దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దా లైనప్పటికీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగినప్పటికీ, స్త్రీ పురుష అసమానతలు తగ్గడం లేదు. స్త్రీలు లింగ వివక్షను దాటుకుని విద్య, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో పురుషులతో సమానంగా పోటీపడి దూసుకుపోతున్నారు.

దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ ‌సంస్థల్లోని 32.29 లక్షల మంది ప్రజాప్రతినిధుల్లో స్త్రీల సంఖ్య 15.03 లక్షలు మాత్రమే. వీరిలో స్వతంత్రంగా పనిచేస్తున్న వారెందరన్నది ప్రధానమైన ప్రశ్న. మహిళా ప్రజాప్రతినిధులను పిండి బొమ్మలనుచేసి భర్త, తండ్రి, కొడుకు, సోదరుడు పదవీ బాధ్యతలను నిర్వహిస్తూ అక్రమాలకు, అవినీతికి పాల్పడే దుస్థితి దేశంలో ప్రతి చోటా రాజ్యమేలుతుంది. సర్పంచ్‌, ‌కార్పొరేటర్‌, ‌మున్సిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌పదవులకు మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో వారిపై పురుషుల పెత్తనాన్ని తప్పించేందుకు కేంద్రం సంసిద్ధం కావడం హర్షణీయం.

స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టి వారికి రాజకీయ ప్రాతినిధ్యం ప్రారంభమై మూడున్నర దశాబ్దాలు అవుతున్నప్పటికి, మహిళా సర్పంచ్‌లు, మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్స్ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో మహిళా ప్రజాప్రతినిధులు అలంకారప్రాయమైనారు. నేడు దేశంలో మహిళ ప్రజా ప్రతినిధులు స్వేచ్ఛగా పనిచేయనిస్థితుల్లో అనేక ప్రతిబంధకాలు ఎదుర్కొంటు న్నారు. పురుషులు కీలక పదవుల్లో ఉన్నప్పుడు తమ భార్యలు, కుటుంబంలోని మహిళలు తమ అధికార పనులుకు అడ్డురావడం లేదు. కానీ మహిళలు రాజకీయ పదవుల్లోకి వస్తే వారు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు లేకపోవడం శోచనీయం. మహిళలకు పురుషులతో సమానంగా ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉన్నప్పటికీ సాధికారత సాధనలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. 1992-93 సంవత్సరం నుంచి స్థానిక సంస్థల్లో మహిళా ప్రాతి నిధ్యం పెరిగింది. లక్షలాదిమంది మహిళలు స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు.

పురుషులపై జరిమానాకు కమిటీ సిఫార్సు అభినందనీయం

స్థానిక సంస్థల్లో పేరుకే మహిళా సర్పంచ్‌లు అధికారం మాత్రం భర్తలు లేదా తండ్రులే చెలాయిస్తు న్నారు. నిర్ణయాధికారంలో పెత్తనం చేస్తూ మహిళా సాధికారిత లక్ష్యాన్ని దెబ్బతీస్తున్న పురుషులపై జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసు చేయడం అభినందనీయం. సుప్రీంకోర్టు సలహా మేరకు విశ్రాంతి ఐఏఎస్‌ అధికారి సుశీల్‌ ‌కుమార్‌ అధ్యక్షతన 2023లో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది.ఇటీవల పంచాయతీరాజ్‌ ‌మంత్రిత్వ శాఖకు ఈ కమిటీ నివేదిక సమర్పించింది. భర్త, తండ్రి, ఇతర పురుష బంధువులు పాత్రను నిరోధించాలంటే మహిళలకు వ్యవస్థాగతంగా ప్రభుత్వం అండగా నిలవాలని నివేదిక సూచించింది. పలు కీలక సూచనలు చేసింది

స్త్రీలకు సమాన అవకాశాలు: ప్రధాని మోదీ

మహిళా సర్పంచ్‌లు, కౌన్సిలర్లను పక్కకు నెట్టేసి కుటుంబంలోని ఎవరో ఒక మగవాడు అధికారాలు చెలాయించడం ప్రజాస్వామానికి సిగ్గుచేటు. ఇలాంటి సంస్కృతి పోవాలని, స్త్రీలకు సమాన హక్కులు, అవకాశాలు లభించాలని ప్రధాని మోదీ లోగడ ఆకాంక్షించారు.

