బలవంతపు మతమార్పిడులను నిరోధించే ఒక చట్టాన్ని అమలు చేయడం కూడా ఈ దేశంలో కష్టమే. కోర్టు ఆదేశాల మేరకు ఆ పని ఆరంభించినా  వెంటనే బెదిరింపులు, వీధి పోరాటాలు మొదలయిపోతాయి. ఇప్పుడు అరుణాచల్‌‌ప్రదేశ్‌ ‌హఠాత్తుగా వార్తలలోకి రావడానికి కారణం ఇదే. 42 సంవత్సరాల నాటి అరుణాచల్‌‌ప్రదేశ్‌ ‌మతస్వేచ్ఛ చట్టం, 1978ను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయాలని తాజాగా  ప్రయత్నాలు ప్రారంభించింది. వెంటనే కొన్ని క్రైస్తవ సంఘాలు బెదిరింపులకు దిగిపోయాయి. వీధికెక్కాయి. అరుణాచల్‌‌ప్రదేశ్‌లోని స్థానికుల ఆచార సంప్ర దాయాలను, ఉనికిని కాపాడాలన్న సదుద్దేశంతో రూపొందించిన ఈ చట్టం అమలు మీద సహజంగానే క్రైస్తవ సంస్థలు కత్తులు నూరుతున్నాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద క్రైస్తవ వేదిక అరుణాచల్‌ ‌క్రిస్టియన్‌ ‌ఫోరమ్‌ ‌మార్చి 6న వ్యతిరేక కార్యక్రమం నిర్వహించింది. 1978 మతమార్పిడి చట్టాన్ని  ఒక్క నెలలోనే వెనక్కి తీసుకోకుంటే తాము ప్రజాభిప్రాయ సేకరణ ప్రదర్శన నిర్వహిస్తామని బెదిరించింది.

స్థానీయతతో కూడిన మత విశ్వాసాలను, నమ్మకాలను, ఆచారాలను పరిరక్షించే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తెచ్చారు. అక్కడ ఉన్న స్థానిక విశ్వాసాలు ఏమిటి? బౌద్ధం, ప్రకృతి ఆరాధన, డోన్యీ పోలో, వైష్ణవం. అరుణాచల్‌ ‌స్థానికులలో మొన్పాస్‌, ‌మెంబాస్‌, ‌షెర్దుక్‌పెన్స్, ‌ఖుంబాస్‌, ‌ఖంప్టిస్‌, ‌సింగ్‌ఫోస్‌ అనే స్థానిక తెగలు బౌద్ధాన్ని ఆచరిస్తాయి. డోన్యీ-పోలో ఆరాధకులు కూడా ఉన్నారు. డోన్యీ అంటే సూర్యుడు, పోలో అంటే చంద్రుడు. దీనినే ప్రకృతి ఆరాధనగా పేర్కొంటున్నారు. నాక్టెస్‌, అకస్‌ అనే తెగల వారు వైష్ణవాన్ని ఆచరిస్తారు. మొత్తంగా చూస్తే స్థానిక ఆచార సంప్రదాయాలు ఆచరించే వర్గం, బౌద్ధులు, క్రైస్తవులు అక్కడ ప్రధానంగా ఉన్నారు.

ఈ చట్టం ఒక మత విశ్వాసం నుంచి మరొక విశ్వాసంలోకి బలవంతంగా మార్చడాన్ని నిషేధించింది. లేదా వ్యక్తి పరిస్థితులను ఆసరాగా చేసుకుని మతం మార్చడాన్ని కూడా అంగీకరించదు. అలా బలవంతపు మత మార్పిడులకు పాల్పడితే రెండేళ్లు జైలు, రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇంతే కాకుండా, ఒకవేళ ఎవరైనా మతం మారాలని అనుకున్న సందర్భంలో ఆ విషయం జిల్లా డిప్యూటీ కమిషనర్‌ ‌దృష్టికి తీసుకువెళ్లాలి.

1978లో ఈ చట్టం వచ్చినప్పటికీ 2022లో మాత్రమే దీనికి ఊపు వచ్చింది. ఆ సంవత్సరమే గౌహతి హైకోర్టులో ఈ చట్టం అమలును కోరుతూ ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. దీనితో కోర్టు ఆ చట్టం అమలుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని ఆదేశించింది. ఈ చట్టం అమలును అరుణాచల్‌‌ప్రదేశ్‌ ‌స్థానిక విశ్వాసాల, సాంస్కృతిక సంఘం స్వాగతించింది. ఇది రాష్ట్రంలోని 90 శాతం ప్రజల విశ్వాసాలను కాపాడే ప్రయత్నమని వ్యాఖ్యానించింది. కానీ అరుణాచల్‌ ‌క్రిస్టియన్‌ ‌ఫోరమ్‌ అప్పుడే వీధులకు ఎక్కింది. మార్చి ఆరున నహర్‌ ‌లాగూన్‌ (‌రాష్ట్ర రాజధాని ఇటానగర్‌  ‌సమీపంలో ఉంది)లో ‘లక్షమంది’తో కూడిన సమావేశం ఇందుకు సంబంధించినదే. ఇక్కడే ఒక విషయం గమనించాలి. అరుణాచల్‌‌ప్రదేశ్‌లో 1971లో 0.79 శాతం ఉన్న క్రైస్తవ జనాభా 2011 నాటికి 30.26 శాతానికి పెరిగింది.

అయినా తమ మత మార్పిడి కార్యక్రమం ఆగకుండా జరిగిపోవాలని ఈ ఫోరమ్‌ ఆశ. మత మార్పిడి నిరోధక చట్టాన్ని మళ్లీ అటకెక్కించాలని క్రిస్టియన్‌ ‌ఫోరమ్‌ అధ్యక్షుడు తర్త్ ‌మిరి హెచ్చరించాడు. తమకు నచ్చిన మత విశ్వాసాన్ని అనుసరించడానికి ఈ చట్టం అడ్డంకిగా ఉంటుందని తర్త్ ఆరోపణ. ఎవరి ఇష్టం మేరకు వారు మత విశ్వాసాన్ని ఎంచుకునే హక్కును లాక్కుంటే అది ప్రజల మధ్య విద్వేషాలకు దారి తీస్తుందని ఫోరమ్‌ ‌ప్రధాన కార్యదర్శి జేమ్స్ ‌తెచి తర వాదిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితిని బట్టి అక్కడ క్రైస్తవ సంఘాలు అంటే మత మార్పిడిని ప్రోత్సహించే క్రైస్తవులు, తమ తమ దేశీయ ఆచార వ్యవహారాలను రక్షించుకోవాలనుకుంటున్న స్థానికులకు మధ్య ఇప్పుడు అక్కడ సంఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ చట్టాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమలులోకి తేవాలని స్థానిక మత విశ్వాసాల వారు కోరుతున్నారు. ఈ చట్టాన్ని అమలులోకి తేవాలని ప్రభుత్వం ఆరంభించిన ప్రయత్నానికి మద్దతుగా వీరు ఇటీవల సద్భావన యాత్రను కూడా నిర్వహించారు. ఎన్నో విన్నపాలు, ఉద్యమాల తరువాత మత మార్పిడి నిరోధక చట్టం వచ్చిందని, అయినా అమలులోకి రాకపోవడం శోచనీయమని వీరి ప్రతినిధి పాయ్‌ ‌దావే వ్యాఖ్యానించారు. స్థానికుల ఆకాంక్షను క్రైస్తవులు వ్యతిరేకిస్తున్నారు. అయితే బీజేపీ అనే పార్టీ ఉనికిలోనికి రాకముందే 1978లో తీసుకువచ్చిన చట్టం. దానిని అంతా గమనించాలి. సెప్టెంబర్‌ 2024‌లో గౌహతి హైకోర్టు ఈ చట్టం అమలుకు విధివిధానాలు ఆరు మాసాలలో రూపొందించమని శాసించింది. ప్రభుత్వం ఈ చట్టం అమలు చేయడా నికి తెచ్చే నిబంధనలు ఏ మతానికి వ్యతిరేకం కాదని ముఖ్యమంత్రి పెమా కందు వెల్లడించారు.

About Author

By editor

Twitter
YOUTUBE