తెలంగాణలోని పలు సాగునీటి ప్రాజెక్టులు నీళ్లతో కాకుండా.. అప్పులతో నిండాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్న అప్పుల కింద వడ్డీలకే రూ. వేల కోట్లు వాయిదాల రూపంలో చెల్లిస్తోంది. ఈ పరిస్థితి ప్రభుత్వ ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నీటి పారుదల శాఖకు కేటాయింపులు చేసిన వాటిలో అప్పులు, వాటి వడ్డీలకు చెల్లించే మొత్తమే బడ్జెట్‌లో దాదాపు 50 శాతం దాకా ఉంటుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలకు బాధ్యులు మీరంటే మీరంటూ గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం సమయానికి సంపన్న రాష్ట్రం. కానీ, భారత రాష్ట్ర సమితి పార్టీ అధికారం నుంచి దిగిపోయే సమయానికి రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ఇది ఎవరు అవునన్నా, కాదన్నా అది ఆ పార్టీ నిర్వాకమని కనిపిస్తోన్న వాస్తవం. అయితే, ఈ భయంకర నిజాన్ని ఆ పార్టీ అంగీకరించడం లేదు. పైగా.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై విమర్శలు ,ఎదురుదాడి చేస్తోంది. ఇలా.. అధికార, ప్రతిపక్షాలు రాజకీయ ఆధిపత్యానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. మరోవైపు.. అప్పులు మాత్రం కొండల్లా పెరిగిపోతూనే ఉన్నాయి.
2025-26 వార్షిక బడ్జెట్‌లో నీటి పారుదల శాఖకు రూ.23,373 కోట్లు కేటాయించారు. బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు రూ.27వేల కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు రూపొందించారు. అయితే, ఆర్థిక శాఖ.. రూ.23,373 కోట్లు బడ్జెట్‌లో ఇచ్చేందుకు ఆమోదించింది. అయితే, అందులో అప్పుల చెల్లింపు, ఇతర ఖర్చులకు రూ.11వేల కోట్లు అవసరం అవుతాయంటున్నారు అధికారులు. అంతేకాదు.. వీటిలో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాయిదాల కిందే రూ. 7వేల కోట్లు చెల్లించాల్సి ఉందట. అంటే.. ప్రాజెక్టుల అప్పుల్లో దాదాపు 70శాతం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ఉన్నాయని అర్థమవుతోంది. నీటి పారుదల శాఖ సిబ్బంది జీతభత్యాలకు మరో రూ.1,600 కోట్లు అవసరం అవుతున్నాయి. వీటిని బట్టి చూస్తే.. ఈ శాఖకు కేటాయించిన బడ్జెట్‌లో ఇవి పోను మిగిలే.. రూ.12 వేల కోట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ డబ్బులతోనే.. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ఆపరేషన్, మెయింటెనెన్స్ చూసుకోవాలి. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలకు ఖర్చు చేయాలి. అయితే, వాస్తవ పరిస్థితి విశ్లేషించుకుంటే ఇది అసాధ్యంగా కనిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో కొత్తగా ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణం, ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులకు నిధుల కటకట తప్పదు. చాలా యేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పాలమూరు, డిండి, సీతారామ, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను ఏడాది లోగానే పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేవాదుల ప్రాజెక్టును కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, వాస్తవ పరిస్థితి చూస్తే ఈ లక్ష్యాలు నెరవేరే ఆశలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం మేరకు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే కనీసం రూ. 30 వేల కోట్లు అవసరం అవుతాయని సాగునీటిరంగ నిపుణులు లెక్కగడుతున్నారు. పైన చెప్పుకున్న ప్రాజెక్టులే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలంటే ప్రస్తుత అంచనాల ప్రకారమే… రూ.60 వేల కోట్లు అవసరం అవుతాయని అంటున్నారు.
ఇక, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చాలా ప్రాజెక్టులను అస్సలు పట్టించుకోలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 2015లో రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. పనులు పూర్తికాకముందే 2023 సెప్టెంబర్‌లో నార్లాపూర్ డ్యామ్‌లోని ఓ పంపును అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించారు. ప్రాజెక్టులోని 2, 3, 4, 6, 7, 11, 14, 15, 17 ప్యాకేజీలకు సంబంధించిన పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఇప్పుడు నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తికాగా.. ఏదుల రిజర్వాయర్ చివరి దశలో ఉంది. నార్లాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు ఆరు రిజర్వాయర్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఇంకా కాలువల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ డిజైన్ల దశలోనే ఉంది. నార్లాపూర్ నుంచి ఏదుల జలాశయానికి నీళ్లు తరలించే కాలువ పనులు పూర్తి కాలేదు. ఆ మార్గంలో మధ్యలో పెద్ద బండరాయి అడ్డు రావడంతో కంట్రోల్ట్ బ్లాస్ట్ చేయాల్సి రావడంతో.. తిరిగి టెండర్లను పిలిచే యోచనలో ప్రభుత్వం ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి సాతాపూర్ సొరంగం వరకు 8 కిలోమీటర్ల మేర కాలువలు నిర్మించాల్సి ఉంది. ఆ కాలువ మధ్యలో నాలుగు వంతెనలు కట్టాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ పూర్తయితేనే నార్లాపూర్ నుంచి ఏదుల వరకు నీటి తరలింపునకు అవకాశం ఉంటుంది. మొత్తంగా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలంటే మరో రూ.22 వేల కోట్లకు పైగానే అవసరమవుతాయని అంచనాలు ఉన్నాయి. మరోవైపు.. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల డీపీఆర్‌లను తిప్పి పంపింది. దానికి సంబంధించిన పనులు కూడా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని అధికారులు అంటున్నారు. కాగా, ఈ బడ్జెట్‌లో పాలమూరు ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.1,700 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులతో ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తేవడం సాధ్యం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూడా భారీగానే నిధులు అవసరం అవుతాయంటున్నారు అధికారులు. రూ.6,190 కోట్ల అంచనాలతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయ నుంచి నీటిని తరలించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రూ.1,800 కోట్లతో అంచనాలు సిద్ధం చేయబోతున్నారు. ఏదుల నుంచి కాలువలు తవ్వి, పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్ డ్యామ్ నిర్మించి.. అక్కడి నుంచి డిండికి నీటిని తరలించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే, బడ్జెట్‌లో మాత్రం డిండి ఎత్తిపోతలకు రూ.1,600 కోట్లు కేటాయించారు.
మరోవైపు.. దేవాదుల ప్రాజెక్టు మోటార్‌ను ప్రారంభించి ఆయకట్టుకు నీళ్లివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టునూ ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా రూ.300 కోట్లు కేటాయించింది. బడ్జెట్‌లో ఈ రెండు ప్రాజెక్టులకే ఎక్కువ నిధులను ప్రభుత్వం కేటాయించింది.
ఇక, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు ప్లాన్ చేసిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పరిస్థితి ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి అన్నట్టుగా తయారైంది. గత యేడాది డిసెంబర్‌లో ఈ ప్రాజెక్టు కోసం అంచనా లను సవరించిన ప్రభుత్వం రూ.4,650 కోట్లు మంజూరు చేసింది. మరో 9 కిలోమీటర్ల మేర సొరంగాన్ని తవ్వితే ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తయినట్లే అంటున్నారు. కానీ, ఇప్పుడు అనుకోని ప్రమాదంతో ఆ పనులు కూడా సందిగ్ధంలో పడ్డాయి. నెల రోజులు గడుస్తున్నా రెస్క్యూ ఆపరేషన్లు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా ఆ నిధులను మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.900 కోట్లు మాత్రమే కేటాయించింది.
సీతారామ సాగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ఇటీవల రూ.19 వేల కోట్లకు పెరిగింది. ఇప్పటికే రూ.9 వేల కోట్ల దాకా ఖర్చు చేశారు. 3.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చే ఉద్దేశంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు.. భూసేకరణ కోసమే రూ.6 వేల కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. కానీ, ఈ ప్రాజెక్టుకు కూడా ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం రూ.699 కోట్లు మాత్రమే కేటాయించారు. కాగా, ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో మూలధన వ్యయం కింద రూ.33 వేల కోట్లు పెట్టింది. అందులో నీటిపారుదల ప్రాజెక్టుల కోసం పెట్టిన బడ్జెట్ దాదాపు రూ.8 వేల కోట్ల దాకా ఉంటుంది. అదే విధంగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
పై పరిస్థితులు చూస్తే.. ప్రభుత్వ లక్ష్యాలకు, వాటికి బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు పొంతన కుదరడం లేదు. అంటే.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ మేమో.. చాలావరకు అస్సలు ప్రాజెక్టులను పట్టించుకో లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే.. ప్రకటనలకు మాత్రమే ప్రాజెక్టులు పరిమితమవు తాయన్న చర్చ నడుస్తోంది.
సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్