స్వతంత్రంగా పనిచేసిన మహిళ సర్పంచ్‌లు అభివృధ్ది కార్యక్రమాల అమలులో రాణించిన చారిత్రిక వాస్తవాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.ఎన్నికైన మహిళాప్రజా ప్రతినిధులు వాట్సప్‌ ‌గ్రూప్‌ ఏర్పాటు చేయాలి. వాటిని పంచాయతీ, బ్లాక్‌ ‌స్థాయి అధికారుల వాట్సప్‌ ‌గ్రూప్‌తో అనుసంధానించాలి. విద్యావంతులైన మహిళలను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలి. మహిళలు ఎదుర్కునే రోజువారు పాలనాపరమైన సమస్యలకు అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలి. గ్రామీణ సర్పంచ్‌గాఎన్నికైన మహిళకు గ్రామీణాభివృద్ధి పథకాలు, గ్రామీణ చట్టాలు, రెవెన్యూ చట్టాల మీద శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. మహిళా హక్కులు, లైంగిక హింస, గృహ హింస చట్టాలు, వారసత్వ చట్టాలు, పరిష్కారాల చట్టాలపై ప్రతి 3 నెలలకు ఉచిత న్యాయ చైతన్య సదస్సులు నిర్వహించి మహిళా ప్రజాప్రతినిధులకు న్యాయ, చట్టపరమైన అవగాహన కలిగించాలి. దైనందిన పాలనా నిర్వహణ, సమస్యల పరిష్కారంలో నైపుణ్యాన్ని పెంపొందించాలి.

రోజు వారీ పాలనా వ్యవహారాల్లో న్యాయ పరమైన సలహాలు అందించాలి. వారికి దన్నుగా ఒక ప్రత్యేక వ్యవస్థను సృష్టించాలి. గ్రామాల్లో మహిళా సంఘాల ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం గ్రామీణ మహిళా సర్పంచ్‌లకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందించాలి. మహిళా జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించాలి. స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ప్రవేశ పెట్టాలి.

విధులు-నిధులుపై అవగాహన

రాజ్యాంగంలోని 73, 74 సవరణ ప్రకారం స్థానిక సంస్థల విధులు, నిధులు ,అధికారాలు,ఆశించిన మేరకు నిధుల లభ్య•,• కేంద్ర, రాష్ట్ర ఫైనాన్స్ ‌కమిషన్‌ ‌ద్వారా లభించే నిధుల పంపిణీ, నిధుల బదిలీ, మౌలిక వసతుల కల్పన మీద మహిళా ప్రజాప్రతి నిధులకు అవగాహన శిక్షణ శిబిరాలు నిర్వహించాలి. గ్రామాల్లో ప్రజాస్వామ్య పక్రియను ప్రోత్సహించడం, గ్రామీణ మహిళా సర్పంచ్‌‌లకు ప్రజలు మద్దతును ఇచ్చే విధంగా అధికార వికేంద్రీకరణ ద్వారా ప్రజాభ్యుదయ పథకాలను అమలు చేయాలి. గ్రామీణ ప్రాంతాలలో మహిళల నాయకత్వం, వ్యవస్థాపన, స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై శిక్షణ ఇవ్వాలి. మహిళా సర్పంచ్‌లకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి పనితీరును మెరుగు పరచాలి. పాలనాధికారంలో స్త్రీలకు సరైన వాటా ఇవ్వడం ద్వారా మహిళా సాధికారతకు పునాది వేయాలి. మహిళాభ్యుదయం, మహిళా హక్కుల రక్షణ, మహిళా సాధికారిత సాధనకు ప్రత్యేక అభివృద్ధి వ్యూహాలతో ముందుకు వచ్చి మహిళాభివృద్ధే మానవాభివృద్ధి కేంద్రంగా ప్రభుత్వం సమగ్రమైన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.

నేదునూరి కనకయ్య

అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్‌ ‌ఫోరం, కరీంనగర్‌,

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE