఆ పట్టణంలో ముస్లింలు ఆంక్షలు పెట్టడం తెంపరితనమే. తమకూ మత స్వేచ్ఛ ఉందని ప్రకటిస్తూ ముందుకు నడిచిన హిందువుల మీద పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే అసలు విషాదం. స్త్రీలు, పిల్లలు అని కూడా చూడకుండా చావగొట్టారు. పైగా ఒక పోలీస్‌ అధికారి అడ్డగోలుగా చేసిన వాదన నీచంగా ఉంది. తమ మీద హిందువులే దాడికి దిగారని ఆయన ఆరోపణ. వీరభద్రస్వామికి చెందిన దైవమాన్యంలోనే మసీదు కట్టి, ఆ మసీదు సమీపం నుంచే ఆ దేవుడి ఊరేగింపు సాగరాదని ఆంక్షలు పెట్టడం దుండగీడుతనం కాదా? అయినా హిందువులు, హిందూ సంఘాలు మాత్రం రాజ్యంగబద్ధ చర్యలనే కోరుకుంటున్నారు. తమపై జరిగిన దాడిని  రాజ్యాంగబద్ధంగానే ఖండిస్తున్నారు. వీహెచ్‌పీ, హిందూ చైతన్య వేదిక (ఆంధ్రప్రదేశ్‌) అన్నిట జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించడమే ఇందుకు నిదర్శనం. ఇందులో విషయాలు విస్తుగొలిపే విధంగా ఉన్నాయి. వారు ఇచ్చిన పత్రికా ప్రకటనలో కూడా ఈ అంశాలను పొందుపరిచారు.

వీరభద్రస్వామి పార్వేట ఉత్సవంలో భాగంగా మసీదు వద్ద నుంచి వెళుతున్న పల్లకీ మీద ముస్లిం మతోన్మాదులు రాళ్లతో దాడి చేసి మసీదులోకి పారిపోయారు. ఇదంతా పోలీసుల కళ్లెదుటే జరిగిందని వేదిక ఆరోపిస్తున్నది. తమ పట్ల ఇంత కనికరం చూపిన పోలీసులను కూడా ముస్లిం మతోన్మాదులు  వదిలిపెట్టలేదు. తర్ఫీదు పొంది వచ్చిన నేరగాళ్ల రీతిలోనే పోలీసుల మీద దాడి చేశారు. ఈ పోలీసులు హిందువుల మీద కేసులు బనాయించారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాలకు సర్వదా సహకరించే హిందువుల పట్ల ఇదీ పోలీస్‌ వైఖరి. నిరంతరం ఈ దేశాన్నీ, ఈ ప్రభుత్వాలనీ, ఈ రాజ్యాం గాన్నీ నిరాకరించే, ఎద్దేవా చేసే ముస్లిం మతోన్మాదులకు స్వేచ్ఛను ఇస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? హిందువుల ఉత్సవాలలో ఎంతమంది పాల్గొనాలి? వారి ఊరేగింపులు ఏ తీరున జరగాలి? ఏ దారిలో వెళ్లాలి? ఇవన్నీ ముస్లిం మతోన్మాదులు శాసిస్తున్న మాట నిజం. రోడ్ల మీద, రైల్వే స్టేషన్‌లలో, పేవ్‌మెంట్ల మీద, నదులలో నమాజ్‌లు చేస్తూ, మొత్తం ప్రజానీకానికి ఇబ్బందికరంగా తయారైన సమూహం అవతలి మతం వారు ప్రశాంతంగా చేసుకునే ఉత్సవాల మీద ఆంక్షలు పెట్టడం ఏమిటి? ఈ ధైర్యం ఎక్కడిది? ఈ ధోరణిని ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవడం ఏమిటి? హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు మరెవరికైనా మతస్వేచ్ఛ ఒక్కటేనన్న సంగతి ప్రభుత్వాలు కూడా ఎందుకు మరచిపోతున్నాయి? ‘మేం కూడా ఓటేస్తేనే ఈ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మేం ఓటేస్తేనే ప్రభుత్వం ఏర్పడిరది!’ అని వేదిక తన వినతిపత్రంలో ప్రభుత్వా లకు గుర్తు చేయడం అవసరమేననిపిస్తుంది. దీనిని అంతా సమర్థించాలి.

ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాలలో కనీసం 150 హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి. ఏపీలో రాయచోటి ఉదంతానికి ముందు, ఆరు మాసాలలోనే పెడన, వి.కోట, దాచేపల్లి తదితర ప్రాంతాలలో ఇలాగే ఉత్సవాల మీద ముస్లింలు ఆంక్షలు పెట్టారు. ఇంతకు ముందు ఉన్న వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం హయాంలో వరస పెట్టి ఆలయాలను అపవిత్రం చేసే పని అప్రతిహతంగా సాగిపోయింది. ఇలాంటి హిందూ వ్యతిరేక ధోరణులకి తెలంగాణ కూడా పెట్టింది పేరు. కనిపించని హైదరాబాద్‌ పాత బస్తీ అల్లర్లు, కనిపించే భైంసా అల్లర్లు, సాయిబాబా మందిరంలోనే పూజారి హత్య, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ధ్వంసం ఇవన్నీ హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచినవే.

 జిహాదీ మనస్తత్త్వంలో శుద్ధి చేసి వెదజల్లిన పాకిస్తాన్‌ విత్తనాలు భారత్‌లో చాలాచోట్ల మొలిచి, పెరుగుతున్నాయి. అందుకు తెలుగు రాష్ట్రాలు మినహాయింపు కాదు. ఆ వాస్తవం రెండు రాష్ట్రాల యంత్రాగాల దృష్టికి రాలేదని అనుకోవడం వ్యర్థం. వీరికి ఇప్పుడు రొహింగ్యాలు తోడయ్యారు. ఏం జరిగినా, హిందువుల మనోభావాలు గాయపడుతున్నా కనీసం స్పందన ఉండడం లేదు. మతోన్మాదం పాకిస్తాన్‌ భక్త ముస్లింల జన్మహక్కనీ, మనోభావాలు ఎంత దారుణంగా గాయపడినా కిమ్మనకుండా ఉండడం హిందువుల కర్తవ్యమనీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తూ ఉంటే అది సరికాదు. చిన్న చిన్న పాకిస్తాన్‌లను ఇప్పటికైనా గుర్తించాలి. కూకటి వేళ్లతో పెకలించాలి. లేకపోతే పెను ముప్పు తప్పదు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE